టీఆర్ఎస్ లో అసమ్మతి భగ్గుమనడం ఖాయమా?

అధికార టీఆర్ఎస్ లో అసమ్మతి పెరిగిపోతోంది. పార్టీలో కొంత కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి జ్వాలలు ఒక్కొక్కటిగా  భగ్గుమంటున్నాయి. అసమ్మతి నేతలు క్రమంగా తమ వాయిస్ పెంచుతున్నారు. బీటీ బ్యాచ్ నాయకుల తీరుపై గుర్రుగా ఉన్న యూటీ వర్గం నేతలు.. బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. టీఆర్ఎస్ లో తాను చెప్పిందే వేదమన్న భావనలో ఉన్న సీఎం కేసీఆర్ కు.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గానే పరోక్షంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న, శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామిగౌడ్ చేస్తున్న ప్రకటనలు గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నాయి. కొన్ని కులాలే పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నాయంటూ స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ను ఉద్దేశించేనని పార్టీలో చర్చ జరుగుతుంది. కుల రక్కసి తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుందని స్వామి గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.   కులాలపై సంచలన కామెంట్లు చేసిన స్వామిగౌడ్.. మరింత దూకుడు పెంచి.. కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని బహిరంగంగా  ప్రశంసించడం టీఆర్ఎస్ అగ్రనేతలకు మింగుడు పడటం లేదు. మండలి చైర్మన్ పదవీ కాలం ముగిసాక ప్రత్యక్ష రాజకీయాలకు స్వామి గౌడ్ దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, తనకు జరుగుతున్న అవమానాలను భరించలేకే స్వామిగౌడ్ ఓపెన్ అయ్యారని రాజకీయ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీతో పొరపొచ్చాల కారణంగానే స్వామి గౌడ్ ఇలా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.   కొన్ని రోజుల క్రితం మంత్రి ఈటల రాజేందర్ కూడా తన కామెంట్లతో కారు పార్టీలో కలకలం రేపారు. కేసీఆర్ క్యాబినెట్ నుంచి తనను తప్పిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. తాము గులాబీ జెండా ఓనర్లమనీ, అడుక్కునే వాళ్లం కాదని తేల్చి చెప్పారు. తనకు మంత్రి పదవి అడుక్కుంటే వచ్చింది కాదన్నారు. తాను పార్టీలోకి మధ్యలో వచ్చినోన్ని కాదని.. బతికొచ్చినోన్ని కాదని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని.. ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతమని చెప్పారు. దొంగలెవరో, దొరలెవరో త్వరలోనే తేలుతుందన్నారు. రాజేందర్ వ్యాఖ్యలతో టీఆర్ఎస్ లో తీవ్ర దుమారం రేగింది. ఈటెల పార్టీ మారుతారని, ఆయనతో చాలా మంది నేతలు వెళతారని ప్రచారం జరిగింది. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన కేసీఆర్... ముఖ్య నేతలతో చర్చించి వివాదానికి తెర దించారు. ఈటలను బుజ్జగించారు. అయినా రాజేందర్ పార్టీలో సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. మొదటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే రాజేందర్.. ఇటీవల అంటిముట్టినట్లుగా ఉంటున్నారు. తన శాఖాపరమైన కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారు. నియోజకవర్గ సమస్యలపైనే ఫోకస్ చేస్తున్నారు. దీంతో సమయం చూసి ఈటల మరోసారి బాంబు పేల్చడం ఖాయమనే చర్చ జరుగుతోంది.    పార్టీ ఆవిర్బావం నుంచి కేసీఆర్ కు కుడి భుజంగా ఉన్న మంత్రి హరీష్ రావు కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. రెండో టర్మ్ లో మొదట హరీష్ ను కేబినెట్ లోకి తీసుకోలేదు. ఆయనను సిద్దిపేట నియోజకవర్గం వరకే పరిమితం చేశారు. దీనిపై విమర్శలు రావడంతో తర్వాత మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే పోర్టు ఫోలియోలో ప్రమోషన్ ఇచ్చినట్లుగా ఆర్థికశాఖను అప్పగించారు. దీంతో ప్రజల్లో తిరిగే హరీష్ రావు జనాల్లోకి వెళ్లకుండా పోయారు. హరీష ఎక్కువగా జనాల్లోకి వెళ్లకుండా ఉండాలనే కుట్రతోనే ఆయనకు ఆర్థికశాఖను అప్పగించారనే ప్రచారం జరిగింది. హరీష్ కూడా ఆర్థికమంత్రిగా ఉన్నప్పటికి ఒక్క జిల్లాలో మాత్రమే తిరుగుతున్నారు. కరోనా కల్లోలంలోనూ ఆయన ఇతర జిల్లాలకు వెళ్లలేదు. కేసీఆర్ ఆదేశాలనే హరీష్ సిద్దిపేటకే పరిమితమయ్యారని తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై హరీష్ వర్గ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారంతా సమయం చూసుకుని తమ గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు గులాబీ పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఇక తెలంగాణ ఉద్యమంలో పని చేసిన చాలా మంద నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. బీటీ బ్యాచ్ హవా సాగుతుండటంతో వారంతా ఏమి చేయలేకపోతున్నారు. కేటీఆర్ కోటరి వల్లే సమస్య లంటున్న అసమ్మతి నేతలు.. త్వరలోనే తమ తడాఖా చూపిస్తామని చెబుతున్నారు. దీంతో త్వరలోనే టీఆర్ఎస్ లో అసమ్మతి భగ్గుమనడం ఖాయమని తెలుస్తోంది.

