చికిత్స కోసం యశోద.. ప్రచారం కోసం గాంధీ!
posted on May 22, 2021 @ 11:15AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే గాంధీ హాస్పిటల్ ను పరిశీలించారు. కొవిడ్ వార్డుల్లోకి కూడా వెళ్లారు. కొవిడ్ రోగులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గాంధీ హాస్పిటల్ కు వెళ్లడం ఇదే మొదటి సారి. కేసీఆర్ గాంధీ పర్యటనపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఏడాది కాలంగా జనాలు కరోనాతో బాధపడుతున్నా పట్టించుకోని కేసీఆర్... గాంధీని సందర్శించి ఏదో చేశానని చెప్పుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఇటీవల కరోనా భారీన పడిన కేసీఆర్.. యశోధ హాస్పిటల్ లో పరీక్షలు చేయించుకున్నారు. దీన్ని కారణంగా చూపుతూ విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్ షర్మిల మరోమారు విరుచుకుపడ్డారు. కరోనా చికిత్స కోసం యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. ప్రచారం కోసం మాత్రం గాంధీ ఆసుపత్రికి వెళ్లారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చర్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు. మహిళలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన షర్మిల .. కరోనా చికిత్సల కోసం, కుటుంబ పోషణ కోసం రాష్ట్రంలోని మహిళలు 10 వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారని షర్మిల అన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 60 శాతం అధికమన్నారు. ప్రభుత్వం స్పందించి గత మూడేళ్ల వడ్డీలతోపాటు రుణాలను కూడా మాఫీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
వడ్డీ లేని రుణం అంటూ తెలంగాణ ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని, తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలంటూ బ్యాంకర్లు దారుణంగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అభయహస్తం పథకాన్ని మళ్లీ అమలు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన షర్మిల తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చాక మళ్లీ అభయహస్తం పథకాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా రుణాలన్నింటినీ కేసీఆర్ ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు.
కేసీఆర్ అసమర్థత, చేతగాని తనం వల్ల 10 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలు అప్పులపాలయ్యారు.. డ్వాక్రా సంఘాల రుణాలను, వడ్డీలను ప్రభుత్వం మాఫీ చేయాలి. అప్పుల పాలైన కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలి.. ఆరునూరైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలిందే అని షర్మిల ట్విట్టర్‌లోనూ పేర్కొన్నారు.