ఉక్కుసంకల్పం.. 100 డేస్ ఉద్యమం.. కేంద్రం దిగొచ్చేనా?
posted on May 22, 2021 @ 12:03PM
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు. దశాబ్దాల క్రితం సాధించుకున్న పరిశ్రమ. ఏళ్లుగా లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీ. విశాఖతో ఉక్కు కర్మాగారం బంధం విడదీయలేనిది. ఇప్పుడు ఉన్నట్టుండి విశాఖ ఉక్కు మీది కాదంటే ఎలా? ప్రైవేటుకు అమ్మేస్తామంటే ఊరుకుంటారా? అందుకే, కార్మికులు, స్థానికులు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పార్లమెంట్‌లో నిర్ణయం ప్రకటించిన వెంటనే.. విశాఖలో ఉద్యమం వెల్లువెత్తుంది. కేంద్ర నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ కార్మికులు నిరహార దీక్షలకు కూర్చొన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లతో ఉక్కు ఉద్యమం హోరెత్తింది.
కట్ చేస్తే, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి నేటికి వంద రోజులు. విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో గడిచిన 100 రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తోంది.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద ఉక్కు పరిరక్షణ, కార్మిక సంఘ నేతలు నిరసన తెలుపుతున్నారు. నిరసనకు సీపీఎం, సీపీఐ, టీఎన్‌టీయూసీ మద్దతు తెలిపాయి. రాష్ట్ర ఎంపీలందరూ కలిసి ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పరిరక్షణ సమితి నేతలు కోరుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉప సంహరించుకునే వరకూ ఉద్యమాన్ని ఆపబోమని నిర్వాసిత గ్రామాల ప్రజలు చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల కార్మికులు, నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు.
ఇంతగా ఉద్యమిస్తున్నా.. కేంద్రంలో ఉలుకుపలుకూ లేదు. ప్రస్తుత కొవిడ్ కల్లోల సమయంలో దేశానికి టన్నులకు టన్నులు ఆక్సిజన్ అందిస్తూ.. కరోనా బాధితుల ప్రాణాలు నిలుపుతున్న విశాఖ ఉక్కు కంపెనీపై సర్కారుకు ఎందుకంత చిన్నచూపని ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయిస్తే సరిపోతుంది.. వెంటనే భారీ లాభాలు ఆర్జించిపెడుతుంది.. కావలసినంత ఆక్సిజనూ అందిస్తుంది.. విశాఖ ఉక్కుతో సమస్య ఉండుంటే.. దానికి పరిష్కారమూ స్పష్టంగా కనిపిస్తోంది. అది వదిలేసి.. మేము నిర్ణయం తీసేసుకున్నాం.. విశాఖ ఉక్కును పోస్కోకు అమ్మేస్తున్నాం.. అన్నట్టు మొండిగా వ్యవహరిస్తుండటంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ తీరుపైనా ఉక్కు కార్మికులు మండిపడుతున్నారు. పైపై ప్రకటనలు, ఉత్తుత్తి చర్యలు మినహా.. స్టీల్ ప్లాంట్ కోసం జగన్‌రెడ్డి సర్కారు గట్టిగా పోరాడటం లేదని అంటున్నారు. జగన్‌కు చెప్పే.. విశాఖను ప్రైవేటైజేషన్ చేస్తున్నామని కేంద్రం స్పష్టంగా ప్రకటించినా.. తనకేం సంబంధం లేదన్నట్టు సీఎం జగన్ మాట్లాడటాన్ని తప్పుబడుతున్నారు. పోస్కో కంపెనీ యాజమాన్యంతో జగన్‌రెడ్డి రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని.. పెద్ద ఎత్తున క్విడ్ ప్రోకో నడిచిందని.. విపక్షం ఆరోపిస్తోంది. జగన్ సర్కారు సహకారంతోనే కేంద్రం విశాఖ ఉక్కును అడ్డగోలుగా అమ్మేస్తోందని అంటున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. ఇప్పటికే 100 రోజులుగా దీక్షలు చేస్తున్నారు.. లెక్క ఎక్కువైనా పర్లేదు.. తగ్గేదే లే.. అంటున్నారు విశాఖ ఉక్కు మనుషులు.