మూడు గ్రూపులు.. ఆరు గొడవలు కాంగ్రెస్ లో కామన్

అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా హస్తంలో నేతల మధ్య అధిపత్య పోరు కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరు ముదురుతోంది. అగ్రనేతలంతా ఎవరికివారే సొంత మైలేజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా కట్టడి, వరద సహాయ చర్యల్లో కేసీఆర్ సర్కార్ విఫలమైందనే భావన ప్రజల్లో ఉంది. సీఎం కేసీఆర్ పాలనపై గతంలో ఎప్పుడు లేనంతగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని వివిధ సంస్థలు చేసిన సర్వేల్లో తేలింది. గత ఆరు నెలల్లో కేసీఆర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని చాలా సంస్థల అభిప్రాయ సేకరణలో వ్యక్తమైంది. ఇలాంటి సమయంలో ప్రజల్లోకి వెళ్లి మైలేజీ పెంచుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ.. అంతర్గత కుమ్ములాటలతో రోడ్డున పడుతోంది. ప్రజా సమస్యలపై ఒకరు పోరాడితే మిగితా వారు అతనికి సహకరించడం లేదు. ఆ నేతకు పోటీగా మరో నేత మరో కార్యక్రమం తీసుకుంటున్నారు. ఇలా సొంతంగానే ఎవరికి వారు కార్యక్రమాలు చేస్తూ... మిగితా వారి సహకారం లేక తుస్సుమంటున్నారు.                      శ్రీశైలం పవర్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. మంటలు వచ్చిన కొన్ని గంటలకే సర్కార్ కుట్ర ఉందంటూ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ ఆరోపణలు ప్రజల్లోనూ చర్చకు దారి తీశాయి. శ్రీశైలం వెళ్లేందుకు ప్రయత్నించిన రేవంత్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ అంశాన్ని జనాల్లోకి మరింతగా తీసుకువెళితే కాంగ్రెస్ కు బూస్ట్ వచ్చి కారు పార్టీ ఇబ్బందుల్లో పడేది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఇందులో పూర్తిగా విఫలమయ్యారు. పోరాటానికి దిగిన రేవంత్ రెడ్డికి ఎవరూ సపోర్ట్ చేయలేదు. దీంతో ఒంటరిగానే వెళ్లారు రేవంత్ రెడ్డి. అయితే ఎవరికి చెప్పకుండానే ఏకపక్ష నిర్ణయాలతో రేవంత్ వెళ్లారని కాంగ్రెస్ లోని మరో వర్గం ఆరోపిస్తోంది. అందరు కలిసి ఉమ్మడిగా పోరాడితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగేదని, రేవంత్ తొందరపాటు చర్యలతో మంచి అవకాశం చేజారిపోయిందని చెబుతున్నారు. రేవంత్ వర్గం మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు. కేసీఆర్ తో కొందరు నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు.    ఇక ఇటీవలే నిరాహర దీక్షకు దిగి అర్ధాంతరంగా విరమించిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. ఆసుపత్రల సందర్శన పేరుతో మరో యాత్ర చేపట్టారు. ఆగస్టు 25 నుంచి 11 రోజుల పాటు ఆయన ఒక్కరే బస్సు యాత్ర చేస్తున్నారు. 33 జిల్లాల్లోని హాస్పిటల్స్ ను ఆయన పరిశీలించనున్నారు. భట్టి తీరుపై పార్టీలో అసంతృప్తి వస్తోంది. పీసీసీ చీఫ్ పదివి కోసమే భట్టీ యాత్ర చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం సైలెంట్ గానే ఉంటున్నారు. తనను మార్చాలని గతంలోనే హైకమాండ్ ను కోరిన ఉత్తమ్.. పరిమితంగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప దూకుడుగా వ్యవహరించడం లేదు. నల్గొండ జిల్లాకే చెందిన మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నా... అవన్ని తన పీసీసీ చుట్టే తిరిగేలా మాట్లాడుతున్నారు. తనకు పార్టీ పగ్గాలు ఇస్తే టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొంటా అని చెబుతున్నారు కాని ప్రజా సమస్యలపై మాత్రం సీరియస్ గా స్పందించడం లేదు. పీసీసీ బాధ్యతలు తనకే ఇవ్వాలని, మరొకరికి ఇస్తే ఒప్పుకునేది లేదంటూ బెదిరించే దోరణిలో వెళుతున్నారు కోమటిరెడ్డి. రేవంత్ టీమ్ ను దూరం పెడుతున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్.    ప్రభుత్వంపై పోరాడాల్సిన కాంగ్రెస్ నేతలు.. ఒకరికొకరు టార్గెట్ చేసుకుంటూ కేడర్ ను మరింత గందరగోళంలో పడేస్తున్నారు. కోటి పది లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర ఎమ్మార్వో నాగరాజు ఎపిసోడ్ కాంగ్రెస్ లో వర్గ పోరుకు తెర లేపింది. నాగరాజు కేసులో అరెస్టైన శ్రీనాథ్, అంజిరెడ్డికి రేవంత్ రెడ్డితో సంబంధాలున్నాయని టీఆర్ఎస్ ఆరోపించింది. అంజిరెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి లెటర్ హెడ్స్ కూడా దొరికాయి. ఇలాంటి సమయంలో పార్టీ ఎంపీకి అండగా ఉండాల్సిన కాంగ్రెస్ లీడర్లు ఆయననే టార్గెట్ చేశారు. ఎంపీ సంగతి తేల్చాలని వీహెచ్ డిమాండ్ చేశారు. తర్వాత వీహెచ్ ను ఉద్దే శించి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కీసర ఘటన కాంగ్రెస్ లో వర్గపోరును బహిర్గతం చేసింది.  సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పీసీసీ రేసులో ఉన్నానని చెబుతున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఇస్తే ఊరుకునేది లేదంటూ పరోక్షంగా రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. పార్టీ నేతల తీరుపై కేడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వంపై పోరాటానికి  మంచి అవకాశాలు వచ్చినా నేతల తీరుతో చేజార్చుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతోంది. లీడర్ల తీరు మారకపోతే కేసీఆర్ ను ఎదుర్కోవడం కష్టమని చెబుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.

