మరి మీ షూటింగులకు ఇది సరైన సమయమా.. పవన్ పై ఏపీ మంత్రి ఫైర్

ఏపీ గవర్నర్ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో రాజకీయ రచ్చ మాములుగా లేదు. దీని పై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇదే సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ మూడు రాజధానుల ఏర్పాటుకు ఇది సరైన సమయం కాదని ముందుగా కరోనా మహమ్మారి నుండి రాష్ట్ర ప్రజలను కాపాడాలని ప్రభుత్వానికి సూచించారు.  తాజాగా పవన్ కామెంట్స్ పై స్పందించిన ఏపీ మంత్రి శంకర్ నారాయణ జనసేన పార్టీపైనా, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పైనా తీవ్ర విమర్శలు చేశారు. అసలు జనసేన పార్టీ జనం కోసం చేసింది ఏమీలేదని, అది ఒక పనికిమాలిన సేన అని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా మూడు రాజధానులకు ఇది సరైన సమయం కాదని పవన్ కల్యాణ్ అంటున్నారని, మరి ఇది షూటింగులకు సరైన సమయమా? అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ గానీ, జనసేన గానీ ఉన్నది ప్యాకేజీ కోసం తప్ప ప్రజల కోసం కాదని అయన తీవ్రంగా విమర్శించారు. అనంతపురం జిల్లా పెనుకొండలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.

అమరావతి విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక పక్క కరోనా వైరస్ వ్యాప్తితో తల్లడిల్లుతోంది. అయితే తాజాగా దీనితో పోటీగా అమరావతి రాజధాని అంశం రాష్ట్రంలో తీవ్ర కలకం రేపుతోంది. నిన్న రాష్ట్ర గవర్నర్ మూడు రాజధానుల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. మరీ ముఖ్యంగా అమరావతే రాజధానిగా ఉండాలని మొదటి నుండి గట్టిగా పట్టుపడుతున్న టీడీపీ తన ప్రయత్నాలు ఫెయిల్ అవడంతో తాజాగా మరో కొత్త అస్త్రాన్ని ప్రయోగించబోతున్నట్లుగా తెలుస్తోంది. అదేంటంటే అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేసే ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా రేపు గవర్నర్‌ని కలిసి చంద్రబాబుతో సహా ఎమ్మెల్యేలు అందరు రాజీనామా పత్రాలు అందించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీంతో రాజధాని తరలింపు ఆగిపోతుందా అంటే.. ముందుగా టీడీపీ చేసే ఈ ప్రయత్నంతో దేశం మొత్తం దృష్టి ఇటు పడే అవకాశం ఉంటుంది అందులో టీడీపీకి జాతీయ స్థాయిలో ప్రముఖ రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాల ఆధారంగా దేశవ్యాప్త అంశంగా చేసి కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తారని తెలుస్తోంది. అదే విధంగా ఇటు రాష్ట్రంలో కూడా రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆందోళనలకు చేపట్టే అవకాశం ఉంది. ఈ ఉద్యమానికి కృష్ణా, గుంటూరు ప్రజలు పూర్తిగా మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల నుంచి మాత్రం అంతగా దీనికి మద్దతు లభించక పోవచ్చు. ఇప్పటికే గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ బీటెక్ రవి తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యూహం ఏ విధంగా విజయవంతం అవుతుందో వేచి చూడాలి.

కొత్త రాజధాని విశాఖలో మరో ప్రమాదం.. 10 మంది మృతి

ఏపీకి కొత్తగా అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ గా నిర్ణయించిన విశాఖలో తాజాగా మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్ యార్డ్ లో కొద్ది సేపటి క్రితం మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది కూలీలు వరకు మృతి చెందినట్టు సమాచారం. అక్కడ ఒక క్రేన్ ను తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా దాని కిందనే పని చేస్తున్న కూలీల పైన పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే మూడు మృత దేహాలను గుర్తించగా మరి కొంత మంది క్రేన్ కింద చిక్కుకున్నారని అని తెలుస్తుంది. అయితే ఈ దుర్ఘటనకు గల కారణాలపై ఇంకా పూర్తీ సమాచారం అందవలసి ఉంది. ఈ ఘటన పై షిప్ యార్డ్ యాజమాన్యం స్పందించలేదు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విశాఖ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకున్నారు అని తెలుస్తుంది.

అంతర్జాతీయ విమానసర్వీసుల రద్దు పొడిగింపు

దేశంలో రోజుకు నమోదు అవుతున్న కొత్త కేసుల  సంఖ్య 60వేలకు చేరువలో ఉంది. కోవిద్ 19 వైరస్ వ్యాప్తికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నా సామాజిక వ్యాప్తి కారణంగా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాంతో కేంద్రం అంతర్జాతీయ విమాన సర్వీసులపై జూలై 31 వరకు విధించిన నిషేధాన్ని మరో నెల పొడిగించింది. తాజాగా పొడిగించిన ఈ నిషేధం ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. అయితే ఈ నిషేధం కేవలం ప్యాసింజర్ విమానాలకు మాత్రమే వర్తిస్తుందని డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆప్ సివిల్ ఏవియేషన్) స్పష్టం చేసింది. వందే భారత్ మిషన్ లో భాగంగా కొన్ని దేశాలకు ప్రత్యేక సర్వీసులు అవసరాన్ని బట్టి నడుస్తాయి. దేశీయ విమాన సర్వీసులు, కార్గో సర్వీసులు నడుస్తాయి.

