ఏపీపై తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్

జాన్ జిగ్రీలైన రెండు తెలుగు రాష్ట్రాల సీఎం ల మధ్య తాజాగా పోతిరెడ్డిపాడు వ్యవహారం చిచ్చు పెడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ భేటీని మళ్ళీ ఈ నెల ఇరవయ్యో తేదీ తర్వాతే సమావేశం ఏర్పాటు చేయాలనీ తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. ఐతే రెండు రాష్ట్రాల సీఎంలు హాజరైతేనే అపెక్స్ భేటీ జరుగుతుంది. ఐతే ఈ భేటీ పై కేసీఆర్ ఆసక్తి చూపకపోవడంతొ అది కాస్తా వాయిదా పడింది. అయితే మరో పక్క కేసీఆర్‌కు తెలంగాణ కోసం కృష్ణా జలాలను కాపాడే ఆసక్తి లేదని అందుకే.. అపెక్స్ భేటీకి హాజరవకుండా రాయలసీమ ఎత్తిపోతల టెండర్లకు సహకరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా దీనికి కౌంటర్‌గా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం.. కట్టాలనుకుంటున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు రద్దు చేయాలని ఆ పిటిషన్ లో తెలంగాణ సర్కార్ కోరింది ఐతే ఇప్పటికే ఈ టెండర్లను నిలిపివేయాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కృష్ణాబోర్డు ఆదేశాలను ఏపీ పట్టించుకోవడం లేదు. దీనికి కారణం శ్రీశైలం నుంచి నీటిని నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ తరలిస్తుంటే దానిపై తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఏపీ ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాము మాత్రం టెండర్లను ఎందుకు నిలిపివేయాలని ప్రశ్నిస్తోంది. దీంతో తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. ఈ పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుందనేది త్వరలో తెలియనుంది. ఇది ఇలా ఉండగా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా పందొమ్మిదో తేదీన ఏపీ ప్రభుత్వం టెండర్లను ఖరారు చేయనుంది. ఐతే టెండర్లను ఖరారు చేసినా కూడా నిర్మాణాలు మాత్రం ప్రారంభించవద్దని ఎన్జీటీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఎంతో సఖ్యంగా ఉంటున్న ఇద్దరు సీఎం ల మధ్య ఈ వ్యవహారం చిచ్చు పెడుతుందా లేక సమసి పోతుందా వేచి చూడాలి.

ప్రపంచమంతా రామమయమే: ప్రధాని మోదీ

అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ముహూర్తం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం 12.44.08కి శంకుస్థాపన జరిగింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మాట్లాడుతూ ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. జైశ్రీరామ్ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన.. జైశ్రీరామ్ నినాదాలు ప్రపంచమంతా వినిపిస్తున్నాయన్నారు. ఇదొక చారిత్రాత్మక దినమని, వందల ఏళ్ల నిరీక్షణ ఈరోజు ఫలించిందని అన్నారు. దేశ ప్రజలందరి ఆకాంక్షలతో రామ మందిరం నిర్మాణం జరుపుకుంటోందని తెలిపారు.   ఏళ్ల పాటు రామ్ లల్లా ఆలయం టెంట్ లోనే కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం జరిగిందని.. అదే విధంగా రామాలయం కోసం కూడా పెద్ద పోరాటం జరిగిందని అన్నారు. రామ మందిర నిర్మాణం కోసం ఎందరో పోరాటం చేశారని, వారందరి త్యాగాలతో రామమందిర నిర్మాణం సాకారమవుతోందని అన్నారు. 130 కోట్ల ప్రజలు వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నారని తెలిపారు. రాముడి కార్యక్రమాలన్నింటినీ హనుమంతుడు చేస్తాడని.. హనుమంతుడి ఆశీస్సులతోనే ఈరోజు మందిర నిర్మాణం ప్రారంభమైందని మోదీ అన్నారు.    ప్రపంచమంతా రామమయమేనని, మన పొరుగునున్న దేశాల సంస్కృతిలో కూడా రాముడు ఉన్నాడని ప్రధాని అన్నారు. ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచడం రాముడి వల్లే సాధ్యమని చెప్పారు. బుద్ధుడి బోధనల్లో, గాంధీ ఉద్యమాల్లో రాముడు ఉన్నాడని.. కబీర్, గురునానక్ వంటి వారికి రాముడు స్ఫూర్తి అని అన్నారు. మనం ఎలా బతకాలనే విషయాన్ని రాముడి జీవితం మనకు బోధిస్తుందని ప్రధాని చెప్పారు.

సివిల్స్ లో మెరిసిన తెలుగు తేజాలు

దేశంలో అత్యున్నత సర్వీస్ గా పేరుగాంచిన యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ పరీక్షల్లో తెలుగు యువత విశేష ప్రతిభను కనపరిచారు. 50కి పైగా ర్యాంకులు సాధించి సివిల్ సర్వీస్ లకు ఎంపికయ్యారు. ఐఎఎస్, ఐపీఎస్‌, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ తదితర పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన సివిల్స్ 2019 ఫలితాలను యూపీఎస్ సీ విడుదల చేసింది. 829మంది అభ్యర్థులు అర్హత సాధించగా అందులో 50మంది తెలుగువారే కావడం విశేషం. 829మందిలో 304 జనరల్, 78 ఈబీసీ, 254 ఓబీసీ, ఎస్సీ 129, ఎస్టీ 67 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ పరీక్షల్లో  జాతీయస్థాయిలో ప్రదీప్ సింగ్ మొదటి ర్యాంక్, జతిన్ కిషోర్ రెండవ ర్యాంకు, ప్రతిభా వర్మ మూడవ ర్యాంక్ సాధించారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత ప్రతిఏడు మాదిరిగానే తమ ప్రతిభ నిరూపించుకున్నారు. ఈ ఏడాది ఎక్కువ మంది ఉత్తమ ర్యాంకులు సాధించారు. వీరిలో యాదాద్రి-భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌కు చెందిన పి. ధాత్రి రెడ్డి 46వ ర్యాంకు సాధించి జాబితాలో టాప్-50లో నిలిచారు. ఆమె ప్రస్తుతం ట్రైనీ ఐపీఎస్‌గా ఉన్నారు. ర్యాంకులు సాధించిన వారిలో మల్లవరపు సూర్యతేజ(76), కట్టా రవితేజ(77), సింగారెడ్డి రిషికేశ్ రెడ్డి(95), ఎంవీ సత్యసాయి కార్తీక్(103), మంద మకరంద్(110), తాటిమాకుల రాహుల్ రెడ్డి(117), కె.ప్రేమ్ సాగర్(170), పిన్నాని సందీప్ వర్మ(244), శ్రీచైతన్య కుమార్ రెడ్డి(250), చీమల శివగోపాల్ రెడ్డి(263), యలవర్తి మోహన్ కృష్ణ(283), ఎ.వెంకటేశ్వర్ రెడ్డి(314), సిరిశెట్టి సంకీర్త్(330), ముత్తినేని సాయితేజ(344), ముక్కెర లక్ష్మీపావన గాయత్రి(427), కొల్లాబత్తుల కార్తీక్(428), ఎన్.వివేక్ రెడ్డి(485), నీతిపూడి రష్మితారావు(534), కోరుకొండ సిద్ధార్థ(566), సి.సమీర్ రాజా(603), కొప్పిశెట్టి కిరణ్మయి(633)తదితరులు ఉన్నారు.

