ఐపీఎల్ కొత్త స్పాన్సర్ ఖరారు
posted on Aug 18, 2020 @ 4:48PM
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కులను 'డ్రీమ్ 11' దక్కించుకుంది. రూ.222 కోట్ల భారీ మొత్తం బిడ్ దాఖలు చేసి హక్కులను పొందినట్లు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. బిడ్ లో టాటా అన్ అకాడమీ, పతంజలి, రిలయన్స్ , బైజూస్, డ్రీమ్ 11 వంటి కంపెనీలు పోటీ పడ్డాయి. అయితే ఫైనల్ గా డ్రీమ్ 11 స్పాన్సర్ షిప్ దక్కించుకుంది.
కాగా, ఇటీవల ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో తప్పుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కోసం 2018లో వివో ఐదేళ్లకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వివో 2022 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే, భారత్- చైనా మధ్య సరిహద్దు లో జరిగిన ఘర్షణ నేపథ్యంలో తాము ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కుల నుండి తప్పుకుంటున్నట్లు వివో ప్రకటించింది.
దాంతో కొత్త స్పాన్సర్స్ వేటలో పడిన బీసీసీఐ ఈ నెల 10 న స్పాన్సర్‌షిప్ కోసం టెండర్స్ ను ఆహ్వానించింది. అప్పటినుండి ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ ఎవరు అవుతారు అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఆ ఆసక్తికి తెరపడింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను డ్రీమ్ 11 దక్కించుకుంది.
కాగా, ఈ ఏడాది మార్చి లో జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ కరోనా కారణంగా వాయిదాపడింది. ఆ తర్వాత యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 13వ సీజన్ ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.