సెప్టెంబర్ 7 నుంచి వర్షాకాల సమావేశాలు
posted on Aug 18, 2020 @ 2:08PM
కోవిద్ నియమాలకు అనుగుణంగానే ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి జరగనున్నాయి. ఈమేరకు సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ పలువురు మంత్రులతో చర్చించారు. 20రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, శాసన సభ్యులు భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా అసెంబ్లీ హాలులో ఏర్పాట్లు చేయనున్నారు. అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు ఈ ఏర్పాట్లను సమీక్షిస్తారు.
అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కరోనా ప్రభావం, వర్షాలు, పెరిగిన వ్యవసాయ సాగు, విద్యాసంవత్సరం ప్రారంభం తదితర ముఖ్యమైన అంశాలను చర్చిస్తారు. పలు బిల్లులు, తీర్మానాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన అనేక అంశాలను కూడా అసెంబ్లీ వేదికగా ప్రకటిస్తారు.
కరోనాను అరికట్టడంలో అధికార పార్టీ విఫలం అయ్యిందని, శాసనసభలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది. కరోనాతో ప్రజలంతా అల్లాడుతుంటే ఆగమేఘాల మీద సచివాలయం కూల్చడాన్ని కూడా సభలో లేవనెత్తనున్నారు. కృష్ణాజలాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఎండకట్టేందుకు భారతీయ జనతాపార్టీ ప్రణాళిక సిద్దం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ప్రశ్నిస్తున్న బిజేపి రాష్ట్ర నాయకులు అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించనున్నారు.