మూసీనదిలో టోర్నడో

ఆకాశానికి ఎగిసిన నదీ జలాలు టోర్నడోలు ఎక్కువగా అమెరికాలో సంభవిస్తుంటాయి. అయితే ఇప్పుడు మన దగ్గర టోర్నడోలు కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లోని యానాంలో రొయ్యల చెరువులమీద ఏర్పడిన భీకరమైన గాలులు సుడులు తిరుగుతూ టోర్నడో గా మారింది. చెరువులోని నీటితో పాటు రొయ్యలు, ఒడ్డున ఉన్న వలలు కూడా గాలిలోకి లేచి పెద్ద బీభత్సం సృష్టించింది. అంతకు ముందు భైరవపాలెంలోని సముద్రంలోనూ టోర్నడో ఏర్పడింది. సముద్రంలోని నీరు సుడులు తిరుగుతూ పైకి ఎగిసి ఆకాశానికి ఎదురెళ్లటం చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆంధ్రలో సంభవించిన ఈ ప్రకృతి భీభత్సం తాజాగా తెలంగాణలోని మూసీ నది సమీపంలో ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీనది జలాలు భూమ్మీద నుంచి ఆకాశానికి  సుడులు తిరుగుతూ పైకెగిశాయి. పెద్దఎత్తున సంభవించిన ఈ టోర్నడో పరిసర ప్రాంతాల ప్రజలను దిభ్రాంతికి గురిచేసింది. దీనిని వీడియోలో బంధించిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా కాసేపట్లోనే వైరల్ అయింది.

కరోనా పోరులో యువత పాత్రే కీలకం

ప్రజల ప్రవర్తనపై స్టడీ ప్రపంచ మానవాళిని భయబ్రాంతులకు గురిచేస్తున్న కరోనా యువతలోనూ ప్రాణాపాయం కలిగిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. ఇప్పటివరకు మధ్యవయస్కుల్లో, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిలో, వృద్ధుల్లో కరోనా ముప్పు ఎక్కువగా ఉందని అనుకున్నాం. కానీ, డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికల మేరకు యువత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా దేశాల్లో యువత తమకేం కాదన్న ధీమాతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. దాంతో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. యువతలోనూ ఎక్కువగా ఉంటుంది. కరోనా పోరాటంలో యువతే కీలక పాత్ర తీసుకుంటూ తమను తాము రక్షించుకుంటూ వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని  డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ అన్నారు. ప్రపంచంలోని 40 శాతం మరణాలు ఇతర జబ్బులతో బాధపడుతున్నవారిలోనే సంభవించాయన్నారు. అందులో 80 శాతం మరణాలు అభివృద్ధి చెందిన దేశాల్లోనే సంభవించాయన్నారు. కరోనాను అరికట్టేందుకు చాలా దేశాలు ఎన్నో మార్గాలో ప్రయత్నాలు చేస్తున్నాయని అయితే ప్రజల్లో అవగాహన కల్పించడమే ముఖ్యమన్నారు. కరోనా కట్టడిలో ప్రజల ప్రవర్తనలో, అవగాహనలో వచ్చిన మార్పును స్టేడీ చేసేందుకు బిహేవియరల్ ఇన్ సెట్స్ అండ్ సైన్స్ ఆఫ్ హెల్తీ ఓ టెక్నికల్ అడ్వ‌జైర్ గ్రూప్ను ఏర్పాటు చేస్తున్నట్టు డబ్ల్యూహెచ్వో చీఫ్ వెల్ల‌డించారు. ఈ గ్రూఫ్ లో సైకాలజీ, న్యూరోసైన్స్, ఆంత్రపాలజీ, హెల్త్ ప్రమోషన్ తదితర సెక్టార్ల‌లో నిపుణులు ఉంటారు. 16 దేశాలకు చెందిన 22 మంది ఎక్స్ పర్ట్స్ ను ఎంపిక చేశారు. 