మాగీ గీ ఎందరికో ఆదర్శం

యుద్ధ విమాన పైలట్ శిక్షకురాలు మాగీ గీ (5ఆగష్టు, 1923  - 1 ఫిబ్రవరి, 2013 ) మహిళలు అంటే ఇంటికే పరిమితం అన్న పురుషాధికార భావజాలాన్ని తప్పని నిరూపించారు మాగీ గీ. యుద్ధ విమానాల పైలట్ గా గాలిలో చెక్కర్లు కొడుతూ తాము ఎందులోనూ తక్కువ కాదని స్పష్టం చేశారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో పైలట్ గా , శిక్షకురాలిగా, ఆ తర్వాత భౌతిక శాస్త్రవేత్తగా మరణించేవరకు ప్రజాసేవలోనే జీవించారు. అమెరికాలోని  ఓక్లాండా అంతర్జాతీయ విమాశ్రయానికి  ఆమె పేరు పెట్టాలన్న డిమాండ్ కూడా ఉంది.   కాలిఫోర్నియాలో జన్మించారు మాగీ గీ. ఆమె తాతల కాలంలోనే వారి కుటుంబం చైనా నుంచి అమెరికా వలస వెళ్లారు. ఎగిరే విమానాలను ఎంతో ఆసక్తితో గమనించే మాగీ తాను పెద్దైన తర్వాత విమానాలు నడపాలని కలలు కన్నారు. ఆమె కుటుంబం ప్రతి ఆదివారం ఓక్లాండ్ విమానాశ్రయం వద్దకు వెళ్ళి అక్కడ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ చూస్తూ గడిపేవారు.  ఆ సమయంలో ఆసియా అమెరికన్లపై జాత్యహంకారం, లింగ వివక్ష ఎక్కువగా ఉండేవి. వాటన్నింటిని ఎదిరిస్తూ మాగీ విద్యాభ్యాసం కొనసాగించారు.   1941 లో గీ భౌతికశాస్త్రంలో ఉన్నత విద్య కోసం ఆమె బర్కిలీ విశ్వవిద్యాలయంలో చేరారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఆమె చదువు సాగలేదు.    ఐలాండ్ నావల్ షిప్‌యార్డ్‌లో పని చేయడానికి సిద్ధమయ్యారు. అయితే యుద్ధంలో చేరాలన్న ఆమె ఆలోచనలు అక్కడ ఎక్కువ కాలం పనిచేయనివ్వలేదు. మరో ఉద్యోగితో కలిసి 25 డాలర్లకు ఒక కారు కొనుగోలు చేసి టెక్సాస్‌లోని స్వీట్‌వాటర్‌లోని అవెంజర్ ఫీల్డ్‌కు వెళ్లారు, యుద్ధంలో పాల్జొన్నాలన్న ఆమె కోరిక విమానాలు నడపాలన్న లక్ష్యాన్ని కూడా చేరుకునేలా చేసింది. ప్రైవేట్ పైలట్ లైసెన్స్ సాధించడంతో పాటు ఉమెన్ ఎయిర్ ఫోర్స్ సర్వీస్ పైలట్స్ (డబ్ల్యూఏఎస్ పి)చేరి ఆరునెలల కఠిన శిక్షణ పూర్తి చేశారు. అమెరికా సైన్యంలోకి తీసుకున్న మొదటి మహిళా ఫోర్స్ లో మాగీ కూడా ఉన్నారు. 25 వేలకు పైగా  మహిళలు దరఖాస్తు చేసుకోగా కేవలం వెయ్యిమందికే అవకాశం వచ్చింది. అంతేకాదు మహిళా ఫోర్స్ లోని ఇద్దరు చైనీస్ అమెరికన్ ఏవియేటర్ మహిళలలో మాగీ గీ ఒకరు.మరోకరు పైలట్ హాజెల్ యంగీలీ. యుద్ధ విమానాల పైలట్ గా శిక్షణ పూర్తి చేసినా మాగీ కి యుద్ధంలో విమానాలు నడపడానికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. దాంతో ఆమె జెంట్ పైలట్లకు శిక్షణ ఇచ్చేవారు. అయితే సైనిక విమానాలను యుద్ధ ప్రాంతానికి ఆమె తీసుకువెళ్లారు.   యుద్ధం తర్వాత ఆమె లారెన్స్ లివర్మోర్ నేషనల్ లాబోరేటరీలో పనిచేశారు. అనేక వర్క్ షాపులు నిర్వహిస్తూ డాక్యుమెంటరీల ద్వారా తన పరిశోధనాంశాలను ప్రపంచానికి తెలియచేశారు. యుద్ధ సమయంలో మాగీ అనుభవాలు జీవిత కథ గా  సై హై ది ట్రూ స్టోరీ ఆఫ్ మాగీ గే అన్న పుస్తకంగా ప్రముఖ రచయిత మారిస్మాన్ మోస్ 2009లో తీసుకువచ్చారు. ఈ పుస్తకంలో యుద్ధ సమయంలో విమానం నడపకుండా తనను అడ్డుకున్నందుకు ఆమె పడిన ఆవేదన కనిపిస్తుంది. 2010 లో ఇతర WASP పైలట్ల తో కలిసి బంగారు పతకాన్ని అందుకున్నారు.   మాగీ గీ చాలా దశాబ్దాలుగా అల్మెడ కౌంటీ డెమోక్రటిక్ సెంట్రల్ కమిటీలో సభ్యురాలిగా పనిచేశారు. బర్కిలీ డెమోక్రటిక్ క్లబ్ లో చాలాకాలం బోర్డు సభ్యురాలిగా, కోశాధికారిగా కూడా  పనిచేశారు. కాలిఫోర్నియా డెమోక్రటిక్ పార్టీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ లో, ఆసియా పసిఫిక్ ఐలాండర్ డెమోక్రటిక్ కాకస్‌లలో పనిచేశారు. 2013లో ఆమె మరణించారు. చిన్నతనం లోనే తాను కన్న కలలను సాకారం చేసుకున్న మాగీ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.  

