ఫోన్ ట్యాపింగ్ పై ఎందుకు దర్యాప్తు జరపకూడదు: ఏపీ హైకోర్టు
posted on Aug 18, 2020 @ 2:33PM
ఫోన్ ట్యాపింగ్‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జడ్జిలపై నిఘా ఉంచారని, ఫోన్స్ ట్యాప్ చేస్తున్నారని మీడియాలో వచ్చిన కథనాలతో అడ్వకేట్ శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు ఆదేశిస్తే ఇబ్బందేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
అఫిడవిట్‌లో ఉన్న మీడియా కథనాన్ని చదివి వినిపించాలని హైకోర్టు కోరింది. ఐదుగురు జడ్జిల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని, జడ్జిల కదలికలపై ఒక అధికారిని ప్రత్యేకంగా ప్రభుత్వం నియమించిందని కోర్టుకు న్యాయవాది శ్రవణ్ విన్నవించారు. ఆ అధికారి ఎవరో చెప్పాలని, ఆధారాలు చూపాలని ధర్మాసనం అడగగా.. తాను అధికారి పేరుతో అఫిడవిట్ దాఖలు చేస్తానని న్యాయవాది శ్రవణ్ చెప్పారు. అన్ని వివరాలతో అఫిడవిట్‌ను ఫైల్ చేయాలని శ్రవణ్ ను హైకోర్టు ఆదేశించింది.
మరోవైపు ఈ అంశంపై ఎందుకు దర్యాప్తు జరపకూడదో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేసినా అది చిన్న విషయం కాదని.. దర్యాప్తుకు ఆదేశిస్తే అసలు విషయాలు బయటపడతాయి కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై ఏమైనా అభ్యంతరం ఉందా అని ప్రభుత్వం తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ మొత్తం అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు రోజుల గడువు ఇస్తూ.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.