అర నిమిషంలోనే కోవిద్ 19 వైరస్ గుర్తింపు

ఢిల్లీలో ప్రారంభమైన ఇజ్రాయిల్ పరీక్షలు కంటికి కనిపించని కోవిద్ 19 వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రపంచంలోని మేధావులంతా కృషి చేస్తున్నారు. మన దేశంలో రోజుకూ అర లక్షకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్న ప్రమాదకర పరిస్థితుల్లో ఎక్కువ మందికి పరీక్షలు చేసేందుకు అనేక కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. మానవ మేధస్సుకు పదును పెడుతూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ(ఏఐ), మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీతో వైరస్ ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. భారత్, ఇజ్రాయెల్ కలిసి వైరస్ ను గుర్తించే కొత్త సాంకేతిక పద్ధతులను పరీక్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ను గుర్తించేందుకు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు నాలుగు పద్ధతులను కొనుగొన్నారు. ప్రస్తుతం ఈ పద్ధతులను ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆసుపత్రి (ఆర్ఎంఎల్)లో పరీక్షిస్తున్నారు. ఈ ట్రయల్స్ విజయవంతమైతే ఇకపై 30 సెకన్లలోనే కరోనా ఫలితాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాదు, కరోనా పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే వైద్య చికిత్స అందించి వ్యాప్తిని నియంత్రించడం సులభం అవుతుంది.  ఈ కొత్త పరీక్ష విధానంలో మన మాట, శ్వాసే శాంపిల్. ముక్కుతో గాలిని ఒక కవర్ బ్యాగ్ లోకి వదలాలి. ఆ గాలిని ఏఐ టెక్నాలజీ ఉండే ‘సెంట్ రీడర్ ’ అనే ఓ మెషీన్ లోకి పంపిస్తారు. అది టెర్రాహెర్ట్జ్ వేవ్స్ (టీహెచ్ జెడ్) అనే టెక్నాలజీ సాయంతో వైరస్ ను అర నిమిషంలోనే గుర్తిస్తుంది. ఆ తర్వాత వాయిస్ టెస్ట్, బ్రెతలైజర్ టెస్ట్, ఐసోథెర్మల్,  పాలి అమైనో యాసిడ్ టెస్ట్ చేస్తారు.

ఏడుపుగొట్టు ముఖాలతో ఇంట్లోనే ఉండండి బాబు అండ్ బ్యాచ్.. రోజా సెటైర్లు

ఏపీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపటం పట్ల నగరి ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలతో పాటు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవసరమని నమ్మి సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చారని రోజా తెలిపారు. ఈ బిల్లుల ఆమోదంతో ఒక్క ఉత్తరాంధ్ర ప్రజలే కాక రాయలసీమ, అమరావతి ప్రాంత రైతులు తో సహా అందరూ సంతోషంగా ఉన్నారని ఆమె అన్నారు. ఇక దీంతో ఏమాత్రం సంతోషంగా లేనిది కేవలం చంద్రబాబునాయుడు, లోకేష్ అండ్ కో బ్యాచ్ అని విమర్శించారు. గతంలో అధికారాన్ని ఒకే చోట కేంద్రీకరణ చెయ్యటం వల్ల తెలంగాణ ఆంధ్ర విడిపోయాక ఏపీ ప్రజలు దిక్కులేని పరిస్థితి లో పడ్డారని కానీ సీఎం జగన్ నిర్ణయంతో భవిష్యత్ లో మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆమె తెలిపారు. ఇదే సమయంలో అమరావతి ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరగదని, గత ప్రభుత్వం ఇక్కడి ప్రజలను మోసం చేసిందని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు లోకేష్ లు ఏడుపు ముఖాలు వేసుకుని ఇంట్లోనే ఉండాలని అలా కాకుండా బయటకు వచ్చి అభివృద్ధి ని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు ఏమాత్రం సహించరని ఆమె హెచ్చరించారు.

భారత్‌ లో కొత్తగా 57,117 కరోనా కేసులు

భారత్‌ లో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 57,117 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 764 మంది కరోనా కారణంగా మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,95,988కు చేరగా, మృతుల సంఖ్య 36,511కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 10,94,374 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 5,65,103 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక తెలంగాణ‌లో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 2,083 కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోదు అయ్యాయి. 11 మంది మృతిచెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు న‌మోదైన కేసుల సంఖ్య 64,786కు చేరుకోగా.. మృతుల సంఖ్య 530కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,754 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మన దేశంలో కరోనా కేసులు ఎప్పటికి తగ్గుతాయి.. రాష్ట్రాలవారీగా అంచనాలు

ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు 17 లక్షలకు దగ్గరలో ఉన్నాయి. తాజాగా ప్రతి రోజూ 50వేల కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మరో పక్క మరణాల సంఖ్య 36వేలు దాటేసింది. దీంతో కరోనా ఎప్పుడు మన దేశాన్ని వదిలిపోతుందా అని ఎదురుచూసే పరిస్థితికి వచ్చేశారు ప్రజలు. ఐతే కొన్ని తాజా అంచనాల ప్రకారం సెప్టెంబర్ 3 నాటికి దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతాయి. అప్పటికి సుమారుగా యాక్టివ్ కేసులు 9.86 లక్షలకు చేరతాయి. ఇక SEIR అంచనా ప్రకారం చూస్తే సెప్టెంబర్ 1 నాటికి దేశంలో యాక్టివ్ కేసులు 10.15 లక్షలుగా ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ మూడోస్థానంలో ఉండగా.. ఆసియాలో మాత్రం మొదటి స్థానంలో ఉంది. 47 లక్షల పాజిటివ్ కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, 26లక్షలకు పైగా కేసులతో బ్రెజిల్ రెండోస్థానంలో ఉన్నాయి. ఐతే ఒక ఊరట ఏంటంటే ఆ రెండు దేశాలతో పోల్చితే... భారత్ లో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. అంతే కాకుండా మొన్నటి వరకు కరోనా తీవ్రంగా ఉండే ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కొత్త కేసులు ఇప్పుడు బాగా తగ్గుతున్నాయి. దేశంలో మరో ముఖ్య నగరం అయిన ముంబైలో కూడా కేసుల తగ్గుదల మొదలైంది. ఇది ఇలా ఉంటె పుణె, బెంగళూరు వంటి నగరాల్లోనూ ఏపీ లోను కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీనిని బట్టి ఈ వైరస్ ఒక్కో చోట ఒక్కో సమయం లో పీక్స్ కు చేరి తరువాత మెల్లగా తగ్గుతోంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఏ రాష్ట్రాల్లో కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందంటే .. మహారాష్ట్రలో ఆగస్ట్ 14 నాటికి కేసులు అత్యంత ఎక్కువవుతాయి. అక్టోబర్ 26 నాటికి పూర్తిగా తగ్గుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్ట్ 23 నాటికి కేసులు బాగా పెరిగి... అక్టోబర్ 28 నాటికి తగ్గుతాయి. తెలంగాణలో ఆగస్ట్ 15 నాటికి కేసులు బాగా పెరిగి... అక్టోబర్ 17 నాటికి కరోనా కొత్త కేసులు తగ్గిపోతాయి. తమిళనాడులో ఆగస్ట్ 24 నాటికి బాగా పెరుగుతాయి. అక్టోబర్ 17కి తగ్గుతాయి. మధ్యప్రదేశ్‌లో ఆగస్ట్ 13 నాటికి బాగా పెరిగి... సెప్టెంబర్ 30 నాటికి తగ్గుతాయి. బెంగాల్‌లో ఆగస్ట్ 12 నాటికి బాగా పెరిగి... అక్టోబర్ 7 నాటికి పూర్తిగా తగ్గుతాయి. కర్ణాటకలో ఆగస్ట్ 16 నాటికి బాగా పెరిగి... నవంబర్ 3 నాటికి బాగా తగ్గుతాయి కేరళలో ఆగస్ట్ 10 నాటికి బాగా పెరిగి... అక్టోబర్ 15 నాటికి తగ్గిపోతాయి. ఉత్తరప్రదేశ్‌లో ఆగస్ట్ 21 నాటికి బాగా పెరిగి... అక్టోబర్ 15 నాటికి తగ్గుతాయి. హర్యానాలో ఆగస్ట్ 17 నాటికి బాగా పెరిగి... సెప్టెంబర్ 20 నాటికి పూర్తిగా తగ్గుతాయి. గుజరాత్‌లో ఆగస్ట్ 14 నాటికి బాగా పెరిగి... అక్టోబర్ 12 నాటికి తగ్గిపోతాయి. రాజస్థాన్‌లో ఆగస్ట్ 15 నాటికి బాగా పెరిగి... అక్టోబర్ 10 నాటికి తగ్గుతాయి.

పార్టీని బలోపేతం చేద్దాం

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవల్సిన చర్యలపై కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కె బాలసుబ్రమణ్యంతో చర్చించారు. శుక్రవారం ఢిల్లీలో బాలసుబ్రమణ్యంను మర్యాదపూర్వకంగా కలిసిన సంజయ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ  వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంపై చర్చ జరిగింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు చేరువ కావడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, బీజేపీ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో దళితులపై పెరిగిన దాడులు, బీజేపీ నేతలు అరెస్టులు, గృహ నిర్భందం మొదలైన అంశాలను సంజయ్ వివరించారు. దేశ వ్యాప్తంగా ఎదురైన కరోనా మహమ్మారి కారణంగా ఎదురైన సవాళ్లు, లాక్ డౌన్ పరిస్థితుల్లో తెలంగాణాలో బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్వహించిన సేవ కార్యక్రమాల గురించి సంజయ్ వివరించారు. రాబోయే రోజుల్లో కరోనా మహామ్మారిని ఎదుర్కొనేందుకు పార్టీ తెలంగాణ విభాగం అలుపెరగకుండా కృషి చేయాలని బాలసుబ్రమణ్యం సూచించారు.

భారత్ లో కరోనాకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం.. కేంద్ర ఆరోగ్య శాఖ

భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 16 లక్షలు దాటింది. ప్రతి రోజు రికార్డ్ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ లాంటి అధిక జనాభా గల దేశంలో హార్డ్ ఇమ్యూనిటీ అసాధ్యం అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. భారతదేశ జనాభా పరిమాణాన్ని బట్టి హార్డ్ ఇమ్మ్యూనిటి ఓ ఆప్షన్ కానే కాదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనాను అరికట్టే వ్యాక్సిన్ వచ్చేవరకు ప్రస్తుత పద్దతిలోనే కరోనా తో పోరాడాల్సి ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓఎస్డీ రాజేష్ భూషణ్ తెలిపారు. భారత్ వంటి దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ అనే ఆప్షన్ పనికి రాదని వ్యాక్సిన్ లేకుండా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడం దాదాపుగా అసాధ్యం అని ఈ సమయంలో దాన్ని అమల్లోకి తేస్తే.. కోట్లాది మంది ప్రజలు అనారోగ్యానికి గురవడమే కాకుండా ప్రాణ నష్టం కూడా అధికంగా ఉంటుందని అయన అన్నారు. భవిష్యత్తులో వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన తర్వాతనే హార్డ్ ఇమ్యూనిటీ అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు ప్రస్తుత పద్దతిలోనే కరోనాను ఎదుర్కొవాలని రాజేష్ భూషణ్ తెలిపారు. అంతే కాకుండా కరోనా రోగులలో రికవరీ రేటు ఏప్రిల్లో 7.85 శాతం ఉండగా ప్రస్తుతం 64.44 శాతానికి పెరిగింది అన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు భారత్ లోనే తక్కువన్నారు.

