చేనేతకు చేయూతనిద్దాం

చేనేత వృత్తి కాదు ఒక నినాదం.. మనం ధరించే వస్త్రం ఒక స్ఫూర్తి.. స్వదేశీ నినాదానికి ప్రతీక.. నలుమూలల ఎగిరే ఆత్మ గౌరవ పతాక..   అగ్గిపెట్టే ఇమిడిపోయే ఆరుగజాల చీరను నేసిన కళానైపుణ్యం నేతన్నది. ప్రపంచానికి  మగ్గంపై నేసిన అద్భుతాలను పరిచయం చేసిన ఘనత భారతీయ నేతన్న సొంతం.   స్వదేశీ ఉద్యమ చిహ్నంగా చరఖా నిలిచిపోయింది. స్వతంత్య్ర ఉద్యమానికి ఖద్దరు ఇంధనమై ముందుకు సాగింది.   మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగమే. దాదాపు కోటి 30లక్షల మందికి ప్రత్యేకంగా, దాదాపు తొమ్మది కోట్ల మందిరి పరోక్షంగా జీవనోపాధి కల్పిస్తోంది.    చేనేత రంగంలో జాతీయ స్థాయిలో వేగంగా అభివృద్ధి సాధించడానికి 1983లో భారత ప్రభుత్వం జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది.  చేనేతరంగ ప్రయోజనాల కోసం, అన్ని రకాల నూలును కొనడం, నిల్వచేయడం, మార్కెటింగ్‌ వంటి కార్యకలాపాలను ఈ కార్పొరేషన్‌ చేపడుతుంది. చేనేత రంగానికి అవసరమైన రంగులు, రసాయనాలు, ముడిపదార్థాలను సబ్సిడీ ధరలపై అందించడం, చేనేత రంగంలో సాంకేతికతను పెంచండం ఈ కార్పొరేషన్‌ ప్రధాన లక్ష్యాలు.    ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాల్లో  95శాతం మన దేశంలో ఉత్పత్తి అవుతుంది.  ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీ ’జాతీయ చేనేత దినోత్సవంగా పాటించాలని  ఐదేండ్ల కిందట కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.   7 ఆగస్టు 1905లో కోల్ కత్తా లోని టౌన్ హాల్ లో మొదటిసారి స్వదేశీ ఉద్యమానికి నాంది పలికారు. అదే స్ఫూర్తిలో 110 ఏండ్ల తర్వాత 7 ఆగస్టు 2015న చెన్నైలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న భారత  ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వదేశీ వస్త్రాలనే వాడాలని పిలుపునిచ్చారు.  దాంతో గత ఐదేండ్లుగా ఆగస్టు 7న ‘జాతీయ చేనేత దినోత్సవం’గా పాటిస్తున్నారు. అయితే ప్రజల్లో చేనేత వస్త్రాలపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలన్న నియమం పెట్టారు. చేనేతకు చేయూతనిచ్చి ఆత్మగౌరవ పతాకగా మార్చడానికి అనేక చర్యలు తీసుకున్నారు.  ఆధునికతను జోడించి మగ్గాలపై అనేక ప్రయోగాలు చేస్తూ  తమ ఉనికిని కాపాడుకునే  ప్రయత్నం చేస్తున్నారు. అయితే విదేశీ వస్త్రాలపై మోజులో ప్రజలు చేనేతను నిర్లక్ష్యం చేస్తున్నారు. దళారీల కారణంగా అప్పులపాలైన నేతన్నల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు.  ప్రజలంతా చేయిచేయి కలిపి చేనేతకు చేయూత నివ్వాలని ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు కోరుతున్నాయి.

ట్రంప్ గారి వ్యాక్సిన్ వచ్చేది అప్పుడేనట..

ప్రపంచం మొత్తం కరోనా తో సతమతమౌతూ వ్యాక్సిన్ ఎపుడు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా దీని పై స్పందించారు. కరోనా కు రోజులు దగ్గర పడుతున్నాయని, నవంబర్ 3 నాటికి ఈ వైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ అమెరికా చేతిలో ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. గురువారం నాడు ఓ రేడియో కార్యక్రమం ద్వారా మాట్లాడిన ఆయన, అమెరికా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ సమాచారాన్ని చైనా దొంగిలించిందా అనే విషయం పై స్పందిస్తూ తాను ఆ విషయాన్ని చెప్పలేనని ఐతే అది చైనాకు సాధ్యమయ్యే పనేనని నమ్ముతున్నానని అయన వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ తయారీలో అమెరికా సంస్థలు ముందంజలో ఉన్నాయని ఆయన అన్నారు.   ఐతే అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు కూడా నవంబర్ 3నే జరగనున్న నేపథ్యంలో నవంబర్ తొలివారంలోనే వ్యాక్సిన్ యూఎస్ వద్ద ఉంటుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికలను ఉద్దేశించి చేసారని అయన ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు అమెరికాలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 50 లక్షలకు చేరుకోగా, 1.61 లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు.

