విశాఖ ఉక్కుని తుక్కు రేటుకి కొట్టేసే కుట్ర! సీఎం జగన్ పై లోకేష్ ఫైర్
posted on May 22, 2021 @ 12:24PM
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం వంద రోజులకు చేరింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా గత 100 రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు పోరాడుతున్నారు. రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలతో కార్మికులు తమ నిరసన కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమం జరుగుతోంది. విపక్ష పార్టీలు ఉద్యమానికి మద్దతు తెలిపాయి. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తోంది.
విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయ ప్రతిపాదనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 64 గ్రామాల ప్రజలు 26 వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన ఫలితమే విశాఖ స్టీల్‌ప్లాంట్ . లక్షలాది మందికి ఉపాధి.ఉత్తరాంధ్రాలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కర్మాగారాన్ని విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ‘విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు’ అంటూ ప్రాణాలు అర్పించి కర్మాగారాన్ని సాధించుకున్నామని, ఆ విధంగానే ప్రాణాలు ఒడ్డయినా ప్లాంటును రక్షించుకుంటామని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే దీనికోసం ఉద్యమం నడుపుతామని రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్నాయి.
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుతో ఉత్తరాంధ్ర ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంది. స్టీల్ ప్లాంటు అనగానే మాతృ సంస్థగా, అందరికీ ఉపాధి కల్పించేదిగా అభిమానిస్తారు. అక్కడ తయారైన స్టీల్‌నే గృహ నిర్మాణానికి ఉపయోగించడం సెంటిమెంట్‌గా భావిస్తారు. కర్మాగారంలో శాశ్వత ఉద్యోగులు 17 వేల మంది వరకు ఉండగా, కాంట్ర్టాక్టు కార్మికులుగా మరో 20 వేల మంది వరకు పనిచేస్తున్నారు. దీనికి అనుబంధంగా ఏర్పాటైన వందలాది చిన్న తరహా పరిశ్రమలపై మరో లక్ష మంది వరకు ఆధారపడి జీవిస్తున్నారు. విశాఖలో అన్నిరకాల వ్యాపారాల్లోను స్టీల్ ప్లాంటు ఉద్యోగుల లావాదేవీలు అధమంగా పది శాతం ఉంటాయి. నెలకు ఎలా లేదన్నా రూ.200 కోట్లు స్టీల్ ప్లాంటు నుంచి విశాఖ మార్కెట్‌లోకి వస్తుంది. అటువంటి సంస్థను ప్రైవేటుపరం చేస్తే...విశాఖలో ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయనే అందోళన వ్యక్తమవుతోంది.
విశాఖ ఉక్కు ఉద్యమం 100 వ రోజుకి చేరిన నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గత 100 రోజులుగా పోరాటం చేస్తున్న కార్మికులకు ఉద్యమాభివందనలు. విశాఖ ఉక్కు ని తుక్కు రేటుకి కొట్టేసి కార్మికుల ఊపిరి తియ్యాలని వైఎస్ జగన్ కుట్రలు చేస్తుంటే దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసి కరోనా రోగులకు ఊపిరి పోశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు' అని నారా లోకేశ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 'ఇప్పటికైనా రాష్ట్రంలో దొంగ తీర్మానాలు, ఢిల్లీలో పాదసేవ మాని చిత్తశుద్ధితో ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం పోరాడాలి. ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది' అని నారా లోకేశ్ స్పష్టం చేశారు.