వ్యాధుల మూలాలను శోధించిన శాస్త్రవేత్త

సురక్షితమైన యాంటీ ఫంగల్ డ్రగ్ కనిపెట్టిన   ఎలిజబెత్ లీ హాజెన్ (ఆగష్టు 24, 1885- జూన్ 24, 1975)   చుట్టూ ఉండే పరిసరాలను గమనిస్తే ఎన్నోఅద్భుతాలు కనిపిస్తాయి. వాటిలో పాటు సమస్యలు గోచరిస్తాయి. ప్రకృతిపై మక్కువ పెంచుకున్న ఒక అమ్మాయి మైక్రోబయాలజీలో పరిశోధనలు చేసి మనషుల్లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లకు సురక్షితమైన యాంటీ ఫంగల్ డ్రగ్ కనిపెట్టారు. ఆమే ఎలిజబెత్ లీ హాజెన్. ఆమె కనిపెట్టిన నిస్టాటిన్ (యాంటీ ఫంగల్ , యాంటీ బయాటిక్ డ్రగ్) ఇరవై దశాబ్దంలోనే అత్యద్భుతమైన , దివ్యౌషదంగా పేర్కోంటారు. అంతేకాదు  బ్యాక్టీరియా నిర్ధారణలో ఆమె అనేక విజయాలు సాధించారు. ఆంత్రాక్స్ వ్యాప్తి, తులరేమియా (ప్లేగు లాంటి వ్యాధి) తదితర అరుదైన జబ్బుల మూలాలను గుర్తించగలిగారు.  ఆమె కనిపెట్టిన నిస్టాటిన్ఫంగల్ ఇన్పెక్షన్లకు ఎంతో బాగా పనిచేసుంది. అంతేకాదు మొక్కల్లోనూ ఫంగల్ ఇన్సెక్షన్లు నివారిస్తుంది. పాతబడిన, శిథిలావస్థకు చేరిన కళాకృతులకు జీవం పోస్తుంది.   ఎలిజబెత్ లీ హాజెన్ 1885 ఆగస్టు 24 న మిస్సిస్సిప్పిలో 24 ఆగస్టు 1885లో ఎలిజబెత్ లీ హాజెన్ జన్మించారు. ఆమె తల్లిదండ్రులు మాగీ హార్ఫర్, ఎడ్గార్ హాజెన్. ముగ్గురు సంతానంలో ఆమె రెండో అమ్మాయి. ఆమె నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులు మరణించారు.  దాంతో ముగ్గురు పిల్లలు వారి అత్తమామ వద్ద పెరిగారు.   చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే ఎలిజబెత్ మిస్సిస్సిప్పి యూనివర్శిటీ ఫర్ ఉమెన్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశారు.  తనకు ఇష్టమైన మైక్రోబయాలజీలో పరిశోధన కోసం కొలంబియాలోని జీవశాస్త్ర విభాగంలో చేరారు. 1917 లో కొలంబియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ ఆఫ్ బయాలజీని పూర్తి చేశారు. ఆ తర్వాత 1927 లో మైక్రోబయాలజీలో పిహెచ్.డి. పూర్తి చేసి డాక్టరెట్ అందుకున్న మొదటి మహిళ గా పేరు నమోదు చేసుకున్నారు. అంతేకాదు ఆమె మొదటి ప్రపంచ యుద్ధంలో ఆమె ఆర్మీ డయాగ్నొస్టిక్ లాబొరేటరీ టెక్నీషియన్‌గా పనిచేశారు. న్యూయార్క్ లోని  పబ్లిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాబొరేటరీస్ , రీసెర్చ్  కార్యాలయంలో పనిచేశారు.   పరిశోధన వైపు ... కొలంబియాలో చదువుతున్నప్పుడే జీవ రసాయన శాస్త్రవేత్త రేచల్ ఫుల్లర్ బ్రౌన్ తో హాజెన్ కు పరిచయం.  వీరిద్దరూ కలిసి అనేక ప్రయోగాలు చేశారు. శీలంధ్ర వ్యాధులపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. 1948లో వీరిద్ధరూ కలిసి స్ట్రెప్టోమైసెస్ నూర్సీబ్యాక్టిరియా నుంచి యాంటీ ఫంగల్ డ్రగ్ తయారు చేశారు. దానిని ఫంగైసిడిన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఈ డ్రగ్ పేరును నిస్టాటిన్ గా మార్చి పేటెంట్ కూడా తీసుకున్నారు.   మొదటి ఏడాదే లక్షా 35వేల డాలర్లు యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే సురక్షితమైన మొదటి డ్రగ్ నిస్టాటిన్. 1950 చివరల్లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సమావేశంలో డాక్టర్ ఎలిజబెత్, డాక్టర్ రేచల్ తమ పరిశోధన ఫలితాలను ప్రకటించారు. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు 1954లో ఇ.ఆర్. స్క్విబ్ అండ్ సన్స్ కంపెనీ ద్వరా ఈ డ్రగ్ మార్కట్ లో విడుదల చేశారు. మొదటి ఏడాదే లక్షా 35వేల డాలర్లు( కోటీ రూపాయలకు పైగా) వచ్చాయి. తమకు వచ్చిన లాయల్టీలో 13మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. సైన్స్ లో పరిశోధనలు చేసే మహిళా శాస్త్రవేత్తలకు ఉపయోగపడేలా ట్రస్ట్ ఏర్పాటు చేశారు.   ఎలిజబెత్ అనేక అవార్డులను అందుకున్నారు.  కెమోథెరపీలో స్క్విబ్ అవార్డు, మెడికల్ మైకోలాజికల్ సొసైటీ ఆఫ్ ది అమెరికాస్ నుంచి  రోడా బెన్హామ్ అవార్డు, హోబర్ట్ , విలియం స్మిత్ కాలేజీల నుండి గౌరవ డిగ్రీ, కెమికల్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమిస్ట్స్ నుంచి  పయనీర్ అవార్డు, ఇతర అనేక పురస్కారాలను ఆమె అందుకున్నారు.  24 జూన్, 1975న మరణించారు. ఆ తర్వాత 1994 లో నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో నామినేట్ అయ్యారు.   పురాతన కళాఖండాలకు ఎలిజబెత్, రేచల్ పరిశోధన ఫలితాలు మానవాళికే కాదు వృక్షజాతులకు ఎంతో ఉపయోగపడ్డాయి. పురాతన కళాఖండాలకు తిరిగి జీవం పొయడానికి కూడా ఉపకరిస్తున్నాయి.

బాబుగారు నిజం చెప్పండి.. ఆ డాక్టర్ ను ఎక్కడ దాచారు.. విజయ్ సాయి ఫైర్ 

టీడీపీ నాయకులు చంద్రబాబు, లోకేష్ ల పై నిత్యం విరుచుకుపడే వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి కరోనా సోకిన తరువాత కొద్ది రోజులు సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా ఈరోజు మరోసారి ట్విట్టర్ వేదికగా బాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తాజాగా, కరోనా చికిత్స కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం కేసులో విజయవాడ రమేశ్ హాస్పిటల్స్ అధినేత రమేశ్ బాబు కోసం పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు. "చంద్రబాబూ నేరుగా అడుగుతున్నా. ఇంతకీ డాక్టర్ రమేశ్ ను మీ ఇంట్లో దాచారా? లేక, మీ కొడుకు ఇంట్లో దాచారా? ఇంతకీ నిమ్మగడ్డ రమేశ్, డాక్టర్ రమేశ్.. ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి?" అని అయన తన ట్వీట్ లో ప్రశ్నించారు.   కాగా, రమేశ్ హాస్పిటల్స్ వ్యవహారంలోనూ, నిమ్మగడ్డ వ్యవహారంలోనూ అధికార పార్టీ నేతలు పదేపదే కుల ప్రస్తావన తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ సాయి చేసిన ట్వీట్ లో కూడా 'ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి?' అని అడగటం ద్వారా పరోక్షంగా కుల ప్రస్తావన తీసుకువస్తూ చంద్రబాబుని టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది.

తుది విజయం అమరావతి రైతులదే: జస్టిస్ గోపాల గౌడ

అమరావతి రైతులు చేస్తున్న పోరాటం న్యాయసమ్మతమేనని, అది  న్యాయబద్ధంగానే ఉందని  స్వయంగా మాజీ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ అభిప్రాయపడ్డారు. గత 251 రోజులనుండి అమరావతి రైతులు, ప్రజలు చేస్తున్న దీక్షలైనా, ఇతర పోరాటాలైన తప్పనిసరిగా న్యాయ సమీక్షకు నిలబడతాయనే అభిప్రయాన్నీ అయన వెల్లడించంతో యి ప్రాంత రైతులుకు కొంత ఊరట కలిగినమాట వాస్తవం.    అయితే, ఎక్కడా ఆవేశకావేశాలకు మాత్రం తావివ్వవద్దని, భావోద్వేగాలకు గురికావద్దని అయన పోరాటం చేసే రైతులకు, ప్రజలకు  సూచించారు. రాజ్యంగ వ్యవస్థపైన, న్యాయ వ్యవస్థపైనా నమ్మకంపెట్టుకోవాలని, న్యాయ నిపుణులు ఎప్పటికీ వారివైపు ఉంటారని, జస్టిస్ గౌడ వారికి భరోసా ఇచ్చారు.    మీరు చేస్తున్న న్యాయబద్ధమైన పోరాటంలో తుది విజయం తప్పక రైతులదేనని, అమరావతి రైతులు ఎలాంటి పరిస్థితులలోనైన విజయం సాధిస్తారని, ధర్మం వారివైపు నిలబడి ఉంటుందని, జస్టిస్ గౌడ అభిప్రాయపడ్డారు. న్యాయం వారివైపు ఉందని, కోర్టుల్లో వారికి న్యాయం తప్పక జరిగి తీరుతుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.    కర్ణాటక రాష్ట్రానికి చెందిన జస్టిస్ గోపాల గౌడ, సుప్రీం కోర్ట్ లో న్యాయమూర్తి గా పదవీవిరమణ చేశారు. సుప్రీం కోర్టుకు న్యాయమూర్తిగా వెళ్లే ముందు ఆయన ఒడిసా హై కోర్ట్ కు చీఫ్‌ జస్టిస్ గా పని చేశారు. ప్రధానంగా సామజిక సమస్యలపై స్పందించే జస్టిస్ గౌడ తెలుగు రాష్ట్రాలలోని ఒక ప్రముఖ వార్తా ఛానల్తో మాట్లాడుతూ, నష్టపోయిన వ్యక్తికి పోరాడే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ఆయన స్పష్టం చేసారు. నష్టపోయిన వారికి న్యాయం చేయాలని, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే దీనిని చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.    ఒకవేళ ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగగకపోతే, ఇకమిగిలింది, వారు న్యాయ వ్యవస్థ తలుపు తట్టడమేనని, జస్టిస్ గౌడ అన్నారు. ఒక మాజీ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తియే స్వయంగా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచడంతో, అమరావతి రైతులలో ఒకరకమైన నమ్మకం ఏర్పడిందని చెప్పక తప్పదు. 

