ఏపీలో మరో అవినీతి తిమింగలం.. నేల మాళిగలో తవ్వే కొద్దీ బంగారం..
posted on Aug 19, 2020 @ 9:44AM
ఏపీలో మరో అవినీతి తిమింగలం బయట పడింది. మరో అవినీతి అధికారి అక్రమార్జనలో ఏకంగా విశ్వరూపం చూపించాడు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ఎస్సీ కాలనీలో.. ట్రెజరీ ఉద్యోగికి డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి బంధువు ఇంట్లో భారీ ఎత్తన ఖజానా బయటపడటం తాజాగా సంచలనం రేపింది. ఎదో పురాతన కాలంనాటి గుప్త నిధులు బయటపడినట్టు.. తవ్వే కొద్ది కిలోల కొద్ది బంగారం, వెండి నిల్వలు వెలుగుచూశాయి. దాదాపు 8 ట్రంకు పెట్టెల్లో దాచిన బంగారం, వెండి వస్తువులను తవ్వి తీసి చూసిన పోలీసులే షాక్ తిన్నారు. అంతేకాకుండా ఇదంతా అక్రమార్జన అని తెలియడంతో వాళ్ళు కూడా గుడ్లు తేలేశారు.
వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా ట్రెజరీ ఆఫీసులో కొన్నేళ్ల కిత్రం కారుణ్య నియామకం కింద మనోజ్‌కుమార్ ఉద్యోగం పొందాడు. ఈ అవినీతి అధికారి బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీలో ఉండే నాగలింగం అనే వ్యక్తిని తన కారు డ్రైవర్‌గా నియమించుకున్నాడు. అయితే మనోజ్‌కుమార్ అవితీనిపై ఇటీవల అనేక ఫిర్యాదులు వస్తుండడంతో పోలీసులు అతని కదలికలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో డ్రైవర్ నాగలింగం మామ ఇంట్లో మనోజ్‌కుమార్ దాచిన సొమ్ము విషయం తెలిసింది. అయితే అదేదో కొద్ది మొత్తంలో ఉంటుందిలే అనుకొని సోదాలు నిర్వహించిన పోలీసులు బయట పడ్డ నిధులను చూసి నోళ్లు వెళ్ళబెట్టారు. ప్రస్తుతం మనోజ్, నాగలింగంలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నాగలింగం బంధువు బాలప్ప ఇంట్లో ఆయుధాలు ఉన్నాయని తమకు సమాచారం అందిందని, సోదాలకు వెళితే, బంగారం దొరికిందని, ఈ విషయంలో లోతుగా విచారిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.