పంద్రాగస్టు వేడుకలకు ఐదువేలమందే...

ప్రతి ఏడాది అంతరంగవైభవంగా ఢిల్లీలో నిర్వహించే భారత స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని గతంలో క‌న్నా భిన్నంగా  అతి తక్కువ మందితో ఈ వేడుకలను నిర్వహిస్తారు. వచ్చే శనివారం ఆగ‌స్టు 15న జరగనున్న 74న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ముస్తాబు అవుతోంది. ఈ మేరకు మునుపెన్నడూ లేని విధంగా కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఢిల్లీ అధికారులు సన్నాహాలు  చేస్తున్నారు. ఎర్రకోటలో ప్రధానమంత్రి జెండా ఎగురవేసే కార్యక్రమం ఉదయం 9 గంటలకు జరుగుతుందని, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆయా జిల్లాల్లోనూ అదే సమయానికి వేడుకలు నిర్వహించాలని హోం శాఖ పేర్కొంది. ఆరోగ్య భద్రత, దేశ భద్రత కారణాలతో తనిఖీలు ముమ్మరం చేస్తూ అతి తక్కువ సంఖ్యలో అతిథులను ఆహ్వానిస్తున్నారు.  కరోనా వారియర్స్ గా ముందువరుసలో నిలబడిన  డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులతో పాటు కరోనా నుంచి కోలుకున్నవారిని స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆహ్వానాలు పంపించారు. అతిథుల సంఖ్య ఐదువేలకు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  వేడుకల్లో పాల్గొన్నే సైనిక, పోలీసు బలగాలు మాస్కులు ధరించి మార్చ్ ఫాస్ట్ లో పాల్గొంటారని, రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో జరిగే కవాతుల్లోనూ మాస్కుల వాడకం, ఫిజికల్ డిస్టెన్స్ నియమాలను తప్పనిసరిగా ఫాలో కావాలని సూచించారు. ప్రతి సారి వేలాది మంది స్కూల్ విద్యార్థులతో నిర్వహించే పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సారి ఉండవు. ఐదు వందల మంది ఎన్ సీసీ క్యాడెట్లు మాత్రమే హజరవుతారు. మాస్క్ తప్పనిసరిగా ధరించేలా అవగాహన కల్పిస్తూ భౌతిక దూరం పాటించేలా సీటింగ్ అరెంజ్ మెంట్స్ చేస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్నే వారందరికీ తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు చూసే సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులు వేడుకలు జరిగే ప్రాంతంలోకి రావద్దని సూచిస్తున్నారు. ఈ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌వుతున్న సిబ్బంది మాస్కులు ధ‌రించి విధులు నిర్వ‌హిస్తున్నారు.

సీఎం జగన్‌కు బ్రాహ్మణ సమాఖ్య ప్రధాన కార్యదర్శి లేఖ.. దర్శనాలు నిలిపివేయండి

ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ఆలయ అర్చకులు సైతం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కి బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రేయ బాబు లేఖ రాశారు. కరోనా రోజురోజుకీ ఉదృతమవుతోందని.. ఈ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించడం వల్ల అర్చకులు, వేదపండితులు కరోనా బారిన పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.  కరోనాతో తిరుమలలో అర్చకుడు మృతి చెందడం అమంగళకరమని, మునుపెన్నడూ లేని రీతిలో తిరుమల అప్రతిష్ట పాలుకావడం శోచనీయం అన్నారు. తక్షణం రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఆలయాల్లో దర్శనాలు నిలిపివేయాలని కోరారు. ఆర్థిక భారం పేరుతో భక్తులను దర్శనానికి అనుమతించడం సమంజసం కాదని హితవు పలికారు. కరోనాతో మృతి చెందిన అర్చకుడికి వెంటనే 10లక్షలు నష్ట పరిహారం చెల్లించాలి డిమాండ్ చేశారు. అర్చకుడి కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. దేవాదాయ అడిషనల్ కమిషనర్ పర్యవేక్షణలో కరోనా బారిన పడిన అర్చకులకు మెరుగైన వైద్యం అందించాలి అని ఆత్రేయ బాబు డిమాండ్ చేశారు.

ఏపీలో శానిటైజర్ మరణాల తీగ లాగితే తెలంగాణలో తేలింది..

కొద్ది రోజుల క్రితం ఏపీలోని ప్రకాశం జిల్లా కురిచేడు, పామూరులో శానిటైజర్ తాగి 16 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటన పై విచారణ జరిపేందుకు ఏర్పాటైన సిట్ దర్యాప్తులో కొన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి. అసలు చనిపోయిన వారు తాగిన శానిటైజర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే అంశంపై అధికారులు ఆరాతీయగా తెలంగాణాలో పెద్ద డొంక కదిలింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో ఉన్న ఒక కంపెనీలో ఈ శానిటైజర్లు తయారు చేసినట్టు తెలిసింది. ఐతే ఆ శానిటైజర్లు తయారు చేసిన కంపెనీకి ఎటువంటి లైసెన్స్ లేదు సరి కదా కనీసం జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా లేదు.   అంతే కాకుండా అసలు శానిటైజర్ తయారీలో కూడా గోల్ మాల్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇథనాల్ కానీ లేదా ఇథైల్ ఆల్కహాల్ కానీ కలిపి తయారు చేయాల్సిన శానిటైజర్ లో మిథైల్ ఆల్కహాల్ కలిపి చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఇక్కడ తయారైన శానిటైజర్లను ఏపీలోని ఒక డిస్ట్రిబ్యూటర్‌కు పంపగా అవి కురిచేడుకు చేరి 16 మంది ప్రాణాలు హరించాయి. ప్రస్తుతం ఈ కేసు ను ఐదు బృందాలు విచారణ జరుపుతున్నాయి. కురిచేడులో శానిటైజర్ తాగిన వారిలో 46 మంది ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.

