ఫోన్‌లోనే పల్స్ ఆక్సీమీటర్.. కరోనా స్టార్టప్..
posted on May 22, 2021 @ 11:23AM
కరోనా ప్రాణాలు తోడేస్తోంది. ఉన్నట్టుండి ఊపిరి తీసేస్తోంది. రికవరీ రేటు భారీగానే ఉంటోంది. అయినా.. కొవిడ్ సోకితే ఏదో తెలియని భయం. ఊపిరి ఆడటం లేదనే ఆందోళన. ఆక్సిజన్ రేటు పడిపోయిందేమోననే అనుమానం. కరోనా సోకితే.. ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలంటూ డాక్టర్లు పదే పదే సూచిస్తున్నారు. ప్రాణవాయువు 95కి తగ్గితే ప్రమాదకరమని.. ఇక 90కి పడిపోతే వెంటనే హాస్పిటల్‌లో చేరాలని హెచ్చరిస్తున్నారు. మరి, ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవడం కోసం పల్స్ ఆక్సీమీటర్ కొందామంటే కాస్త ఖరీదు ఎక్కువే. మార్కెట్లో అందుబాటూ తక్కువే. ఇలాంటి ఇబ్బందులు ఇక మీదట అవసరం లేదు. జస్ట్.. ఇంట్లో ఉండే మీ మొబైల్ ఫోన్‌లో ఆక్సిజన్ స్థాయిలు తెలుసుకోవచ్చు. చాలా సింపుల్.. ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే సరి.
‘కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్’. ఫోటో ప్లెథిస్మోగ్రఫీ టెక్నాలజీతో, కృత్రిమ మేధ సాయంతో కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్ పనిచేస్తుంది. సాధారణంగా ఆక్సీమీటర్లలో ఇన్‌ఫ్రారెడ్ లైట్ సెన్సార్లు ఉంటాయి. కానీ ఈ యాప్‌లో కేవలం ఫోన్‌లోని ఫ్లాష్ ఆధారంగా ఆక్సిజన్ స్థాయి తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను తెరచి ఫోన్ ఫ్లాష్‌లైట్ ఆన్ చేసి వెనుక కెమెరాపై వేలిని ఉంచాలి. తర్వాత స్కాన్ అనే బటన్‌ను నొక్కగానే 40 సెకన్లలో ఆక్సిజన్, పల్స్, శ్వాసక్రియ రేట్లను యాప్‌లో చూపిస్తుంది.
ఇప్పటికే ఈ పని తీరుపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. అందులో ఈ యాప్ 96 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైందని.. ఈ యాప్‌ను తయారు చేసిన కోల్‌కతా కేంద్రంగా పని చేస్తున్న.. కేర్ నౌ హెల్త్‌కేర్ అనే అంకుర సంస్థ వెల్లడించింది.
‘కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్’ ప్రస్తుతం ఐవోఎస్ వినియోగదారుల కోసం యాప్‌స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అయితే వెబ్‌సైట్‌లో ఏపీకేను అందుబాటులోకి ఇచ్చారు. త్వరలో ప్లే స్టోర్‌లోకి తీసుకురానున్నారు. సింగిల్ యూజర్ వినియోగం కోసం యాప్‌ను ఉచితంగా అందిస్తున్నారు. అంతకుమించి ఎక్కువ మందికి సేవలు కావాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వివరాలు కేర్‌నౌ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.