కరోనాతో టీటీడీ అర్చకుడి కన్నుమూత

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి రోజు దాదాపు 10 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. అక్కడ ఇక్కడ అని లేకుండా అన్ని ప్రాంతాలను కరోనా చుట్టేస్తోంది. ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రం తిరుమల కొండపై కూడా కరోనా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలువురు అర్చకులు కరోనా బారిన పడ్డారు. ఐతే వీరిలో కొందరు కోలుకోగా తాజాగా కరోనా రక్కసి కారణంగా అర్చకుడు ఎన్వీ శ్రీనివాసాచార్యులు కన్నుమూశారు. ఆయన వయసు 45 సంవత్సరాలు. నాలుగు రోజుల క్రితం ఆయన కరోనా సోకగా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అయన వాస్తవానికి తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయంలో అర్చకులుగా ఉన్నారు. ఐతే డిప్యుటేషన్ పై తిరుమలకు వచ్చారు.

అమరావతిపై క్లారిటీ అడిగిన నేతపై వేటు వేసిన ఏపీ బీజేపీ

సోము వీర్రాజుకు ఏపీ బీజేపీలో ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. తాజాగా ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి అయన దూకుడు మరింత పెంచారు. హైకమాండ్ ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో వాటిని పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ పాటించాలని లేకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఇందులో ఎటువంటి మొహమాటం ఉండదని అయన స్పష్టం చేస్తున్నారు.   తాజాగా ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం విషయంలో మొదటి నుండి అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని దానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదని ఐతే పార్టీపరంగా మాత్రం మేము అమరావతికి మద్దతు తెలుపుతామని సోము వీర్రాజు చెప్పడం తెలిసిందే. ఈ విషయం ఇలా ఉండగానే ఏపీ రాజధాని అంశంపై బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు డాక్టర్ ఓ వి రమణ "మూడుముక్కలాట తో నష్టపోతున్న బీజేపీ" అంటూ ఇటీవల ఓ ప్రముఖ తెలుగు దిన పత్రికలో వ్యాసం రాశారు. దీంతో ఆగ్రహించిన సోము వీర్రాజు ఆ వ్యాసం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రకటించి ఓవీ రమణ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసారు   ఐతే ఆ వ్యాసంలో డాక్టర్ రమణ రాసింది ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడు గా ఉన్న సమయం వరకు అమరావతి రాజధాని కి బీజేపీ అనుకూలంగా ఉందని దీక్షలు చేశారు మీడియా సమావేశాలు పెట్టి భారీ డైలాగులు వేశారు. అయితే అధ్యక్షుడు మారిపోగానే.. రాష్ట్ర రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదని, అదే సమయంలో పార్టీ వేరు కేంద్ర ప్రభుత్వం వేరని కొత్తగా వ్యాఖ్యానాలు చేస్తున్నారని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఇదే సమయంలో అమరావతి ప్రజల తరుఫున పోరాడతామని కొత్త అధ్యక్షులు చెపుతున్నారని పేర్కొన్నారు. దీంతో రాజధాని పై స్పష్టత లేని బీజేపీ పైన ప్రజలలో ఉన్న నమ్మకం పూర్తిగా పోతోందని దానితో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా అయోమయం లో పడ్డారని అందులో పేర్కొన్నారు. తాజాగా ఆ ప్రాంత రైతులు పోరాటం చేస్తున్నదే రాజధాని కోసం అయినప్పుడు, మరి రాష్ట్ర బీజేపీ మద్దతు దేనికి ఇస్తున్నట్లు? ఈ గందరగోళం వల్ల విలువలతో కూడిన బీజేపీ ని ప్రజలు శంకించే పరిస్థితి ఏర్పడిందని ఓ వి రమణ ఆ వ్యాసంలో ఏపీ బీజేపీని సూటిగా ప్రశ్నించారు. దీంతో సోము వీర్రాజు వెంటనే రమణ ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు.

బాలికపై వైసీపీ యువకులు అత్యాచారయత్నం.. వీళ్లకు ఇంత ధైర్యం ఇచ్చింది ఎవరు?

