కరోనా మరణాలపై WHO షాకింగ్ రిపోర్ట్..
posted on May 22, 2021 @ 1:10PM
ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని షేక్ చేస్తోంది కరోనా మహమ్మారి. ప్రస్తుతం వైరస్ సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ తో భారత్ అల్లాడిపోతోంది. 18 నెలల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా శనివారం ఉదయం వరకు అధికార లెక్కల ప్రకారం 16 కోట్ల 64 లక్షల మంది వైరస్ భారీన పడ్డారు. ఇప్పటి వరకు 34 లక్షల మందికి పైగా చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మరణాలపై షాకింగ్ విషయం వెల్లడించింది. వివిధ దేశాలు ఇస్తున్న లెక్కల కంటే రెండింతలు ఎక్కువగానే కరోనాతో జనాలు చనిపోయారని అంచనా వేసింది. కరోనాతో ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగానే చనిపోయారని అభిప్రాయపడుతోంది. మొదటి వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని, ఈ సంవత్సరం మరణాల సంఖ్య భారీగా పెరిగిందని వెల్లడించింది.
గత ఏడాది డిసెంబర్ 31 వరకు 18 లక్షల మంది మాత్రమే చనిపోయారని ప్రపంచ దేశాల గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది. ఆయా దేశాలు మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపించాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఆయా దేశాలు వెల్లడించిన గణాంకాల కంటే 12 లక్షల మరణాలు అధికంగా సంభవించి ఉండవచ్చని తెలిపింది.
కరోనా సోకి చికిత్స పొందుతూ మరణించిన వారితో పాటు పాజిటివ్‌గా వచ్చి ఇళ్లలో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి గణాంకాలనే ప్రపంచ దేశాలు నమోదు చేశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కరోనా నిర్ధారణ సరిగా జరగకముందే మృతి చెందిన వారు చాలా మంది ఉన్నారని, ఆ మృతుల సంఖ్యను లెక్కల్లోకి తీసుకోలేదని వివరించింది. కరోనా సోకవడం వల్ల మాత్రమే కాకుండా ఆ సంక్షోభం కారణంగా తలెత్తిన పరిణామాల వల్ల కూడా చాలా మంది మృతిచెందారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. మే 22 శనివారం వరకు ఇండియాలో 2 కోట్ల 62 లక్షల మందికి పైగా కరోనా సోకగా.. 2 లక్షల 95 వేల మంది చనిపోయారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే అనధికారిక లెక్కల ప్రకారం ఇదీ డబుల్ ఉంటుందని చెబుతున్నారు.