పిచ్చోడిగా ముద్ర వేసిన డా సుధాకర్ మృతి.. జగన్ రెడ్డిదే పాపమన్న టీడీపీ
posted on May 22, 2021 8:53AM
విశాఖ జిల్లా నర్సీంపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్ (52) గుండెపోటుతో మృతి చెందారు. విశాఖపట్టణంలోని సీతమ్మధారలో ఉంటున్న డాక్టర్ సుధాకర్ ఇంట్లోనే గుండెపోటుతో మృతి చెందారు.గతేడాది కరోనా రోగులకు సేవలు అందించిన డాక్టర్ సుధాకర్ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, ప్రభుత్వాధికారులు ఎవరూ తమకు సహకరించడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ప్రభుత్వం సుధాకర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై డాక్టర్ సుధాకర్ తీవ్ర మనస్తాపం చెందారు. వైద్యులకు వసతులు లేవని చెప్పడంతో తనపై కక్షగట్టి సస్పెండ్ చేశారని ఆరోపించారు.
గత ఏడాది మే నెలలో విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం వద్ద జాతీయ రహదారిపై గలాటా సృష్టిస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్‌ను నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను ఆ సమయంలో కొట్టడం, చేతులు విరిచికట్టడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. ఆ వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
డాక్దర్ సుధాకర్ కు మతిస్థిమితం లేదంటూ పోలీసులు ఆయనను మానసిక వైద్యశాలకు తరలించారు. దీనిపై దళిత నాయకులు కోర్టును ఆశ్రయించడంతో సీబీఐతో విచారణ చేయించారు. కోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించడం అప్పట్లో సంచలనమైంది. త్వరలోనే ఈ కేసులో తీర్పు రావాల్సి ఉండగా అంతలోనే ఆయన మరణించారు. కాగా సుధాకర్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
డాక్టర్ సుధాకర్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడునారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు సుధాకర్ బలయ్యారని అన్నారు. మాస్కులు అడిగిన పాపానికి శారీరకంగా, మానసికంగా వేధించి సుధాకర్‌ను జగన్ ప్రభుత్వం బలిగొందని విమర్శించారు. సుధాకర్ మృతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మానసికంగా వేధించి సుధాకర్‌ను చంపారని ఆరోపించారు. నడిరోడ్డు మీద బట్టలు తీసి, డాక్టర్ సుధాకర్‌ను జగన్ ప్రభుత్వం వేధించిందన్నారు. జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేక చర్యలకు ఒక డాక్టర్ బలైయ్యాడన్నారు. దళిత డాక్టర్ మృతికి కారణమైన జగన్మోహన్ రెడ్డి ఇంతకింత అనుభవించే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. జగన్ ప్రభుత్వం మానసికంగా వేధించడంతోనే డాక్టర్ సుధాకర్ మృతి చెందారని ఆరోపించారు. మృతుని కుటుంబ సభ్యులకు కోటి రూపాయలు పరిహారం ఇచ్చి, అన్ని విధాల ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. సుధాకర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
డాక్టర్ సుధాకర్ గారి మృతి తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మాస్క్ అడగడమే దళిత వైద్యుడు చేసిన నేరంగా జగన్‌రెడ్డి ఆదేశాలతో రెక్కలు విరిచి కట్టి, కొట్టి, నానా హింసలు పెట్టి పిచ్చాసుపత్రిలో చేర్పించడంతో సుధాకర్ బాగా కుంగిపోయారని తెలిసింది.. ఒక సామాన్య వైద్యుడిని వెంటాడి వేధించి చివరికి ఇలా అంతమొందించారు.. ఇది గుండెపోటు కాదు. ప్రశ్నించినందుకు ప్రభుత్వం చేసిన హత్య ఇది..నిరంకుశ సర్కారుపై పోరాడిన సుధాకర్ గారికి నివాళి అర్పిస్తున్నాను.ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.