ఆనందయ్యతో అమెరికా డీల్?
posted on May 22, 2021 @ 1:10PM
దేశ వ్యాప్తంగా చర్చగా మారింది కృష్ణపట్నం ఆనందయ్య కరోనా ఆయుర్వేద ఔషదం. కరోనాను నయం చేస్తుందన్న ప్రచారంతో ఏపీతో పాటు పలు రాష్ట్రాల నుంచి జనాలు కృష్ణపట్నం వస్తున్నారు. తాకిడి పెరగడంతో పోలీసులు మందు పంపిణిని నిలిపివేశారు. ప్రభుత్వం పంపిణీ నిలిపివేయడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కరోనా మందు పంపిణిని ఆపేయడంపై జనాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఆయుర్వేద వైద్యుడు బొణిగె ఆనందయ్య గురించి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ‘‘ఎయిర్ ఫోర్స్ వన్‌లో కృష్ణపట్నానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, శాస్త్రవేత్త డాక్టర్ ఫౌసీ బయలు దేరారని తెలిసింది. ఆనందయ్యతో డీల్ కుదుర్చుకోవడానికై అయ్యిండొచ్చు.. అంటూ ట్విటర్‌లో సెటైరిక్ పోస్టు పెట్టారు రాంగోపాల్ వర్మ. అంతేకాదు ఆనందయ్య కిడ్నాప్ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించి, సైనిక భద్రత కల్పించొచ్చు కదా’’ అంటూ ఆర్జీవీ మరో ట్వీట్ చేశారు.
కరోనాకు ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన భద్రతపై ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కార్పొరేట్ శక్తులతో జాగ్రత్తగా ఉండాలని.. ఆయనను అణగదొక్కే అవకాశం ఉందని రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ట్వీట్ సామాజికమాధ్యమాల్లో రచ్చ చేస్తోంది. ఆర్డీవీ ట్వీట్లకు నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. ఆనందయ్యకు మెడికల్ మాఫియా నుంచి ముప్పు ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు.
మరోవైపు కృష్ణపట్నం గ్రామానికి కరోనా మందు కోసం పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. ఆనందయ్య లేకపోవడంతో ఆయన ఇంటి దగ్గరే పడిగాపులు పడుతున్నారు. గ్రామానికి చెందిన కొందరు మందు స్టాకు చేసి బహిరంగంగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇంకొందరు వారు తయారుచేసిన మందుని ఆనందయ్య మందుగా చెబుతూ మోసాలకు పాల్పడుతున్నారు. మందు కోసం వచ్చే వారి నుంచి వేలకి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. తన సొంత డబ్బుతో మందు తయారుచేసి వేల మందికి ఉచితంగా ఆనందయ్య పంపిణీ చేస్తున్నారు. ఆనందయ్యకి కొందరు వ్యక్తులు చెడ్డపేరు తెస్తున్నారనే గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.