మాట్లాడుకుందామని .. బీర్ బాటిల్ తో పొడిచి..

వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారు.. ఆ ప్రేమలో ఉన్నన్ని రోజులు కలిసి తిరిగారు.  అంతలో ఏమైందో తెలియదు.. ప్రేమలో ఉన్నపుడు తప్పులు కనిపించవు నేటి తరం యువతి యువకులకు. ఒక్కోసారి నేను ప్రేమించిన అమ్మాయి నాకు తప్ప మరెవ్వరికీ దక్కకూడదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తను ప్రేమించిన అమ్మాయి ఎక్కడ ఉన్న, ఎవరితో ఉన్న హ్యాపీ గా ఉండాలి అనుకోవాలి గానీ.. నేను ప్రేమించిన అమ్మాయి నాకే దక్కాలి అనడంలో మూర్ఖత్వం తప్ప మరొకటి లేదు. తాజాగా  పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు తన ప్రేమించిన యువతిపై బీరు సీసాతో అతి దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. మాట్లాడుదాం రా.. అని చెట్ల పొదల్లోకి పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అది నాగార్జున సాగర్.  గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన చందన (20), అనుముల మండలం కోరిమోనిగూడెనికి చెందిన శంకర్ (19) గత కొంత కాలంగా ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. వరికోత మిషన్ డ్రైవర్‌గా పని చేస్తున్న శంకర్.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాట్లాడేది ఉంది రమ్మంటూ చందనను సాగర్‌లోని పాత శివమ్ హోటల్ రప్పించాడు. ఆమెను ఆ హోటల్ వెనుక భాగం కొంత దూరం తీసుకెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని శంకర్ కోరడంతో చందన నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి యువతిని బీరు సీసాతో పొడిచి, బండరాయితో మోది దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన చందన ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె హతమైన తర్వాత శంకర్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ హత్యపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.

అప్పుడు సుధాక‌ర్‌.. ఇప్పుడు ర‌ఘురామ‌.. రాజ్యం ప‌గ‌బ‌డితే...

డాక్ట‌ర్ సుధాక‌ర్‌. విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నంలోని ప్ర‌భుత్వ‌ వైద్యులు. ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. న‌ర్సాపురం పార్ల‌మెంట్ స‌భ్యులు. వీరిద్ద‌రికి ఎలాంటి సంబంధం లేదు. వీరిద్ద‌రికీ ఒక‌రికి ఒక‌రు ప‌రిచ‌యం లేదు. ఒక‌రు ప్రభుత్వ వైద్యులు. మ‌రొక‌రు గౌర‌వ పార్ల‌మెంట్ స‌భ్యులు. అయినా.. ఓ విష‌యంలో మాత్రం వీరిద్ద‌రూ బాధితులే. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వానికి ఎదురు మాట్లాడితే.. స‌ర్కారు త‌ప్పుడు విధానాల‌ను త‌ప్పు అని చెబితే.. ముఖ్య‌మంత్రికి భ‌జ‌న చేయ‌కుండా.. స‌మ‌స్య‌లు సీఎం దృష్టికి తీసుకొస్తే.. ఎట్టా ఉంటాదో చెప్ప‌డానికి నిద‌ర్శ‌నం ఈ ఇద్ద‌రు.  ఆసుప‌త్రిలో స‌మ‌స్య‌లు ఎత్తిచూపిన పాపానికి.. డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను విధుల నుంచి స‌స్పెండ్ చేసి.. పిచ్చివాడిగా ముద్ర వేసి.. మెంట‌ల్ హాస్పిట‌ల్‌కు పంపించి.. శారీర‌కంగా, మాన‌సికంగా వేధించి.. చుక్కలు చూపించింది జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు. ఏడాదికి పైగా అనుభ‌విస్తున్న మ‌నోవేధ‌న‌తోనే డాక్ట‌ర్ సుధాక‌ర్‌ గుండె ఆగి చ‌నిపోయాడని అంటున్నారు.  ర‌ఘురామ‌ను సైతం అదే విధంగా చేయాల‌నుకున్నారేమో! రాజ‌ద్రోహానికి పాల్ప‌డుతున్నాడంటూ నాన్‌బెయిలబుల్ కేసు పెట్టి.. గుంటూరు జైలులో కుక్కారు. జైల్లోనే ర‌ఘురామ‌ను హ‌త్య చేసేందుకు కుట్ర చేశారంటూ స్వ‌యంగా ర‌ఘురామ స‌తీమ‌ణి ర‌మాదేవి ఆరోపించడం క‌ల‌క‌లం రేపింది. కానీ, డాక్ట‌ర్ సుధాక‌ర్‌లా.. ఎంపీ ర‌ఘురామ అమాయ‌కుడు కాదు. బ‌ల‌మైన నాయ‌కుడు. రాజ్యంతో తుద‌కంటూ పోరాడ‌గ‌ల స‌త్తా ఆయ‌న సొంతం. అందుకే, సుప్రీంకోర్టుకు వెళ్లి మ‌రీ.. బెయిల్ తెచ్చుకున్నారు. జ‌గ‌న్‌రెడ్డి క‌బంధ హ‌స్తాల నుంచి బ‌య‌ట‌ప‌డ్డారని చెబుతున్నారు. డాక్ట‌ర్ సుధాక‌ర్ మృతి చెంద‌డం.. ర‌ఘురామకు బెయిల్ రావ‌డం.. ఈ రెండూ ఒకేరోజు జ‌ర‌గ‌డం కాక‌తాళీయ‌మే. సంద‌ర్భం కుదిరింది కాబ‌ట్టే ఇప్పుడంతా సుధాక‌ర్‌, ర‌ఘురామ గురించి చ‌ర్చించుకుంటున్నారు. గతేడాది కరోనా రోగులకు సేవలు అందించిన డాక్టర్ సుధాకర్ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, ప్రభుత్వాధికారులు ఎవరూ తమకు సహకరించడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ప్రభుత్వం సుధాకర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై డాక్టర్‌ సుధాకర్‌ తీవ్ర మనస్తాపం చెందారు. వైద్యులకు వసతులు లేవని చెప్పడంతో తనపై కక్షగట్టి సస్పెండ్‌ చేశారని ఆరోపించారు.  గత ఏడాది మే నెలలో విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం వద్ద జాతీయ రహదారిపై గలాటా సృష్టిస్తున్నారంటూ డాక్టర్‌ సుధాకర్‌ను నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను ఆ సమయంలో కొట్టడం, చేతులు విరిచికట్టడంపై.. తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఆ వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.డాక్దర్ సుధాకర్ కు మతిస్థిమితం లేదంటూ పోలీసులు ఆయనను మానసిక వైద్యశాలకు తరలించారు. దీనిపై దళిత నాయకులు కోర్టును ఆశ్రయించడంతో సీబీఐతో విచారణ చేయించారు. కోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించడం అప్పట్లో సంచలనమైంది. త్వరలోనే ఈ కేసులో తీర్పు రావాల్సి ఉండగా అంతలోనే ఆయన మరణించారు. కాగా సుధాకర్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో చ‌నిపోయిన‌ట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను ప్ర‌భుత్వం టార్చ‌ర్ చేసిన తీరును.. ఎంపీ రఘురామ‌ను స‌ర్కారు కేసుల‌తో వేధిస్తున్న వైనాన్ని.. పోల్చి చూస్తున్నారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించినందుకు వారిద్ద‌రికి ఎదురైన చేదు అనుభ‌వాల‌ను ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. చిన్న విమ‌ర్శ‌నే భ‌రించ‌లేక‌.. సుధాక‌ర్‌ను టార్చ‌ర్ చేయ‌డంతో.. ఆయ‌న గుండెపోటుతో మ‌ర‌ణించే వ‌ర‌కూ వ‌చ్చింది. గుండె ఆప‌రేష‌న్ అయిన ర‌ఘురామ‌ను అరెస్ట్ చేయ‌డం.. ఆయ‌న ఆరోపిస్తున్న‌ట్టు క‌స్ట‌డీలో తీవ్రంగా కొట్ట‌డం.. జైల్లో మూసేయాల‌ని చూసిన ప్ర‌భుత్వ బ‌రితెగింపు విధానాల‌ను తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు ప్ర‌జాస్వామ్య‌వాదులు.  సీబీఐ కేసు ఇంకా కొన‌సాగుతుండ‌గానే డాక్ట‌ర్ సుధాక‌ర్ మృతి చెందారు. ర‌ఘురామ‌ను క‌స్ట‌డీలో కొట్ట‌డంపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాలంటూ ఆయ‌న కుమారుడు సుప్రీంకోర్టులో కేసు దాఖ‌లు చేశారు. మ‌రోవైపు, జ‌గ‌న్‌కు బెయిల్ ర‌ద్దు చేయాలంటూ ర‌ఘురామ సీబీఐ కోర్టులో వేసిన పిటిష‌న్‌పై వేగంగా విచార‌ణ జ‌రుగుతోంది. ఇలా డాక్ట‌ర్ సుధాక‌ర్‌, ఎంపీ ర‌ఘురామ‌ల ఉదంతాల‌కు కార‌ణం జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ క‌క్ష సాధింపు చ‌ర్య‌లేన‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. కోర్టులు, తీర్పులు ఎలా ఉన్నా.. ఈ రెండు కేసులూ స‌ర్కారు చేసిన‌ కుట్ర‌, కుతంత్రాల ఫ‌లిత‌మేన‌నేది ప్ర‌జ‌ల అభిప్రాయం. అందుకే, ప్ర‌జాకోర్టులో దోషిగా నిల‌బ‌డుతోంది జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు.  

కరోనా మరణాలపై WHO షాకింగ్ రిపోర్ట్.. 

ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని షేక్ చేస్తోంది కరోనా మహమ్మారి. ప్రస్తుతం వైరస్ సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.  సెకండ్ వేవ్ తో భారత్ అల్లాడిపోతోంది. 18 నెలల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా శనివారం ఉదయం వరకు అధికార లెక్కల ప్రకారం 16 కోట్ల 64 లక్షల మంది వైరస్ భారీన పడ్డారు. ఇప్పటి వరకు 34 లక్షల మందికి పైగా చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మరణాలపై షాకింగ్ విషయం వెల్లడించింది. వివిధ దేశాలు ఇస్తున్న లెక్కల కంటే రెండింతలు ఎక్కువగానే కరోనాతో జనాలు చనిపోయారని అంచనా వేసింది. కరోనాతో ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగానే చనిపోయారని అభిప్రాయపడుతోంది. మొదటి వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని, ఈ సంవత్సరం మరణాల సంఖ్య భారీగా పెరిగిందని వెల్లడించింది.  గత ఏడాది డిసెంబర్ 31 వరకు 18 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే చ‌నిపోయార‌ని ప్ర‌పంచ దేశాల గ‌ణాంకాలు తెలుపుతున్నాయి. అయితే గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయి ఉంటార‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది. ఆయా దేశాలు మృతుల సంఖ్య‌ను త‌క్కువ చేసి చూపించాయ‌ని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఆయా దేశాలు వెల్ల‌డించిన గ‌ణాంకాల కంటే 12 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు అధికంగా సంభ‌వించి ఉండ‌వ‌చ్చ‌ని తెలిపింది.  కరోనా సోకి చికిత్స పొందుతూ మరణించిన వారితో పాటు పాజిటివ్‌గా వ‌చ్చి ఇళ్ల‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి గ‌ణాంకాల‌నే ప్ర‌పంచ దేశాలు న‌మోదు చేశాయ‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. క‌రోనా నిర్ధారణ సరిగా జరగకముందే మృతి చెందిన వారు చాలా మంది ఉన్నార‌ని, ఆ మృతుల సంఖ్య‌ను లెక్కల్లోకి తీసుకోలేదని వివ‌రించింది.  క‌రోనా సోక‌వ‌డం వ‌ల్ల మాత్ర‌మే కాకుండా ఆ సంక్షోభం కార‌ణంగా త‌లెత్తిన ప‌రిణామాల వ‌ల్ల కూడా చాలా మంది మృతిచెందార‌ని డ‌బ్ల్యూహెచ్‌వో తెలిపింది. మే 22 శనివారం వరకు ఇండియాలో 2 కోట్ల 62 లక్షల మందికి పైగా కరోనా సోకగా.. 2 లక్షల 95 వేల మంది చనిపోయారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే అనధికారిక లెక్కల ప్రకారం ఇదీ డబుల్ ఉంటుందని చెబుతున్నారు.   

ఆనందయ్యతో అమెరికా డీల్? 

దేశ వ్యాప్తంగా చర్చగా మారింది కృష్ణపట్నం ఆనందయ్య కరోనా ఆయుర్వేద ఔషదం. కరోనాను నయం చేస్తుందన్న ప్రచారంతో ఏపీతో పాటు పలు రాష్ట్రాల నుంచి జనాలు కృష్ణపట్నం వస్తున్నారు. తాకిడి పెరగడంతో పోలీసులు మందు పంపిణిని నిలిపివేశారు.  ప్రభుత్వం పంపిణీ నిలిపివేయడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కరోనా మందు పంపిణిని ఆపేయడంపై జనాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఆయుర్వేద వైద్యుడు బొణిగె ఆనందయ్య గురించి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ‘‘ఎయిర్ ఫోర్స్ వన్‌లో కృష్ణపట్నానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, శాస్త్రవేత్త డాక్టర్ ఫౌసీ బయలు దేరారని తెలిసింది. ఆనందయ్యతో డీల్ కుదుర్చుకోవడానికై అయ్యిండొచ్చు.. అంటూ ట్విటర్‌లో సెటైరిక్ పోస్టు పెట్టారు రాంగోపాల్ వర్మ. అంతేకాదు ఆనందయ్య  కిడ్నాప్ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించి, సైనిక భద్రత కల్పించొచ్చు కదా’’ అంటూ ఆర్జీవీ మరో ట్వీట్ చేశారు.  కరోనాకు ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ఆయన భద్రతపై ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కార్పొరేట్ శక్తులతో జాగ్రత్తగా ఉండాలని.. ఆయనను అణగదొక్కే అవకాశం ఉందని రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ట్వీట్ సామాజికమాధ్యమాల్లో రచ్చ చేస్తోంది. ఆర్డీవీ ట్వీట్లకు నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. ఆనందయ్యకు మెడికల్ మాఫియా నుంచి ముప్పు ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు.   మరోవైపు కృష్ణపట్నం గ్రామానికి కరోనా మందు కోసం పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. ఆనందయ్య లేకపోవడంతో ఆయన ఇంటి దగ్గరే పడిగాపులు పడుతున్నారు. గ్రామానికి చెందిన కొందరు మందు స్టాకు చేసి బహిరంగంగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇంకొందరు వారు తయారుచేసిన మందుని ఆనందయ్య మందుగా చెబుతూ మోసాలకు పాల్పడుతున్నారు. మందు కోసం వచ్చే వారి నుంచి వేలకి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. తన సొంత డబ్బుతో మందు తయారుచేసి వేల మందికి ఉచితంగా ఆనందయ్య పంపిణీ చేస్తున్నారు. ఆనందయ్యకి కొందరు వ్యక్తులు చెడ్డపేరు తెస్తున్నారనే గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

విశాఖ ఉక్కుని తుక్కు రేటుకి కొట్టేసే కుట్ర! సీఎం జగన్ పై లోకేష్ ఫైర్

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం వంద రోజులకు చేరింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా గత 100 రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు పోరాడుతున్నారు. రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలతో కార్మికులు తమ నిరసన కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమం జరుగుతోంది. విపక్ష పార్టీలు ఉద్యమానికి మద్దతు తెలిపాయి. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తోంది.  విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయ ప్రతిపాదనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 64 గ్రామాల ప్రజలు 26 వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన ఫలితమే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ . లక్షలాది మందికి ఉపాధి.ఉత్తరాంధ్రాలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కర్మాగారాన్ని విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ‘విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు’ అంటూ ప్రాణాలు అర్పించి కర్మాగారాన్ని సాధించుకున్నామని, ఆ విధంగానే ప్రాణాలు ఒడ్డయినా ప్లాంటును రక్షించుకుంటామని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే దీనికోసం ఉద్యమం నడుపుతామని రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్నాయి. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుతో ఉత్తరాంధ్ర ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంది. స్టీల్‌ ప్లాంటు అనగానే మాతృ సంస్థగా, అందరికీ ఉపాధి కల్పించేదిగా అభిమానిస్తారు. అక్కడ తయారైన స్టీల్‌నే గృహ నిర్మాణానికి ఉపయోగించడం సెంటిమెంట్‌గా భావిస్తారు. కర్మాగారంలో శాశ్వత ఉద్యోగులు 17 వేల మంది వరకు ఉండగా, కాంట్ర్టాక్టు కార్మికులుగా మరో 20 వేల మంది వరకు పనిచేస్తున్నారు. దీనికి అనుబంధంగా ఏర్పాటైన వందలాది చిన్న తరహా పరిశ్రమలపై మరో లక్ష మంది వరకు ఆధారపడి జీవిస్తున్నారు. విశాఖలో అన్నిరకాల వ్యాపారాల్లోను స్టీల్‌ ప్లాంటు ఉద్యోగుల లావాదేవీలు అధమంగా పది శాతం ఉంటాయి. నెలకు ఎలా లేదన్నా రూ.200 కోట్లు స్టీల్‌ ప్లాంటు నుంచి విశాఖ మార్కెట్‌లోకి వస్తుంది. అటువంటి సంస్థను ప్రైవేటుపరం చేస్తే...విశాఖలో ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయనే అందోళన వ్యక్తమవుతోంది.  విశాఖ ఉక్కు  ఉద్యమం 100 వ రోజుకి చేరిన నేప‌థ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శలు గుప్పించారు. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గత 100 రోజులుగా పోరాటం చేస్తున్న కార్మికులకు ఉద్యమాభివందనలు. విశాఖ ఉక్కు ని తుక్కు రేటుకి కొట్టేసి కార్మికుల ఊపిరి తియ్యాలని వైఎస్ జ‌గ‌న్ కుట్రలు చేస్తుంటే దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసి కరోనా రోగులకు ఊపిరి పోశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు' అని నారా లోకేశ్ ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. 'ఇప్పటికైనా రాష్ట్రంలో దొంగ తీర్మానాలు, ఢిల్లీలో పాదసేవ మాని చిత్తశుద్ధితో ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం పోరాడాలి. ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది' అని నారా లోకేశ్ స్ప‌ష్టం చేశారు. 

ఉక్కుసంక‌ల్పం.. 100 డేస్ ఉద్య‌మం.. కేంద్రం దిగొచ్చేనా?

