ఇళ్ల స్థలాల పై జగన్ సర్కార్ కు హైకోర్టు మరో షాక్
posted on Aug 18, 2020 @ 5:32PM
ఎపి సీఎం జగన్ ప్రభుత్వానికి కోర్టులలో ఎదురు దెబ్బల పరంపర కొనసాగుతోంది. నిన్న రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు పై సుప్రీం కోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన అంశంలో ఎపి హైకోర్టు జగన్ సర్కార్ కు మరో షాక్ ఇచ్చింది. తాజాగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు చెందిన స్థలాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ తిరుమలగిరిలోని ట్రైబల్ పాఠశాల స్థలం ఇళ్ల పట్టాలుగా ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసు పై తదుపరి విచారణను కోర్టు 8 వారాలకు వాయిదా వేసింది.
ఎపి లో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో అమరావతి భూములతో సహా రాష్ట్రంలోని పలు వివాదాలలో ఉన్న భూములు కూడా ఉన్నాయి. అమరావతి భూములు, ఇతర భూములకు సంబంధించి అనేక న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. అమరావతిలో భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచాలన్న జగన్ సర్కారు నిర్ణయంపై అమరావతి రైతులు హైకోర్టుకు ఎక్కడంతో అక్కడ బ్రేక్ పడింది. హైకోర్టు నిర్ణయం మీద జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా సర్కారుకు చుక్కెదురైంది. ఇలా వరుస సమస్యల నేపథ్యంలో ఇప్పటికి ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూ వస్తోంది. మొదట మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకున్నారు. అయితే కోర్టు కేసుల నేపథ్యంలో వాయిదా వేసి ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవ్వాలని ప్లాన్ చేశారు. కానీ, కోర్టు కేసుల కారణంగా మళ్లీ వాయిదా పడి అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.