రాజమండ్రి రూరల్ లో 10ఏళ్ల ముస్లిం మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారయత్నం చేశారు. అత్యాచారయత్నం చేసింది వైసీపీకి చెందినవారిగా గుర్తించారు. అయితే వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించడంతో తల్లిదండ్రులు కామ్ గా ఉన్నారు. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలని వేధింపులకు గురిచేస్తుండడం, చంపేస్తామని బెదిరిస్తుండడంతో తమను సీఎం జగనే కాపాలంటూ వేడుకుంటున్నారు.   కాగా, ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. "రాజమండ్రి రూరల్ లో అభం శుభం తెలీని 10 ఏళ్ల ముస్లిం మైనర్ బాలికపై ముగ్గురు వైసీపీ యువకుల అత్యాచారాయత్నాన్ని ఖండిస్తున్నాం. పైగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరింపులా? ఈ అరాచక మూకలకు ఇంత ధైర్యం ఇచ్చింది ఎవరు?" అని ప్రశ్నిస్తూ.. బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియోని చంద్రబాబు పోస్ట్ చేశారు. "16ఏళ్ల దళిత మైనర్ బాలికపై 12మంది గ్యాంగ్ రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందే వదిలేసిన దుర్ఘటన కళ్లముందే ఉంది. కర్నూలులో గిరిజన మహిళను భర్త కళ్లముందే అతిదారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. దిశచట్టం అసలు అమల్లో ఉందా? ఇప్పటికైనా పోలీసులు నిద్రమత్తు వీడి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలి." అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

అమరావతికి అయోధ్యకు పోలికా.. ఏపీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్

ఏపీలో అమరావతి అంశం పై రచ్చ మాములుగా లేదు. ఈ విషయంలో టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఏపీ మంత్రి పేర్ని నాని తాజాగా కౌంటర్ ఇచ్చారు. అయోధ్యతో అమరావతిని పోల్చడాన్ని ఈ సందర్భంగా ఆయన తప్పుబట్టారు. అయోధ్యతో అమరావతికి ఎక్కడా అసలు పోలికే లేదని ఆయన వ్యాఖ్యానించారు.   అయోధ్య పుణ్యభూమి అని ఐతే అమరావతి మాత్రం పాపాలపుట్ట అని మంత్రి అన్నారు. అంతే కాదు అమరావతి పవిత్రస్థలం కాదు.. పాపాల పుట్ట అనే విషయం ప్రధాని నరేంద్రమోదీకి కూడా అర్థమైందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పోలవరం చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని గతంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారని అయన గుర్తు చేసారు.   అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ఎలాంటి విధానాన్ని అవలంభించారో అందరికీ తెలుసని పేర్ని నాని ఎద్దేవా చేసారు. కేవలం డబ్బులు లెక్కపెట్టడం మాత్రమే తెలిసిన నారాయణ చెబితేనే రాజధానిని అమరావతిలో పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు.   ఎప్పుడూ టీవీల్లో కనిపించకపోతే చంద్రబాబుకు తోచదని పేర్ని నాని విమర్శించారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చంద్రబాబు చేసిన డిమాండ్‌పై మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. కనీసం ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌కు కూడా దిగని చంద్రబాబు తమకు సవాళ్లు విసరడమేమిటని అయన వ్యాఖ్యానించారు.

ఏపీ రాజధాని అంశంతో మాకు సంబంధం లేదు: కేంద్రం

మూడు రాజధానులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఏపీ రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని దాఖలైన అఫిడవిట్‌ కు కేంద్ర హోంశాఖ గురువారం కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసింది. రాష్ట్ర రాజధాని అంశంతో కేంద్రానికి సంబంధం లేదని ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. రాష్ట్ర రాజధానుల నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారపడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.    విభజన చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం 2014లో శివరామకృష్ణన్‌ ఆధ్వర్యంలో కమిటీని నియమించామని కేంద్రం తెలిపింది. 2015 ఏప్రిల్ 23న  అప్పటి ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిందని, రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తెలిపింది. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికి జూలై 31న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని, ఇందులో కూడా కేంద్రానికి ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేసింది.

జగన్ గారూ.. వారు వేటకుక్కలై వేటాడే టైం దగ్గర పడింది: రఘురామకృష్ణంరాజు

అమరావతి ప్రాంతానికి చెందిన మహిళలను కుక్కలతో పోల్చుతూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ముఖ్యమంత్రిగారూ, వారంతా వేటకుక్కలై వేటాడే సమయం దగ్గరపడే రోజు వస్తుంది' అని అన్నారు.    నిరసన తెలిపే వారిని కుక్కలతో పోలుస్తారా? అని మండిపడ్డారు. మహిళలను కించపరుస్తూ పోస్టులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగనాయకమ్మ అనే వృద్ధ మహిళ ఎవరో పెట్టిన పోస్టింగ్‌ను ఫార్వర్డ్ చేస్తే ఆమెపై కేసులు పెట్టినప్పుడు.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వాన్ని అపార్థం చేసుకోవాల్సి వస్తుందని అన్నారు.    అమరావతికి న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. రాజధాని రైతులు, మహిళలు అభద్రతాభావానికి గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. త్వరలోనే అమరావతిలో మనోధైర్య యాత్ర చేస్తానని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.   ఎస్వీబీసీ ఛానెల్‌లో అయోధ్య రామమందిర భూమిపూజను ప్రత్యక్షప్రసారం చేయకపోవడం దారుణమని అన్నారు. ఇక సీఎం జగన్ కు గుడికడతానన్న గోపాలపురం ఎమ్మెల్యేపై రఘురామకృష్ణంరాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. అభిమానం ఉంటే మరో విధంగా చాటుకోవాలి కానీ.. గుడి కడతానని అనడం సిగ్గుచేటన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దని కోరారు.