శతాబ్దాల తర్వాత తిరిగి జన్మస్థలానికి...

యుగాలుగా పూజలందుకున్న పవిత్రప్రాంతం. యుగపురుషుడి జన్మస్థలం. ఇక్ష్యాక వంశమూలపురుషులచే నిర్మితమై హిందూ, బుద్ధ, జైన, ఇస్లాం మతాలకు ఆరాధ్య ప్రదేశం, అనేక వివాదాలను కేంద్రబిందువై ఎట్టకేలకు కోట్లాది మంది హిందువుల ఆరాధ్యదైవమైన రామయ్య కోవెల నిర్మాణానికి సిద్ధమైన పట్టణం అయోధ్య.. శతాబ్దాల తర్వాత రాముడు సర్వాంగసుందరంగా భక్తులకు దర్శనమించే మహిమాన్విత ప్రదేశంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. కోట్లాది మంది హిందువుల పవిత్రయాత్రాస్థలంగా రూపుదిద్దుకోనుంది.   హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడు అవతరించిన ప్రదేశం అయోధ్య. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు అత్యంత మహిమాన్వితమైన చరిత్ర ఉన్న నగరం. రామాయణమహాకావ్యానికి ఆరంభం పలికిన అయోధ్యను సాకేతపురంగా కూడా పిలిచేవారు. సూర్యవంశ చక్రవర్తుల పాలనలోని కోసలరాజ్య రాజధానిగా ఈ నగరం వెలుగొందింది. స్కంధ పురాణంతో పాటు ఏడు మోక్షపురాణాల్లో అయోధ్య ప్రస్తావన ఉంది.   అధర్వణవేదంలో అయోధ్య దేవనిర్మితమని పేర్కొన్నారు. సూర్యవంశ రాజైన వైవసత్వ మనువు కుమారుడు ఇక్ష్వాకుడు ఈ నగరాన్ని నిర్మించి కోసల రాజ్యాన్ని పరిపాలించాడని పురాణాల్లో ఉంది.   ఇక్ష్వాకవంశం 63వ రాజైన దశరథుడి తనయుడిగా శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. తులసీదాస్ రచించిన రామచరిత మానస్ లో అయోధ్య వైభవం, రామరాజ్యం గొప్పతనం వర్ణించబడింది.   11వేల ఏండ్లు రాముని పాలనలో.. విష్ణుమూర్తి ఏడో అవతారమైన శ్రీరాముడు రావణసంహారణ అనంతరం ఇక్ష్వాక రాజ్యధినేతగా, సూర్యవంశవారసుడిగా దాదాపు 11వేల ఏండ్లు అయోధ్యను రాజధానిగా కోసల రాజ్యాన్ని పరిపాలించాడు అని పురాణాల్లో ఉంది.పురుషోత్తముడిగా, ఆదర్శపురుషుడిగా కీర్తించబడిన శ్రీరామచంద్రమూర్తి పాదస్పర్శతో పునీతమైన నేలగా అయోధ్య పట్టణానికి  గుర్తింపు ఉంది. జీవితంలో ఒకసారైనా రాముడు తిరుగాడిన ఈ నేలను తాకాలని హిందువులు తపిస్తారు. సత్యవాక్యపరిపాలకుడైన శ్రీరాముడు హిందువులకే కాదు అనేక మతాల వారికి ఆరాధ్యుడు. అయోధ్యలో రామమందిర నిర్మాణం సందర్భంగా అమెరికా టైమ్స్ స్కైర్ లోనూ రామచంద్రమూర్తి దివ్యరూపాలతో దేదీప్యమానంగా వెలుగొందాయి.    శతాబ్దాల తర్వాత త్రేతాయుగం నుంచి కలియుగం వరకు పవిత్రప్రాంతంగానే అయోధ్య ఆరాధించబడింది. ముస్లీంల దండయాత్ర తర్వాత అనేక నగరాల రూపురేఖలు మారినట్టే అయోధ్య రూపు మార్చచే ప్రయత్నం జరిగింది. రాముడి మూలాలను చెరిపివేస్తూ బబ్రీమసీదు నిర్మాణం జరిగింది. అనేక దశాబ్దాల పాటు కోర్డులో వివాదాంశంగా కొనసాగి చివరికి  రామమందిర నిర్మాణానికి  గత ఏడాది నవంబర్ 9న సుప్రీంకోర్డు అనుమతి లభించింది.   కోట్లాది హిందువుల కల రామజన్మభూమిలో రామమందిర నిర్మాణం కోట్లాది మంది కల. అసేతు హిమాచలం పులకించేలా ఈ రోజు రామ మందిరానికి భూమి పూజ జరుగుతుంది.

తెలంగాణలో ఉధృతంగానే కరోనా.. టెస్టులను బట్టి బయట పడుతున్న కేసులు 

తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం ప్రకటించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2,012 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,139 మంది కోలుకుని డిశార్జ్ కాగా, 13 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 70,958కి చేరింది. వివిధ ఆసుపత్రుల్లో 19,568 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి మొత్తం 50,814 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 576కి చేరింది. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 532 కరోనా కేసులు నమోదు కాగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 198, రంగారెడ్డిలో 188 కేసులు, వరంగల్ అర్బన్ లో 127, ఖమ్మం లో 97, సంగారెడ్డిలో 89 కేసులు నమోదయ్యాయి.   ఇదిలా ఉంటే తెలంగాణ‌లో టెస్టుల సంఖ్య‌ను బట్టి పాజిటివ్ కేసులు కూడా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. మొన్న శని ఆదివారాలలో బక్రీద్ సందర్భంగా కొన్ని చోట్ల టెస్టులు చేయలేదు. దీంతో ఆ రెండు రోజులు పాజిటివ్ కేసులు తగ్గాయి. ఐతే తాజాగా 21 వేల‌కు పైగా టెస్టులు చేస్తే.. 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌పడ్డాయి. అంటే దాదాపుగా టెస్టుల సంఖ్య‌లో 10 శాతం బాధితులు ఉన్నట్లుగా తేలుతోంది. అయితే టెస్టులు కనుక పెంచితే పాజిటివ్ కేసులు సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు.