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హ‌క్కు. ద‌శాబ్దాల క్రితం సాధించుకున్న ప‌రిశ్ర‌మ‌. ఏళ్లుగా ల‌క్ష‌లాదిమందికి ఉపాధి క‌ల్పిస్తున్న కంపెనీ. విశాఖ‌తో ఉక్కు క‌ర్మాగారం బంధం విడ‌దీయ‌లేనిది. ఇప్పుడు ఉన్నట్టుండి విశాఖ ఉక్కు మీది కాదంటే ఎలా?  ప్రైవేటుకు అమ్మేస్తామంటే ఊరుకుంటారా? అందుకే, కార్మికులు, స్థానికులు విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున దీక్ష‌లు, ధ‌ర్నాలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై కేంద్రం పార్ల‌మెంట్‌లో నిర్ణ‌యం ప్ర‌క‌టించిన వెంట‌నే.. విశాఖ‌లో ఉద్య‌మం వెల్లువెత్తుంది. కేంద్ర నిర్ణ‌యాన్ని వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాలంటూ కార్మికులు నిర‌హార దీక్ష‌లకు కూర్చొన్నారు. ధ‌ర్నాలు, రాస్తారోకోలు, బంద్‌ల‌తో ఉక్కు ఉద్య‌మం హోరెత్తింది.  క‌ట్ చేస్తే, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి నేటికి వంద రోజులు. విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో గడిచిన 100 రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తోంది.  కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ స్టీల్ ప్లాంట్ ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద‌ ఉక్కు ప‌రిరక్ష‌ణ, కార్మిక సంఘ నేత‌లు నిర‌స‌న  తెలుపుతున్నారు. నిర‌స‌న‌కు సీపీఎం, సీపీఐ, టీఎన్‌టీయూసీ మ‌ద్ద‌తు తెలిపాయి. రాష్ట్ర‌ ఎంపీలంద‌రూ క‌లిసి ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్ర‌భుత్వ రంగంలోనే కొన‌సాగించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల‌ని ప‌రిర‌క్ష‌ణ స‌మితి నేత‌లు కోరుతున్నారు.  కేంద్ర ప్రభుత్వం త‌న నిర్ణ‌యాన్ని ఉప సంహ‌రించుకునే వ‌ర‌కూ ఉద్య‌మాన్ని ఆప‌బోమ‌ని నిర్వాసిత గ్రామాల ప్ర‌జ‌లు చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయ‌డం ప‌ట్ల కార్మికులు, నిర్వాసితులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.   ఇంత‌గా ఉద్య‌మిస్తున్నా.. కేంద్రంలో ఉలుకుప‌లుకూ లేదు. ప్ర‌స్తుత కొవిడ్ క‌ల్లోల స‌మ‌యంలో దేశానికి ట‌న్నులకు ట‌న్నులు ఆక్సిజ‌న్ అందిస్తూ.. క‌రోనా బాధితుల ప్రాణాలు నిలుపుతున్న విశాఖ ఉక్కు కంపెనీపై స‌ర్కారుకు ఎందుకంత చిన్న‌చూప‌ని ప్ర‌శ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గ‌నులు కేటాయిస్తే స‌రిపోతుంది.. వెంట‌నే భారీ లాభాలు ఆర్జించిపెడుతుంది.. కావ‌ల‌సినంత ఆక్సిజ‌నూ అందిస్తుంది.. విశాఖ ఉక్కుతో స‌మ‌స్య ఉండుంటే.. దానికి ప‌రిష్కార‌మూ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అది వ‌దిలేసి.. మేము నిర్ణ‌యం తీసేసుకున్నాం.. విశాఖ ఉక్కును పోస్కోకు అమ్మేస్తున్నాం.. అన్న‌ట్టు మొండిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంపై కార్మికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  రాష్ట్ర ప్ర‌భుత్వ తీరుపైనా ఉక్కు కార్మికులు మండిప‌డుతున్నారు. పైపై ప్ర‌క‌ట‌న‌లు, ఉత్తుత్తి చ‌ర్య‌లు మిన‌హా.. స్టీల్ ప్లాంట్ కోసం జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు గ‌ట్టిగా పోరాడ‌టం లేద‌ని అంటున్నారు. జ‌గ‌న్‌కు చెప్పే.. విశాఖ‌ను ప్రైవేటైజేష‌న్ చేస్తున్నామ‌ని కేంద్రం స్ప‌ష్టంగా ప్ర‌క‌టించినా.. త‌న‌కేం సంబంధం లేద‌న్న‌ట్టు సీఎం జ‌గ‌న్ మాట్లాడ‌టాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. పోస్కో కంపెనీ యాజ‌మాన్యంతో జ‌గ‌న్‌రెడ్డి ర‌హ‌స్య ఒప్పందం కుదుర్చుకున్నార‌ని.. పెద్ద ఎత్తున క్విడ్ ప్రోకో న‌డిచింద‌ని.. విప‌క్షం ఆరోపిస్తోంది. జ‌గ‌న్ స‌ర్కారు స‌హ‌కారంతోనే కేంద్రం విశాఖ ఉక్కును అడ్డ‌గోలుగా అమ్మేస్తోంద‌ని అంటున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా.. ఇప్ప‌టికే 100 రోజులుగా దీక్ష‌లు చేస్తున్నారు.. లెక్క ఎక్కువైనా ప‌ర్లేదు.. త‌గ్గేదే లే.. అంటున్నారు విశాఖ‌ ఉక్కు మ‌నుషులు.

ఒక టీ.. అది 100 సార్లు

ఓ వైపు కరోనా వైరస్. మరో వైపు లాక్ డౌన్. ఇంకో వైపు ఆర్థిక ఇబ్బందులు. ఇంకో వైపు తీరని వాంఛలు. చాలా మంది ఉండటానికి గూడు లేక, తినదానికి తిండిలేక, వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక సతమతమవుతున్నారు. ఇంకొంత మంది తిన్నది అరగక వెక్కిలి పనులు చేస్తున్నారు. మరీ కొంతమంది మృగాళ్ల మనస్తత్వం మారడంలేదు. మహిళలను లైంగికంగా వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. తాజాగా ఓ యువతికి టీ లో మత్తు మందు ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, అనంతరం వీడియోలతో బెదిరిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓపెన్ చేస్తే.. సోషల్ మీడియా ద్వారా ఓ 35 ఏళ్ళ వ్యక్తికి, 24 ఏళ్ళ యువతి  పరిచయమైంది. కొద్దీ రోజులకే ఆ పరిచయం స్నేహం గా మారింది. ఈ క్రమంలోనే ఒకరోజు యువతిని తన ఇంటికి అహ్వాహించాడు సదరు వ్యక్తి.. ఇంట్లోకి రాగానే తన భార్య ఇప్పుడే గొడవపడి బయటకు వెళ్లిందని కాకమ్మకబుర్లు చెప్పాడు. కొద్దీ సేపటితర్వాత అతిధి మర్యాదగా యువతికి టీ ఇచ్చాడు. ఆ టీ తాగిన యువతి  మత్తులోకి జారుకోగానే ఆమెపై అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆ దృశ్యాలను తన ఫోన్ లో బంధించాడు. మెలుకువ వచ్చి విషయం తెలుసుకున్న యువతి  పారిపోవడానికి ప్రయత్నించింది. తన గురుంచి బయటికి చెప్తే తన నగ్న వీడియోలోను  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన యువతి బాధతో ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వీడియోను అడ్డంపెట్టుకొని అనేక సార్లు యువతిపై లైంగికదాడి చేశాడు. కొన్నిసార్లు మళ్లీ వీడియో తీసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇక ఈ వేధింపులు తట్టుకోలేని యువతి  మొత్తం విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వారి సాయంతో పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేసింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుండి ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ లో యువతితో పాటు మరికొంతమంది యువతుల వీడియోలను చూసి షాక్ అయ్యారు. ఈ దారుణ ఘటన ముంబై మహానగరంలో వెలుగుచూసింది

ఫోన్‌లోనే ప‌ల్స్ ఆక్సీమీట‌ర్‌.. క‌రోనా స్టార్ట‌ప్‌..

క‌రోనా ప్రాణాలు తోడేస్తోంది. ఉన్న‌ట్టుండి ఊపిరి తీసేస్తోంది. రిక‌వ‌రీ రేటు భారీగానే ఉంటోంది. అయినా.. కొవిడ్‌ సోకితే ఏదో తెలియ‌ని భ‌యం. ఊపిరి ఆడ‌టం లేద‌నే ఆందోళ‌న‌. ఆక్సిజ‌న్ రేటు ప‌డిపోయిందేమోన‌నే అనుమానం. క‌రోనా సోకితే.. ఎప్ప‌టిక‌ప్పుడు ఆక్సిజ‌న్ లెవెల్స్ చెక్ చేసుకోవాలంటూ డాక్ట‌ర్లు ప‌దే ప‌దే సూచిస్తున్నారు. ప్రాణ‌వాయువు 95కి త‌గ్గితే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని.. ఇక 90కి ప‌డిపోతే వెంట‌నే హాస్పిట‌ల్‌లో చేరాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి, ఆక్సిజ‌న్ లెవెల్స్ చెక్ చేసుకోవ‌డం కోసం ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ కొందామంటే కాస్త ఖ‌రీదు ఎక్కువే. మార్కెట్లో అందుబాటూ త‌క్కువే. ఇలాంటి ఇబ్బందులు ఇక మీద‌ట అవ‌స‌రం లేదు. జ‌స్ట్‌.. ఇంట్లో ఉండే మీ మొబైల్ ఫోన్‌లో ఆక్సిజ‌న్ స్థాయిలు తెలుసుకోవ‌చ్చు. చాలా సింపుల్‌.. ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే స‌రి. ‘కేర్‌ప్లిక్స్‌ వైటల్స్‌ యాప్‌’. ఫోటో ప్లెథిస్మోగ్రఫీ టెక్నాలజీతో, కృత్రిమ మేధ సాయంతో కేర్‌ప్లిక్స్‌ వైటల్స్‌ యాప్‌ పనిచేస్తుంది. సాధారణంగా ఆక్సీమీటర్లలో ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌ సెన్సార్లు ఉంటాయి. కానీ ఈ యాప్‌లో కేవలం ఫోన్‌లోని ఫ్లాష్‌ ఆధారంగా ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను తెరచి ఫోన్‌ ఫ్లాష్‌లైట్‌ ఆన్‌ చేసి వెనుక కెమెరాపై వేలిని ఉంచాలి. తర్వాత స్కాన్‌ అనే బటన్‌ను నొక్కగానే 40 సెకన్లలో ఆక్సిజన్‌, పల్స్‌, శ్వాసక్రియ రేట్లను యాప్‌లో చూపిస్తుంది.  ఇప్ప‌టికే ఈ ప‌ని తీరుపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. అందులో ఈ యాప్‌ 96 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైందని.. ఈ యాప్‌ను త‌యారు చేసిన కోల్‌క‌తా కేంద్రంగా ప‌ని చేస్తున్న‌.. కేర్ నౌ హెల్త్‌కేర్ అనే అంకుర సంస్థ వెల్ల‌డించింది.   ‘కేర్‌ప్లిక్స్‌ వైటల్స్‌ యాప్‌’ ప్రస్తుతం ఐవోఎస్‌ వినియోగదారుల కోసం యాప్‌స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం అయితే వెబ్‌సైట్‌లో ఏపీకేను అందుబాటులోకి ఇచ్చారు. త్వరలో ప్లే స్టోర్‌లోకి తీసుకురానున్నారు. సింగిల్‌ యూజర్‌ వినియోగం కోసం యాప్‌ను ఉచితంగా అందిస్తున్నారు. అంతకుమించి ఎక్కువ మందికి సేవలు కావాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మిగ‌తా వివ‌రాలు కేర్‌నౌ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