విమాన ప్రమాదంలో మరో విషాదం.. మృతులలో ఒకరి కరోనా

నిన్న రాత్రి కొజికోడ్ లో జరిగిన విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టికే 20 మంది మృతి చెందిన విషాదం నుండి ఇంకా తేరుకోక ముందే తాజాగా మ‌రో ఆందోళ‌న‌క‌ర‌మైన సంగతి తెలిసింది. అదేంటంటే ప్రమాద మృతుల్లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్టు తాజాగా జరిపిన ప‌రీక్ష‌ల్లో తేలింది. దీంతో నిన్న రాత్రి నుండి విమాన ప్ర‌మాద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న‌వారిలో తాజాగా ఆందోళ‌న మొద‌లైంది. అంతే కాకుండా విమానంలో వ‌చ్చిన ప్ర‌యాణికులు కూడా టెన్ష‌న్ ప‌డుతున్నారు.   దీంతో నిన్నటి నుండి విమాన ప్ర‌మాద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న వారంతా టెస్టులు చేయించుకోవాల‌ని అంతే కాకుండా ముందు జాగ్ర‌త్త‌గా క్వారంటైన్‌లోకి వెళ్లాల‌ని వారికి కేర‌ళ ప్రభుత్వం సూచించింది. ఇదే సమయంలో వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న‌ విమాన ప్ర‌యాణికులకి క‌రోనా టెస్ట్ లు నిర్వ‌హిస్తున్నామ‌ని కేర‌ళ ఆరోగ్య‌శాఖ‌ ప్ర‌క‌టించింది.   విమాన ప్ర‌మాదం సహాయ కార్యక్రమాలలో పాల్గొన్న ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, సిఐఎస్ఎఫ్, పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు స్థానికులు కూడా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాలుపంచుకున్నారు. దీంతో అందరిలో టెన్షన్ నెలకొంది.

పదేళ్ల క్రితం మంగళూరులో ఇలాగే.. అసలీ టేబుల్‌టాప్ రన్‌వే ఏంటి?

కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో నిన్న రాత్రి విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియాకు చెందిన బోయింగ్‌ 737 విమానం కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న సమయంలో రన్ వే పై నుంచి జారిపోయి రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో విమాన పైలెట్, కో పైలట్ సహా 20 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు.    సరిగ్గా పదేళ్ల క్రితం కర్నాటకలోని మంగళూరు విమానాశ్రయంలో కూడా ఇటువంటి ప్రమాదమే జరిగింది. ఈ రెండు ప్రమాదాలకు కొన్ని దగ్గర పోలికలు ఉన్నాయి. కోజికోడ్, మంగళూరు రెండూ టేబుల్‌టాప్‌ రన్‌వేలే. రెండు ప్రమాదాల్లోనూ విమానాలు బోయింగ్‌ 737 రకానికి చెందినవే. రెండు విమానాలూ వచ్చింది దుబాయ్‌ నుంచే. 2010 మే 22న దుబాయ్‌ నుంచి వచ్చిన విమానం ఉదయం 6గంటల ప్రాంతంలో మంగళూరులో ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న సమయంలో కూలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పైలట్‌, కోపైలట్ సహా 158మంది ఆగ్నికి ఆహుతయ్యారు. కేవలం 8మంది ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, అప్పట్లో ఇప్పుడున్నట్లు విపత్కర వాతావరణ పరిస్థితులు లేవు. విమానాన్ని దించడంలో పైలట్‌ చేసిన తప్పిదమే ఆ ఘోరానికి కారణమని తేలింది.   అయితే, ఈ ప్రమాదాలకు టేబుల్‌టాప్ రన్‌వేలే ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది. మన దేశంలో టేబుల్‌టాప్‌ రన్‌వేలు మూడే ఉన్నాయి. కర్నాటకలోని మంగళూరు, కేరళలోని కోజికోడ్‌, మిజోరాంలోని లెంగ్‌ప్యూ విమానాశ్రయాల్లో టేబుల్‌టాప్‌ రన్‌వేలు ఉన్నాయి. కొండ లేదా ఎత్తైన ప్రదేశంలో చదునుగా ఉండే చోట ఈ టేబుల్‌టాప్ రన్‌వేను నిర్మిస్తారు. సాధారణ రన్‌వేల కంటే వీటి నిడివి చిన్నదిగా ఉంటుంది. పైలట్‌ కూడా ఈ రన్‌వేకు తగినట్లే విమానాన్ని దించాల్సి ఉంటుంది. అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లకు కూడా అయోమయాన్ని కలిగిస్తాయి. పైలట్లు చిన్న తప్పిదం చేసినా విమానానికి ఘోర ప్రమాదం తప్పదు.    టేబుల్‌టాప్‌ రన్‌వేలు ఉన్న విమానాశ్రయాల్లో దిగడానికి అన్ని రకాల విమానాలూ అనుకూలం కాదు. షార్ట్‌ ఫీల్డ్‌ ఫెర్ఫార్మెన్స్‌ సాంకేతికత ఉన్న విమానాలే టేబుల్‌టాప్‌పై దిగగలవు. అందువల్లనే పలు విమానయాన సంస్థలు బోయింగ్‌ 737, ఎయిర్‌బర్‌ ఏ330 వంటి విమానాలను టేబుల్‌టాప్‌ రన్‌వేలున్న విమానాశ్రయాలకు పంపడం మానుకున్నాయి. 