లెబనాన్ రాజధాని లో భారీ పేలుడు, 78 మంది మృతి.. వేలాది మందికి గాయాలు

లెబనాన్ రాజధాని బీరుట్ ‌లో జరిగిన భారీ పేలుడులో 78 మంది చనిపోగా 4000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి కెమెరాకు చిక్కిన ఒక వీడియోను గమనిస్తే బ్లాస్ట్ ఏ స్థాయిలో సంభవించిందో అర్థమయిపోతుంది. చాల భవనాలు కూలిపోయి శిథిలాల కింద ఇంకా ప్రజలు చిక్కుకొని ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బీరూట్ నగరంతా గాజు పెంకులతో నిండిపోయింది. ప్రజల ఆర్తనాదాలు, హాహాకారాలతో భయానకమైన వాతావరణం అక్కడ దర్శనమిస్తోంది.   తొలుత బాంబు బ్లాస్టులుగా భావించినప్పటికీ ఇది బాంబు బ్లాస్టు కాదని తరువాత జరిగిన విచారణలో తేలింది. లెబనాన్ రాజధాని బీరుట్ ఓడరేవులోని ఓ గోడౌన్ ‌లో ఆరేళ్లుగా అత్యంత శక్తిమంతమైన పేలుడు పదార్ధమైన అమ్మోనియం నైట్రేట్ ను నిల్వ చేసినట్లు తాజాగా అధికారులు చెబుతున్నారు. మొత్తం 2750 టన్నుల అనుమతిలేని అమ్మోనియం నైట్రేట్ నిల్వ చేశారని ఆ దేశ అధ్యక్షుడు మైకెల్ ఆన్ ట్వీట్ చేశారు. ఆరు సంవత్సరాలుగా ఇంత భారీ స్థాయిలో అమ్మోనియం నైట్రేట్ ని ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా నిల్వ చేయడం పై లెబనాన్ ప్రధాని తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తూ దీని వెనుక ఎంతటివారున్నా వదిలేది లేదు అని తెలిపారు. దీనికి బాధ్యులైనవారికి అత్యంత కఠిన శిక్షలు పడతాయని లెబనాన్ సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ కూడా తెలిపింది.   తాజాగా ఈ పేలుడులో గాయపడిన క్షతగాత్రులతో బీరూట్ రాజధాని ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. అత్యవసరంగా సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వం దాదాపుగా 500 కోట్ల రూపాయలను విడుదల చేసింది. పేలుడు శబ్దాన్ని వందల కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ దేశంలో కూడా వినిపించిందంటే పేలుడు ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

ఏపీలో మరో మంత్రికి కరోనా

ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు ఉధృతమౌతోంది. తాజాగా సీఎం జగన్ క్యాబినెట్ లోని విద్యుత్‌, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆయనకు తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి కరోనా టెస్ట్ చేయించుకోగా మొదట్లో ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది. అయితే నిన్న మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్న బాలినేనికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన వెంటనే చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా కు చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వివిధ ప్రయివేట్ హాస్పిటల్స్ లో చేరి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

కరోనా చికిత్స అధ్వాన్నంగా ఉంది.. మంత్రి ముందే కడిగేసిన వైసిపి ఎమ్మెల్యే

కరోనా వ్యవహారంలో ఏపీ సర్కార్ తీరు పై వైసిపి ఎమ్మెల్యే అనంత వెంకట్రామి రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. నిన్న అనంతపురం లో మంత్రి ఆళ్ల నాని కోవిడ్ పై సమీక్ష నిర్వహించిన సందర్భం లో ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. "అందరూ ఏదో అంతా బాగానే ఉంది. అన్నీ సవ్యంగా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కాని అది నిజం కాదు. జిల్లాలో ని ఒక్క ఆస్పత్రి తప్ప.. మిగతా అన్నిటిలోనూ బాధితులకు వైద్య సేవలు సరిగా అందడం లేదు. ఎక్కడా అసలు సరైన సౌకర్యాలు కూడా లేవు. అంతే కాదు పేషెంట్లకు అందించే ఫుడ్ కూడా బావుండడం లేదు. ఇక డాక్టర్లు, నర్సులు.. పేషెంట్లు ఉన్న రూముల్లోకే వెళ్లటం లేదు. ఇలా అయితే కష్టం" అంటూ సమీక్ష చేస్తున్న మంత్రి ముందే మొత్తం ఉన్నదున్నట్లు కడిగిపారేశారు. దీంతో షాక్ కు గురైన మంత్రి మెల్లగా తేరుకుని ఎమ్మెల్యే గారు చెప్పారు కదా.. వెంటనే తగిన చర్యలు తీసుకోండి అని ముగించేశారు. అయినా పాపం అయన మాత్రం ఏం చేస్తారు .. ఆయనకు కూడా తెలుసు వాస్తవ పరిస్ధితేమిటో.   ఏపీలో కరోనా కేసుల లెక్కలు కూడా తేడాలొస్తున్నాయని ఒక పక్క మీడియా కోడై కూస్తోంది. జిల్లాల అధికారులు ఇచ్చే రిపోర్టుకు.. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే రిపోర్టుకు కూడా తేడాలుంటున్నాయని తాజాగా బయటపడింది. దీంతో ఇంకెన్ని కేసులు ఉన్నాయో.. అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అంతే కాకుండా.. కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ఉన్న యంత్రాంగం.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వారిని గుర్తించి టెస్టులు చేయడం సాధ్యం కావడం లేదు. దీంతో అనుమానం ఉన్నవారే వచ్చి టెస్ట్ చేయించుకుంటున్నారు. అలా కాకపోతే తమ చుట్టూ కేసులొచ్చిన చుట్టుపక్కలవారు కూడా వారంతట వారే వచ్చి టెస్ట్ చేయించుకుంటున్నారు. ఐతే ఈ టెస్టుల రిపోర్టులు కూడా ఎప్పటికో వస్తున్నాయి. అంతే కాకుండా టెస్టులు కూడా సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అదేమంటే టెస్టులు ఎక్కువగా చేస్తున్నామని చెపుతున్నారు. ఇది ఇలా ఉండగా పేషెంట్లు.. గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్లడానికి భయపడి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి లక్షలు లక్షలు సమర్పించుకుంటున్నారు. మన ముందు ఢిల్లీ, కేరళ సక్సెస్ అయిన ఉదాహరణలు కనపడుతున్నా అవి పట్టించుకోకుండా ఇంట్లోనే ఉండండి, కరోనాతో సహజీవనం తప్పదు, అందరికీ రాక తప్పదు వంటి డైలాగులతో ప్రభుత్వం కాలం గడిపేస్తోందని.. అధికార పార్టీ నేతలు ఎవరికి కరోనా వచ్చినా.. ఐతే హైదరాబాద్ లేదంటే చెన్నై పరిగెడుతున్నారు.. అంటే వారికీ ఇక్కడ చికిత్స పైన నమ్మకం లేకే గదా అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈరోజు తాజాగా ఎమ్మెల్యే కరణం బలరాం హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో చేరి.. చికిత్స పొందుతున్నారు.