విమానయాన రంగానికి గడ్డుకాలం

చతికిల పడ్డ ఆకాశయానం పార్కింగ్ కోసం ఫ్లైట్స్ కు తప్పని ఫైట్ కంటికి కనిపించని వైరస్ దాడితో అనేక రంగాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకు పోయాయి. అందులో విమానయాన రంగం ఒకటి.  ఒకప్పుడు ధనికులకే అందుబాటులో ఉండేది ఆకాశయానం. గత కొన్నేండ్లుగా ప్రైవేటు విమాన సంస్థల మధ్య నెలకొన్న పోటీతో మధ్యతరగతి వారికి సైతం అందుబాటులోకి వచ్చింది. పోటీలు పడీ మరీ ధరలను తగ్గించి.. స్పెషల్ ఆఫర్స్ తో దిగువ మధ్యతరగతి వారిని సైతం మేఘాల్లో విహరించేలా చేసింది. అలాంటి విమానయాన రంగం కరోన కారణంగా చతికిలపడింది. ప్రపంచ రవాణావ్యవస్థలో అత్యధిక లాభాలతో దూసుకు పోయిన గత దశాబ్దాన్ని వైమానిక రంగం స్వర్ణయుగంగా ఎంతో మంది అభివర్ణించారు. ఈ పదేళ్లుగా మంచి పురోగతిని సాధిస్తూ ఏటా అంతకంతకు వృద్ధి చెందింది. 2020లో 870 బిలియన్ డాలర్ల పైనా ఆదాయం వస్తుందని అంచనా వేస్తే ఇప్పటికి వచ్చింది కేవలం 419 బిలియన్ డాలర్లు మాత్రమే. దేశీయంగా సైతం చిన్నచిన్న విమానాలతో రవాణా సమయాన్ని ఆదా చేసిన విమానాలు ఇప్పుడు రెక్కలు తెగిన పక్షుల్లా ఎయిర్ పోర్టులకే పరిమితం అయ్యాయి. కరోనా మహమ్మారి విజృంభించక ముందు ప్రపంచ రవాణా రంగం ఊపులో ఉండేది. కానీ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రపంచంలో చాలా దేశాలు లాక్ డౌన్ విధించడం, కొత్తగా తమ తమ దేశాల్లోకి ఎవ్వరినీ అనుమతించకపోవడంతో ఎక్కడివారు అక్కడే గప్ చుప్ అన్న విధంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దాంతో కొత్తగా ఎవరూ టికెట్స్ బుక్ చేసుకోకపోవడం..ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ డబ్బులు వెనక్కి ఇచ్చేయమని డిమాండ్ చేశారు. జనవరి - జులై మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఏడున్నర లక్షల విమానాలు రద్దు అయ్యాయి. దాంతో విమానయాన సంస్థలు కోలుకో లేని నష్టాలు చవిచూశాయి. విమానాలు అన్నీ ఎయిర్ పోర్ట్ లకే పరిమితం కావడంతో చివరకు ఆ విమానాలను పార్కింగ్ చేసే స్థలం కోసం కూడా తగువులాడే పరిస్థితి వచ్చింది.               పర్యాటకం పైనే ఆధారపడే చాలా విమానయాన సంస్థలు మూతపడే స్థితికి వచ్చాయి. థాయ్ ఎయిర్ వేస్, లుఫ్తాన్సా, లాటన్ వంటి సంస్థలు దాదాపుగా పతనావస్థకు చేరుకున్నాయి. వేలాది మంది ఉద్యోగులు ఇంటి దారి పట్టారు. మరి కొందరి వేతనాల్లో కోతలు విధించారు. విమాన ప్రయాణాల్లో వచ్చిన ఈ విపత్కర పరిస్థితి విమాన తయారీ సంస్థలపై కూడా ప్రభావం చూపింది. ప్రపంచంలోనే  విమానయాన తయారీలో అత్యంత పేరున్న బోయింగ్ సంస్థ దాదాపు 16000 వేల మందిని, ఎయిర్ బస్ 15000 మందిని ఇప్పటికే ఉద్యోగాల నుండి తొలగించాయి. 2001 సెప్టెంబర్ 11 లో విమానాల హైజాక్ తర్వాత ఎయిర్ ఫోర్టుల్లో వైమానిక మార్గదర్శకాలను అనుసరించి స్క్రీనింగ్ చేయడంలో, కాక్ పీటీలోకి ఎవరిని అనుమతించక పోవడం లాంటి నియమాలు పాటిస్తూ నిబంధనలను కఠినతరం చేశారు.  గతంలో ఒక ప్రయాణికుడు తన షూ లో దాచిన ఆయుధంతో  తోటి ప్రయాణికులను భయపెట్టి హైజాక్ చేయడానికి ప్రయత్నించాడు. ఇంగ్లాడ్ లో మరో  ప్రయాణికుడు ద్రావణం రూపంలో ఉన్న పేలుడు సామాగ్రిని అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించాడు. ఇలాంటి ఎన్నో రకాల అవాంఛనీయ సంఘటనలను చాకచక్యంతో ఎయిర్ ఫోర్ట్ రక్షణా సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం కంటికి కనిపించని వైరస్ ను ఎదుర్కోవడానికి మరిన్ని జాగ్రత్తలు అవసరం అయ్యాయి.  మాస్కులు, ఫేస్ షిల్డ్స్,  స్క్రినింగ్, ప్రొటెక్టివ్ గేర్స్, , హాండ్ శానీటైజర్ వంటివి తప్పనిసరిగా మారింది. వీటితో పాటు తమ విమానాల్లో ప్రయాణం సురక్షితం అని ప్రయాణికుల్లో నమ్మకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. బోయింగ్ లాంటి సంస్థలు HEPA ఫిల్టర్స్ ద్వారా 99 శాతం వైరస్ ను నాశనం చేసే చర్యలు తీసుకుంటామని చెబుతున్నాయి.  ప్రయాణికులు తీసుకునే ఆహారం విషయంలో, టాయిలెట్స్, బాత్ రూమ్స్ వంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.                 సోషల్ డిస్టెన్సింగ్ వంటివి కొంత కష్టం అయినప్పటికీ తప్పని పరిస్థితిలో వెస్ట్ జెట్(WestJet), ఎయిర్ కెనడా(Air Canada) వంటి సంస్థలు సోషల్ డిస్టెన్స్ ను అమలు చేస్తున్నాయి. అయితే దీనితో ప్రయాణికులపైనే అదనపు భారం పడుతుంది. కరోనా కన్న ముందు కొన్ని సంస్థలు విహార యాత్ర చేయాలనుకునే  ప్రయాణికులను ఆకట్టుకోవడానికి 40 శాతం వరకు టికెట్ లో రాయితీ  ఇచ్చాయి. దాంతో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండేది. ఉదాహరణకు బార్సిలోనా విషయానికి వస్తే గత సంవత్సరం ఈ నగరం ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది. ఒక దశలో స్థానికులు విసిగిపోయి ఇది టూరిస్ట్ ప్లేస్ కాదు అని బ్యానర్లు కట్టే పరిస్థితి వచ్చింది. ఎవరెస్టు శిఖరం పైన కూడా టూరిస్టులతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదంతా కూడా విమానయాన రంగంలో ఏర్పడిన పోటీతో తక్కువ రేట్ కు టికెట్లు అందుబాటులోకి తీసుకురావడంతోనే ఏర్పడింది. కానీ ఇప్పుడు మాత్రం చాలా విమానయాన సంస్థలు లాభాదాయకంగా ఉన్న మార్గాల ద్వారానే విమానాలు తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాయి.  మన దేశం వందే భారత్  మిషన్ ద్వారా కొన్ని దేశాలకు విమానాలు నడుపుతుంది. బ్రిటిష్ ఎయిర్ వేస్ బోయింగ్ 777ను రద్దు చేసింది.  కెనెడియన్ ఎయిర్ లైన్స్  పరిమిత మార్గాల్లోనే విమానాలు నడపడానికి సిద్ధపడింది. విమానయాన రంగం ఈ కఠిన పరిస్థితుల నుంచి బయటపడి  నిండుగా ఉన్న ప్రయాణికుతో స్వేచ్ఛగా గాలిలోకి ఎగరాలంటే మరి కొన్ని నెలలు ఎదురుచూడక తప్పదేమో..!!