అవధానప్రక్రియకు విశేషప్రాచుర్యం కల్పించిన శతావధాని

నేడు కవి చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 150వ జయంతి ఆంధ్రదేశంలో అవధాన విద్యకు విస్తృతమైన ప్రాచుర్యం తీసుకువచ్చి, రూపురేఖలు ఏర్పరచడంలో,  అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించిన తెలుగు కవి, అవధాని, నాటకకర్త చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి. తిరుపతి వేంకట కవులుగా విశేషప్రాచుర్యం పొందిన వారిలో ఒకరు.  తెలుగులో అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్దిన ఆయన దివాకర్ల తిరుపతిశాస్త్రితో కలిసి తిరుపతి వేంకట కవుల జంటగా ప్రసిద్ధిచెందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తొలి ఆస్థానకవిగా సాహిత్యసేవలందించిన ఆయన 150వ జయంతి నేడు.   తూర్పుగోదావరి జిల్లా కడియంలో 8 ఆగస్టు1870లో వేంకటశాస్త్రి జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చంద్రమ్మ, కామయ్య. అతని ముత్తాత తమ్ముడు వేంకటేశ్వర విలాసము, యామినీ పూర్ణతిలక విలాసము అనే గ్రంథాలు రచించిన కవి. అతను సేకరించిన అమూల్య తాళపత్ర గ్రంథాలు వేంకటశాస్త్రికి అందుబాటులో ఉండేవి. తరువాత వారు కడియం నుంచి యానాంకు మకాం మార్చారు. కొంతవరకు కవి, పండిత నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన అసాధారణ ధారణశక్తితో తన ప్రతిభను నలుదిశగా చాటారు. ప్రముఖ పండితులు చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద వ్యాకరణం నేర్చుకున్నారు. ఆ తర్వాత కాశీ వెళ్ళి అక్కడ పండితుల వద్ద వ్యాకరణ, తర్క శాస్త్రాలు, వేద భాగం, సంస్కృత కావ్యాలు, బ్రహ్మసూత్ర భాష్యం వంటివి అధ్యయనం చేశాడు. కాశీ నుంచి తిరిగి చర్ల బ్రహ్మయ్యశాస్త్రి వద్ద చేరారు. ఆ తర్వాత తన పాండిత్యానికి మెరుగులు దిద్దుకుంటూ అవధానాలు చేయాలని సంకల్పించి తన నిర్ణయాన్ని గురువుతో చెప్పారు. తన శిష్యుల్లో మరొకడైన దివాకర్ల తిరుపతిశాస్త్రిని జోడీగా స్వీకరించమని గురువు సూచించడంతో 1891లో కాకినాడలో జంటగా వారిద్దరి తొలి శతావధానం జరిగింది. తిరుపతి వేంకట కవుల పేరుతో చేసిన ఆ శతావధానంలో ప్రతిభ, పాండిత్యాలను ప్రదర్శించడంతో పాటు, యుక్తితో పండితులను గెలిచారు. అలా జంటకవుల్లో ఒకరుగా చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి విజయపరంపర ప్రారంభమైంది. ధారాశుద్ధితో కూడిన ధారణాశక్తి, ఆశుధారాపటిమ తో వారు చేసే అష్టావధానాలు, శతావధానాలకు ప్రజాదరణ, రాజాదరణ పెరిగింది. జంటగా వీరు మహాభారతం ఆధారంగా రాసిన పద్యనాటకాల్లో పాండవోద్యోగ విజయాలు విశేష  ప్రాచుర్యం పొందాయి. కావ్య రచనతో పాటు వివాద సాహిత్యాన్ని వెలువరించారు. దివాకర్ల తిరుపతిశాస్త్రి 1920లో మరణించిన తర్వాత చెళ్ళపిళ్ల చాలా వచన రచనలు, పద్య రచనలు చేశారు. అయితే తన రచనల్లో చాలావాటిని తిరుపతి వేంకటీయం అన్న జంట పేరు మీదే ప్రచురించిన ప్రతిభామూర్తి.   తిరుపతి వేంకట కవులకు ముఖ్యంగా చెళ్లపిళ్ల వేంకటశాస్త్రికి ఎందరో చిన్నా పెద్దా సాహిత్యవేత్తలు, కవులు, పండితులు వీరితో వివాదాలు, జగడాలు, వాదప్రతివాదాలు జరుగుతూ ఉండేవి.  ఆయా వివాదాలన్నీ సాహిత్యరూపం వచ్చాయి.   కొప్పరపు సోదరకవులతో జరిగిన వివాదాలను సవివరంగా "గుంటూరి సీమ" పేరుతో గ్రంథరూపంలో తీసుకువచ్చారు. ఇతరులతో ఉన్న వాదప్రతివాదాలతోనూ వందలాది పుటల సాహిత్యం వచ్చింది.   చెళ్లపిళ్ల తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశాడు. అతని వద్ద శిష్యులుగా చదువుకున్నవారు చాలామంది ఆ తర్వాతి కాలంలో తెలుగు సాహిత్యరంగంలోను, భాషాశాస్త్రంలోనూ కవులుగా, పండితులుగా ప్రఖ్యాతి పొందారు.  పండితుకే కాదు అతి సామాన్యులకు కూడా అర్థం అయ్యేలా ఆయన సాహిత్యం ఉంటుంది. వేంకటశాస్త్రి పద్యరచనలతో పాటుగా వచనరచనలు చేయడం కూడా ప్రారంభించాడు. అలా రాసినవే అనంతర కాలంలో కథలు గాథలు గా, కాశీయాత్రగా ప్రచురితమయ్యాయి. వచనం కూడా గ్రాంథిక భాషలో ప్రారంభించి, తర్వాతి కాలంలో సరళ వ్యావహారికం లో రాయడం ప్రారంభించి సుదీర్ఘమైన రచనాజీవితంలో తన శైలిని ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ మెరుగుపెడుతూనే సాహిత్యప్రియుల అభినందనలు వేంకటశాస్త్రి అందుకున్నారు. ఎన్నో కావ్యాలు, శతకాలు, అనువాదాలు, నాటకాలు రాశారు. అనేక సత్కారాలు, బిరుదులు అందుకున్నారు. 80ఏండ్ల వయసులో 1950లో ఆయన మరణించారు.

