బ్లాక్ అండ్ వైట్ అటాక్.. ఫంగస్‌తో ఫసక్..
5,500 కేసులు. 126 మరణాలు. ఇవేమీ కరోనా సోకిన వారి వివరాలు కావు. అవేమీ కొవిడ్‌తో సంభవించిన చావులేమీ కావు. ఇన్నాళ్లూ.. ప్రతీరోజూ కొత్తగా ఇంత మందికి కరోనా సోకింది.. వైరస్ వల్ల అంత మంది చనిపోయారంటూ అప్‌డేట్స్ తెలుసుకున్నాం. ఇకపై కరోనాకు తోడుగా బ్లాక్ ఫంగస్ డిటైల్స్ సైతం తెలుసుకోవాల్సిన దుస్థితి. ఎందుకంటే, కరోనా మాదిరే.. బ్లాక్ ఫంగస్ కేసులు సైతం దేశంలో విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాలూ అదే జోరుతో నమోదవుతున్నాయి. కొవిడ్‌తో పోలిస్తే.. బ్లాక్ ఫంగస్ మరింత డేంజరస్ అనే వార్తలు మరింత కలవరపెడుతున్నాయి.
ఓ వైపు దేశమంతా కరోనా మహమ్మారితో అల్లాడుతున్న వేళ ఫంగస్ వ్యాధి భయపెడుతోంది. రోజురోజుకీ బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 5,500 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదుకాగా.. 126 మంది చనిపోయినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇక కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలోనే ఈ ఫంగస్ కేసులు కూడా అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 90 మరణాలు సంభవించాయి.
ఆ తర్వాత హరియాణాలో 14 మంది, ఉత్తరప్రదేశ్‌లో 8 మంది, ఝార్ఖండ్‌లో నలుగురు, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ఇద్దరు చొప్పున బ్లాక్ ఫంగస్‌తో మరణించారు. కొన్ని రాష్ట్రాలు ఈ ఫంగస్ కేసులు, మరణాలను నమోదు చేయకపోవడంతో ఇంకా పూర్తి సంఖ్య స్పష్టంగా తెలియడం లేదంటున్నారు.
తెలుగురాష్ట్రాల్లోనూ బ్లాక్ ఫంగస్ వేగంగా విస్తరిస్తోంది. ఏపీలో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో బ్లాక్ ఫంగస్ చికిత్సకు సరైన సదుపాయాలు లేకపోవడంతో.. బాధితులంగా హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. కరోనా విషయంలోనే అట్టర్‌ఫ్లాప్ అయిన జగర్‌రెడ్డి సర్కారు.. ఇక బ్లాక్ ఫంగస్‌ను అరికట్టడంలో చేతులెత్తేసింది. ఏపీ సర్కారు బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి చేతులు దులిపేసుకుంది.
అటు, తెలంగాణలో బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) రోగుల బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. చికిత్స కోసం ఇతర రాష్ట్రాల నుంచీ హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రికి వస్తున్నా పడకలు దొరకడం లేదు. తమ వంతు కోసం ఆసుపత్రి ఆవరణలో పడిగాపులు కాయాల్సివస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసుపత్రిని బ్లాక్ ఫంగస్‌కు నోడల్ కేంద్రంగా ప్రకటించింది. ప్రస్తుతం 90 పడకల వరకు నిండడంతో మరో 50 పెంచేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర ప్రాంతాలవారనే వివక్ష లేకుండా అందర్నీ చేర్చుకోవాలని రోగుల బంధువులు విజ్ఞప్తి చేస్తుండగా, పడకలు లేకపోవడం వల్లే కొందరికి కేటాయించలేకపోతున్నామని వైద్యులు చెబుతున్నారు.
ఈఎన్‌టీ వైద్యశాలలో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం సీటీస్కాన్ పనిచేయడం లేదు. ఫంగస్ ముఖ భాగంలో ఎక్కడెక్కడ వ్యాపించిందనేది గుర్తించడం కష్టమే. ఫంగస్ మెదడులోకి విస్తరించిందో లేదో తెలుసుకోవాలంటే బ్రెయిన్ ఎం.ఆర్.ఐ., మరికొన్ని ఇతర పరీక్షలు అవసరమవుతాయి. ఇవేమీ ఈఎన్‌టీ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో రోగులను ఉస్మానియా ఆసుపత్రికి పంపుతున్నారు. అక్కడ తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది.