ఐతే చర్చలు.. లేదంటే మిలట్రీ యాక్షన్.. చైనాకు బిపిన్ రావత్ స్ట్రాంగ్ వార్నింగ్

భారత్ చైనా ల మధ్య సరిహద్దు వివాదం చైనా మొండి వైఖరి తో ఇంకా జఠిలమవుతున్నట్లుగా తెలుస్తోంది. సరిహద్దు వివాదం పరిష్కారం కోసం రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చలలో చిక్కుముడి ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఈ చర్చల్లో ముఖ్యంగా ప్యాంగ్యాంగ్ సరసు వద్ద ఉన్న ఫింగర్స్ ప్రాంతంలో సైనిక బలగాల ఉపసంహరణ పై ప్రతిష్టంభన ఏర్పడినట్లుగా తెలుస్తోంది. దీంతో చైనా సైన్యం అతిక్రమణలను ఎదుర్కోడానికి చర్చల ద్వారా తాము ప్రయత్నిస్తూనే ఉన్నామని, ఒకవేళ అవి సఫలం కాకపోతే మాత్రం మిలటరీ యాక్షన్‌కు భారత సైన్యం సిద్ధంగానే ఉందని భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.   సరిహద్దుల వద్ద చైనా దుందుడుకు చర్యలను నిరోధించేందుకు రక్షణ దళాలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయని చెప్పారు. భారత ప్రభుత్వం దీనికి శాంతియుతంగానే పరిష్కారం కోరుతోందని, అయితే చర్చలు ఫలించకపోతే మాత్రం ఆర్మీని రంగంలోకి దింపడానికి, యుద్ధానికి కూడా సిద్ధమని అయన చెప్పారు. అయితే ఈ విభేదాలు మరింత ముదరకుండా ఉండేందుకు భారత్ చైనా కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నాయి. అయితే ఏప్రిల్‌కి ముందు ఉన్న యథాతథ స్థితిని చైనా ఆర్మీ కొనసాగించాలని భారత సైన్యం పట్టుబడుతుండగా చైనా సైన్యం మాత్రం ససేమిరా అంటుండడంతో భారత్‌ తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది.

ఎమ్మెల్యే వంశీ ఆ ఒక్క స్టేట్ మెంట్ తో గన్నవరం వైసీపీలో మంటలు

కృష్ణ జిల్లా గన్నవరం రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గన్నవరం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ.. వైసీపీకి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ‘గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఇంఛార్జి రెండూ నేనే. దుట్టా రామచంద్రావు, యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పనిచేస్తాను. నాకు ఎలాంటి అభ్యంతరాలు, గొడవలు ఏం లేవు.’ అంటూ వంశీ వ్యాఖ్యానించారు.   ఈ వ్యాఖ్యల ద్వారా ఒకవేళ తాను రాజీనామా చేసి, గన్నవరంకి ఉప ఎన్నిక జరిగినా వైసీపీ నుంచి తానే అభ్యర్థిగా పోటీ చేస్తాననే సంకేతాలు పంపడం వంశీ ఉద్దేశంగా తెలుస్తోంది. అయితే, వంశీ చేతిలో ఓడిపోయిన అప్పటి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆయనకి ఎంతవరకూ సహకరిస్తారో సందేహమే. ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లింది. గత ఎన్నికలకు ముందు తమని ఇబ్బంది పెట్టిన వంశీ.. ఇప్పుడొచ్చి గన్నవరం ఇంఛార్జ్‌గా తనను తాను ప్రకటించుకోవడం పట్ల కూడా యార్లగడ్డ వర్గం గుర్రుగా ఉందని తెలుస్తోంది.    ఇక మొదటి నుంచి వైఎస్ జగన్‌ వెంట నడిచిన నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేత దుట్టా రామచంద్రరావు రూపంలో వంశీకి మరో గండం కూడా ఉంది. తాజాగా దుట్టా చేసిన వ్యాఖ్యలు చూస్తోంటే ఆ విషయం స్పష్టమవుతోంది.    తాజాగా గన్నవరం రాజకీయాలపై స్పందించిన దుట్టా.. "నాకు 40సం.లనుండి రాజశేఖర్ రెడ్డి తో పరిచయం ఉంది, ఆరోజు నుండి ఈరోజు వరకు ఆయన కుటుంబం తో నడిచాను. జగన్ పార్టీ పెట్టిన తరువాత ఆయనతో నడిచాను. నియోజకవర్గంలో ఏపని చేసిన నాతో సంప్రదించి చేశారు. జగన్ ఏమి చెప్పినా తూచా తప్పకుండా పాటించాను" అన్నారు.   "నియోజకవర్గంలో టీడీపీలో ఉండి పది సంవత్సరాల పాటు వైసీపీ కార్యకర్తలు పై కేసులు పెట్టించి అనేక ఇబ్బందులు పెట్టిన వారు ఈరోజు వైసీపీ అధికారంలోకి రాగానే వైసీపీలో చేరి.. వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డాక్టర్ గారి వెంట ఉంటే ఏమి వస్తుంది అంటూ ఎమ్మెల్యే పక్కన ఉంటే పదవులు కాంట్రాక్టు లు ఇస్తాం.. రాకపోతే ఇబ్బందులు పడతారని నా దగ్గర ఉన్నవారికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఈ నియోజకవర్గంకు అన్నీ నేనే అని ఎమ్మెల్యే వంశీ అంటున్నారు. ఇన్ని సంవత్సరాల నుండి వైసీపీ వెంట ఉన్నది ఇందుకేనా అని వైఎస్సార్ కార్యకర్తలు నా దగ్గర గోడు వెళ్లబోసుకుంటున్నారు." అని దుట్టా చెప్పారు.   "నాకూ యార్లగడ్డ వెంకట్రావు కి విభేదాలు లేవు చిన్న మనస్పర్థలు తప్ప. నా అల్లుడు శివభరత్ రెడ్డి వంశీ చేసే అక్రమాలు ను ఆపుతున్నాడని ,శివ భరత్ రెడ్డి పక్కన ఉన్న నాయకులు ను బెదిరిస్తున్నారు. శివ భరత్ రెడ్డి కి పదవులు అవసరం లేదు, కావాలంటే గన్నవరం నియోజకవర్గం నుండి నేనే పోటీ చేస్తా. వైసీపీ కార్యకర్తలు మీద చెయ్యి వేయాలంటే అది నా ప్రాణం పోయిన తర్వాతే. రౌడీలు, ఫ్యాక్షనిస్టులు నన్నేమి చేయలేరు. వైసీపీ జెండా కప్పుకొనే చస్తా." అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, వైసీపీ కార్యకర్తలు కు రానున్న 15రోజుల్లో ఒక చల్లని కబురు చెబుతా అని పేర్కొన్నారు.   దుట్టా వ్యాఖ్యలు చూస్తుంటే.. ఒకవేళ గన్నవరం ఉప ఎన్నిక జరిగినా వల్లభనేని వంశీకి వైసీపీ టికెట్ ఎంతవరకూ దక్కుతుందో నమ్మకం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. యార్లగడ్డతో విభేదాలు లేవని చెప్పడం, కావాలంటే గన్నవరం నియోజకవర్గం నుండి నేనే పోటీ చేస్తానని దుట్టా చెప్పడం చూస్తుంటే.. వంశీ పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్టుగా తయారైంది. రాజీనామా చేసినా ఉపఎన్నికల్లో టికెట్ కష్టమే, ఒకవేళ టికెట్ వచ్చినా దుట్టా, యార్లగడ్డ వర్గాలు కలిసి ఓడించే అవకాశాలున్నాయి. మొత్తానికి వంశీ పరిస్థితి అటు టీడీపీకి, ఇటు వైసీపీకి కాకుండా అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా వ్యాక్సిన్ వివరాల కోసం పోర్టల్