ఆ టీకా తీసుకున్నవారిలో కరోనా ప్రభావం తక్కువే.. కన్ఫర్మ్ చేసిన తాజా పరిశోధన

టీబీ పై పోరులో భాగంగా ఇస్తున్న బిసిజి టీకా కరోనా సమయంలో కూడా సురక్షితమేనని తాజా అధ్యయనం తేల్చింది. ఈ టీకా వేయించుకున్న వారు కరోనా సోకినప్ప‌టికీ తీవ్ర అనారోగ్యం బారిన పడట్లేదని ప‌రిశోధ‌కులు గుర్తించారు. తాజాగా ఈ టీకా వేయించుకున్న వారితో పాటు టీకా వేయించుకోని వారిపై ప‌రిశోధ‌న‌లు చేసిన నెదర్లాండ్స్‌లోని రాడ్‌బౌడ్‌ యూనివర్సిటీ ప‌రిశోధ‌కులు తాము కనుగొన్న ఫ‌లితాలు వెల్ల‌డించారు. టీకా వేయించుకున్న వారు ఎక్కడ కూడా తీవ్రంగా అనారోగ్యం పాలైనట్లు త‌మ దృష్టికి రాలేదని వారు తెలిపారు. అంతే కాకుండా క‌రోనా బారిన పడే ముప్పును ఆ టీకా పెంచుతున్న పరిస్థితులు కూడా లేవని వారు తెలిపారు. క్షయ(టిబి) బారిన ప‌డ‌కుండా బీసీజీ టీకా వేస్తార‌న్న సంగతి తెలిసిందే. ఈ అధ్య‌య‌నంలో భాగంగా ఐదేళ్ల క్రితం బీసీజీ టీకా వేసుకున్న వారి ఆరోగ్య ప‌రిస్థితితో పాటు ఆ టీకా వేయించుకోని వారిని క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ప‌రిశీలించామ‌ని ఆ శాత్రవేత్తలు వెల్ల‌డించారు. ఆ వాలంటీర్ల‌లో రోగ నిరోధక వ్యవస్థ పనితీరును ప‌రిశీలించి ఈ ఫ‌లితాలు చెబుతున్న‌ట్లుగా వారు వివ‌రించారు.

కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో పాఠశాలలు మళ్ళీ తెరుచుకోనున్నాయి

కరోనా వైరస్ కారణంగా గత మార్చ్ నెలలో మూతపడిన పాఠశాలలను తిరిగి తెరిచేందుకు కేంద్రం సిద్ధమౌతోంది. తాజాగా సెప్టెంబరు 1 నుంచి నవంబరు 14 మధ్య దశల వారీగా పాఠశాలలను తిరిగి తెరవాలని నిర్ణయించింది. అయితే, ఈ విషయంలో స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియను ప్రకటిస్తున్న కేంద్రం అన్‌లాక్ 3.0 ప్రక్రియలో భాగంగా ఈ నెలాఖరు నాటికి విస్తృతస్థాయి స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఆగస్టు 31 తర్వాత అనుసరించాల్సిన విధివిధానాలను ఇందులో పేర్కొననుంది.   ఐతే విద్యార్థులు ఎప్పుడు, ఏ పద్దతిలో తరగతులకు హాజరుకావొచ్చన్న దాని పై రాష్ట్రప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం బోధన సిబ్బంది, అలాగే విద్యార్థుల్లో 33 శాతం సామర్థ్యంతో విడతల వారీగా తరగతులను నడపాలని, అంతే కాకుండా క్లాస్ రూముల్లో విద్యార్థులు 2, 3 గంటలకు మించి ఉండకుండా చూడాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొనే అవకాశమా ఉన్నట్లుగా తెలుస్తోంది.   మొదటి షిప్టును ఉదయం 8 గంటల నుంచి 11 వరకు, రెండో షిప్టును మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు నిర్వహించాల్సి ఉంటుందని తెలుస్తోంది. మధ్యలో ఉండే గంట విరామ సమయంలో తరగతి గదులను తప్పనిసరిగా శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. అయితే కేవలం 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే భౌతికంగా క్లాసులు ఉండే అవకాశం ఉంది. మిగిలిన వారికి మాత్రం ఆన్‌లైన్ తరగతులనే కొనసాగించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