రాజధాని పిటిషన్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాష్ట్ర ఖజానాకు నష్టమే కదా?

రాజధాని పిటిషన్లపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. రాజధాని నిధుల వ్యయానికి సంబంధించిన అంశం విచారణకు వచ్చింది. ఇప్పటి వరకూ 52వేల కోట్ల రూపాయల వ్యయం చేశారని సీఆర్డీఏ రికార్డును హైకోర్టు న్యాయవాది ఉన్నం మురళీధర్ చూపించారు. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నేటివరకు ఎంత ఖర్చు చేశారు? ఎక్కడ ఆ నిర్మాణం ఆగింది? తదితర వివరాలు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఇది ప్రజల సొమ్ము, రాష్ట్ర ఖజానాకు నష్టమే కదా? అని హైకోర్టు వ్యాఖ్యానించింది.   బిల్డింగ్‌లు ఎన్ని పూర్తయ్యాయి? ఎక్కడ ఆగిపోయాయి? ఎంత వ్యవయం చేశారు? కాంట్రాక్టర్లకు ఎంత డబ్బులివ్వాలి? వంటి వివరాలన్నీ వెంటనే సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. నిర్మించిన భవనాలను వాడుకోకపోతే, అవి పాడైపోతాయి కదా?.. ఆ నష్టం ఎవరు భరిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర అకౌంటెడ్ జనరల్‌కు వెంటనే నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ డబ్బులు ఎక్కడ నుంచి తీసుకువచ్చారు? 52 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లు ఏ దశలో ఉన్నాయో కూడా వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 14వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

ఆ గాయానికి 75ఏండ్లు

విధ్వంసానికి కేరాఫ్ క్షణాల్లో లక్షలాది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయిన దుర్ఘటన.. శత్రువును సైతం గుండెదడకు గురిచేసిన విస్పోటనం.. రెప్పపాటు కాలంలో శవాల గుట్టలు.. శిథిలాల మధ్య జీవం మొలకెత్తడానికి పట్టిన కాలం రెండేళ్లు.. హిరోషిమా .. అణుబాంబు విధ్వంసానికి చిరునామా. సరిగ్గా 75 ఏండ్ల కిందట ఇదే రోజు... ఇక్కడే... ఆకాశం నుంచి అగ్రరాజ్య విమాన ద్వారా జారవిడిచిన అణుబాంబు సృష్టించిన  విస్పోటనం ఒక నగరాన్ని శిథిలంగా మార్చింది.  ప్రజలతో నిండిన పట్టణం శవాలతో శిథిలంగా మారింది. కనీసం గడ్డికూడా మొలవదని అందరూ భావించిన ఈ చోట రెండేళ్ల తర్వాత బూడిద కుప్పల్లో నుంచి వచ్చిన మొలకలు మనిషిలోని ఆశను బతికించాయి. అణుబాంబు కారణంగా విషతుల్యమైన ఆ ప్రాంతంలో రేడియేషన్ తాలుకా దుష్పరిణామాలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. 6 ఆగష్టు, 1945 లో జరిగిన ఈ సంఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్థం సంస్మరణ దినోత్సవాన్ని జపాన్ ప్రజలు జరుపుకోంటారు. ఈ రోజును హిరోషిమా డే గా ప్రపంచమంతా అణువిధ్యంస చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటూ అణ్వస్త్ర వ్యతిరేక దినం (యాంటీ న్యూక్లియర్‌ డే)గా ప్రకటించారు.

ఏపీ ప్రభుత్వానికి మరో దెబ్బ.. వైసీపీ ఎంపీ కి కేంద్రం వై కేటగిరి భద్రత..!

