నిత్యానంద లీలలు.. కైలాస దేశంలో రిజర్వుబ్యాంకు, కొత్త కరెన్సీ
posted on Aug 17, 2020 @ 6:13PM
ఇటీవల ‘కైలాస’ అని కొత్త దేశాన్ని ప్రకటించిన నిత్యానంద.. తాజాగా ఆ దేశానికి రిజర్వు బ్యాంకుని ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేక కరెన్సీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 22 వినాయక చవితి రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస(ఆర్బీకే) ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. అదే రోజు నుంచి ఆర్బీకే కరెన్సీ చలామణిలోకి వస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించి పలు దేశాల బ్యాంకులతో చట్టబద్దంగా ఎంఓయూ కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఏ దేశ కరెన్సీ అయినా కైలాస దేశంలో చెల్లుబాటు అవుతుందని, అలాగే కైలాస దేశం కరెన్సీ కూడా అన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుందని నిత్యానంద తెలిపారు. అయితే, ఈ కథనాలన్నీ నిత్యానంద సొంత వెబ్‌సైట్ 'కైలాస.ఆర్గ్' వండివార్చిన సమాచారమేనంటూ ఈక్వెడార్ కొట్టిపారేసింది.
కర్ణాటకలోని బిడిదిలో ఆశ్రమాన్ని స్ధాపించి పిల్లల అక్రమ నిర్బంధం, మహిళల అదృశ్యం, యువతులను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద దేశం విడిచి పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ క్వెడార్‌లోని భాగమైన ఓ ద్వీపాన్ని కొని, కొత్త దేశంగా ప్రకటించి, దానికి ‘కైలాస’ అనే పేరు కూడా పెట్టినట్లు తన వెబ్‌సైట్ ద్వారా వెల్లడించారు. అంతేగాక తన దేశానికి పాస్‌పోర్ట్, జెండా, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు సొంతంగా బ్యాంకును కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ప్రకటనలు అయితే వస్తున్నాయి కానీ ఆయన ఎక్కడున్నారో మాత్రం తెలియడం లేదు. నిత్యానంద పేరుతో వస్తున్న ప్రకటనలు మినహా ఆయన గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.
మరోవైపు ఈక్వెడార్ ఆర్బీకే, కరెన్సీ వార్తలను కొట్టిపారేసింది. అసలు నిత్యానంద తమ దేశంలో కానీ, చుట్టు పక్కల కానీ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టడం లేదని ఈక్వెడార్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇవన్నీ జనాన్ని బురిడీ కొట్టించేందుకు నిత్యానంద చేస్తోన్న ప్రకటనలని అర్ధమవుతోంది.