తెలంగాణ యాసను అక్షరాల్లో పొదిగి.. తెలుగు పాఠకుల మనసులో ఒదిగి

పాకాల యశోద రెడ్డి (8ఆగస్టు 1929 - 7 అక్టోబర్ 2007) సాహిత్యంలోని అనేక ప్రక్రియలను తన కలం ద్వారా సృజించినప్పటికీ పల్లె తెలంగాణను అక్షరాల ఆవిష్కరించిన ఎచ్చమ్మ కథలు ఆమెకు గుర్తింపు నిచ్చాయి. అచ్చమైన తెలంగాణ మాండలికంలో కథలు రాసిన తొలి తరం తెలంగాణ రచయిత్రిగా చరిత్రలో ఆమె పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఆమే ప్రముఖ రచయిత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షురాలు డాక్టర్  పాకాల యశోదారెడ్డి.   తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అచ్చమైన యాస వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాధరణకు గురైన తెలంగాణ యానను తన కథల ద్వారా బతికించారు యశోదరెడ్డి. ప్రతి కథలోనూ తెలంగాణ గ్రామీణ ప్రాంత ఆత్మ అక్షరాల్లో పొదిగి ఉంటుంది. చదివిన తర్వాత పాఠకుల మనసులో ఒదిగిపోతుంది. దక్కన్ రేడియోలో తెలంగాణ మాండలికంలో ప్రసంగాలు చేసిన తొలి రచయిత ఆమె. యశోద రెడ్డి రచనలు భాషాభిమానులకు నిధులు. వెతుక్కుంటే అందులో ఎన్నో సామెతలు, ఉపమానాలు, చమత్కారాలు అంతర్లీనమై పాఠకులను అలరిస్తాయి. ఆమె ప్రసంగాలు విని తెలంగాణ భాష ఇంత అందమైన యాస అని చాలా మంది అబ్బుర పడేవారట.   మహబూబానగర్ జిల్లా బిజినేపల్లిలో యశోద జన్మించారు. ఆమె తల్లిదండ్రులు సరస్వతమ్మ, కాశిరెడ్డి. చిన్నతనంలోనే అమ్మను కోల్పోయిన ఆమె బంధువుల వద్ద పెరిగారు. చదువుపై ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించిన రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఆమెను హైదరాబాద్ నారాయణగూడలోని మాడపాటి బాలికల పాఠశాలలో చేర్చారు. ఆ రోజుల్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా పనిచేసే ఆయన చదువుపై ఆసక్తి ఉన్న ఆడపిల్లలు పట్టణంలో చదువుకునేందుకు వీలుగా వసతిఏర్పాటు కూడా చేసేవారట. అలా హైదరాబాద్ లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసిన యశోద  విజయవాడలో ఆంధ్ర మెట్రిక్ పరీక్షను ప్రత్యేక అనుమతితో రాశారు. ఆమెతో పాటు మరో ముగ్గురు అమ్మాయిలు కూడా ఈ పరీక్ష రాశారు. గుంటూరు ఎసి కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, హైదరాబాద్ ఉమెన్స్ కాలేజీలో సెకండ్ ఇయర్ పూర్తి చేశారు.    కరీంనగర్ జిల్లా మానకొండూరు సమీపంలోని అన్నారం గ్రామవాసి ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమలరెడ్డితో పెళ్లి జరిగింది. రాతకు గీత తోడైంది. భర్త ప్రోత్సాహంతో ఆమె ఉన్నత విద్య పూర్తి చేశారు. ప్రైవేట్ గా డిగ్రీ చదివి ఉస్మానియా యూనివర్సిటీ నించి ఎం.ఎ (తెలుగు), ఎం.ఎ (సంస్క-తం) పూర్తిశారు. తెలుగు సాహిత్యంలో పి హెచ్ డీ తో పాటు ఆలీగర్ యూనివర్సిటీ నించి డి.లిట్ కూడా అందుకున్నారు.  హిందీ, ఉర్దూ, కన్నడ భాషల్లో ప్రావీణ్యంతో పాటు జర్మన్ భాషలో డిప్లొమా కూడా చేశారు.    కోఠీ విమెన్స్ కాలెజిలో తెలుగు అధ్యాపకురాలిగా తన ప్రస్థానం ప్రారంభించి  ఉస్మానియా యూనివర్సిటీలో ప్రోఫెసర్ పదవీవిరమణ చేశారు. యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ మెంబర్ గా, కేంద్ర సాహిత్య అకాడమీ మెంబర్ గా, అధికార భాషాసంఘం అధ్యక్షురాలిగా అనేక స్థాయిలో పనిచేశారు.   కథ, కవిత, వ్యాస ప్రక్రియల్లో ఆమె ఎన్నో రచనలు చేశారు. వందకు పైగా కథలు రాసినా అందులో కొన్ని కథలు మాత్రమే మూడు కథా సంపుటాలుగా వచ్చాయి. ఎచ్చమ్మ కతలు బాగా ప్రాచుర్యం పొందిన కథా సంపుటి. ఉగాదికి ఉయ్యాల, భావిక కవితా సంపుటాలు, కథలూ నవలలూ-ఒక పరిశీలన, కథా చరిత్ర, భారతంలో స్త్రీ, ఆంధ్ర సాహిత్య వికాసం, హరివంశము ఉత్తర భాగము, పారిజాతాపహరణం, తెలుగులో హరివంశములు వ్యాస సంపుటాలుగా వచ్చాయి.   ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి అవార్డు, సుశీలా నారాయణ రెడ్డి అవార్డు, నాళం కృష్ణారావు అవార్డు, సురవరం ప్రతాపరెడ్డి అవార్డులూ అందుకున్న ఆమె ఎచ్చమ్మ కతల యశోదగా పాఠకుల మనసులో నిలిచిపోయారు. తెలంగాణ యాసలో సాగే ఆమె రచనలపై చాలామంది పరిశోధనలు చేసి డాక్టరేట్ లు అందుకున్నారు.

అత్యంత అనుభవం ఉన్న పైలట్.. అయినా తప్పని ప్రమాదం.. కారణం అదేనా..!