కొద్ది రోజులుగా వైసీపీకి కంట్లో నలుసులాగా తయారైన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించింది. కొద్దీ రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యేల నుంచి తనకు ప్రాణాలకు ముప్పు ఉందంటూ రఘురామ రాజు కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా దీని కోసం అయన కేంద్ర హోమ్ సెక్రటరీని కలవటంతో పాటుగా ఢిల్లీ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన ఈ రోజు విచారణ జరగనుంది. ఐతే దీని పైన తర్జన భర్జనల తరువాత కేంద్ర హోం శాఖ ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఈ రోజు కోర్టుకు నివేదించనుందని తెలుస్తోంది.    ఐతే రఘురామరాజు కోరినట్లుగా కేంద్రం రక్షణ కల్పించటం ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు సవాల్ గా మారుతోంది. గడచినా కొద్దీ నెలలో ఇలా జరగడం ఇది రెండో సారి. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ సైతం రాష్ట్రంలో తనకు భద్రత లేదంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసారు. ఆ సమయంలోనూ ఆయనకు భద్రత కల్పించేందుకు కేంద్ర హోం శాఖ సూచనలు చేసింది. ఇది ఇలా ఉండగా పార్టీ పరంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఇరకాటంలో పెట్టే విధంగా అనేక అంశాల పైన రఘురామరాజు బహిరంగ లేఖలు రాస్తున్నా ఆయన పైన ఇప్పటివరకు ఎటువంటి క్రమశిక్షణా చర్యలు కూడా వైసిపి తీసుకోలేకపోయింది.

బాబు కానీ, జడ్జీలు కానీ జగన్ వెంట్రుక కూడా కదపలేరు: వైసిపి ఎమ్మెల్సీ సెన్సేషనల్ కామెంట్స్ 

కొద్ది రోజుల క్రితం కొత్తగా గవర్నర్ చేత ఎమ్మెల్సీగా నియమించబడ్డ వైసీపీ నేత పండుల రవీంద్రబాబు ప్రతిపక్షనేత చంద్రబాబు, కోర్టుల జడ్జిల పై పరుష వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనను స్వాగతిస్తూ వైసిపి నాయకులు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గుడ్డివానిచింత వద్ద జగన్‌ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. పండుల తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికయిన సందర్భంగానూ ఈ కార్యక్రమం ఏర్పాటయింది. ఈ సందర్భంగా ఆయన కోర్టులు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "న్యాయస్థానాలు గానీ, జడ్జీలుగానీ, చంద్రబాబుగానీ, కేసులుగానీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెంట్రుకని కూడా కదపలేవు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాజధాని రైతుల శాపం కారణముగా చంద్రబాబు ఘోర పరాజయంపాలు అయ్యారని అయన ఆరోపించారు. అసలు రాజధాని రైతులకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తున్నవారంతా రైతులు కాదని, వారి ముసుగులో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులని రవీంద్రబాబు ఆరోపించారు.   మూడు రాజధానుల నిర్ణయాన్ని సీఎం ప్రకటించడం వెనుక ఎవరికీ ఎటువంటి స్వార్థ రాజకీయ లాభాపేక్షా లేదన్నారు. గతంలో విశాఖ నుంచి పోటీ చేసిన జగన్‌ తల్లి విజయలక్ష్మి ఓడిపోయినా.. అదే విశాఖ నుండి ఎమ్మెల్యేలుగా టీడీపీకి చెందిన ముగ్గురు ఎన్నిక అయినా సీఎం జగన్‌ రాజకీయ స్వార్థం లేకుండా విశాఖపట్నంను రాజధానిగా ఎంపిక చేశారన్నారు. అదే సీఎం రాజకీయ స్వలాభం చూసుకొంటే "కడప లేక పులివెందులలోనే రాజధానిని పెట్టేవారు’’అని రవీంద్రబాబు పేర్కొన్నారు. 

