నాలుగో బిగ్ బాస్ ఎవరు?.. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ నిజమేనా?
posted on Aug 18, 2020 @ 4:04PM
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తుల ఫోన్‌లు ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పిన పాయింట్.. ఫోన్ ట్యాపింగ్ అనుమానాలను బలపరుస్తోంది.
దాదాపు రెండు నెలల క్రితం హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీ సమయంలో పార్క్ హయత్ హోటల్లో ఏదో జరిగిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. "పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం. దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు. ఫేస్ టైం లో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరు? మరిన్ని వివరాలు అతి త్వరలో..." అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ఫేస్ టైంలో ఎవరెవరు ఎవరితో మాట్లాడారనే విషయం విజయసాయి రెడ్డికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ కి గురైందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమేయం ఉండకపోవచ్చని, అయితే ట్యాపింగ్ కు పాల్పడిన వ్యక్తులు ఎవరో తేల్చాలని కోరారు. అంతేకాదు, ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోకుంటే ఈ అంశాన్ని తాను కచ్చితంగా పార్లమెంట్‌లో లేవనెత్తుతాని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.
రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ అనుమానాలను బలపరిచేలా ఉన్నాయి. పార్క్ హయత్ హోటల్ లో ముగ్గురు భేటీ అయిన విషయం అందరికి తెలిసిందే. కానీ, నాలుగో వ్యక్తి ఫేస్ టైం లో మాట్లాడినట్టు విజయసాయికి ఎలా తెలుసు? అంటే, నిజంగానే ట్యాపింగ్ కి పాల్పడుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు అందరిని ఆలోచనలో పడేలా చేశాయి. మరి ఈ విషయంపై విజయసాయి ఎలా స్పందిస్తారో చూడాలి.