చికిత్స కోసం యశోద.. ప్రచారం కోసం గాంధీ! 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే గాంధీ హాస్పిటల్ ను పరిశీలించారు. కొవిడ్ వార్డుల్లోకి కూడా వెళ్లారు. కొవిడ్ రోగులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గాంధీ హాస్పిటల్ కు వెళ్లడం ఇదే మొదటి సారి. కేసీఆర్ గాంధీ పర్యటనపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఏడాది కాలంగా జనాలు కరోనాతో బాధపడుతున్నా పట్టించుకోని కేసీఆర్... గాంధీని సందర్శించి ఏదో చేశానని చెప్పుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఇటీవల కరోనా భారీన పడిన కేసీఆర్.. యశోధ హాస్పిటల్ లో పరీక్షలు చేయించుకున్నారు. దీన్ని కారణంగా చూపుతూ విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్ షర్మిల మరోమారు విరుచుకుపడ్డారు. కరోనా చికిత్స కోసం యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. ప్రచారం కోసం మాత్రం గాంధీ ఆసుపత్రికి వెళ్లారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చర్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు. మహిళలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన షర్మిల .. కరోనా చికిత్సల కోసం, కుటుంబ పోషణ కోసం రాష్ట్రంలోని మహిళలు 10 వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారని షర్మిల అన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 60 శాతం అధికమన్నారు. ప్రభుత్వం స్పందించి గత మూడేళ్ల వడ్డీలతోపాటు రుణాలను కూడా మాఫీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. వ‌డ్డీ లేని రుణం అంటూ తెలంగాణ ప్ర‌భుత్వం అస‌త్యాలు చెబుతోంద‌ని, తీసుకున్న‌ రుణాలు తిరిగి చెల్లించాలంటూ బ్యాంక‌ర్లు దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని  మ‌హిళ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అభ‌య‌హ‌స్తం ప‌థ‌కాన్ని మ‌ళ్లీ అమ‌లు చేయాల‌ని కోరారు. దీనిపై స్పందించిన షర్మిల‌ తెలంగాణ‌లో మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక మ‌ళ్లీ అభ‌య‌హ‌స్తం ప‌థ‌కాన్ని పున‌రుద్ధ‌రిస్తామ‌ని  హామీ ఇచ్చారు. డ్వాక్రా రుణాలన్నింటినీ కేసీఆర్ ప్ర‌భుత్వం మాఫీ చేయాలని  డిమాండ్‌ చేశారు. ఈ ప్రభుత్వానికి ప్ర‌జ‌లు ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు.     కేసీఆర్‌ అసమర్థత, చేతగాని తనం వల్ల 10 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలు అప్పులపాలయ్యారు.. డ్వాక్రా సంఘాల రుణాలను, వడ్డీలను ప్రభుత్వం మాఫీ చేయాలి. అప్పుల పాలైన కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలి.. ఆరునూరైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలిందే అని ష‌ర్మిల ట్విట్ట‌ర్‌లోనూ పేర్కొన్నారు. 

15 వేల వాహనాలు సీజ్.. తెలంగాణలో కఠినంగా లాక్ డౌన్

తెలంగాణలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈనెల 12 నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయితే మొదట పోలీసులు  సీరియస్ గా వ్యవహరించలేదనే ఆరోపణలు వచ్చాయి. లాక్ డౌన్ ఉన్నా వాహనాలు భారీగానే రోడ్లపై కనిపించాయి. జనాలు తిరుగుతున్న విజువల్స్ మీడియాలో ప్రసారమయ్యాయి. లాక్ డౌన్ పై సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. దీంతో డీజీపీ డైరెక్షన్ లోనే లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. సడలింపు సమయం ముగిసిన తర్వాత రోడ్డుపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ మహేందర్‌రెడ్డి ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. యథేచ్ఛగా రోడ్లపైకి వస్తున్న వారిపై కొరడా ఝళీపిస్తున్నారు పోలీసులు.  పది గంటల తర్వాత రోడ్లపైకి వస్తే వాహనాలను జప్తు చేస్తున్నారు. కారణం లేకుండా బయటకు వచ్చిన వారి నుంచి నిన్నటి వరకు ఏకంగా 15 వేల వాహనాలను పోలీసులు జప్తు చేశారు. మున్ముందు మరింత కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు పేర్కొన్నారు. కారణం లేకుండా బయటకు వచ్చే వారి వాహనాన్ని తాత్కాలికంగా జప్తు చేసి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. జరిమానా చెల్లించినా లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాతే వాహనాన్ని ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు.  మరోవైపు లాక్‌డౌన్ సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగితే అందుకు కారకులైన వారిపై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నారు. మే నెల తొలి రెండు వారాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి 4.31 లక్షల కేసులు నమోదయ్యాయి. మాస్కు ధరించని వారి నుంచి రూ. 31 కోట్లను జరిమానాగా వసూలు చేశారు. 

కరోనా కౌగిలిలో దేశం.. 

దేశంలో కరోనాఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మరోరోజు నాలుగు వేలకు పైనే మరణాలు నమోదయ్యాయి. రోజూవారీ కేసులు మాత్రం కొద్దిమేర తగ్గాయని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  శుక్రవారం 20,66,285మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,57,299మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. గత కొద్దిరోజులుగా కొత్తకేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అలాగే గత నాలుగు రోజులుగా నిత్యం 20లక్షలపైనే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ..మూడు లక్షలకు దిగువనే కేసులు వెలుగుచూస్తున్నాయి. అలాగే 24 గంటల వ్యవధిలో 4,194మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మరోసారి వరసగా రెండోరోజు కరోనా మరణాలు నాలుగువేలకు పైబడ్డాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 1,263, తమిళనాడులో 467మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు కరోనా సోకిన వారిసంఖ్య 2,62,89,290 చేరింది. గత సంవత్సరకాలంలో మహమ్మారి 2,95,525మంది ఉసురుతీసింది.    ఇక క్రియాశీల కేసులు 30లక్షల దిగువకు చేరాయి. ప్రస్తుతం 29,23,400మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. నిన్న 3,57,630మంది కోలుకున్నారు. వరసగా 9వ రోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తం రికవరీలు 2.3కోట్ల మార్కును దాటాయి. క్రియాశీల, రికవరీ రేట్లు వరసగా..11.12 శాతం, 87.76 శాతంగా ఉన్నాయి. మరోవైపు నిన్న 14,58,895 మందికి టీకాలు డోసులు అందాయి. తెలంగాణాలో.. బ్లాక్ ఫంగస్ తో ఒకరు మృతి..  బ్లాక్ ఫంగ‌స్ బారిన ప‌డి గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ జిల్లా తాండూరు మండలం ఎల్మ‌క‌న్నె వాసి వెంక‌ట్‌రెడ్డి(46) మృతిచెందారు. ఇటీవ‌ల క‌రోనా నుంచి కోలుకున్న ఆయ‌న కంటికి ఇన్‌ఫెక్ష‌న్ కావ‌డంతో అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. కుటుంబ స‌భ్యులు వెంక‌ట్‌రెడ్డిని జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప‌రీక్షించిన వైద్యులు బాధితుడికి బ్లాక్‌ఫంగ‌స్ సోకిన‌ట్లు నిర్ధ‌రించారు. అక్క‌డ చికిత్స పొందుతుండ‌గా నిన్న రాత్రి వెంక‌ట్‌రెడ్డి ప‌రిస్థితి విష‌మించింది. దీంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ ఆయ‌న ఈ ఉద‌యం మృతిచెందారు.   

ఇక సెలవు.. ఇదే నా చివరి కాల్.. 

హైదరాబాద్ ఇది ఒక పెద్ద నగరం.. నగరం పెద్దది అయినా.. ఇక్కడ ఇల్లు చాలా ఇరుకు.. ఆ ఇరుకు ఇళ్లలాగే మనుషుల మనుషుల మనసులు కూడా చాలా ఇరుగ్గా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఊరు గొప్ప పేరు దిబ్బ అన్నట్లు ఉంటుంది ఇక్కడ యవ్వారం.. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీరే చూడండి.  ఓపెన్ చేస్తే..  పురానాపూల్‌ చంద్రికాపురం. అతని పేరు కొమరాల లింగేశ్వర్‌రావు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. లింగేశ్వర్‌రావు దంపతులు ఇద్దరు పద్నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. తల్లిదండ్రులు మృతి చెందడం తో వారికి ఏం అర్ధం కాలేదు . ఎవరు వారిని దగ్గరికి తియ్యలేదు. వారికి ఎవరి సహాయం అందలేదు. చివరికి ఆ ముగ్గురు అన్నచెల్లెలు ఏం చేశారో చూడండి.  లింగేశ్వర్‌రావు పెద్దకుమారుడు కె.మధుసూదన్‌రావు(38) ఎల్‌ఐసీ ఏజెంట్‌. మరో కుమారుడు సందీప్‌కుమార్‌ (35) ప్రైవేటు ఉద్యోగి. కుమార్తె ప్రేమలత(36) ఇంట్లోనే ఉంటారు. వీరికి వివాహం కాలేదు. తల్లిదండ్రులు చనిపోయిన్పటికీ బస్తీలో అందరితో కలుపుగోలుగా ఉంటూ మేనమామ, బంధువుల సహకారంతో చదువులు పూర్తి చేసుకున్నారు. ఏడాదిన్నర క్రితం అప్పు చేసి తమ పాత ఇంటిని కూల్చి రెండంతస్తుల భవనం నిర్మించారు. అప్పులు తీరిన అనంతరం వివాహాలు చేసుకోవాలనుకున్నారు. మరోపక్క వడ్డీలు పెరిగిపోయి. ఆ అప్పులు తీరే మార్గం వాళ్లకు కన్పించలేదు. అప్పిచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక గత ఏడు నెలలుగా ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నారు.  కట్ చేస్తే.. అప్పు  ఎప్పటికైనా ముప్పే అన్నట్లు. వారు చేసుకున్న అప్పులే వారికి ముప్పై కూర్చుంది చివరికి.  ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న వారు తమ నూతన ఇంటికొచ్చి శుక్రవారం ఉదయం ఉరేసుకొన్నారు. ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు సందీప్‌కుమార్‌ బేగంబజార్‌లోని తన మిత్రుడు గోవింద్‌సింగ్‌ (35)కు ఫోన్‌ చేశారు. మాటల మధ్యలో పొరపాటు నిర్ణయం తీసుకున్నామంటూ చెప్పారు. గోవింద్‌సింగ్‌ ఆ మాటలను అంతగా విశ్వసించలేదు. మధ్యాహ్నం గోవింద్‌సింగ్‌ తిరిగి సందీప్‌కుమార్‌కు ఫోను చేశాడు. ఎన్నిసార్లు చేసినా.. సమాధానం లేకపోవడంతో అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే ఇన్‌స్పెక్టర్‌ నరేశ్‌కుమార్‌, ఎస్సై నర్సింహారావు బృందం వెళ్లి పరిశీలించగా ఇరువురు సోదరులు, సోదరి ఉరేసుకొని ఆత్మహత్యకు పాలుపడ్డారు అని పోలిసులు తెలిపారు.      అమ్మానాన్న చనిపోయారు. అయినా వాళ్ళు దగ్గర తియ్యలేదు. పాపం ఏం చెయ్యాలో అర్థం కాక.. ఇలాంటి దారుణానికి పాల్పడ్డారు. సమస్యలు అందరికి ఉంటాయి కానీ చనిపోతే సమస్యలు తీరుతాయా చెప్పండి.. కొంచం క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నారు.   