చైనా లో మరో కొత్త వైరస్.. ఇప్పటికే ఏడుగురు మృతి

చైనాలోని వుహాన్ లో మొదలైన కరోనా వైరస్ ఇపుడు ప్రపంచం మొత్తాన్ని చుట్టేసి మానవాళిని కబళిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు దీనికి సరైన ట్రీట్ మెంట్ లేదు అలాగే దీనిని ఎదుర్కునే వ్యాక్సిన్ కూడా రాలేదు. ఇది ఇలా ఉండగా తాజాగా చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. అంతే కాకుండా ఈ వైరస్ సోకి ఇప్పటికే ఏడుగురు మరణించారు. కీటకాల ద్వారా వ్యాపించే ఈ వైరస్ దాదాపు 60 మందికి పైగా సోకింది. బుధవారం చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ ఈ సమాచారాన్ని ప్రచురించింది. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో గత నెలలో 37 మందికి పైగా SFTS Virus బారిన పడ్డారు. తాజాగా తూర్పు చైనాలోని అన్హుయి ప్రావిన్స్‌లో 23 మందికి ఈ వైరస్ సోకినట్లుగా గుర్తించినట్లు అధికారిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. వైరస్ బారిన పడిన జియాంగ్సు రాజధాని నాన్జియాంగ్‌కు చెందిన ఒక మహిళ మొదట్లో దగ్గు, జ్వరం లక్షణాలతో మొదలై తరువాత ఆమె శరీరంలో ల్యూకోసైట్స్, ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గినట్లు వైద్యులు గుర్తించారు. దాదాపు ఒక నెల చికిత్స తర్వాత ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. తాజా నివేదిక ప్రకారం తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో కనీసం ఏడుగురు వైరస్ కారణంగా మరణించారు. ఐతే ఈ SFTS వైరస్ కొత్తది కాదు. దీనిని చైనాలో 2011 లోనే కనుగొన్నారు. జంతువుల శరీరానికి అతుక్కుని ఉండి, తరువాత మానవులకు వ్యాపించే నల్లి (టిక్) వంటి కీటకాల ద్వారా ఈ వైరస్ మానవులకు వ్యాపిస్తుందని వైరాలజిస్టులు పేర్కొన్నారు. ఈ వైరస్ మనుషులకే కాక మనం పెంచుకునే మేకలు, బర్రెలు, గుర్రాలు, పందులకు కూడా సోకుతుందని తెలుస్తోంది. అంతే కాకుండా ఇప్పటికే దీనిపై స్టడీ చేసిన అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం దీనిని అదుపు చేయకపోతే మరో మహమ్మారిగా మారి ఇటు మానవాళికి అటు జంతువులకు కూడా తీవ్ర నష్టం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి.. సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి

టీఆర్ఎస్ నేత, సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.   దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రామలింగారెడ్డి.. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా ఉన్న ఆయన.. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పని చేశారు.   రామలింగారెడ్డి తొలుత దాదాపు పాతికేళ్ళ పాటు జర్నలిస్టుగా పని చేశారు. అప్పటి పీపుల్స్‌వార్‌ సంస్థతో సంబంధాలున్నాయనే నెపంతో ఆయనపై టాడా కేసు నమోదు చేశారు. దేశంలోనే మొట్టమొదటి టాడా కేసు రామలింగారెడ్డిపై నమోదు కావడం గమనార్హం.    2004లో రామలింగారెడ్డి రాజకీయరంగ ప్రవేశం చేశారు. 2004లో మొదటి సారిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2008 (ఉప ఎన్నికలు), 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.   ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిగా, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.

జగన్ ఆ ప్రకటన చేస్తే.. మేము పదవులు వదులుకుంటాం: బాబు

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు చంద్రబాబు ఇచ్చిన 48 గంటల డెడ్ లైన్ ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగిసింది. దీంతో కొద్దీ సేపటి క్రితం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఒక్కసారి అవకాశం ఇస్తామంటే కరెంటు తీగను పట్టుకొంటారా అని తాను చెప్పినా కూడ ప్రజలు పట్టించుకోలేదన్నారు. ప్రజలు నమ్మి వైసీపీకి అధికారాన్ని కట్టబెడితే ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ పై బాబు మండిపడ్డారు.   మూడు రాజధానుల అంశం పై తాను చేసిన అసెంబ్లీ రద్దు ప్రతిపాదన విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పారిపోయాడని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీ రద్దుకు తాను డిమాండ్ చేస్తే వైసీపీ వారు పిరికి పందల్లా పారిపోయారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమరావతిలోనే రాజధానిని కొనసాగిస్తామని స్పష్టమైన ప్రకటన చేస్తే తాము రాజీనామాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఐతే ప్రజలకు ఇచ్చిన మాట తప్పినందుకు గాను అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.   అంతే కాకుండా అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని అమరావతిని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం కూడ ఈ విషయంలో ఏపీకి న్యాయం చేయాలన్నారు. వైసీపీలోని నిజాయితీ గల నేతలంతా కూడ అమరావతికి మద్దతివ్వాలని బాబు కోరారు.   తాను చేస్తున్న ఈ పోరాటం నా కోసమో లేక మా పార్టీ కోసమో కాదని ఆయన ప్రజలకు గుర్తు చేశారు. ఈ విషయం పై ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో అమరావతిలోనే రాజధాని ఉంటుందని వైసీపీ నేతలు ప్రకటించిన వీడియో క్లిప్పింగ్ లను ఆయన ఈ సమావేశంలో ప్రదర్శించారు. సీఎం జగన్ అమరావతి విషయంలో మాట తప్పారు. మడమ తిప్పారని బాబు విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు మూడు రాజధానుల గురించి ఎందుకు చెప్పలేదని ఆయన జగన్ ను ప్రశ్నించారు. ప్రజలకు ద్రోహం చేయడం నీచమన్నారు.   ఇప్పటికైనా వైసీపీ నేతలు ఈ విషయంలో డ్రామాలు చేయడం ఆపాలని ఆయన డిమాండ్ చేసారు. అమరావతిలోనే రాజధాని ఎందుకు ఉండాలనే విషయమై తాను రెండు రోజులకు ఒకసారి ప్రజల ముందు అన్ని విషయాలను పెడతానని ఆయన చెప్పారు. ఈ విషయాలపై తాను చెప్పిన అంశాలను ప్రజలంతా చర్చించి ఏది మంచో ఏది చెడో మీరే నిర్ణయించుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్రం కొన్ని విషయాల్లో జోక్యం చేసుకొనే అవకాశం ఉంటుంది. అదే అధికారాన్ని ఆసరాగా చేసుకొని అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