కోవిద్ 19 వ్యాక్సిన్ ఏడాది చివరి నాటికి...   కొవాగ్జిన్‌ ట్రయల్స్ లో మార్పులు   చర్మపొరలకు వ్యాక్సిన్..   జీవితాన్ని నాలుగుగోడల మధ్య బందీ చేసిన కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు అభివృద్ధి చేస్తున్న టీకాలు ఏఏ దశల్లో ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు, ఫలితాలు, మార్కెట్ ధరలు అన్ని తెలుసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ వ్యాక్సిన్‌ పోర్టల్‌ను ఐసీఎంఆర్‌ హెడ్‌ (అంటువ్యాధుల విభాగం) అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ వెబ్‌సైట్‌లో వ్యాక్సిన్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. ఇంగ్లీష్‌తో పాటు అనేక స్థానిక భాషల్లో కూడా సమాచారం అందుబాటులోకి తీసుకువస్తున్నారు.   భారతదేశంలో మొత్తం మూడు వ్యాక్సిన్‌లు క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. అన్ని ప్రయోగాలు అనుకున్నట్టే జరిగితే ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్  అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.  హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్‌తోపాటు జైకోవ్-డి వ్యాక్సిన్‌లు క్లినికల్ ట్రయల్స్‌లోకి ప్రవేశించాయి. ఇప్పటివరకూ ఈ వ్యాక్సిన్ ను ఫేస్ 1, 2 ట్రయల్స్ లో భాగంగా, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 ఆసుపత్రుల్లో 1,125 మందికి ఇచ్చి పరిశీలిస్తున్నారు. న్యూఢిల్లీ, పట్నాలోని ఎయిమ్స్, విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్, హైదరాబాద్ లోని నిమ్స్, రోహ్ తక్ లో పీజీఐఎంఎస్ తదితర చోట్ల టెస్టింగ్ జరుగుతోంది. ఆరోగ్యవంతులైన వారికి రెండు వారాల వ్యవధిలో వారికి రెండు వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. డోసేజ్ ఇచ్చిన 58 రోజుల తర్వాత ఈ వ్యాక్సిన్ సురక్షితమేనా, వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తిని పెంచుతుందా లేదా అని పరీక్షిస్తారు. అయితే  భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా తయారు చేసిన 'కోవాగ్జిన్' వ్యాక్సిన్  ట్రయల్స్ లో కొన్ని మార్పులు చేయనున్నారు. ఈ వ్యాక్సిన్ చర్మం కింది పొరలోకి ఇంజక్ట్ చేయడం ద్వారా ట్రయల్స్ చేపట్టాలని నిర్ణయించారు.   చర్మం పొరల్లో.. వ్యాక్సిన్ ను వివిధ రకాలుగా శరీరంలోకి పంపిస్తారు. ఎక్కువగా భుజాలు, పిరుదు కండరాలకు వేసే వ్యాక్సిన్ ఇస్తారు. దీన్ని ఇంట్రామస్కులర్ పద్దతిగా పిలుస్తారు. ప్రస్తుతం హైపటైటిస్, క్షయ, ధనుర్వాతం మొదలైన వ్యాక్సిన్లు ఇంట్రామస్కులర్ లో అందుబాటులో ఉన్నాయి. పోలియా వ్యాక్సిన్ నోటి చుక్కల ద్వారా ఇస్తారు. అయితే ఇప్పుడు కోవిద్ 19 వైరస్ అరికట్టే వ్యాక్సిన్ ను చర్మం కింది పొర ద్వారా శరీరంలోకి పంపించాలన్న శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. దీని వల్ల తక్కువ మోతాదులో వ్యాక్సిన్ ఇస్తే సరిపోతుంది.   కోవిద్ 19 వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున, ఎక్కవ డోసులు తయారు చేయాల్సి వస్తుంది. చర్మం ద్వారా ఇస్తే తక్కువ మోతాదులో ఎక్కువ మందికి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. కండరాలకు ఇచ్చే ఒక వ్యాక్సిన్ డోస్ తో  నలుగురికి చర్మం ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ తయారు చేయవచ్చు. దీనితో వ్యాక్సిన్ తక్కువ తయారు చేసినా ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావచ్చు. ధర కూడా 70 నుంచి 80 శాతం వరకూ తగ్గుతుంది.

చైనాలో అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్.. ప్రస్తుతం వారికి మాత్రమే.. 

కరోనా పుట్టిన చైనాలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. అయితే దీని వినియోగంపై అక్కడి ప్రభుత్వం కొన్ని ఆంక్షలు కూడా విధించింది. దీనిని కేవలం అత్యవసరంగా అవసమైన వారికి మాత్రమే వీటిని వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది.   ఈ వ్యాక్సిన్ వినియోగాన్ని జులై 22 నుండి ప్రారంభించినట్టు టీకా అభివృద్ధి బృందానికి నేతృత్వం వహిస్తున్న జెంగ్ జోంగ్‌వీ తెలిపారు. నిజానికి ఈ టీకాలు ఇప్పటికీ క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉన్నాయి. ఆహార మార్కెట్లు, ట్రాఫిక్ వ్యవస్థ, సేవారంగాల్లో పనిచేసే వారికి తొలి ప్రాధాన్యంగా వీటిని ఇస్తున్నట్టు జోంగ్‌వీ పేర్కొన్నారు. క్లినిక్ల ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్ ను అత్యవసర సర్వీసులలో ఉన్నవారికి ఉపయోగించేందుకు చైనాలోని చట్టాలు అనుమతిస్తాయి. ఇది ఇలా ఉండగా సినోఫార్మ్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లో భాగంగా యుఎఇ లోని 20 వేల మందికి ఇచ్చినట్లుగా ఆ సంస్థ చైర్మన్ తెలిపారు.

దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన పార్టీకి సారధి కరువయ్యాడు!!

సారధి లేని రథమైనా, సైన్యమైనా, పార్టీ అయినా సరైన దారిలో నడవలేవు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీది కూడా అదే పరిస్థితి. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు పార్టీని నడిపించే సారధి ఎవరా అని సతమతమవుతోంది.   2019 ఎన్నికల్లో ఓటమి తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పార్టీ నాయకులు ఎంతమంది చెప్పినా రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సోనియాగాంధీ తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. అయితే వయస్సు, అనారోగ్య సమస్యల కారణంగా ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనలేక పోతున్నారు. దీంతో అసలే వరుస ఓటములతో జోష్ తగ్గిన కాంగ్రెస్ మరింత ఢీలా పడిపోయింది. దీంతో కాంగ్రెస్ లో జోష్ రావాలంటే కొత్త అధ్యక్షుడు రావాలని, అది కూడా రాహుల్ అయితేనే బాగుంటుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.   కరోనా విషయంలో ముందే హెచ్చరించడం, వివిధ అంశాలపై మోడీ సర్కార్ ని ప్రశ్నిస్తుండటం వంటివి పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని పెంచాయి. అదీగాక రాహుల్ అయితేనే అందరూ ఆమోదిస్తారని పార్టీ సీనియర్ నేతలతో పాటు మిత్రపక్ష నేతలు కూడా చెప్తున్నారు. కానీ రాహుల్ మాత్రం పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ఇప్పటికీ ఆసక్తి చూపడంలేదు. అంతేకాదు అధ్యక్ష పదవి కోసం రాహుల్ కొత్తగా రెండు పేర్లు సూచించినట్లు సమాచారం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ మంత్రి, సీనియర్ నేత ఏకే ఆంటోనీ పేర్లను రాహుల్ సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు, సోనియాకు అత్యంత సన్నిహితుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. మొత్తానికి గాంధీ కుటుంబేతర వ్యక్తులే ప్రస్తుతానికి అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి.   అయితే మన్మోహన్, ఏకే ఆంటోనీ, ముకుల్ వాస్నిక్ లలో అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపట్టినా పూర్తికాలంపాటు వారిని నియమించరన్న ప్రచారం కూడా జరుగుతోంది. కేవలం తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలే అప్పజెప్పనున్నారని సమాచారం. ప్రస్తుత కరోనా సంక్షోభం తొలగిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్లీనరీ నిర్వహిస్తారని, అందులోనే రాహుల్ పూర్తిస్థాయి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. మరోవైపు రాహుల్ కోవిడ్ సమస్య సమసిపోయిన తర్వాత.. దేశవ్యాప్తంగా పర్యటిస్తారని ఆ తర్వాతే అధ్యక్ష బాధ్యతలు చేపడతారని, పార్టీని కిందిస్థాయి నుంచి బలపడేలా చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి రాహుల్ కరోనా సంక్షోభం తర్వాత అయినా పార్టీ బాధ్యతలు చేపడతారో లేక అప్పుడు కూడా చేతులు ఎత్తేస్తారో చూడాలి. విచిత్రం అంటే ఇదేనేమో.. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన పార్టీ.. ఇప్పుడు సారధి కోసం సతమతమవుతోంది.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కోమాలోకి... బాధ్యతలు చేపట్టిన కిమ్ సోదరి

ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లిపోయారని దక్షిణ కొరియా మాజీ అధికారి చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనం సృష్టిస్తున్నాయి. కిమ్ కోమాలో ఉండడంతో ఉత్తర కొరియాలో ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలను ఆయన సోదరి కిమ్ యో జోంగ్ చూస్తున్నారని ఆ అధికారి తెలిపారు. గతంలో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే జంగ్‌కు రాజకీయ సలహాదారుగా పనిచేసిన చాంగ్ సాంగ్ మిన్ తెలిపారు. కిమ్ కోమాలోకి వెళ్లిన విషయాన్ని తమ దేశ గూఢచార వర్గాలు తెలిపాయని అయన పేర్కొన్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన సమాచారం చైనా లోని ఒక ముఖ్య వ్యక్తి నుండి అందినట్లుగా అయన తెలిపారు   ప్రస్తుతం కిమ్ కోమాలో ఉన్నట్టుగా తెలుస్తోందని అయితే ఆయన మరణించలేదని చాంగ్ తెలిపారు. ఈ ఏడాది మొదట్లో కిమ్ చాలా తక్కువసార్లు బయట కనిపించారని, అపుడే ఆయన ఆరోగ్యం క్షీణించిందని అన్నారు. దీంతో దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ సిద్ధంగా ఉన్నట్టు చాంగ్ పేర్కొన్నారు. అయితే కిమ్‌ బ్రెయిన్ డెడ్ అయినట్టు గతంలో కూడా వార్తలు వచ్చాయి కానీ.. ఆ తర్వాత కిమ్ ఒక ఫెర్టిలాజర్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం చేస్తూ బహిరంగంగా కనిపించడంతో ఆ వార్తలకు తెర పడింది. అయితే ఇప్పుడు కూడా మళ్లీ అటువంటి వార్తలే వస్తున్నాయి.

ఏపీలో విచిత్ర పరిస్థితి.. ఆ జిల్లాలలో లక్షణాల్లేకుండానే పాజిటివ్ 

కరోనా సోకిన వ్యక్తికి వ్యాధి లక్షణాలు కచ్చితంగా ఉంటాయనే గ్యారంటీ లేకపోవడంతో పాటు కొంత మందికి అసలు ఎటువంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతున్న సంగతి తెలిసిందే. వారినే వైద్యపరిభాషలో ఎసింప్టమెటిక్ అంటారు. మన దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకు తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశంలో కరోనా వ్యాప్తి పై పలు సంస్థలు సర్వే చేసి సెన్షేనల్ విషయాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం సీరో సర్వైలెన్స్‌ సంస్థతో నిర్వహించిన సర్వే ప్రకారం ఏపీ‌లోని పలు జిల్లాల్లో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. పలు జిల్లాలలో అత్యధిక శాతం మందికి లక్షణాలు లేనప్పటికీ పరీక్షల్లో మాత్రం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. ముఖ్యంగా అనంతపురం, కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఇటువంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు సర్వేలో తేలింది.   ఈ సర్వే ప్రకారం అనంతపురం జిల్లాలో 99.5 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 92.8 శాతం, కృష్ణా జిల్లాలో 99.4 శాతం, నెల్లూరు జిల్లాలో 96.1 శాతం మందికి ఎటువంటి లక్షణాల్లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంతేకాకుండా కృష్ణా జిల్లాలోని జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో 22.3 శాతం మందికి కనీసం తెలియకుండానే వైరస్ వచ్చి దానంతట అదే తగ్గిపోయింది.   అయితే లక్షణాలు లేకున్నా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని 10 రోజులపాటు హోం క్వారంటైన్‌లో కానీ, ఐసోలేషన్ కేంద్రాల్లో కానీ ఉంచుతున్నట్టు వైద్యులు తెలిపారు. క్వారంటైన్‌లో ఉన్నపుడు ఏవైనా లక్షణాలు కనిపిస్తే మాత్రం మందులు ఇస్తామని, లేదంటే బలమైన ఆహారం తీసుకుంటే సరిపోతుందని వారో చెపుతున్నారు. వీరికి మళ్లీ కొవిడ్ టెస్టు కూడా అవసరం లేదని, అంతేకాకుండా 11వ రోజు నుంచి వీరు బయటకు కూడా వెళ్లొచ్చని... వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించదని స్పష్టం చేస్తున్నారు.