42 మంది కరోనా రోగులు మిస్సింగ్

ఉత్తరప్రదేశ్‌ లోని ఘజీపూర్‌లో 42 మంది కరోనా రోగులు క‌నిపించ‌కుండా పోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. వారంతా కరోనా పరీక్షలు చేయించుకున్న స‌మ‌యంలో త‌మ ఫోన్ నంబర్లు, చిరునామాల‌ను త‌ప్పుగా ఇచ్చిన‌ట్టు అధికారులు తెలిపారు.  దీనిపై ఘాజీపూర్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కేకే వర్మ అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ కు శుక్రవారం లేఖ రాశారు. కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన దాదాపు 42 మంది కనిపించడం లేదని వెల్లడించారు. పరీక్షల సమయంలో చాలామంది సరైన వివరాలు ఇవ్వడం లేదని, దీంతో పాజిటివ్ అని తేలిన తర్వాత వారిని గుర్తించడం కష్టమవుతోందని పేర్కొన్నారు. త‌ప్పిపోయిన వారిని గుర్తించేందుకు సాయం చేయాల్సిందిగా డాక్టర్ కేకే వర్మ కోరారు.  త‌ప్పిపోయిన వారి సంఖ్య 40 దాట‌డంతో జిల్లా ఆరోగ్య శాఖ తీవ్రంగా ప‌రిగ‌ణించింది. మరోవైపు, గత 15 రోజులు నుండి జిల్లాలో చాలామంది కరోనా రోగులు మిస్సైనట్టు తెలుస్తోంది. కాగా, ఘజీపూర్ జిల్లాలో ఇప్పటివరకు 10 మంది కరోనా కార‌ణంగా మరణించగా.. ప్రస్తుతం 505 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