గాంధీ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ బాధితులకు ప్రత్యేక వార్డు కేటాయించారు. కేవలం కరోనా పాజిటివ్‌తో పాటు బ్లాక్‌ఫంగస్ ఉంటేనే చేర్చుకుంటున్నామని వైద్యులు తెలిపారు. ఇక్కడ చికిత్స పొందుతున్న బ్లాక్ ఫంగస్ రోగుల సంఖ్య గురువారానికి 23కు చేరింది. ఆసుపత్రి ప్రధాన భవనంలోని నాలుగో అంతస్తులో 30 పడకలతో ప్రత్యేకంగా ఓ వార్డు ఏర్పాటు చేశారు.
నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బ్లాక్‌ఫంగస్ బాధితుల తాకిడి పెరుగుతోంది. కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో గురువారం ఒక్కరోజే 39 మంది చేరారు. ఇప్పటికే ఇక్కడ 90 మంది వరకు చేరారు. ఏడుగురికి శస్త్ర చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. గాంధీలో ఇదే వ్యాధితో 23 మంది చికిత్స పొందుతున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో కోఠి ఈఎన్‌టీలో పడకలకు కొరత ఏర్పడుతోంది.
మరోవైపు బ్లాక్‌ఫంగస్ ఉద్దృతమవుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు దీన్ని అంటువ్యాధిగా ప్రకటించాలని, రోగులకు అత్యవసర చికిత్స అందించాలని కేంద్రం ఆదేశించింది. అటు కేసులు పెరుగుతుండటంతో ఈ వ్యాధిని అదుపు చేసేందుకు ఉపయోగించే లిపోసోమల్ యాంపొటెరిసిన్ బి ఇంజెక్షన్ ఔషధం కొరత ఏర్పడుతోంది. ప్రస్తుతం ఈ మందుల కొరతను అధిగమించేందుకు మరో 5 కంపెనీలకు అనుమతులిచ్చింది కేంద్ర ప్రభుత్వం.
కొవిడ్ వైరస్, బ్లాక్ ఫంగస్ భయం ఉండగానే తాజాగా వైట్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. బీహార్ లోని పాట్నాలో నలుగురికి వైట్ ఫంగస్ వ్యాధి నిర్ధారణ అయింది. వీరికి కరోనా టెస్టుల్లో నెగెటివ్ రిపోర్టులు వచ్చినప్పటికీ... వీరికి వైట్ ఫంగస్ సోకినట్టు స్పష్టమైంది. అయితే వీరికి యాంటీ ఫంగల్ ఔషధాలను ఇవ్వడంతో ఆ వ్యాధి నుంచి కోలుకున్నారు.
వైద్యులు చెపుతున్న దాని ప్రకారం బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ మరింత డేంజరస్. వైట్ ఫంగస్ సోకినవారిలో వారి ఊపిరితిత్తులు, చర్మం, గోళ్లు, కడుపు, మూత్రపిండాలు, మెదడు, మర్మావయవాలు, నోరు ప్రభావితమవుతాయి. వైట్ ఫంగస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హెచ్ఆర్సీటీ ద్వారా ఈ ఫంగస్ ను గుర్తించవచ్చు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు హెచ్ఆర్‌సీటీలో కనిపిస్తే, వైట్ ఫంగస్‌ను కనుగొనడానికి మ్యూకస్ (శ్లేష్మం) కల్చర్‌ను ఎగ్జామిన్ చేయాలి. ఎక్కువ కాలం స్టెరాయిడ్లు తీసుకునేవారికి, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి, డయాబెటిస్ బాధితులకు.. వైట్ ఫంగస్ సోకే ప్రమాదం ఎక్కువ.
ఇలా కరోనాకు పోటీగా బ్లాక్ అండ్ వైట్ ఫంగస్ కేసులు పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకరం. కరోనానే అంటే ఈ ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు మరింత డేంజరస్ అని చెబుతుండటంతో ప్రజలు మరింత బెదిరిపోతున్నారు.