భారీ వర్షాలతో సతమతమవుతున్నకేరళలో నిన్న రాత్రి విమాన ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి కోజికోడ్ వచ్చిన ఎయిరిండియాకు చెందిన బోయింగ్ విమానం కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న సమయంలో రన్ వే పై నుంచి జారిపోయి రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో విమాన పైలెట్, కో పైలట్ సహా 20 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా కోజికోడ్ వచ్చిన ఈ విమానంలో ప్రమాదం సమయంలో 180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. గాయపడిన వారిని కోజికోడ్ లోని వివిధ ఆసుపత్రులకు తరలించారు.   నిన్న కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో పైలెట్ దీపక్ వసంత సాథే అత్యంత అనుభవం కలిగిన వారు, ఆయన IAF లో వింగ్ కమాండర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు NDA తరపున స్వార్డ్ ఆఫ్ ఆనర్ అవార్డ్ కూడా లభించింది. అయినప్పటికీ ఆ విమానం రన్‌వేపై ల్యాండ్ అయేటపుడు కుదుపులకు లోనై రన్‌వేపై దూసుకుపోతూ పక్కనే ఉన్న లోయలోకి జారిపోతూ రెండు ముక్కలైపోయిందంటే ఆ ప్రమాదం ఎంత భయంకరంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు.   నిన్న రాత్రి విమానం ల్యాండ్ అయ్యే సమయంలో వర్షం పడ్తుండటం వల్ల రన్‌వే చిత్తడిగా ఉంది. అందువల్ల విమానం దిగగానే... టైర్లు జారి ఉంటాయని అనుమానిస్తున్నారు. దీంతో విమానం లోయలోకి వెళ్లిపోయిందని అనుకుంటున్నారు. ఈ ప్రమాదం పై ఎయిర్ మార్షల్ పీకే బార్బోరా స్పందిస్తూ ఎంతో అనుభవం ఉన్న పైలెట్ అయిన దీపక్ వసంత సాథే కూడా విమానాన్ని కంట్రోల్ చేయలేకపోయారంటే... ప్రమాదం ఏ స్థాయిలో జరిగివుంటుందో ఊహించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.   మరో పక్క భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కోజికోడ్‌ రన్‌వే విమానాలు దిగడానికి సరైనది కాదని తొమ్మిదేళ్ల కిందటే ఎయిర్‌ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ కెప్టెన్‌ మోహన్‌ రంగనాథన్ ఒక నివేదికలో వివరించారు‌. ఇలాంటి ప్రమాదం ఏదైనా జరిగే అవకాశం ఉందని అప్పట్లోనే ఆయన చెప్పారు. దానికి తగ్గట్లే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఐతే ఇకపై ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఏం చెయ్యాలనే అంశంపై దర్యాప్తు రిపోర్ట్ వచ్చాక... కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మా నాన్నను చంపింది కరోనా కాదు: సున్నం రాజయ్య కుమారుడు

కొద్ది రోజల క్రితం భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య కరోనా బారిన పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం పై పార్టీలకు అతీతంగా నేతలు సంతాపం ప్రకటించారు. అయితే, తాజాగా ఆయన కుమారుడు విడుదల చేసిన ఓ ఆడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.   ఉద్యమాలే ఊపిరిగా తన తండ్రి బతికారని... అందుకే తనకు సీతారామరాజు అని పేరు పెట్టారని అయన ఆ ఆడియో ద్వారా తెలిపారు. ఐతే కరోనా సోకిన తన తండ్రి పట్ల తమ గ్రామంలో కొంత మంది వివక్ష చూపారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. మొదటిగా మా ఇంట్లో మా అక్కకు కరోనా సోకిందని... దీంతో, తన తండ్రిని గ్రామస్తులు అదోలా చూడటం మొదలు పెట్టారని, ఆయన వస్తుంటే తలుపులు వేయడం చేశారని అయన తెలిపారు. దీంతో రాజయ్య మానసికంగా కృంగిపోయారని.. ఈ లోగా ఆయనకు కూడా కరోనా పాజిటివ్ అని తేలిందని అయన తెలిపారు. దీంతో తన తండ్రి విపరీతమైన ఆందోళనకు గురయ్యారని అయన తెలిపారు.   తన తండ్రి జీవితంలో ఎన్నో ప్రమాదాలను, రోగాలను చూసారని అటువంటి ఆయనకు కరోనా ఒక లెక్క కానే కాదని అయన చెప్పారు. ఏ ప్రజల కోసం తన తండ్రి పరితపించారో ఆ ప్రజలే ఆయనను దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయారని అయన అన్నారు. అదే కనుక ప్రజలు పలకరిస్తూ, ధైర్యం చెప్పి ఉంటే తన తండ్రి బతికేవారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా కరోనాపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించలేదని అయన విమర్శించారు.

విడుదలై 24 గంటల గడవకముందే.. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్

ఊహించినట్లే జరిగింది. జైలు నుంచి విడుద‌లై 24 గంట‌లు తిర‌గ‌క ముందే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేశారు.   54 రోజుల పాటు కడప జైలులో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న బెయిల్‌ పై విడుదలయ్యారు. అయితే, కడప జైలు నుంచి విడుదలై తాడిపత్రి వచ్చే క్రమంలో భారీ కారు ర్యాలీతో వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డిని సీఐ దేవేంద్రకుమార్ అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో కారు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. సీఐ దేవేందర్‌తో దురుసగా వ్యవహరించారు. నా కారును ఎందుకు ఆపుతున్నారంటూ విరుచుకుపడ్డారు.   దాంతో సీఐ దేవేంద్ర కుమార్ తాడిపత్రిలో ఫిర్యాదు చేయగా, జేసీ ప్రభాకర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది. అంతేకాకుండా, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కూడా కేసు నమోదు చేశారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల కోసం ఆయనను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆయనను గుత్తి కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపర్చుతారని తెలుస్తోంది.

కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో అడుగుపడింది

ఆంధ్రప్రదేశ్‌ లో లోక్ సభ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కేబినెట్ సమావేశంలో జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య ఆధారంగా ఏపీలో 25 జిల్లాలు ఏర్పడనున్నాయి.    తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు.    ఏపీ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాల పునర్వవస్థీకరణ అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. 25 జిల్లాల ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయన కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో ఆరుగురు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. మూడు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మూడు రాజధానుల పై సుప్రీం కోర్టుకు జగన్ సర్కార్..!

హైకోర్టులోనూ, సుప్రీం కోర్టులోనూ ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న ఎపి ప్రభుత్వం తాజాగా మరో సారి సుప్రీం కోర్టు తలుపు తట్టనున్నట్లుగా తెలుస్తోంది. మూడు రాజ‌ధానుల బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోద‌ముద్ర పడగానే, దాని పై అమ‌రావ‌తి రైతులు హై కోర్టులో సవాల్ చేశారు. దీంతో ఈ బిల్లుల ఆమోదం పై స్టేటస్ కో విధిస్తు విశాఖప‌ట్నంకు ప్రభుత్వ కార్యాల‌యాలు త‌ర‌లించ‌కుండా హైకోర్టు ఆర్డ‌ర్ ఇచ్చింది.    తాజాగా దీనిపై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ… అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మం పూర్తిగా రాజ‌కీయ ప్రేరేపిత ఉద్య‌మ‌మ‌ని, అవ‌స‌రం అయితే హైకోర్టు నిర్ణ‌యంపై సుప్రీం కోర్టుకు వెళ్లే విష‌యం కూడా ఆలోచిస్తాం అంటూ కామెంట్ చేశారు. అంతే కాకుండా చంద్రబాబు తానొక్కడినే బాగుపడాలనే పెద్ద స్వార్ధపరుడని, అందుకే రాజధాని అమరావతిలోని ఉండాలని కోరుకుంటున్నారని అయన తీవ్ర విమ్మర్శలు చేసారు. ఐతే మంత్రి తాజా వ్యాఖ్యలతో రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టు స్టేటస్ కో పై సుప్రీంకు వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా పలువురు అనుమానిస్తున్నారు.   ఇది ఇలా ఉండగా ఇప్ప‌టికే ఎన్నిక‌ల అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ స‌హా ప‌లు కేసుల్లో సుప్రీం కోర్టులో ఏపీ స‌ర్కార్ కు గ‌ట్టి ఎదురు దెబ్బ‌లు త‌గ‌ల‌గా... మళ్ళీ మూడు రాజ‌ధానుల బిల్లుపై ప్ర‌భుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తే ఎలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయి అన్న‌ది ఆస‌క్తిక‌రంగా తయారయింది.

ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు

న్యాయస్థానాలను, న్యాయమూర్తులను ఉద్దేశించి ఇటీవల ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఎమ్మెల్సీ రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై దాడి చేయడమేనని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ప్రణాళికాబద్ధంగా కోర్టులను విమర్శిస్తున్నారని, న్యాయస్థానాల ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని  మండిపడ్డారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.   కాగా, మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనను స్వాగతిస్తూ వైసీపీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గుడ్డివానిచింత వద్ద సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు కోర్టులు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "న్యాయస్థానాలు గానీ, జడ్జీలుగానీ, చంద్రబాబుగానీ, కేసులుగానీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెంట్రుకని కూడా కదపలేవు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మరి ఇప్పుడు న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలా స్పందిస్తారో చూడాలి.

కరోనా కాలం కలిసోచ్చింది.. 'గీత పొగత్' అంతరంగం...!!