అర్ధరాత్రి భయంతో నిర్ణయాలు వద్దు.. జగన్ కి రాఘురామకృష్ణం రాజు సూచన

ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను మళ్లీ నియమించడం ఆలస్యమైనా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎంపీ రాఘురామకృష్ణం రాజు అన్నారు. ఇంకా ఇలాంటివి ఏమన్నా ఉన్నా సరిచేసుకోవాలని సూచించారు. మన దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు రాజ్యాంగానికి అనుసంధానమై ఉంటాయని.. ఒక వ్యవస్థ గాడి తప్పినా చాలా సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ఎస్ఈసీ విషయంలో జరిగిన తప్పిదాలతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో చూశామని, కోర్టుల కోసం ఎంతో ప్రజాధనం వృథా అయిందని అన్నారు.  అయితే, తెల్లారితే ఈ అంశంతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులకు జైలుశిక్ష పడుతుందనే భయంతో.. అర్ధరాత్రి పూట నిర్ణయాలు తీసుకోవడం కాకుండా.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని జగన్ కు రాఘురామకృష్ణం రాజు సూచించారు. న్యాయ వ్యవస్థను గౌరవించాలని.. భయంతో మనం నిర్ణయాలు తీసుకున్నట్టు ఉండకూడదని, ఇకపై ఇలా జరగకుండా మనం వ్యవహరించాలని అన్నారు.

ప్లాస్మా దాతలకు 5వేల రూపాయలు ప్రోత్సాహకం

కరోనా చికిత్స కోసం గుర్తించిన ఆసుపత్రుల్లో బెడ్ల ఖాళీలు, భర్తీల వివరాలు ఆస్పత్రి హెల్ప్‌ డెస్క్‌లో అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ఎవరికైనా బెడ్‌ అందుబాటులో లేకపోతే.. వారిని సమీప ఆస్పత్రికి పంపించి అక్కడ బెడ్‌ అలాట్‌ చేయాలని తెలిపారు.  కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌ కోసం నిర్దేశించిన 138 ఆసుపత్రుల మేనేజ్‌మెంట్‌ పై దృష్టి పెట్టాలని చెప్పారు. బెడ్లు, వైద్యం, ఆహారం, శానిటేషన్‌ పై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.  ప్లాస్మా థెరపీపై కూడా బాగా అవగాహన కల్పించాలి, దీనివల్ల మంచి ఫలితాలుంటే ప్రోత్సహించాలని సూచించారు. ప్లాస్మా ఇచ్చే వారికి 5వేల రూపాయలు ప్రోత్సాహకం ఇవ్వాలని జగన్‌ ఆదేశించారు. మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందని సీఎం జగన్ అన్నారు‌. సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లు తెరిచే ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు. విద్యాకానుకతో పాటు పిల్లలకు మాస్కులు కూడా ఇవ్వాలని, దీని కోసం వెంటనే మాస్కులు సిద్ధం చేయండని ఆదేశించారు.

దీర్ఘాయుష్మాన్ జపాన్..

తొమ్మిది పదుల వయసు దాటినవారు 20లక్షలకు పైగా సగటు జీవన ప్రమాణం 85ఏండ్లు ఆహారపు అలవాట్లే దీర్ఘాయుష్ కు కారణం స్వచ్ఛత, శుభ్రత వారి దినచర్యలో భాగం అగ్ర రాజ్యాలను, అభివృద్ధి చెందిన దేశాలను కబళిస్తున్న కరోనా వైరస్ జపాన్ లో పెద్ద ప్రభామేమీ చూపలేదు. వయోధికులపై ఎక్కువగా ప్రభావం చూసే కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని చూసి ప్రపంచదేశాలు తమ దేశంలోని వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. అయితే వయోవృద్ధుల జనాభా ఎక్కువ ఉండే జపాన్ ఈ వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందో అని ఆందోళన ఏర్పడింది. అయితే జపాన్ మాత్రం చాలా త్వరగానే కోవిద్ 19ను అరికట్టగలగడంతో పాటు తమ దేశ సంపదగా భావించే వృద్ధులను రక్షించుకుంది. అయితే అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ కరోనా విజృంభిస్తే తీసుకోవల్సిన జాగ్రత్తలను కూడా తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది జపాన్ ప్రజల జీవనవిధానం. మనిషి సగటు జీవన ప్రమాణం అత్యధికంగా ఉన్న దేశాల్లో జపాన్ ది రెండో స్థానం. సగటు జీవన ప్రమాణం 89 ఏండ్లతో మొదటిస్థానం మొనాకో దేశానిది. జనాన్ లో 90ఏండ్లు పై బడిన వారి సంఖ్య 20లక్షలకు పైనే. వారిలో శతాధిక వృద్ధుల సంఖ్య  దాదాపు 69,785. అంటే సగటు జీవన ప్రమాణాల కాలం 84.2 ఏండ్లు. పురుషుల జీవన ప్రమాణ కాలం 81.1 ఏండ్లు కాగా, మహిళల జీవన ప్రమాణ కాలం ఇంకాస్త ఎక్కువగా అంటే 87.1 ఏండ్లుగా ఉంది. జపానీయుల ఆహారపు అలవాట్లు జీవనవిధానం ప్రపంచాన్ని ఎప్పుడు  అబ్బురపరుస్తూనే ఉంది. వారి దీర్ఘాయుష్ పై అనేక పరిశోధనలు కూడా జరిగాయి. జన్యుపరంగా ఎక్కువ కాలం జీవించడం అక్కడ మాములే అనుకుంటారు. అయితే ఇప్పటివరకు జరిగిన చాలా అధ్యాయాలు వారి జీవనవిధానం, ఆహారం వారిని ఆరోగ్యంగా ఉంచుతున్నాయని స్పష్టం చేశాయి. జపాన్ ప్రజలు ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి రోజు తాజా కూరగాయలు,  సీజనల్ గా లభించే పండ్లు తప్పక తింటారు. అంతేకాదు ప్రాసెసింగ్ చేసిన, ప్యాకెట్స్, టిన్స్ లోని ఆహారాన్ని వారు అసలు ఇష్టపడరు. అంతేకాదు జపానీయుల ఆహారంలో రెడ్ మీట్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా సముద్రపు ఆహారమైన చేపలు వంటి వాటిని ఇష్టంగా తీసుకుంటారు. అందుకే చేపల వినియోగంలో ప్రపంచంలో ఆరవ స్థానంలో జపాన్ ఉంది. మాంసంలో కన్నా చేపల్లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. 36 శాతం గుండె సంబంధిత మరణాలను ఇది తగ్గిస్తుంది. ప్రతి సంవత్సరం దాదాపు లక్ష టన్నుల సముద్రపు నాచు(సీవుడ్)ను ఆహారంగా తీసుకుంటారు. ఒక కప్పు సముద్రపు నాచులో 2 -9 గ్రాముల ప్రోటీన్ తో పాటు సహజ సిద్ధంగా దొరికే అయోడిన్ ఉంటుంది. దీన్ని ఉపయోగించడం వల్ల థైరాయిడ్ వంటి సమస్యలు రావు.  దీనికి తోడు వాళ్ళు ఎక్కువ కాలం బతకడానికి మరో కారణం ఆహారాన్ని మితంగా తీసుకోవడం. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వలన అక్కడి ప్రజల్లో స్థూలకాయం సమస్య చాలా తక్కువ. ప్రపంచంలోని అధిక బరువు ఉన్నవారిలో జపానీయుల సంఖ్య కేవలం 3.6శాతం మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా ఇదే చాలా తక్కువ.  జపాన్ ప్రజల జీవన ప్రమాణ కాలం ఎక్కువగా ఉండటానికి మరో కారణం ఎక్కువగా చాయ్ తాగటం. సహజంగా కాఫీ కంటే కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాయ్ లోనే ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటూ క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు. జపాన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ విధానం కోసం ఎక్కువ ఖర్చు చేస్తుంది. మిగతా వాటితో పోల్చితే 70 శాతం ఆరోగ్యంపైనే ఖర్చు చేస్తుంది.  మిగతా దేశాల వాళ్ళతో పోల్చితే జపనీయుల ఎత్తు కాస్త తక్కువే.   శరీర నిర్మాణం కూడా ఒక అడ్వాంటేజ్. దీంతో చురుగ్గా ఉండటం, బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు జీర్ణక్రియ విధానం సక్రమంగా జరుగుతుంది. ఆఫీసుకు వెళ్ళడానికి కూడా నడిచి వెళ్ళడమో లేదా సైకిల్ మీద వెళ్ళటానికే ఇష్టపడతారు. జపాన్ లోని వయోవృద్ధులు సాధ్యమైనంత వరకు శారీరక శ్రమలో భాగస్వాములు అవుతూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండటానికి మరో కారణం 85 శాతం మంది జపనీయుల రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా స్నానం చేస్తారు. నిద్రించే ముందు వేడినీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో ఉండే మలీనాలు సులభంగా వెళ్లిపోవడమే కాకుండా మానసిక, శారీరక ఒత్తిడిని కూడా  దూరం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వీటన్నింటికన్నా మరో ముఖ్యమైన విషయం జపనీయులు తమ ఆచారా వ్యవహారాలను తప్పక పాటిస్తారు. పెద్దవారిని గౌరవిస్తారు. మన దేశంలో పిల్లలను సంపదగా భావస్తాం. జపాన్ లో పెద్దవారిని సంపదగా భావిస్తారు. వయోవృద్ధుల  నుంచి ఎన్నో నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. చిన్నారులకు ఊహ తెలిసినప్పటి నుంచే స్వచ్చత, శుభ్రత నేర్పిస్తారు. మితంగా తింటూ అమితంగా పెద్దలను, సంస్కృతిని గౌరవించడమే జపానీయుల ఆరోగ్య రహాస్యమని చెప్పక తప్పదు.