ఆ పదం వాడితే జైలే.. నెటిజన్లకు కేంద్రం వార్నింగ్ 

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారి కేసుల సంఖ్య కొంత తగ్గినా.. మరణాలు మాత్రం ఆందోళన కల్గిస్తున్నాయి. కరోనాపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. కొందరు నెటిజన్లు అత్యుత్సాహం చూపిస్తున్నారు. తామే డాక్టర్లలా ఫీలైపోతే... నెటిజన్లకు సలహాలు, సూచనలూ ఇస్తున్నారు. తమకు ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారు ఇలాంటి వారికి కేంద్రం తాజాగా చేసిన హెచ్చరిక జారీ చేసింది. అతిక్రమిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.  "ఇండియన్ వేరియంట్" అనే పదంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ పదాన్ని ఉపయోగిస్తూ... సోషల్ మీడియాలో చాలా మంది దేశ పరువు తీస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార టెక్నాలజీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌లోని డబుల్ మ్యూటెంట్ అయిన B.1.617ను చాలా మంది సోషల్ మీడియాలో... ఇండియన్ వేరియంట్ అని చెబుతున్నారు. ఇది ఇండియన్ వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎక్కడా చెప్పలేదు. దీన్ని వేరియబుల్ ఆఫ్ కన్సర్న్ అని మాత్రమే చెప్పింది. అంటే... ఈ వైరస్ వేర్వేరు దేశాల్లో విస్తరిస్తోందని అర్థం. అంతే తప్ప... దీనికీ ఇండియాకీ సంబంధం ఉంది అని WHO చెప్పలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లారిటీ ఇచ్చినా చాలా మంది సోషల్ మీడియాలో. దీన్ని ఇండియన్ వేరియంట్ అని అసత్య ప్రచారం చేస్తున్నారు. దీనిపైనే కేంద్ర సమాచార శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎవరైనా ఈ పదాన్ని వాడి ఉంటే వెంటనే తొలగించాల్సిందిగా నోటీస్ జారీ చేసింది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే తామూ ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇండియాలో పుట్టిన B.1.617... ప్రపంచ దేశాలకు పాకుతోందని అసత్య ప్రచారం చేస్తున్నారనీ... ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని కేంద్ర సమాచార శాఖ తెలిపింది. WHO అలా చెప్పనప్పుడు... సోషల్ మీడియాలో నెటిజన్లు అలా ఎందుకు తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని కేంద్రం ప్రశ్నిస్తోంది. దీనిపై మే 12నే స్పష్టత ఇచ్చామనీ... ఇందుకు సంబంధించిన ప్రెస్ రిలీజ్‌ని ఈ లింక్ ద్వారా చూడవచ్చని కేంద్రం లింక్ ఇచ్చింది. కేంద్రం హెచ్చరికతో నెటిజన్లు ఇప్పుడే ఇండియన్ వేరియంట్ అనే పదాన్ని వెతికి... దాన్ని అర్జెంటుగా తొలగించాల్సి ఉంది. ఎప్పుడు రాశామో, ఎక్కడ రాశామో గుర్తు లేదు అంటే కుదరదు. కేంద్రం గనక అలాంటి పదాన్ని ఎవరైనా రాసినట్లు గుర్తిస్తే... వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. కేసు నమోదు చేస్తుంది. ఇది దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి... చర్యలు కఠినంగానే ఉంటాయి. 

పిచ్చోడిగా ముద్ర వేసిన డా సుధాకర్ మృతి.. జగన్ రెడ్డిదే పాపమన్న టీడీపీ

విశాఖ జిల్లా నర్సీంపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్ (52) గుండెపోటుతో  మృతి చెందారు. విశాఖపట్టణంలోని సీతమ్మధారలో ఉంటున్న డాక్టర్ సుధాకర్  ఇంట్లోనే గుండెపోటుతో మృతి చెందారు.గతేడాది కరోనా రోగులకు సేవలు అందించిన డాక్టర్ సుధాకర్ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, ప్రభుత్వాధికారులు ఎవరూ తమకు సహకరించడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ప్రభుత్వం సుధాకర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై డాక్టర్‌ సుధాకర్‌ తీవ్ర మనస్తాపం చెందారు. వైద్యులకు వసతులు లేవని చెప్పడంతో తనపై కక్షగట్టి సస్పెండ్‌ చేశారని ఆరోపించారు.  గత ఏడాది మే నెలలో విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం వద్ద జాతీయ రహదారిపై గలాటా సృష్టిస్తున్నారంటూ డాక్టర్‌ సుధాకర్‌ను నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను ఆ సమయంలో కొట్టడం, చేతులు విరిచికట్టడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. ఆ వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. డాక్దర్ సుధాకర్ కు మతిస్థిమితం లేదంటూ పోలీసులు ఆయనను మానసిక వైద్యశాలకు తరలించారు. దీనిపై దళిత నాయకులు కోర్టును ఆశ్రయించడంతో సీబీఐతో విచారణ చేయించారు.  కోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించడం అప్పట్లో సంచలనమైంది. త్వరలోనే ఈ కేసులో తీర్పు రావాల్సి ఉండగా అంతలోనే ఆయన మరణించారు. కాగా సుధాకర్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్ సుధాకర్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడునారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు సుధాకర్ బలయ్యారని అన్నారు. మాస్కులు అడిగిన పాపానికి శారీరకంగా, మానసికంగా వేధించి సుధాకర్‌ను జగన్ ప్రభుత్వం బలిగొందని విమర్శించారు. సుధాకర్ మృతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మానసికంగా వేధించి సుధాకర్‌ను చంపారని ఆరోపించారు. నడిరోడ్డు మీద బట్టలు తీసి, డాక్టర్ సుధాకర్‌ను జగన్ ప్రభుత్వం వేధించిందన్నారు. జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేక చర్యలకు ఒక డాక్టర్ బలైయ్యాడన్నారు.  దళిత డాక్టర్ మృతికి కారణమైన జగన్మోహన్ రెడ్డి  ఇంతకింత అనుభవించే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.  జగన్ ప్రభుత్వం మానసికంగా వేధించడంతోనే డాక్టర్ సుధాకర్ మృతి చెందారని ఆరోపించారు. మృతుని కుటుంబ సభ్యులకు కోటి రూపాయలు పరిహారం ఇచ్చి, అన్ని విధాల ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. సుధాకర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన  ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు డాక్టర్ సుధాకర్ గారి మృతి తనను తీవ్ర‌ దిగ్బ్రాంతికి గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మాస్క్ అడగ‌డ‌మే ద‌ళిత వైద్యుడు చేసిన నేరంగా జ‌గ‌న్‌రెడ్డి  ఆదేశాల‌తో రెక్క‌లు విరిచి క‌ట్టి, కొట్టి, నానా హింస‌లు పెట్టి పిచ్చాసుప‌త్రిలో చేర్పించ‌డంతో సుధాక‌ర్ బాగా కుంగిపోయార‌ని తెలిసింది.. ఒక సామాన్య వైద్యుడిని వెంటాడి వేధించి చివ‌రికి ఇలా అంత‌మొందించారు.. ఇది గుండెపోటు కాదు.  ప్ర‌శ్నించినందుకు ప్ర‌భుత్వం చేసిన హ‌త్య ఇది..నిరంకుశ స‌ర్కారుపై పోరాడిన సుధాక‌ర్‌ గారికి నివాళి అర్పిస్తున్నాను.ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్రగాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. 

క‌రోనా దేవికి పూజ‌లు.. పిచ్చి పీక్స్‌...