ప్రపంచవ్యాప్తంగా జనజీవితాన్ని స్తంభించేలా చేసిన కరోనా వల్ల అనేక రంగాలు చతికిలాబడ్డాయి. కరోనా వల్ల టోక్యో నగరంలో ఈ సంవత్సరం జరగాల్సిన 'ఒలంపిక్స్ క్రీడలు' వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంతో చాలా మంది క్రీడాకారులు నిరుత్సాహ పడ్డారు. కానీ ఒకరి విషయంలో మాత్రం అది అదృష్టంగానే భావించుకోవచ్చేమో...ఆ వ్యక్తే కామన్వెల్త్ క్రీడల్లో రేజ్లింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన గీత పొగత్. 2010లో జరిగిన కామన్ వెల్త్ గోమ్స్ లో మన దేశానికి మొట్టమొదటిసారి బంగారు పతకం ఆమె సాధించారు. ఒలంపిక్స్ కు ఎంపికైన తొలి మహిళా కుస్తీ క్రీడాకారిణి కూడా గీతానే. 2016లో ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్న గీత 2019లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఏడాది జరగాల్సిన ఒలంపిక్స్  కరోనా కారణంగా వాయిదా పడటంతో తనకు మేలే జరిగిందనంటున్నారు. కరోనా కాలం కలిసోచ్చింది అంటూ ఆమె 2021లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో ఫిట్ నెస్ కోసం వర్కవుట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక  ఇంటర్వ్యూలో ఆమె తన అంతరంగాన్ని ఇలా పంచుకున్నారు.   బాబు (అర్జున్) పుట్టి చూస్తుండగానే ఏడు నెలలు గడిచిపోయాయి. వాడి ఫోటోలను నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది. వాటిని చూస్తూంటే  ఆనందంగా ఉంది. ఒక రకంగా బాబు పుట్టాక  చాలా సంతోషంగా ఉన్నాను. జీవితంలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు టైం అంతా వాడితోనే... ప్రత్యేకమైన టైమింగ్ అంటూ ఏమీ ఉండవుకదా అందుకే నేను వాడి టైమింగ్ కు అనుగుణంగా మారాల్సి వస్తుంది. రాత్రివేళ కూడా చాలా సార్లు వాడు నిద్రలేస్తాడు. పాలు పట్టాలి ,బట్టలు మార్చాలి. అలా అన్నీ నేను చూసుకుంటున్నాను. వీటితో పాటు నా ఫిట్ నెస్ మీద కూడ దృష్టి పెట్టాల్సి ఉంది.   పెళ్లి చేసుకోవడం, అమ్మను కావడంతో నేను కుస్తీ మానేశాను అనుకుంటున్నారు. చాలామంది నెక్ట్స్ ఏంటీ అని అడుగుతుంటారు కూడా. అర్జున్ పుట్టాక మా ఇంట్లో వాళ్ళు కూడ ఇపుడు ఏం చేస్తావు అని అడుగుతున్నారు. నేను మాత్రం ఎప్పుడు  కుస్తీని వదిలేది లేదు.   అయితే 2020లో జరిగే పోటీల్లో పాల్గొన్నలేనేమో అని బాధపడ్డాను. అయితే  కరోనా కారణంగా  ఈ ఏడాది జరగాల్సి ఒలంపిక్స్  2021 లో జరగబోతున్నాయి. ఒక రకంగా మళ్ళీ నాకు పాల్గొనే అవకాశం వచ్చినట్లే అందుకే దీన్నీనేను అసలు వదులుకోను. కచ్చితంగా ఈ ఒలంపిక్స్ కి వెళ్తడంతో పాటు పతకాలు తేవడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను. అందుకోసం ఇప్పటి నుంచే ఫిట్నెస్ మీద దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. మా ఇంట్లో అందరూ కుస్తీ యోధులే.. నా భర్త కూడా రెజ్లరే కావడంతో నన్ను అర్థం చేసుకుని సహకరిస్తున్నారు. ఇక నాన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే నా గురువు. మా సోదరి, ఫ్యామిలీ మెంబర్స్ నన్ను గమనిస్తూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు చేయగలవు, ఇంతకుముందు కన్నా ఇపుడే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నావు అంటూ ప్రోత్సహిస్తున్నారు. సాధించాలన్న తపన ఉంటే  చాలు ఎవరైనా చేస్తారు అంటూ వాళ్లందరూ  మోటివేట్ చేస్తున్నారు. అయితే నాన్నగారి గురించి ఒక విషయం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. చాలా రోజుల తర్వాత  నాన్న మా ఇంటికి వచ్చారు.  రాగానే ఆయన  నన్ను అడిగిన మొదటి ప్రశ్న ఇప్పుడు ని బరువు ఎంత ఉంది? కుస్తీ చేయాలనే కోరిక ఉందా లేదా? తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు అని ప్రశ్నించారు.  నేను కాస్త బరువు చాలా పెరిగాను కాబట్టి నా బరువు తగ్గించి, మళ్ళీ ఎప్పటిలా కుస్తీ చేస్తాను అని చెప్పాను. దానికాయన అది చాలా కష్టం, ఇపుడు నువ్వింక ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అన్నారు. అవును, నేను కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి కష్టపడతాను, బరువు తగ్గిస్తానని చెప్పాను. ఎందుకంటే నాకు కుస్తీ తప్పించి ఇంకేమి కనిపించడం లేదు.   మా నాన్న చెప్పినట్లే నిజానికి  రెజ్లర్స్ కి  బరువు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే  బరువును బట్టే మన క్యాటగిరి అనేది నిర్ణయించబడుతుంది. లాస్ట్ టైం నేను  57 కేజీల విభాగంలో పాల్గొన్నాను.  దాని తర్వాత కూడ నేను ఆడాను.  ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో కూడ 5 7 కేజీల విభాగంలో  ఆడాను. ఇపుడు జరగబోయే ఒలంపిక్స్ కి 62 కేజీల విభాగం అవసరం. ఈ మధ్య నా ఫోటోలను చూసి సోషల్ కొంతమంది నెగిటివ్ గా కూడా కామెంట్ చేశారు. నా హర్డ్ వర్క్ ను గమనించకుండా కామెంట్స్  చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. అయితే వారి కామెంట్స్ కు బాధపడేతే అక్కడే ఆగిపోతాను. ఒకరకంగా ఇలాంటి నెగటివ్ విషయాలు కూడ నన్ను పాజిటివ్ గా మోటివేట్ చేస్తాయి. ఒక రకంగా వాళ్ళ   మీద జాలి కలుగుతుంది. ఇపుడు నేను ఓ బిడ్డకు తల్లి ని.  అమ్మఅయిన తర్వాత సహజంగానే శరీరంలో మార్పులు వస్తాయి. బరువు పెరుగుతారు. ఇవన్నీ సహజంగా జరిగేవే. అలా కాకుండా  మీరు ఇలా లావాపోయారేంటి? కుస్తీ వదిలేశారా? లావయితే ఇక కుస్తీ ఎలా చేయగలరు' అని నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారంటేనే తెలిసిపోతుంది వాళ్ళకి అంతగా అర్థం చేసుకునే శక్తి లేదని. అందుకే నేను వాళ్ళ మీద జాలి పడి వదిలేస్తాను. అమ్మ అయినంత మాత్రానా నాకు ఇష్టమైన కుస్తీని వదిలేయాలా  దాన్ని ఛాలెంజ్ గా కూడా తీసుకుంటాను. మళ్ళీ నేను ఫిట్ అవ్వడానికి సాధన చేస్తున్నాను.