రేపు అయోధ్య‌లో మోదీ షెడ్యూల్ ఇదే.. ఓ వైపు భక్తి, మరోవైపు ఉగ్రముప్పు!!

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రేపు భూమిపూజ జరగనుంది. ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతుండగా.. విశిష్ట అతిథిగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరవుతున్నారు. వేదికపై వీరిద్దరితో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి‌, అయోధ్య టెంపుల్ ట్రస్ట్ ఛైర్మన్ మాత్రమే ఆసీనులు కానున్నారు. మరోవైపు ఉగ్రవాదులు దాడికి తెగబడే అవకాశాలు ఉన్నాయన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేప‌థ్యంలో భ‌ద్ర‌త‌ను మ‌రింత ప‌టిష్టం చేశారు. ఇప్పటికే అయోధ్య మొత్తం ఎస్పీజీ భద్రతాబలగాల చేతుల్లోకి వెళ్లిపోయింది. అయోధ్య నగరంలోకి ప్రవేశించే సరిహద్దులను మూసేశారు. బయటి నుంచి నగరంలోకి వచ్చే వారిపై పూర్తి స్థాయిలో నిషేధం విధించారు. స్థానికులు కూడా ఐడీ కార్డు లేకుండా బయటకు రావొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.  ఇక ప్రధాని మోదీ షెడ్యూల్ విషయానికి వస్తే... రేపు ఉదయం 10.35 గంట‌లకు ప్రత్యేక విమానం ద్వారా ఆయన ఢిల్లీ నుంచి లక్నోకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి 125 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు ప్రత్యేక హెలికాప్టర్ లో వెళతారు. అయోధ్య‌లో ఉద‌యం 11.30 గంట‌ల‌కు మోదీ ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో ల్యాండ్ అవుతారు. అయోధ్య‌లో రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్య‌క్ర‌మానికి ముందు ప్ర‌ధాని అక్క‌డి హ‌నుమాన్ ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటారు. త‌రువాత భూమిపూజ‌కు వెళ్తారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు రామ్ ల‌ల్లా ‌ను ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేస్తారు. మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు భూమి పూజ జ‌రుగుతుంది. 12.40 గంట‌ల‌కు అయోధ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాప‌న చేస్తారు.

జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. మూడు రాజధానులపై హైకోర్టు స్టే 

సీఎం జగన్‌కు ఏపీ హైకోర్టులో పెద్ద షాక్ తగిలింది. మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. రాజధాని వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు బిల్లు పై గవర్నర్ ఇచ్చిన గెజిట్‌పై కోర్టు మంగళవారం స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీని పై తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతధ స్థితిని కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఏపీలో 3 రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్రవేయడాన్ని సవాల్ చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కోర్టులో సోమవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాజధాని వికేంద్రీకరణ పై జీఎన్ రావు, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్ కోర్టును కోరారు. రాజ్ భవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు గవర్నర్ జారీ చేసిన గెజిట్‌పై స్టేటస్ కో విధించింది.

జగన్ గారి పబ్లిసిటీ పిచ్చి తప్ప మహిళలకు న్యాయం ఎక్కడ?

వైఎస్ జగన్‌ పాలనలో గిరిజనులకు రక్షణ లేకుండాపోతోందంటూ టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 15 నెలల పాలనలో 400 అత్యాచార ఘటనలు జరిగాయి. 21 రోజుల్లో న్యాయం ఎక్కడ? అని ప్రశ్నించారు. దిశ చట్టం, ఈ-రక్షా బంధన్ అంటూ వైఎస్ జగన్ గారి పబ్లిసిటీ పిచ్చి తప్ప క్షేత్రస్థాయిలో మహిళలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. కర్నూలు జిల్లాలో భర్త ముందే ఒక ఎస్టీ మహిళపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. కేసు నమోదు చెయ్యడానికి గిరిజన సంఘాలు ఉద్యమం చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, బాధిత మహిళలకు జగన్ రెడ్డి గారి పాలనలో ఎంత అన్యాయం జరుగుతోందో అర్థం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి అని లోకేష్ డిమాండ్ చేశారు. కాగా, కర్నూలు జిల్లా వెలుగోడు మండలం జమ్మినగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు భర్తతో కలిసి గాలేరు వంతెన వద్ద నిద్రిస్తుండగా ముగ్గురు యువకులు ఆమె భర్తపై దాడిచేసి, ఆమెను ముళ్ల పొదల్లోకి ఈడ్చుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని గిరిజన సంఘం నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఈ కేసుపై పోలీసులు సరిగ్గా స్పందించలేదని బాధితురాలి భర్త, బంధువులు ఆరోపిస్తున్నారు.

