గణపతి పూజలు గడపలోపలే..
posted on Aug 17, 2020 @ 7:16PM
ఆన్ లైన్ లో ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం
బాలా పూర్ లడ్డు వేలం రద్దు
ప్రతి ఏడాది నగరమంతా మండపాలలో వెలిసి 11రోజులు పూజలు అందుకునే గణపయ్య ఈ ఏడాది ఇంటికే పరిమితం కానున్నారు.
దశాబ్దాలుగా ప్రతి ఏటా వేలాది మండపాలు దేశంలోని పెద్దపెద్ద నగరాల్లో ముంబాయి, హైదరాబాద్ అత్యంత వైభవంగా గణనాధులు పూజలందుకుంటారు. నిమర్జనం కూడా కోలాహమే. అయతే దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వినాయక మండపాలకు అనుమతి లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాలు కూడా విష్నేశ్వరుడి పూజలను ఇంటికే పరిమితం చేయాలని ఆదేశించారు. ముంబయి తర్వాత అత్యంత వైభవంగా జరిగే హైదరాబాద్ లోనూ గణేష్ మండపాలను అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది.
దశాబ్దాలుగా..
ప్రజలందరికీ ఒక తాటిపైకి తీసుకురావాలన్న ఆలోచనతో స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో గణేష్ ఉత్సవాలను బాలగంగాధర తిలక్ ప్రారంభించారు. కాలక్రమేణా ఈ ఉత్సవాలు దేశంలోని వాడవాడలా నిర్వహిస్తున్నారు. చిన్నపెద్ద అన్న తారతమ్యం లేకుండా ప్రజలంతా రోజూ పూజలు, అన్నదానాలు, ఊరేగింపులలో పాల్గొంటారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పండుగ వాతావరణం నెలకొంటుంది. అయితే బహిరంగ ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటుచేయడం, ప్రజలు గుంపులుగా రావడం వల్ల కరోనా కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వాలు ముందస్తులుగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
వేలాది విగ్రహాలు..
నెలరోజుల ముందు నుంచే విగ్రహాల తయారీ మొదలుపెట్టిన కార్మికులు ఇప్పటికే వేలాది భారీ విగ్రహాలను తయారుచేశారు. కొన్నివందల కుటుంబాలు విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉంటాయి. జూలై, ఆగష్టు నాటికైనా కరోనా అదుపులోకి వస్తుందన్న ఆలోచనతో విగ్రహాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే నానాటికీ పెరుగుతున్న కేసుల కారణంగా పూర్తిగా వినాయక ఉత్సవాలను ఇంటికే పరిమితం చేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి.
ఇదే తొలిసారి..
గణేష్ ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మండపాలు ఏర్పాటుచేయని సందర్భం ఎప్పుడూ రాలేదు అంటున్నారు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అంటున్నారు. 1980 నుంచి ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నామని, ఉత్సవాలు నిర్వహించకపోవడం ఇదే తొలిసారి అన్నారు.
ధన్వంతరి నారాయణగా.. ఆన్ లైన్ లోనే
హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ భారీ వినాయకుడి స్థానంలో ఈ సారి తొమ్మది అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా పేరు పెట్టారు. ఆన్ లైన్ లోనే దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారు. లడ్డు వేలంలో అత్యంత పేరున్న బాలాపూర్ గణేష్ ఎత్తు తగ్గించడమే కాకుండా లడ్డూ వేలం రద్దు చేశారు.
అనుమతులు లేవు..
కరోనా విజృంభిస్తున్న కారణంగా ఈ సారి గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతులు లేవని హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించారు. ఇంటిలోనే పూజలు చేసుకోవాలి. ఇది మీ ఆరోగ్యం కోసమే.. దయచేసి గణపతి పూజ గడపలోపలే చేసుకోండి అంటున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వాలు ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే ఇప్పటికే వివిధ రంగుల్లో మండపాలకు తరలడానికి సిద్ధంగా ఉన్న వినాయకుల సంగతి.. విగ్రహాల అమ్మకాలపై ఆధారపడిన కార్మికుల సంగతేఎంటీ అన్నది ప్రశ్నార్ధకం.
మట్టి గణపతులు..విత్తన విగ్రహాలు..
భారీ విగ్రహాలకు స్వస్తి పలికి పర్యావరణాన్ని కాపాడేలా మట్టి గణపతులను, విత్తన గణపతులను పూజించాలంటూ మరికొందరు సందేశాలు ఇస్తున్నారు.
ఉగాదులు లేవు ఉషస్సులు లేవు..శ్రీరామ కళ్యాణ వేడుకలు లేవు, గ్రామదేవతలకు బోనాలు లేవు.. శ్రావణమాస పేరంటాలు లేవు, ఇప్పడు గణపతి ఉత్సవాలు కూడా లేవు.. ఇంకా ఎన్ని రోజులు ఈ ఇంటికే పరిమితాలు అంటూ ప్రజలు వాపోతున్నారు.