చార్టెడ్ ఫ్లైట్‌లో లంగ్స్
posted on Aug 17, 2020 @ 6:13PM
పుణే నుంచి హైదరాబాద్‌కు గంటా ఇరవై నిమిషాల్లో
బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి నుంచి సేకరించిన లంగ్స్ ను హైదరాబాద్ కిమ్స్ హార్ట్ అండ్ లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ ఇనిస్టిట్యూట్ లో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చేందుకు చార్టెడ్ ఫ్లైట్‌లో లంగ్స్ తరలించారు. పుణే నుంచి హైదరాబాద్‌కు గంటా ఇరవై నిమిషాల్లో చేరుకునేలా ఎయిర్ ఫోర్స్ అధికారులు, పోలీసులు సహకరించారు.
పుణేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. ఆ వ్యక్తి కుటుంబసభ్యులు మానవత్వంతో అవయవదానం చేసి మరో నలుగురి ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవన్‌దాన్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. దాంతో పూనేలో మరణించిన వ్యక్తి లంగ్స్ హైదరాబాద్ లోని వ్యక్తికి అమర్చడానికి జీవన్‌ధాన్ డాక్టర్ స్వర్ణలత, పుణేలో జడ్‌టీసీసీ సెంట్రల్ కో–ఆర్డినేటర్ ఆర్తిగోఖలే సమాయత్తం అయ్యారు. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి నుంచి సర్జరీ ద్వారా లంగ్స్ సేకరించారు. పుణే ఆస్పత్రి నుంచి ఎయిర్‌పోర్టు వరకు అక్కడి ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు.
అప్పటికే ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉన్న చార్టెడ్ ఫ్లైట్‌లో లంగ్స్ తో బయలుదేరిన వైద్యసిబ్బంది బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. హైదరాబాద్ నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ ఆదేశాల మేరకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వరకు బేగంపేట ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. అప్పటికే సమాచారం అందడంతో కిమ్స్ వైద్యుల బృందం లంగ్స్ అవసరమైన వ్యక్తిని సర్జరీకి సిద్దం చేశారు. దాదాపు ఎనిమిది గంటల సర్జరీ తో ఆ వ్యక్తికి ఊపరితిత్తులను అమర్చుతారు.
నిర్ణీత సమయంలో అవయవాలు అమర్చడానికి సహకరించిన విమాన ఆధికారులకు, పోలీస్ అధికారులకు ఆపరేషన్ అవసరం అయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.