క‌రోనా వైర‌స్‌. కంటికి క‌నిపించ‌ని సూక్ష్మ‌జీవి. యావ‌త్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ల‌క్ష‌లాది మంది ఉసురు  తీస్తోంది. కేవ‌లం మ‌నుషుల‌కు మాత్ర‌మే సోకుతోంది. ప‌గ‌బ‌ట్టిన‌ట్టు ప్రాణాలు తీస్తోంది. ముందు ముక్కులో చొర‌బ‌డుతుంది. ఈ త‌ర్వాత క్ర‌మంగా ఊపిరితిత్తుల‌ను పాడు చేస్తోంది. మెళ్లిగా ఊపిరి ఆడ‌కుండా చేసి ప్రాణాల‌ను బ‌లిగొంటోంది. ప్రాణం పోసేది దేవుడైతే.. ప్రాణం తీసేది య‌ముడు. మ‌రి, య‌ముడిని ఎవ‌రైనా పూజిస్తారా?  గుడిక‌ట్టి ఆరాధిస్తారా?  దేవుడు, య‌ముడు సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. వైర‌స్‌కు ఎవ‌రైనా గుడి క‌డ‌తారా?  ప్రాణాలు తీస్తున్న మ‌హ‌మ్మారికి విగ్ర‌హం పెట్టి.. పూజ‌లు చేసి.. ఆరాధిస్తారా?  చేయ‌నే.. చేయ‌రు క‌దా. కానీ.. త‌మిళ‌నాడుకు చెందిన కొంద‌రు అలా చేస్తున్నారు. క‌రోనా దేవికి పూజ‌లు చేస్తూ.. చాద‌స్తం చాటుకుంటున్నారు.    ఏ విష‌యంలోనైనా ఓవ‌ర్ చేయ‌డంలో త‌మిళుల త‌ర్వాతే ఎవ‌రైనా. సినీ న‌టి ఖుష్బూ, త్రిష‌, అజిత్‌లాంటి వాళ్ల‌కు గుళ్లుక‌ట్టి పూజ‌లు చేయ‌డం వారికే చెల్లింది. త‌మ అభిమానాన్ని, భ‌యాన్ని.. విగ్ర‌హాలు, ఆల‌యాల రూపంలో వ్య‌క్తం చేయ‌డంలో వారికి వారే సాటి.  తమిళనాడులో తమ అభిమాన సినీ, రాజకీయ ప్రముఖలకు విగ్రహాలు ఏర్పాటు చేయడం, ఆలయాలను నిర్మించి పూజలు చేయడం పరిపాటే. తాజాగా కరోనా దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. కోయంబత్తూరులో ఓ ఆలయంలో కరోనా దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కామాక్షిపురి ఆలయంలో ఒకటిన్నర అడుగు ఎత్తున్న కరోనా దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.  కేవ‌లం విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించ‌డ‌మే కాదు.. 48 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మహాయాగం చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. క‌రోనా దేవి ఆల‌య‌మైనా.. క‌రోనా కాలం కాబ‌ట్టి.. యాగం సమయంలో భక్తులెవరినీ ఆలయంలోకి అనుమతించబోమని తెలిపారు.  గతంలో కూడా కలరా, తట్టు, మసూచీ వంటి వ్యాధులు ప్రబలినప్పుడు తమిళనాడులోని పలు గ్రామాల్లో మరియమ్మన్, బ్లాక్‌ మరియమ్మన్‌, మగలియమ్మన్‌ విగ్రహాలను ప్రతిష్టించి పూజాలు చేశారు. ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో.. కరోనా దేవి విగ్రహం ఏర్పాటు చేసి పూజ‌లు చేస్తున్నారు త‌మిళ తంబిలు. వాళ్ల పిచ్చి పీక్స్‌కు చేరిందంటున్నారు చూసిన‌వాళ్లు.  

ఆనందయ్య మందుపై వెంకయ్య ఆరా... నెల్లూరుకు ఐసీఎంఆర్ టీమ్ 

దేశ వ్యాప్తంగా చర్చగా మారింది కృష్ణపట్నం ఆనందయ్య కరోనా ఆయుర్వేద ఔషదం. కరోనాను నయం చేస్తుందన్న ప్రచారంతో ఏపీతో పాటు పలు రాష్ట్రాల నుంచి జనాలు కృష్ణపట్నం వస్తున్నారు. తాకిడి పెరగడంతో పోలీసులు మందు పంపిణిని నిలిపివేశారు.  ప్రభుత్వం మంది పంపిణిని ఆపేయడంపై జనాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లా కలెక్టర్ మాత్రం అధ్యయన రిపోర్ట్ వచ్చాకే మందు సరఫరాపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొవిడ్ బాధితులకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద మందు మీద అధ్యయనం ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయుష్ ఇన్ చార్జ్ మంత్రి శ్రీ కిరణ్ రిజ్జు, ఐసిఎంఆర్. డైరక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్ కు సూచించారు. ఆయుర్వేద మందు విషయంలో నెల్లూరులో నెలకొన్న పరిస్థితులు, వేలాదిగా ప్రజలు తరలివస్తున్న విషయం ఉపరాష్ట్రపతి దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రి మరియు డైరక్టర్ జనరల్ తో ఫోన్ ద్వారా మాట్లాడారు. అంతకు ముందు కృష్ణపట్నం చుట్టు పక్కల గ్రామాలకు చెందిన తమ పరిచయస్తులతో మాట్లాడిన ఉపరాష్ట్రపతి, విషయ పూర్వాపరాలు తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన అంశాలను కేంద్ర మంత్రి మరియు డైరక్టర్ జనరల్ కు వివరించి, దీనికి సంబంధించిన అంశాలపై వారితో చర్చించారు. విషయ ప్రాముఖ్యత దృష్ట్యా వెంటనే ఆ మందు మీద అధ్యయనం ప్రారంభించి, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య ఇస్తున్న కరోనా ఔషధంపై పరిశీలన చేపట్టేందుకు ఐసీఎంఆర్ బృందం కృష్ణపట్నం చేరుకుంది. ఆనందయ్య ఔషధం తయారీలో ఉపయోగించే చెట్ల ఆకులు, పదార్థాలను ఐసీఎంఆర్ బృందంలోని సభ్యులు పరిశీలించారు. ఔషధ తయారీ విధానాన్ని ఆనందయ్యను అడిగి తెలుసుకున్నారు. ఆయుర్వేద మందుతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అనే కోణంలో ఆరా తీశారు. ఐసీఎంఆర్ బృందం వెంట నెల్లూరు జేసీ హరేంద్రప్రసాద్, డీపీవో ధనలక్ష్మి కూడా ఉన్నారు. కృష్ణపట్నంలో ఆనందయ్య అందించే మూలికా ఔషధం కరోనాను తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తోందంటూ ప్రచారం జరగడంతో ప్రజలు పోటెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆ ఔషధం సమర్థత తెలిసేదాకా పంపిణీ నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 

దొరికినంత దోచుకో ...  లాక్ డౌన్ దోపిడీతో  అల్లాడుతున్న జనం 

కరోనా కష్ట కాలంలోనూ, అందరూ కాదు కానీ, కొందరు వ్యాపారులు, ఇదే అదనుగా సామాన్యులను దోచుకుంటున్నారు.కార్పొరేట్ అసుపత్రులలో జరుగతున్న దోపిడీ గురించి అయితే, చెప్పనే అక్కరలేదు.అలాగే, అత్యవసర మందుల బ్లాక్  మార్కెటింగ్, ఇతరత్రా కొవిడ్ బాధితులు ఎదుర్కుంటున్న దోపిడీ, దుర్మార్గాల గురించి కూడా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. ఆసుపత్రుల వద్ద కనిపించే కొన్ని సంఘటనల గురించి విన్నప్పుడు, వీళ్ళు అసలు మనుషులేనా అనిపిస్తుంది.  సరే, అదలా ఉంటే, కరోనా కట్టడి కోసం రాష్ట్ర పభుత్వం లాక్ డౌన్ విధించడంతో సామాన్యులను దోచుకునేందుకు, వ్యాపారులు దాన్నొక సాకుగా ఉపయోగించుకుంటున్నారు. నిజానికి, ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా, అనేక మంది రోజువారీ కూలీలు, ఇతరత్రా చిరు ఉద్యోగులు, స్వయం ఉపాధి పై ఆధారపడి జీవించే వారు, పని లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అనేక కుటుంబాలకు రోజు గడవడమే కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో కూడా, సిగరెట్, బీడి మొదలు ఉప్పు, పప్పు,చితపండు వరకు ప్రతి వస్తువు  ధరలను అడ్డగోలుగా పెంచేసి, అదేమంటే, లాక్ డౌన్’ను సాకుగా చూపుతున్నారు. పది రోజుల క్రితం కిలో కందిపప్పు రూ. 120 , ఇప్పుడు అదే కందిపపు కిలో రూ. 150. చిత్రం ఏమంటే, అవసరం అయితే దేశం కోసం తమ సంపద మొత్తం ఇచ్చేదుకు సిద్దమని ప్రకటించిన  టాటా గ్రూప్, వస్తువలను కూడా స్థానిక వ్యాపారాలు, మాల్స్’లో  అధిక ధరలకు అమ్ముతున్నారు.ఇలా ఇదీ అదీ అని కాకుండా.. అన్ని రకాల వస్తువుల ధరలు గత 10 రోజులుగా పెరిగిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం.. వ్యాపారులే..! లాక్‌డౌన్‌ పేరుతో వారు ఎడాపెడా ధరలు పెంచి, విక్రయాలు జరుపుతున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు వెసులుబాటు ఇవ్వడంతో.. వ్యాపారులు వినియోగ దారులను ఇష్టారరాజ్యంగా జనాలను దోచుకుంటున్నారు. అది పేస్టు అయినా టీపొడి లేదా మరో వస్తువు ఏదైనా  ప్రతి వస్తువు ధరను 10 నుంచి 15 శాతం  వరకు పెంచేశారు. అదేమని దిగితే ,నేరం మాది కాదు హోల్‌సేలర్లది, అని నెపాన్ని హోల్ సెల్లర్స్ మీద నెట్టేస్తున్నారు. అయితే, అందులో నిజం కూడా ఉండవచ్చును. కానీ, పూర్తిగా పాపం అంతా హోల్ సెల్లర్స్’ ది మాత్రమే కాదు. తిలా పాపం తలా పిడికెడు .. కొన్నిచోట్ల ఏకంగా ఎమ్మార్పీని మించి విక్రయాలు జరుపుతున్నారు. సబ్బులు, షాపూలు, నూనెలు వంటి వస్తువులకు గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ)పై రూ. 2 నుంచి రూ. 10 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. నిజానికి వంట నూనెలు హోల్‌సేల్‌లో ఎమ్మార్పీ కంటే రూ. 10 నుంచి రూ.20 తక్కువకే లభిస్తాయి.రిటైలర్లు వాటిపై రూ. 5 నుంచి రూ. 10 వరకు మార్జిన్‌ చూసుకుని, ఎమ్మార్పీ కంటే తక్కువకే విక్రయిస్తారు. కానీ, లాక్‌డౌన్‌ తర్వాత.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు జరుపుతున్నారు. లాక్ డౌన్’ ను కొందరు వ్యాపారాలు తమ దోపిడీకి లైసెన్స్’గా బావిస్తున్నారు. దీంతో.. పేద, మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు.ఈ దోపిడీని అరికట్టేందుకు, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటేనేగానీ,పరిస్థితి అదుపులోకి వచ్చేలా లేదు.