అప్పుడు ప్రత్యేక హోదా.. ఇప్పుడు అమరావతి

ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్ర విభజనతో ఏర్పడిన గాయానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా అనే మందు వేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ నిర్ణయాన్ని అప్పటి విపక్షాలు స్వాగతించాయి. బీజేపీ అయితే ఐదు కాదు పది సంవత్సరాలు ప్రత్యేకహోదా ఇవ్వాలని చెప్పింది. తీరా ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ప్రత్యేకహోదాపై మాట మార్చింది. ప్రత్యేకహోదా కంటే విలువైన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. అప్పుడు బీజేపీతో దోస్తీ చేస్తోన్న అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్యాకేజీకి సరే అన్నారు. ప్యాకేజీతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. కానీ కొంతకాలానికి బీజేపీ ప్రభుత్వం ప్యాకేజీ విషయంలో మోసం చేసిందని ఆరోపిస్తూ.. హోదానే కావాలని పట్టుబట్టారు. బీజేపీతో దోస్తీ కూడా కట్ చేసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.   ఇక ప్రస్తుత ఏపీ అధికార పార్టీ వైసీపీ అయితే.. ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేకహోదా తీసుకొస్తామని హామీ ఇచ్చింది. టీడీపీ కారణంగానే ఏపీకి హోదా రాలేదని, మెజారిటీ ఎంపీ స్థానాల్లో తమ పార్టీని గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచైనా హోదా సాధిస్తామని చెప్పింది. 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లతో ఘన విజయం సాధించింది. కానీ ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచైనా హోదా సాధిస్తామని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసింది. హోదా ఇచ్చేవరకు కేంద్రాన్ని అడగటం తప్ప ఏం చేయలేమని, కేంద్రంలో బీజేపీకి పూర్తీ మెజారిటీ ఉంది కాబట్టి హోదాపై ఒత్తిడి తీసుకురాలేమని చెప్పుకొచ్చింది. ఇక జనసేన సంగతి సరేసరి. పాచిపోయిన లడ్డులు ఇచ్చారని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు అదే బీజేపీతో దోస్తీ చేస్తూ హోదా సంగతే మరిచారు. మొత్తానికి ఇలా అన్ని పార్టీలు కలిసి ప్రత్యేకహోదాని అటక ఎక్కించాయి. ఇప్పుడు అమరావతికి కూడా అదే పరిస్థితి తీసుకొస్తున్నాయి.   టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే అప్పటి ప్రతిపక్ష వైసీపీ స్వాగతించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అయితే అసెంబ్లీ సాక్షిగా రాజధాని నిర్ణయాన్ని స్వాగతించి, రాజధాని కోసం కనీసం 30 వేల ఎకరాలైనా కావాలన్నారు. ఎన్నికల సమయంలో కూడా రాజధానిని అమరావతి నుంచి తరలించే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి.. మూడు రాజధానులను తెరదీశారు. అమరావతి రైతులు ఉద్యమిస్తున్నా లెక్క చేయకుండా మూడు రాజధానులకు శ్రీకారం చుట్టారు. దీంతో టీడీపీ అమరావతి రైతుల తరఫున గళం వినిపిస్తోంది. కానీ రాజధాని తరలింపుని అడ్డుకుంటామన్న భరోసాని మాత్రం కలిగించలేకపోతోంది. టీడీపీ బలంగా నిలబడి దీనినొక రాష్ట్ర స్థాయి ఉద్యమంలా చేస్తే తప్ప.. టీడీపీపై నమ్మకం కలిగే పరిస్థితి లేదు. ఇక బీజేపీ ని ప్రజలు నమ్మేపరిస్థితి లేదు. కేంద్రం కలగచేసుకోదు, కానీ రాష్ట్ర బీజేపీ మాత్రం అమరావతినే రాజధానిగా కోరుకుంటోందని చెప్పడం, గవర్నర్ మూడు రాజధానుల బిల్లు ఆమోదించడం.. ఇవన్నీ చూసి ప్రజలకు బీజేపీపై నమ్మకం పోతోంది. ఇక బీజేపీతో దోస్తీ చేస్తోన్న జనసేన పరిస్థితి కూడా అలాగే ఉంది. అమరావతి కోసం ఉద్యమిస్తామని చెప్తున్నా నమ్మకం కలగట్లేదు. చేతల్లో చూపిస్తేనే నమ్మే పరిస్థితి ఉంది. మరి అన్ని పార్టీలు కలిసి అమరావతిని కూడా ప్రత్యేకహోదా లాగా అటక ఎక్కిస్తాయో? లేక కనీసం ఒక్క పార్టీ అయినా బలంగా నిలబడి అమరావతి కోసం ఉద్యమిస్తాయో చూడాలి.

ఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా..

ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఇటు సామాన్యులను అటు ప్రజా ప్రతినిధులను కూడా కలవర పెడుతోంది. ఈ రోజు ఉదయం ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసిపి ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. కొద్దీ కాలంగా అనారోగ్యంగా ఉండటంతో ఒంగోలులోని రమేష్ సంఘమిత్ర ఆస్పత్రిలో రాంబాబు, ఆయన భార్య పరీక్షలు చేయించుకున్నారు. ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. ఐతే అయన కుటుంబ సభ్యులకు మాత్రం నెగిటివ్ వచ్చింది.  ఐతే తాజాగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో అయన కుటుంబ సభ్యులతోపాటు ప్రైమరీ కాంటాక్టులను కూడా పిలిపించి అందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇంతకు ముందు సామాన్యులకు ఎక్కువగా కరోనా సోకేది. ఐతే ఎపుడు సెక్యూరిటీ మధ్య ఉండే ప్రజా ప్రతినిధులకు కూడా కరోనా సోకుతోంది. దీంతో ఈ ఎమ్మెల్యేలను ఈ మధ్య కలిసిన వారిని కూడా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సూచిస్తున్నారు.

చంద్రుడిపై ఎకరం ధర ఎంతో తెలుసా..