నీ సినిమాలు మీ వాళ్ళు మాత్రమే చూస్తారా.. హీరో రామ్ కు ఎమ్మెల్యే వంశీ సూటి ప్రశ్న

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై టాలీవుడ్ హీరో రామ్ చేసిన వ్యాఖ్యల పై తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. హీరో రామ్ విజయవాడ రమేశ్ ఆసుపత్రికి సంబంధించిన వ్యవహారంలో ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివాడని అయన విమర్శించారు. అయితే రామ్ సినిమాలు కేవలం అతని సామాజిక వర్గం వాళ్లే చూస్తారా? వేరే సామాజిక వర్గం వాళ్లు చూడరా? అని ప్రశ్నించారు. వేరే సామాజిక వర్గం వాళ్లను తన సినిమాలు చూడొద్దని రామ్ చెప్పగలడా? అంటూ వంశీ నిలదీశారు.    కొద్ది రోజుల క్రితం రామ్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. కులం అనే జబ్బు కరోనా కంటే వేగంగా వ్యాపిస్తుందని, ఇది కరోనా కంటే ప్రమాదకరమైనదని వ్యాఖ్యానించాడు. నిశ్శబ్దంగా విస్తరించే ఈ మహమ్మారి నుంచి దూరంగా ఉండాలని ప్రజలను కోరైనా సంగతి తెలిసందే.   ఇదే సందర్భంలో ఎమ్మెల్యే వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ సామాజిక వర్గానికి చంద్రబాబు ఒక్కడే నాయకుడు కాదని, గతంలో చాలామంది నాయకులు తమ వర్గం కోసం పనిచేశారని తెలిపారు. అసలు తమ సామాజిక వర్గానికి చంద్రబాబుతోనే పెద్ద ప్రమాదం ఉందని, చంద్రబాబు తనకున్న సమస్యలన్నింటినీ తన కులంపై రుద్దుతాడని విమర్శించారు.

కొన్ని క్షణాలలో నేను చనిపోతున్నా.. ఎవరు రావద్దు: శ్రీశైలం ప్రమాదంలో ఏఈ మోహన్ ఆఖరిమాటలు 

శ్రీశైలం విద్యుత్ కేంద్రం లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే వారు చనిపోయే ముందు తమ సహచరులను కాపాడే ప్రయత్నం చేస్తినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో తాము చనిపోతున్నామని తెలుసుకొని పవర్ ప్లాంట్ ను కూడ ఈ ప్రమాదం నుండి రక్షించేందుకు ప్రయత్నించారు. చివరి నిమిషంలో వారు తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. శ్రీశైలం విద్యుత్ కేంద్రం లో ప్రమాదం జరిగిన సమయంలో మంటలు మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఏఈ మోహన్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఇదే సందర్భంలో తన వద్దకు ఎవరూ రావొద్దని ఆయన కోరారు. అంతేకాకుండా అగ్ని ప్రమాదం సమాచారాన్ని మరో ఏఈ అనిల్ కు ఇస్తూ.. మంటలు తీవ్రంగా ఉన్నాయని మిగిలినవారంతా అప్రమత్తంగా ఉండి ప్లాంట్ నుండి బయటపడాలని అయన సూచించారు. మరో కొద్ది నిమిషాల్లో తాను చనిపోతున్నానని అనిల్ కు ఏఈ మోహన్ ఫోన్ లో చెప్పారు. అయితే దురదృష్టవశాతూ మంటలను తగ్గించే క్రమంలో మోహన్ మంటల్లోనే కాలిపోయారు.   ఇక మరో ఉద్యోగి ఉజ్మ ఫాతిమా పవర్ ప్లాంట్ ద్వారం వద్దకు కూడా చేరుకున్నారు. అయితే అమరాన్ కంపెనీ నుండి ఇద్దరు ఉద్యోగులు కొత్తగా బ్యాటరీలు బిగించేందుకు పవర్ ప్లాంట్ కు వచ్చారు. అయితే అమరాన్ ఉద్యోగులు ప్లాంట్ కు కొత్తవారు కావడంతో మళ్లీ వెనక్కు వెళ్లి వారిద్దరిని బయటకు పంపే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలోనే ఉజ్మా ఫాతిమా కూడ ఈ ప్రమాదంలో మరణించినట్టుగా తెలుస్తోంది. ప్లాంట్ లోని మరికొందరు అధికారులు కూడా ల్యాండ్ లైన్ ద్వారా చివరి నిమిషంలో తమ కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడి అగ్ని ప్రమాదం గురించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. 15 నిమిషాల్లో కనుక తాము బయటకు రాకపోతే చనిపోతామని అయితే పిల్లలను మాత్రం బాగా చదివించి ప్రయోజకులను చేయాలనీ వారు కుటుంబసభ్యులకు తెలిపారు.

రోహిత్ శర్మకు ఖేల్ రత్న.. తెలుగుతేజం సాయిరాజ్ కు అర్జున

క్రీడల్లో అత్యున్నతమైన అవార్డు రాజీవ్ ఖేల్‌రత్నకు అర్హత సాధించిన వారి జాబితాను కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ జాబితాలో క్రికెటర్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేష్ ఫోగట్, టెబుల్ టెన్నిస్ ఛాంపియన్ మనికా బాత్రా, 2016 పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు, హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్ ఉన్నారు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు అర్హత సాధించిన అభ్యర్థులకు అవార్డులను రాష్ట్రపతి అందజేయనున్నారు.    కాగా, క్రికెట్‌లో రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ టెండూల్కర్ 1998లో, అలాగే ధోని 2007లో, విరాట్ కోహ్లీ 2018లో రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు అందుకున్నారు.   అర్జున అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డు, ద్రోణాచార్య అవార్డులకు అర్హత సాధించిన వారి పేర్లను కూడా కేంద్రం ప్రకటించింది. అర్జున అవార్డుకు క్రికెటర్లు ఇషాంత్ శర్మ, దీప్తి శర్మ, అథ్లెట్ ద్యుతి చంద్, షూటర్ మను భాస్కర్‌తో పాటు మరో 27 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. అర్జున అవార్డు విజేతల్లో తెలుగుతేజం, బ్యాడ్మింటన్ యువ కెరటం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి కూడా ఉన్నాడు. సాత్విక్ సాయిరాజ్ డబుల్స్ లో ప్రపంచస్థాయిలో పదో ర్యాంకులో ఉండడం విశేషం. 

శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌ ప్రమాదంలో 9 మంది మృతి

శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. అగ్ని ప్రమాదంలో లోపల చిక్కుకున్న తొమ్మిదిమందీ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు తెలంగాణ జెన్‌ కో అధికారులు ప్రకటించారు. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు ప్లాంట్‌లో ఉన్నారు. 9 మంది దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. మరో 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. మృతుల వివరాలు: డీఈ శ్రీనివాస్ గౌడ్ (హైదరాబాద్) ఏఈ వెంకట్‌రావు (పాల్వంచ)  ఏఈ మోహన్ కుమార్ (హైదరాబాద్ ) ఏఈ ఉజ్మ ఫాతిమా (హైదరాబాద్) ఏఈ సుందర్ (సూర్యాపేట)  ప్లాంట్ అటెండెంట్ రాంబాబు (ఖమ్మం జిల్లా)  జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్ (పాల్వంచ)  హైదరాబాద్‌కు చెందిన అమర్ రాజా బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్ 

ఏపీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..!!

ఏపీ పాలిటిక్స్‌లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మొత్తం 16 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో సీబీఐతో పాటు సర్వీస్ ప్రోవైడర్లు ఉన్నారు. సీబీఐ, రిలయన్స్, జియో, వోడాఫోన్, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోషియేషన్ అధ్యక్షుడికి హైకోర్టు నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లో సమాధానాలు చెప్పాలని.. వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరుకావాలని వారికి ఆదేశాలిచ్చింది.    కాగా, జ‌డ్జిలపై నిఘా ఉంచార‌ని, ఫోన్స్ ట్యాప్ చేస్తున్నార‌ని మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌తో అడ్వ‌కేట్ శ్ర‌వ‌ణ్ కుమార్ దాఖ‌లు చేసిన పిటిషన్‌ ను చీఫ్ జస్టిస్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించిన సంగతి తెలిసిందే. అఫిడవిట్‌లో ఉన్న మీడియా కథనాన్ని చదివి వినిపించాలని హైకోర్టు కోరింది. ఐదుగురు జ‌డ్జిల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని, జ‌డ్జిల క‌ద‌లిక‌ల‌పై ఒక అధికారిని ప్రత్యేకంగా ప్ర‌భుత్వం నియ‌మించింద‌ని కోర్టుకు న్యాయవాది శ్రవణ్ విన్నవించారు. ఆ అధికారి ఎవరో చెప్పాలని, ఆధారాలు చూపాలని ధర్మాసనం అడగగా.. తాను అధికారి పేరుతో అఫిడవిట్ దాఖలు చేస్తానని న్యాయవాది శ్రవణ్ చెప్పారు. అన్ని వివరాలతో అఫిడవిట్‌ను ఫైల్ చేయాలని శ్రవణ్‌ ను హైకోర్టు ఆదేశించింది. అలాగే, ఈ మొత్తం అంశంపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కూడా హైకోర్టు ఆదేశించింది.   హైకోర్టు ఆదేశించిన నేపధ్యంలో తాజాగా న్యాయవాది శ్రవణ్ కుమార్ అనుబంధ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ అనుబంధ అఫిడవిట్‌లో ప్రభుత్వం ప్రత్యేకంగా ట్యాపింగ్ కోసం నియమించిన అధికారి పేరును, అలాగే కొంత మంది సర్వీస్ ప్రొవైడర్ల వద్ద నుంచి కాల్ డేటాను ఎలా సేకరించారో వివరించే ఆధారాలను సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలను పరిశీలించిన ధర్మాసనం.. 16 మందికి నోటీసులు జారీ చేసింది.   న్యాయవాది శ్రవణ్ కుమార్ అఫిడవిట్‌ లో ఏం చెప్పారన్న విషయం బయటకు రాకపోయినప్పటికీ.. ఆయన సమర్పించిన వివరాలతో.. హైకోర్టు 16 మందికి నోటీసులు ఇవ్వడంతో ఆధారాలు బలంగానే ఉండి ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, నాలుగు వారాల తర్వాత కేసు విచారణకు రానుంది. అప్పుడు విచారణ కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది.

ప్రజల నుంచి ఎన్టీఆర్ ను దూరం చేయడం మీ తరం కాదు

గుంటూరు జిల్లా తెనాలిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలగొడితే కూలిపోవడానికి, ధ్వంసంచేస్తే ధ్వంసమైపోవడానికి ఆయన విగ్రహం కాదు ప్రజల మనస్సులో కొలువైన దైవం అని పేర్కొన్నారు.    స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహాలు లేకుండా చేయడం ద్వారా ప్రజలకు ఆయన్ని దూరం చేయగలమని సైకో మనస్తత్వంతో ఉన్న వైఎస్ జగన్, వైసీపీ నాయకులు అనుకుంటున్నారని విమర్శించారు. ప్రజల నుంచి ఎన్టీఆర్ ను దూరం చేయడం మీ తరం కాదని అన్నారు. తెనాలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి రాక్షస ఆనందం పొందిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలి అని లోకేష్ డిమాండ్ చేశారు. కాగా, గత కొంతకాలంగా ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్న, తొలగిస్తున్న ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల నెల్లూరు జిల్లాలోని కావలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడంపై తీవ్ర దుమారం రేగింది. అధికార పార్టీపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ సహా ఇతర  టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే.. బాలకృష్ణకు ఫోన్ చేసి, తానూ ఎన్టీఆర్ అభిమానినేనని, విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.   నిజానికి కావలిలో ఎన్టీఆర్‌ విగ్రహాం తొలగింపుపై పలువురు వైసీపీ నేతలు సైతం ఆవేదనకు గురయ్యారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై మనస్తాపానికి గురై వైసీపీ సీనియర్ నాయకుడు కండ్లగుంట మధుబాబు నాయుడు, కావలి మాజీ కౌన్సిలర్ గంగినేని పద్మావతి వంటి నాయకులు పార్టీకి రాజీనామా చేశారు.   కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఎన్టీఆర్‌ ని అభిమానించే వాళ్ళు ఎందరో ఉంటారు. ఆ విషయాన్ని మరిచి కొందరు ఎన్టీఆర్ విగ్రహాల్ని ధ్వంసం చేయడం, తొలిగించడం వంటివి చేసి విమర్శలు పాలవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

శ్రీశైలం ప్రమాదంపై సీఐడీ విచారణకు సీఎం ఆదేశం

శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. విచారణాధికారిగా సీఐడీ అడిషనల్‌ డీజీపీ గోవింద్‌సింగ్‌ ‌ను నియమించారు. ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు రావాలని చెప్పారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ ను విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.   శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని ర‌క్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.   కాగా, ప్రమాదంలో 9 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే, ఏఈ సుందర్‌ నాయక్‌ (35) మృతదేహాన్ని రెస్క్యూ బృందం గుర్తించింది. మిగతా 8 మంది కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. అలాగే ఈ ప్రమాదంలో పలువురు గాయాలపాలయ్యారు.