పర్యావరణ గణపతి విగ్రహాన్ని పూజిద్దాం

సకల విఘ్నాలను తొలగిస్తూ, అన్ని ఆపదల నుంచి రక్షించే వినాయకుని వత్రం సందర్భంగా పర్యావరణ గణపతిని పూజించాలని దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య  కరోనా వ్యాప్తి దీని నుంచి మనకు మనం రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే వాతావరణాన్ని శుద్ధి చేసే వేపమొక్కలను విరివిగా నాటాలన్నారు. మనల్ని మనం రక్షించుకోవటంతో పాటు, సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది. ఈ నేపథ్యంలో వినాయక  చవితి సందర్భంగా ఆధ్యాత్మికతకు ప్రకృతి, పర్యావరణ రక్షణను జోడించాలని వారు కోరారు. ఇందు కోసం ఈ వినాయక చవితికి విత్తన గణపతిని (సీడ్ గణేష్) అందరికీ పంపిణీ చేస్తామన్నారు. లాంఛనంగా ఇవాళ విత్తన గణపతిని ఆవిష్కరించారు.  పర్యావరణ హిత స్వచ్ఛమైన మట్టిలో వేప విత్తనాన్ని కలిపి గణపతిని తయారు చేసి పంపిణీ చేయటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. అంతేకాదు మట్టిగణపతి విగ్రహన్ని అందరూ పూజకు ఉపయోగించేలా అవగాహన కల్పిస్తున్నారు. కరోనా సమయంలో గణపతి వేడుకలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ,ఎవరికి వారే తమ ఇళ్లలోనే విత్తన గణపతిని ప్రతిష్టించుకునేలా, పూజల తర్వాత మొలకెత్తే వేప విత్తనాన్ని నాటు కోవచ్చునని తెలిపారు. తద్వారా ప్రతీ ఇంటి ఆవరణలో ఔషధ గుణాలున్న ఒక వేప చెట్టు ఉండాలన్న గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఆశయం కూడా సిద్దిస్తుందని సంతోష్ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా వీలైనన్ని విత్తన గణేష్ లను పంపిణీ చేస్తామని, అదే సమయంలో ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు. టీ ఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా విత్తన గణపతి పంపిణీలో పాల్గొనాలని సంతోష్ పిలుపు నిచ్చారు. ఆకుపచ్చని తెలంగాణ సాధనలో ఇది కూడా ఒక సాధనంగా ఉపయోగపడు తుందన్నారు.

కరోనా మహమ్మారి నుండి బయట పడ్డ ముఖ్య మంత్రి

మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ క‌రోనా నుండి కోలుకున్నారు. తాజాగా జరిపిన టెస్ట్ లో ఆయ‌న‌కు నెగిటివ్ రావ‌డంతో ఆయ‌న్ను ఆస్ప‌త్రి నుంచి‌ డిశ్చార్జ్ చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ గత నెల 25న కరోనా బారినప‌డ్డారు. దీంతో చికిత్స కోసం ఆయ‌న భోపాల్‌లోని చిరాయు ఆస్పత్రిలో చేరారు. అయితే మరి కొన్ని రోజుల పాటు ఆయనను తన ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండాలని డాక్ట‌ర్లు సూచించారు.   ఆస్పత్రి నుండి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చిన తరువాత డాక్ట‌ర్ల బృందానికి సీఎం కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. క‌రోనా మాత్రం అంత ప్ర‌మాద‌కరం కాద‌ని.. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలు తీస్తుంద‌ని ఈ సందర్బంగా అయన హెచ్చ‌రించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కూడా అయన సూచించారు. అవ‌స‌ర‌మైతే క‌చ్చితంగా చికిత్స తీసుకోవాలని వివ‌రించారు. అంత‌కుముందు తనకు చికిత్స చేసిన వైద్య సిబ్బందితో క‌లిసి అయన ఫొటోలు దిగారు.