చంద్రుడిపై ఇల్లు కట్టుకోని భూమి చూడాలనుందా మైనింగ్ చేసి హీలియం వెలికితీసి డబ్బులు సంపాదించే ఆలోచన ఉందా పరిశోధనా సంస్థలకు మీ స్థలం లీజుకు ఇవ్వాలని ఉందా ఈ ఆలోచనలు ఉంటే మీరు తక్షణమే చంద్రడిపై జాగ కొనాల్సిందే.. మరి అక్కడ ఎకర స్థలం ఎంతో తెలుసా.. అంతేకాదు రెండుకు మించి ఎకరాలు కొనేవారికి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ చంద్రుడిపై స్థలం సొంతం చేసుకున్న మొదటి బాలీవుడ్ హీరో. ఆస్ట్రేలియాలో ఉండే ఆయన అభిమాని ఒకరు షారూక్ బర్త్ డే గిఫ్ట్ గా చంద్రుడిపై ప్లాట్ కొని బహుమతిగా ఇచ్చారట. ఇక ఇటీవల మరణించిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా చంద్రుడిపై ప్లాట్ కొన్నారు. ముంబాయికి చెందిన మరో వ్యాపారి కూడా చంద్రుడిపై స్ఠలం కొన్నాడు. సుశాంత్ అభిమాని ఒకరు గత నెల చంద్రుడిపై జాగను సొంతం చేసుకున్నాడు.   ఎవరు అమ్ముతున్నారు.. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం చంద్రుడు. సూర్యమండలంలోని  ప్రధాన గ్రహల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు 173 ఉన్నాయని శాస్త్రవేతలు చెబుతారు. వీటిలో అత్యధికంగా బృహస్పతి చుట్టూ 67,  శని  గ్రహం చుట్టూ 62 ఉపగ్రహాలు ఉన్నాయి. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం చంద్రుడిని చేరుకోవడానికి దశాబ్దాలుగా నాసా అంతరీక్ష నౌకలు పంపిస్తోంది. అనేక దేశాలు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు 12మంది చంద్రుడిపై కాలు మోపి ఆ తర్వాతి తరం వారు కాలనీలు కట్టుకోవడానికి వీలైన వాతావరణం కోసం అన్వేషణ కొనసాగించారు. సమీప భవిష్యత్ లో చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు చేసుకోవడం సాధ్యం చేయాలన్న సంకల్పంతో చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ప్రయోగాలు జరిగాయి. చాలా దేశాలు చంద్రుడిపై పాగా వేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.  అంతరీక్షంలోని ఇతర గ్రహాలను నివాసయోగ్యంగా చేసుకోవాలన్న ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.  ఈ నేపథ్యంలో అంతరిక్ష వనరుల అన్వేషణ, వినియోగ చట్టం అమలులోకి వచ్చింది. కాలిఫోర్నియాకు చెందిన ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ సంస్థ ఆఫీస్ న్యూయార్క్ లో ఉంది.   కాలనీలుగా.. చంద్రుడిపై మచ్చగా కనిపించే ప్రాంతంలో లూనా సోసైటీ ఇంటర్నేషనల్ కాలనీలుగా డివైడ్ చేసింది. వాటికి ఆకర్షణీయమైన పేర్లు కూడా పెట్టి ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ ఎకరాల చొప్పున స్థలాన్ని విక్రయిస్తున్నారు. డ్రీమ్ సరస్సు,, ప్రశాంత సముద్రం, బే ఆఫ్ రెయిన్ బోస్ ఇలాంటి పేర్లతో కాలనీలుగా చంద్రుడిపై ఆవాసాలు ఏర్పర్చుకోవచ్చని సూచిస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల వారు ఈ స్థలాలను ఇప్పటికే కొనుగోలు చేశారు.   ధర తక్కువే.. కొనుగోలు విధానమే కష్టం.. చంద్రుడిపై రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సులభతరం చేయడానికి 1999లో అంతర్జాతీయ లూనార్ రిజిస్ట్రీ లాండ్స్(ఐఎల్ఎల్ఆర్)ను రూపొందించారు. ఇది స్వతంత్య్ర సంస్థ. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు అంటార్కిటికా ఖండం మినహా మిగతా ఆరుఖండాల్లోని వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు, సంపన్నులు పన్నెండు న్నర లక్షల ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. లూనార్ సోసైటీలో సభ్యత్వం కోసం చెల్లించాల్సిన ఫీజుమొత్తాన్ని డాలర్ల రూపంలోనే చెల్లించాలి. స్థలం సొంతదారులకు పట్టాలను కూడా ఈ సంస్థ అందిస్తోంది. హ్యాపీనెస్ సరస్సు  సమీపంలో ఎకరం ధర 28.95 డాలర్లు. మూడు ఎకరాలు కొంటే 25శాతం, ఐదు ఎకరాలు కొంటే 33శాతం, పది ఎకరాలు కొంటే 173డాలర్లు మాత్రమే. అంటే పది ఎకరాలు కొనేవారికి 40శాతం రాయితీ ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో టూరీజం, పరిశోధనలకు మంచి డిమాండ్ ఉంటుందని సంస్థ నిర్వహకులు ప్రకటిస్తున్నారు. ఏయో ప్రాంతాలు వేటికి బాగా పనికి వస్తాయో కూడా వివరిస్తున్నారు. అంతేకాదు ఆయా  ప్రాంతాల్లో ధరలు కూడా వేరువేరుగా ఉన్నాయి. చాలా మంది తమకు ఇష్టమైన వారికి బహుమతులుగా కొనిస్తున్నారట. మరికొన్ని దశాబ్దాల్లో అచ్చం మన భూమి మీద మాదిరిగానే చంద్రుడి మీద ఇల్లు కట్టుకుని "భూమి అమ్మ రావే.. బందరు లడ్డు తేవే" అని పాడుకునే రోజు వస్తుందేమో..!  

అప్పు తీర్చలేదని మహిళా రైతును ట్రాక్టర్ తో తొక్కించి చంపిన వైసీపీ నేత..