జగన్నాటకంలో గెలిచింది రఘురాముడేనా?

ర‌ఘురాముడు.. విజ‌య‌రాముడై తిరిగొస్తున్నాడు. త‌న అరెస్ట్ అక్ర‌మ‌మంటూ.. మెజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వ‌ర‌కూ పోరాడాడు. ప్ర‌భుత్వం ఎన్ని కొర్రీలు పెట్టినా.. అన్నిటినీ ఎడ‌మ‌ కాలి గాయాల‌తో.. ఓ త‌న్ను త‌న్నేసి.. త‌లెత్తుకొని బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌స్తున్నాడు. రాజ‌ద్రోహం లాంటి నాన్‌-బెయిల‌బుల్ కేసుల‌తో ర‌ఘురామ‌కు స‌ర్కారు ఉచ్చు బిగించినా.. ఆ ఉక్కు బంధ‌నాల‌ను సుప్రీంకోర్టు తీర్పుతో తునాతున‌కలు చేసేశాడు. త‌న‌ను టార్గెట్ చేసి.. త‌న‌పై బ‌ల‌ప్ర‌యోగం చేసిన రాజ్యంపై.. ఎదురు తిరిగి.. గుండె బ‌లంతో పోరాడి.. దెబ్బ‌తిన్న పులిలా గ‌ర్జించి.. విజ‌య‌గ‌ర్వంతో మ‌రోసారి మీసం మెలేయ‌నున్నారు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. ప్ర‌భుత్వం త‌న అస్త్ర‌శ‌స్త్రాల‌న్నీ ఉప‌యోగించి.. ర‌ఘురామ‌కు బెయిల్ రాకుండా ఎంతగా ప్ర‌య‌త్నించినా.. చివ‌రికి న్యాయం ర‌ఘురామ ప‌క్షానే నిలిచింది. ఎంపీ ర‌ఘురామ‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ల‌భించింది. బెయిల్ కోసం సుప్రీంలో సుదీర్ఘ వాద‌న‌లు జ‌రిగాయి. హేమాహేమీలైన ఇద్ద‌రు సుప్రీంకోర్టు సీనియ‌ర్ లాయ‌ర్లు నువ్వా-నేనా అన్న‌ట్టు త‌ల‌ప‌డ్డారు. త‌మ అనుభ‌వ‌మంతా ఉప‌యోగించి.. పాత తీర్పులు ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకొచ్చి.. తుద‌కంటూ ప్ర‌య‌త్నించారు. గంట‌ల త‌ర‌బ‌డి జ‌రిగిన వాద‌న‌ల త‌ర్వాత‌.. న్యాయ‌దేవ‌త చేతిలోని త‌రాజు ర‌ఘురామ వైపు మొగ్గు చూపింది. ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాల‌న్నిటినీ ప‌టాపంచ‌లు చేస్తూ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు స‌ర్కారు విసిరిన వ‌ల నుంచి విముక్తి ల‌భించింది.   ర‌ఘురామ అరెస్ట్ నుంచి.. సుప్రీంకోర్టు బెయిల్ వ‌ర‌కూ.. పెద్ద హైడ్రామానే న‌డిచింది. శుక్ర‌వారం మొద‌లైన ఎపిసోడ్‌.. మ‌ళ్లీ శుక్ర‌వారం నాటికి సుఖాంత‌మైంది. ఈ మ‌ధ్య‌లో మ‌హాభార‌త యుద్ధంలో ఉన్న‌న్ని ట్విస్ట్‌లు, కుట్ర‌లు, కుతంత్రాలు జ‌రిగాయి. అభిమ‌న్యుడిలా వాట‌న్నిటిపై ఒంట‌రి పోరాటం చేసి.. అర్జునుడిలా విజ‌యుడై.. బెయిల్ సాధించారు ర‌ఘురాముడు. మే 14.. శుక్ర‌వారం సాయంత్రం.. హైద‌రాబాద్‌లోని ర‌ఘురామ కృష్ణ‌రాజు నివాసం.. ఉన్న‌ట్టుండి ప‌దుల సంఖ్య‌లో ఏపీ సీఐడీ పోలీసులు ఎంపీని చుట్టుముట్టారు.. సీఆర్పీఎఫ్ ర‌క్ష‌ణ‌లో ఉన్న ర‌ఘురామ‌ను బ‌ల‌వంతంగా అరెస్ట్ చేశారు.. ఒక్కసారిగా షాక్‌.. తెలుగు రాష్ట్రాల్లో బ్రేకింగ్ న్యూస్‌.. రాజ‌ద్రోహం కేసు పెట్టి.. పుట్టిన రోజు నాడే ఆయ‌న్ను అరెస్ట్ చేశారు ఏపీ సీఐడీ. నేరుగా గుంటూరు సీఐడీ కార్యాల‌యానికి తీసుకొచ్చారు. రాత్రంతా అక్క‌డే ఉంచి గుచ్చిగుచ్చి ప్ర‌శ్నించారు. తెల్లారేస‌రికి సీన్ మ‌రింత సితార్ అయింది. శ‌నివారం ర‌ఘురామ అరెస్ట్ ఎపిసోడ్ మ‌రింత కాక రేపింది. త‌న అరెస్ట్ అక్ర‌మ‌మంటూ.. బెయిల్ కోసం శ‌నివారం ఉద‌యం మొద‌ట ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు ర‌ఘురామ‌. కింది కోర్టుకు వెళ్ల‌మంటూ హైకోర్టు సూచించ‌డంతో.. మేట‌ర్ మెజిస్ట్రేట్ కోర్టుకు చేరింది. అక్క‌డ‌.. అస‌లు దారుణం వెలుగులోకి వ‌చ్చింది. శుక్ర‌వారం రాత్రి.. సీఐడీ ఆఫీసులో త‌న‌ను తీవ్రంగా కొట్టారంటూ ర‌ఘురామ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఐదుగురు వ్య‌క్తులు ముఖానికి క‌ర్చీఫ్‌లు ధ‌రించి.. త‌న కాళ్ల‌పై విప‌రీతంగా కొట్టారంటూ.. గాయాల‌ను జ‌డ్జికి చూపించారు. ఆ ఫోటోలూ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అవి చూసి అంతా షాక్‌... ర‌ఘురామ పాదాలకు తీవ్ర గాయాలు స్ప‌ష్టంగా క‌నిపించాయి. కాళ్లు వాచి ఉన్నాయి. గాయాలు చూసి.. మెజిస్ట్రేట్ తీవ్రంగా స్పందించారు. వెంట‌నే మెడిక‌ల్ బోర్డు ఏర్పాటు చేసి.. ర‌ఘురామ గాయాల‌ను ప‌రిశీలించాల‌ని ఆదేశించారు. తొలుత జీజీహెచ్ ఆసుప‌త్రిలో, ఆ త‌ర్వాత ర‌మేశ్ హాస్పిట‌ల్‌లో ప‌రీక్ష‌లు చేయించాల‌ని ఉత్త‌ర్వులు ఇచ్చారు. శ‌నివారం రాత్రంతా జీజీహెచ్‌లోనే ర‌ఘురామ‌ను ప‌రీక్షించారు వైద్యులు..కోర్టు ఒక‌లా ఆదేశిస్తే.. పోలీసులు మ‌రోలా వ్య‌వ‌హ‌రించారు. ఆదివారం మ‌ధ్యాహ్నం జీజీహెచ్ నుంచి ర‌మేశ్ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ల‌కుండానే.. నేరుగా గుంటూరు జైలుకు త‌ర‌లించ‌డం వివాదాస్ప‌ద‌మైంది. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి..త‌న భ‌ర్త‌ను జైల్లో చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ర‌ఘురామ స‌తీమ‌ణి ర‌మాదేవి ఆరోపించ‌డం మ‌రింత క‌ల‌క‌లం రేపింది.  ఆదివారం హైకోర్టు డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించారు ర‌ఘురామ త‌ర‌ఫు లాయ‌ర్లు.. కోర్టు సైతం త‌మ ఆదేశాల‌ను ఎందుకు దిక్క‌రించారంటూ సీరియ‌స్‌గా స్పందించింది.. మ‌రోవైపు, ర‌ఘురామ మెడిక‌ల్ రిపోర్ట్ సైతం మ‌రింత క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న కాళ్లు రంగు మారాయి.. వాచి ఉన్నాయి.. కానీ, అవి కొట్ట‌డం వ‌ల్ల అయిన గాయాలు కావంటూ వైద్యులు నివేదిక ఇవ్వ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఇక సోమ‌వారం.. ర‌ఘురామ ఎపిసోడ్ సుప్రీం కోర్టుకు చేరింది. బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ ఈ శుక్ర‌వారానికి వాయిదా ప‌డినా.. ర‌ఘురామ‌కు ఆరోగ్య ప‌రీక్ష‌లు చేసే అంశంలో మాత్రం సుప్రీం అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. ర‌మేశ్ హాస్పిట‌ల్ అంటూ ర‌ఘురామ లాయ‌ర్లు వాదించారు. మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ చాలంటూ ప్ర‌భుత్వ న్యాయ‌వాదులు చెప్పారు. చివ‌రాఖ‌రులో సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిట‌ల్‌ను ఫిక్స్ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్త‌ర్యులు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు న్యాయ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో.. మెడిక‌ల్ బోర్డు రిపోర్టును షీల్డ్ క‌వ‌ర్‌లో ఇవ్వాలంటూ ఆదేశించి ఏపీ స‌ర్కారుకు షాక్ ఇచ్చింది సుప్రీం ధ‌ర్మాస‌నం... సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎంపీ రఘురామకృష్ణరాజు గుంటూరు జైలు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఏ పోలీసులైతే ర‌ఘురామ‌ను అరెస్ట్ చేసి.. కారులో కుక్కి.. హైద‌రాబాద్ నుంచి గుంటూరుకు తీసుకెళ్లారో... అదే ఏపీ పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి.. ర‌ఘురామ‌ను కారులో గౌర‌వంగా.. గుంటూరు నుంచి మ‌ళ్లీ హైద‌రాబాద్‌కు తీసుకు రావ‌డం టోట‌ల్ ఎపిసోడ్‌లోకే హైలైట్.. గుంటూరు జైలు ముందు కారు ఎక్కుతూ.. చేతులు ఊపుతూ.. విజ‌య‌గ‌ర్వంతో క‌నిపించారు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. కారులో కూర్చొని మీసం మెలేస్తూ.. తాను మొన‌గాడిన‌నే మెసేజ్ అప్పుడే ఇచ్చారు ర‌ఘురామ‌.. ఈ శుక్ర‌వారం సుప్రీంకోర్టులో ర‌ఘురామ బెయిల్ పిటిష‌న్‌, కాలి గాయాలపై విచార‌ణ హోరెత్తింది. ర‌ఘురామ కాళ్ల‌కు గాయాలు ఉన్న‌ట్టు.. కేవ‌లం గాయాలు మాత్ర‌మే కాదు.. ర‌ఘురామ కాలి వేలికి ఫ్రాక్చ‌ర్ కూడా అయిందంటూ సికింద్రాబాద్‌ ఆర్మీ వైద్యుల బృందం సుప్రీంకోర్టుకు షీల్డ్ క‌వ‌ర్‌లో నివేదిక ఇచ్చింది. కోర్టు ప‌ర్య‌వేక్ష‌కుడి స‌మ‌క్షంలో, వీడియో చిత్రీక‌ర‌ణ మ‌ధ్య జ‌రిగిన మెడిక‌ల్ క‌మిటీ ప‌రిశీల‌న రిపోర్ట్ దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానానికి భ‌ద్రంగా అంద‌జేసింది. ఏపీ సీఐడీ పోలీసులు.. కస్టడీలో చిత్రహింసలు పెట్టారన్న తమ ఆరోపణలు నిజమని తేలాయని రఘురామ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ అన్నారు. ఏపీ సీఐడీ అధికారుల చిత్రహింసలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే స్పందిస్తూ రఘురామే స్వయంగా చేసుకున్న గాయాలా? కాదా? అన్నది తెలియదన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లే ముందు స్వయంగా గాయాలు చేసుకున్నారని అంటున్నారా? అని ధర్మాసనం న్యాయవాది దవేను ప్రశ్నించింది. రఘురామ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి ప‌లు కీల‌క అంశాల‌ను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. త‌న‌ను సీఐడీ క‌స్ట‌డీలో టార్చర్ పెట్టార‌ని.. ఆ త‌ర్వాతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారని రఘురామ తనతో చెప్పారని రోహ‌త్గి అన్నారు. ఎంపీపై చాలా సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యిందని.. అందులో సెక్షన్‌ 124ఏ చాలా ముఖ్యమైందని తెలిపారు. ర‌ఘురామ‌కు బెయిల్‌ రాకూడదనే ఉద్దేశంతోనే సెక్షన్‌ 124ఏ కింద కేసు నమోదు చేశారని కోర్టుకు నివేదించారు రోహత్గి. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తాజా తీర్పుతో.. 124ఏ రాజ‌ద్రోహం లాంటి నాన్‌బెయిలబుల్ కేసులు బుక్ చేసి.. ర‌ఘురామ‌ను జైల్లోనే బుక్ చేయాల‌నే రాజ్యం ర‌చించిన ఎత్తుగ‌డ.. సుప్రీంకోర్టు ముందు పార‌లేదు. కాలి గాయాల బాధ‌ను పంటిబిగువ‌న భ‌రిస్తూనే.. బెయిల్ కోసం తీవ్రంగా పోరాడిన ర‌ఘురామ‌.. ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించారు. మొన‌గాడిలా మ‌రోసారి మీసం మెలేశాడు. ఒక రోజు సీఐడీ క‌స్ట‌డీ.. మ‌రో రోజు గుంటూరు జైలు.. ఆ త‌ర్వాత సికింద్రాబాద్‌ ఆర్మీ హాస్పిట‌ల్‌.. తాజా బెయిల్‌తో మ‌ళ్లీ ఇంటికి. ఇక్క‌డితోనే అయిపోలేదు సినిమా. ర‌ఘురామ ఎపిసోడ్ అటు పార్ల‌మెంట్ స‌భా హ‌క్కుల సంఘానికి చేరింది. సుప్రీంలో ర‌ఘురామ త‌న‌యుడు వేసిన పిటిష‌న్ అలానే ఉంది. అటు, సీబీఐ కోర్టులో జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ ర‌ఘురామ వేసిన కేసూ వేగంగా ముందుకు సాగుతోంది. ప్ర‌స్తుతానికైతే బెయిల్ పై ర‌ఘురామ బ‌య‌ట‌ప‌డ్డారు. ఇప్పుడిక‌.. ర‌ఘురామ దండ‌యాత్రను జ‌గ‌న్‌రెడ్డి ఎలా కాచుకుంటారో చూడాలి. ఏది ఏమైనా.. వారం రోజులుగా సాగుతున్న‌.. ర‌ఘురామ అరెస్ట్‌, బెయిల్‌ను ఘ‌ట‌న‌ల‌ను చూస్తుంటే.. ఎంతైనా.. వాడు మ‌గాడ్రా బుజ్యా.. అనిపించ‌క‌మాన‌దు. ర‌ఘురామ‌.. నువ్ నిజంగా మొన‌గాడివేరా.. ఇప్పుడు మ‌ళ్లీ తిప్ప‌రా మీసం...  

