ఆనందయ్య మందుపై వెంకయ్య ఆరా... నెల్లూరుకు ఐసీఎంఆర్ టీమ్
posted on May 21, 2021 @ 9:11PM
దేశ వ్యాప్తంగా చర్చగా మారింది కృష్ణపట్నం ఆనందయ్య కరోనా ఆయుర్వేద ఔషదం. కరోనాను నయం చేస్తుందన్న ప్రచారంతో ఏపీతో పాటు పలు రాష్ట్రాల నుంచి జనాలు కృష్ణపట్నం వస్తున్నారు. తాకిడి పెరగడంతో పోలీసులు మందు పంపిణిని నిలిపివేశారు. ప్రభుత్వం మంది పంపిణిని ఆపేయడంపై జనాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లా కలెక్టర్ మాత్రం అధ్యయన రిపోర్ట్ వచ్చాకే మందు సరఫరాపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
కొవిడ్ బాధితులకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద మందు మీద అధ్యయనం ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయుష్ ఇన్ చార్జ్ మంత్రి శ్రీ కిరణ్ రిజ్జు, ఐసిఎంఆర్. డైరక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్ కు సూచించారు. ఆయుర్వేద మందు విషయంలో నెల్లూరులో నెలకొన్న పరిస్థితులు, వేలాదిగా ప్రజలు తరలివస్తున్న విషయం ఉపరాష్ట్రపతి దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రి మరియు డైరక్టర్ జనరల్ తో ఫోన్ ద్వారా మాట్లాడారు.
అంతకు ముందు కృష్ణపట్నం చుట్టు పక్కల గ్రామాలకు చెందిన తమ పరిచయస్తులతో మాట్లాడిన ఉపరాష్ట్రపతి, విషయ పూర్వాపరాలు తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన అంశాలను కేంద్ర మంత్రి మరియు డైరక్టర్ జనరల్ కు వివరించి, దీనికి సంబంధించిన అంశాలపై వారితో చర్చించారు. విషయ ప్రాముఖ్యత దృష్ట్యా వెంటనే ఆ మందు మీద అధ్యయనం ప్రారంభించి, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య ఇస్తున్న కరోనా ఔషధంపై పరిశీలన చేపట్టేందుకు ఐసీఎంఆర్ బృందం కృష్ణపట్నం చేరుకుంది. ఆనందయ్య ఔషధం తయారీలో ఉపయోగించే చెట్ల ఆకులు, పదార్థాలను ఐసీఎంఆర్ బృందంలోని సభ్యులు పరిశీలించారు. ఔషధ తయారీ విధానాన్ని ఆనందయ్యను అడిగి తెలుసుకున్నారు. ఆయుర్వేద మందుతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అనే కోణంలో ఆరా తీశారు. ఐసీఎంఆర్ బృందం వెంట నెల్లూరు జేసీ హరేంద్రప్రసాద్, డీపీవో ధనలక్ష్మి కూడా ఉన్నారు. కృష్ణపట్నంలో ఆనందయ్య అందించే మూలికా ఔషధం కరోనాను తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తోందంటూ ప్రచారం జరగడంతో ప్రజలు పోటెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆ ఔషధం సమర్థత తెలిసేదాకా పంపిణీ నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.