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పు వసూలు కోసం వైసీపీ నేత ఒకరు అరాచకానికి పాల్పడ్డాడు. వడ్డీకి తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న కోపంతో ఓ గిరిజన మహిళా రైతును ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు ఆ దుర్మార్గుడు. గుంటూరు జిల్లా నకరికల్లు శివారులో ఉన్న శివాపురం తండాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు...శివాపురం తండాకు చెందిన గిరిజన దంపతులు రమావత్ మంత్రూ నాయక్, మంత్రుభాయి (55) అటవీ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ రెండున్నర ఎకరాల అటవీ భూములపై వారు హక్కులు సాధించారు. ఐతే సాగు ఖర్చులు, కుటుంబ అవసరాల కోసం అదే మండలంలోని బోనముక్కల శ్రీనివాస రెడ్డి వద్ద రెండేళ్ల కిందట పొలం తాకట్టు పెట్టి రూ.3.80 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఐతే కొంత కాలంగా వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో వారు శ్రీనివాస్ రెడ్డి దగ్గరి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేకపోయారు.   దీంతో గత కొన్ని నెలలుగా అప్పుగా ఇచ్చిన సొమ్మును వడ్డీతో పాటు చెల్లించాలని శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నాడు. అంతే కాకుండా అప్పు చెల్లించనిదే తాకట్టు పెట్టిన భూమిలో అడుగుపెట్టొద్దని హుకుం జారీ చేశాడు. అప్పును కనుక చెల్లించకుంటే తాకట్టుపెట్టిన భూమిని కూడా స్వాధీనం చేసుకుంటానని హెచ్చరిస్తూ వచ్చాడు. ఐతే ఇప్పటికిప్పుడు మా వద్ద అంత డబ్బు లేదు కాబట్టి పొలం అమ్మి అప్పు తీరుస్తాం.. లేదంటే భూమి మీరు తీసుకుని మిగిలిన మొత్తం మాకివ్వండి అని ఆ గిరిజన దంపతులు వేడుకున్నా శ్రీనివాస్ రెడ్డి కనికరించలేదు. ఈ విషయంలో గిరిజన దంపతులకు, అప్పు ఇచ్చిన శ్రీనివాస రెడ్డికి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో గిరిజన దంపతులు పొలం సాగుచేసేందుకు పొలాల్లోకి రాగా సమాచారం అందుకున్న శ్రీనివాస రెడ్డి ట్రాక్టర్‌తో వారి గ్రామానికి చేరుకుని అప్పు చెల్లించకుండా పొలంలో అడుగుపెడితే ఊరుకోనని హెచ్చరించాడు. ఈ విషయంలో గిరిజన దంపతులకు, శ్రీనివాస్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన శ్రీనివాస రెడ్డి ట్రాక్టర్‌తో మంత్రుభాయిని తొక్కించి వెళ్లిపోయాడు. దీంతో రక్తపు మడుగులో ఆ ముయ్యల రైతు అక్కడికక్కడే కన్నుమూసింది. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి ట్రాక్టర్‌తో పాటు పరారీలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. మరో పక్క శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని గిరిజన సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

నాసా మెప్పు పొందిన  ఇద్దరు అమ్మాయిలు

అంగారక గ్రహానికి సమీపంలో ఆస్టరాయిడ్ గుర్తింపు ఆకాశంలో చుక్కలు చూస్తూ వాటి లెక్క తెలియక చాలామంది తికమక పడుతుంటారు. కొందరు మాత్రమే ఆ చుక్కల లెక్కలు తేల్చాలని సంకల్పం చెప్పుకుంటారు. అలాంటి కోవలోకి చెందిన వారే సూరత్ లోని ఇద్దరు బాలికలు.    ఈ ఇద్దరు అమ్మాయిలు అంగారక గ్రహానికి సమీపంగా ఉన్న గ్రహశకలాన్ని గుర్తించారు. వారు గుర్తించిన గ్రహశకలానికి నాసా హెచ్ఎల్ వీ 2514 (HLV2514)గా నామకరణం కూడా చేసింది. సూరత్ అమ్మాయిలేంటీ, నాసా నామకరణం ఎంటీ అంటూ తికమక పడుతున్నారా.. అసలు విషయం తెలిస్తే మీరు ఔరా ఎంత గొప్ప పనిచేశారు మన అమ్మాయిలు అని మెచ్చుకుంటారు.   గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఇద్దరు బాలికలు  వైదేహి వెకారియా సంజయ్‌భాయ్, రాధిక లఖాని ప్రఫుల్‌భాయ్. స్థానికంగా పిపి సవాని చైతన్య విద్యా సంస్థలో పదోతరగతి చదువుతున్నారు. ఇటీవల  రెండు నెలల పాటు ‘ఆల్‌ ఇండియా ఆస్టరాయిడ్‌ సెర్చ్‌ క్యాంపెయిన్‌ 2020’  క్యాంపెయిన్‌లో  వీరిద్దరూ పాల్గొన్నారు. టెక్సాస్‌లోని హార్డిన్ సిమన్స్ యూనివర్సిటీ సహకారంతో స్పేస్ ఇండియా, ఇంటర్నేషనల్ అస్ట్రానామికల్ సెర్చ్ కొలాబరేషన్(IASC)లు సంయుక్తంగా ఈ  క్యాంపెయిన్‌ను నిర్వహించాయి.    భారతీయ విద్యలో ఖగోళ శాస్త్రం, అంతరిక్ష శాస్త్రాలు ప్రాచుర్యం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్న స్పేస్ ఇండియా అనేక పాఠశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశోధనలకు ఎంపిక చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైదేహి, రాధిక హవాయిలోని పాన్‌‌స్టార్స్ (పనోరమిక్ సర్వే టెలిస్కోప్ & రాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్) అధునాతన టెలిస్కోప్ సాయంతో అంగారక గ్రహం సమీపంలో గ్రహశకలాన్ని గుర్తించారు. తాము కనిపెట్టిన ఈ కొత్త గ్రహశకలం చిత్రాలను తీయడానికి టెలిస్కోప్‌ను ఉపయోగించారు. ఈ టెలిస్కోప్ అధిక-స్థాయి సిసిడి కెమెరాలతో గ్రహశకలం చిత్రాలను తీస్తుంది. అంతరిక్షంలో ఉండే మందమైన వస్తువులను ఈ టెలిస్కోప్ గుర్తిస్తుంది.   'దాదాపు 20ఆబ్జక్ట్స్ ను జాగ్రత్తగా పరిశీలించాం. అందులో ఒకటి గ్రహశకలంగా గుర్తించబడింది'. అంటున్నారు ఈ ఇద్దరు అమ్మాయిలు. వారిద్దరూ గ్రహశకలాన్ని కనుగొన్నారనే  విషయాన్ని  నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) నే ప్రకటించింది. అంతేకాదు  ఈ గ్రహశకలానికిHLV2514 గా నామకరణం చేసింది. ఈ సరికొత్త గ్రహశకలం సమీప భవిష్యత్తులో భూమిని దాటే అవకాశం ఉందని,  అయితే దీనికి కొన్ని సంవత్సరాల సమయం పట్టవచ్చు  అని గ్లోబల్ స్పేస్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది.