దొరికినంత దోచుకో ... లాక్ డౌన్ దోపిడీతో అల్లాడుతున్న జనం
posted on May 21, 2021 @ 7:32PM
కరోనా కష్ట కాలంలోనూ, అందరూ కాదు కానీ, కొందరు వ్యాపారులు, ఇదే అదనుగా సామాన్యులను దోచుకుంటున్నారు.కార్పొరేట్ అసుపత్రులలో జరుగతున్న దోపిడీ గురించి అయితే, చెప్పనే అక్కరలేదు.అలాగే, అత్యవసర మందుల బ్లాక్ మార్కెటింగ్, ఇతరత్రా కొవిడ్ బాధితులు ఎదుర్కుంటున్న దోపిడీ, దుర్మార్గాల గురించి కూడా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. ఆసుపత్రుల వద్ద కనిపించే కొన్ని సంఘటనల గురించి విన్నప్పుడు, వీళ్ళు అసలు మనుషులేనా అనిపిస్తుంది.
సరే, అదలా ఉంటే, కరోనా కట్టడి కోసం రాష్ట్ర పభుత్వం లాక్ డౌన్ విధించడంతో సామాన్యులను దోచుకునేందుకు, వ్యాపారులు దాన్నొక సాకుగా ఉపయోగించుకుంటున్నారు. నిజానికి, ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా, అనేక మంది రోజువారీ కూలీలు, ఇతరత్రా చిరు ఉద్యోగులు, స్వయం ఉపాధి పై ఆధారపడి జీవించే వారు, పని లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అనేక కుటుంబాలకు రోజు గడవడమే కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో కూడా, సిగరెట్, బీడి మొదలు ఉప్పు, పప్పు,చితపండు వరకు ప్రతి వస్తువు ధరలను అడ్డగోలుగా పెంచేసి, అదేమంటే, లాక్ డౌన్’ను సాకుగా చూపుతున్నారు. పది రోజుల క్రితం కిలో కందిపప్పు రూ. 120 , ఇప్పుడు అదే కందిపపు కిలో రూ. 150. చిత్రం ఏమంటే, అవసరం అయితే దేశం కోసం తమ సంపద మొత్తం ఇచ్చేదుకు సిద్దమని ప్రకటించిన టాటా గ్రూప్, వస్తువలను కూడా స్థానిక వ్యాపారాలు, మాల్స్’లో అధిక ధరలకు అమ్ముతున్నారు.ఇలా ఇదీ అదీ అని కాకుండా.. అన్ని రకాల వస్తువుల ధరలు గత 10 రోజులుగా పెరిగిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం.. వ్యాపారులే..! లాక్‌డౌన్ పేరుతో వారు ఎడాపెడా ధరలు పెంచి, విక్రయాలు జరుపుతున్నారు.
ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు వెసులుబాటు ఇవ్వడంతో.. వ్యాపారులు వినియోగ దారులను ఇష్టారరాజ్యంగా జనాలను దోచుకుంటున్నారు. అది పేస్టు అయినా టీపొడి లేదా మరో వస్తువు ఏదైనా ప్రతి వస్తువు ధరను 10 నుంచి 15 శాతం వరకు పెంచేశారు. అదేమని దిగితే ,నేరం మాది కాదు హోల్‌సేలర్లది, అని నెపాన్ని హోల్ సెల్లర్స్ మీద నెట్టేస్తున్నారు. అయితే, అందులో నిజం కూడా ఉండవచ్చును. కానీ, పూర్తిగా పాపం అంతా హోల్ సెల్లర్స్’ ది మాత్రమే కాదు. తిలా పాపం తలా పిడికెడు .. కొన్నిచోట్ల ఏకంగా ఎమ్మార్పీని మించి విక్రయాలు జరుపుతున్నారు. సబ్బులు, షాపూలు, నూనెలు వంటి వస్తువులకు గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ)పై రూ. 2 నుంచి రూ. 10 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. నిజానికి వంట నూనెలు హోల్‌సేల్‌లో ఎమ్మార్పీ కంటే రూ. 10 నుంచి రూ.20 తక్కువకే లభిస్తాయి.రిటైలర్లు వాటిపై రూ. 5 నుంచి రూ. 10 వరకు మార్జిన్ చూసుకుని, ఎమ్మార్పీ కంటే తక్కువకే విక్రయిస్తారు. కానీ, లాక్‌డౌన్ తర్వాత.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు జరుపుతున్నారు. లాక్ డౌన్’ ను కొందరు వ్యాపారాలు తమ దోపిడీకి లైసెన్స్’గా బావిస్తున్నారు. దీంతో.. పేద, మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు.ఈ దోపిడీని అరికట్టేందుకు, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటేనేగానీ,పరిస్థితి అదుపులోకి వచ్చేలా లేదు.