పట్టాలకు వేలాడే రైలు

రైలు ఎలా వెళ్ళుతుంది అనగానే.. పట్టాలపై వెళ్లుతుంది అని ఠక్కున ఎవరైనా చెబుతారు. కానీ, జర్మనీలోని ఎలక్ట్రిక్‌ ఎలివేటెడ్‌ రైలు గురించి తెలిసిన వారు మాత్రం పట్టాల పైన వెళ్లవచ్చు, పట్టాల కింద వేలాడుతూ కూడా వెళ్ళవచ్చు అని చెప్తారు. పట్టాలకు వేలాడుతూ  ప్రయాణికులను వింత అనుభూతులను లోను చేస్తూ వెళ్లే రైలు జర్మనీలో ఉంది.  జర్మన్‌ వెళ్లిన వారు  ఈ అద్భుత రైలు ప్రయాణం తప్పక చేస్తారు..   ఉత్తర జర్మనీలోని రైన్‌-వెస్ట్ఫాలియాలోని  ఉప్పర్‌ నగరం చుట్టూ తిరుగుతూ, పట్టణం అందాలను కనువిందు చేస్తూ  సాగే రైలు ప్రయాణం ఇక్కడి ప్రజలను నిత్యానందమే. ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు  చేర్చే ఈ ఈ వేలాడే రైలు పూర్తి పేరు ''ఎలక్ట్రిక్‌ ఎలివేటెడ్‌ రైల్వే (సస్పెన్షన్‌ రైల్వే). విద్యుత్‌ చార్జింగ్‌తో నడిచే రైల్వే సిస్టం ఇది.   ఈ రైలు నిర్మాణానికి  1897లో శంకుస్థాపన జరిగి 1903 నాటికి పూర్తి అయ్యింది. ఈ వేలాడే రైలులో ఏటా ప్రయాణించే వారి సంఖ్య 25 మిలియన్లు అంటే అతిశయోక్తి కాదు. కేవలం ఈ రైలులో ప్రయాణించడానికే అనేక మంది పర్యాటకులు జర్మన్‌ వెళ్లుతారట. సుమారు 12 మీటర్ల ఎత్తులో ఉండే ఈ రైల్వే ట్రాక్‌ 13.3 కిలోమీటర్ల మేరకు ఉంటుంది. ఈ మార్గంలో మొత్తం ఇరవై రైల్వే స్టేషన్లు ఉన్నాయి. సుమారు మూడు కిలోమీటర్ల వరకు లోయ పై నుంచి ప్రయాణం సాగుతుంది. పచ్చని ప్రకృతితో లోయ సోగసులు పారదర్శక అద్దాల నుంచి అద్భుత చిత్రంగా కనిపిస్తాయి.   1824లో ఇంగ్లండ్‌కు చెందిన హెన్రీ రాబిన్సన్‌ పాల్మెర్‌ విభిన్నంగా ఉండే ఒక రైల్వే వ్యవస్థ రూపొందించారు. ఈ నూతన నిర్మాణం నచ్చిన సస్పెన్షన్‌ రైల్వే సంస్థ దీనిని నిర్మాణానికి ముందుకు వచ్చింది. స్థానికులకు అందుబాటులో ఉన్న ఈ రైల్ వే  పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ నిలిచేది.  ఈ రైల్వేను ప్రపంచ యుద్ధం సమయంలో తీవ్ర నష్టం కారణంగా మూసివేశారు. 1946లో కాస్త ఆధునికరించి ప్రయాణికులకు తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చారట.   కోల్‌ పరిశ్రమల వెంట, ఉప్పర్‌ వ్యాలీ చుట్టూ ఉంటే ఈ రైల్వే ట్రాక్‌ 486 ఫిల్లర్స్‌ మీదుగా నిర్మించబడింది. ఈ రైల్వేలో ప్రతిరోజూ సగటున ఎనబైరెండు వేల మంది ప్రయాణిస్తారు. 24 మీటర్ల పొడవు ఉండే రెండు బోగీల సముదాయంగా ఈ రైలు ఉంటుంది. నాలుగు డోర్స్‌ గల ప్రతి క్యాబిన్‌లో 48 మంది కూర్చోనేందుకు వీలుగా సీట్లు, 130మంది నిలబడే వీలు ఉంటుంది. ఈ రైలులో ప్రయాణం వింత అనుభవంగా పర్యాకులు అభివర్ణిస్తారు. ముఖ్యంగా ఉప్పర్‌ వ్యాలీపై నుంచి వెళ్లుతూ.. లోయ అందాలను వీక్షించడం మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందంటారు.

జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరు

అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టైన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి కాస్త ఊరట లభించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేపు కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  బీఎస్‌3 వాహనాలను బీఎస్4 వాహనాలుగా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న అభియోగంపై ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. అలాగే నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేశారన్న అభియోగంపై అశ్విత్‌ రెడ్డిపై కేసు నమోదైంది. జూన్ 13న హైదరాబాద్‌లోని శంషాబాద్‌ లోని వారి నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కడపకు తరలించారు.