కరోనా ఆయుర్వేద ఆనందయ్యపై కేసు 

నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఆయుర్వేదం  కోవిడ్ మందు కోసం పలు ప్రాంతాల నుంచి వేలాది మంది జనం తరలివస్తున్నారు. పలు ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ చేసి ఆక్సిజన్ పెట్టుకుని మరీ కోవిడ్ రోగులు ముత్తుకూరుకు వస్తున్నారు. దీంతో జనాలను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కావడం లేదు. తోపులాటలు జరగడంతో లాఠీ చార్జ్ చేసి అదుపు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఆయుర్వేద ఆనందయ్యపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. జనం ఎక్కువగా గుమిగూడారని ఆఫీస్‌కు పిలిపించి ఎస్పీ మాట్లాడారు.  కృష్ణపట్నం పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు అక్కడ ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నారు. ఆనందయ్యకు ఆయుర్వేదంపై ఉన్న పట్టుతో అతను మందును కనిపెట్టారు. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారు. ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేశారు. అయితే మందుపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. దీంతో శుక్రవారం నుంచి మళ్లీ మందు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య తయారు చేసిన కరోనా నివారణ ఔషధంపై  సీఎం జగన్ కూడా దృష్టి సారించి, శాస్త్రీయ అధ్యయనం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని నిలిపివేసింది. దీనిపై నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు వివరణ ఇచ్చారు. మూలికా ఔషధం పంపిణీ ఆపివేశామని, ఈ ఔషధం తాలూకు శాంపిళ్లను డీఎంహెచ్ఓ, ఆయుష్ అధికారులు హైదరాబాదులోని ఓ ప్రయోగశాలకు పంపారని వెల్లడించారు. దీనిపై ఐసీఎంఆర్ శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే... ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని తెలిపారు. అప్పటివరకు మందు పంపిణీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆనందయ్య మందుకు రెండ్రోజుల్లో అనుమతులు వస్తాయని ఎమ్మెల్యే కాకాణి  తెలిపారు. అనుమతులు వస్తే ఇతర రాష్ట్రాలకు కొరియర్ ఛార్జీలు భరించి.. తాము మందు పంపుతామని చెప్పారు.  ఇప్పటికే వేల మందికి ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేశారని, ఎక్కడా సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మందు అద్భుతంగా పనిచేస్తుందని కరోనా బాధితులు చెబుతున్నారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ఎవరూ రావద్దని ఎమ్మెల్యే కాకాని అన్నారు. వేల మంది రావడం వల్ల పోలీసులు కూడా నియంత్రించలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఈరోజు సాయంత్రానికి ఆయుష్ అనుమతులు కూడా వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రభుత్వ అనుమతులు, క్లీన్ చిట్ వస్తే ఇతర రాష్ట్రాల వారికి కొరియర్ చార్జీలు కూడా తామే భరించి మందులు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కాకాని స్పష్టం చేశారు. ఆనందయ్య మందు పంపిణీని ఆపేది మీరే..ప్రారంభిస్తున్నామని ప్రకటించేది మీరే..తిరిగి లాఠీచార్జీ చేసేది మీరేనా అని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.  సాఫీగా సాగిపోయే కార్యక్రమాన్ని గందరగోళం చేయకండని అధికారులు, ప్రభుత్వానికి ఆయన  విజ్ఞప్తి చేశారు. అసలు ఆయుర్వేదం మందు పంపిణీని ఎందుకు ఆపాల్సివచ్చిందని సోమిరెడ్డి ప్రశ్నించారు. తిరిగి ప్రారంభించేటప్పుడు ఒక్క పద్ధతి ప్రకారం ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. ఆనందయ్య రోజుకు ఎంత మందికి ఇవ్వగలరో ఆలోచించి టైమ్ స్లాట్ ప్రకారం కూపన్లు ఇచ్చే అంశం ఎందుకు పరిశీలించలేకపోయారని సోమిరెడ్డి మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను కాపాడలనే మంచి ఉద్దేశంతో ఆనందయ్య ఉచితంగా చేపట్టిన  కార్యక్రమాన్ని గందరగోళం చేసేశారని విమర్శించారు. పెద్దాసుపత్రి క్యాజువాలిటీ బ్యాక్ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది..ఆస్పత్రిలో చేసే వైద్యం కన్నా ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేదం మందుపై ప్రజలకు నమ్మకం పెరిగిందని సోమిరెడ్డి తెలిపారు. నెల్లూరులో ఏసీ స్టేడియం లేదా వీఆర్సీ మైదానంలో, లేదంటే కృష్ణపట్నంలోనే ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.