అప్పుడు సుధాకర్.. ఇప్పుడు రఘురామ.. రాజ్యం పగబడితే...
posted on May 22, 2021 @ 1:28PM
డాక్టర్ సుధాకర్. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ప్రభుత్వ వైద్యులు. ఎంపీ రఘురామకృష్ణరాజు. నర్సాపురం పార్లమెంట్ సభ్యులు. వీరిద్దరికి ఎలాంటి సంబంధం లేదు. వీరిద్దరికీ ఒకరికి ఒకరు పరిచయం లేదు. ఒకరు ప్రభుత్వ వైద్యులు. మరొకరు గౌరవ పార్లమెంట్ సభ్యులు. అయినా.. ఓ విషయంలో మాత్రం వీరిద్దరూ బాధితులే. జగన్‌రెడ్డి ప్రభుత్వానికి ఎదురు మాట్లాడితే.. సర్కారు తప్పుడు విధానాలను తప్పు అని చెబితే.. ముఖ్యమంత్రికి భజన చేయకుండా.. సమస్యలు సీఎం దృష్టికి తీసుకొస్తే.. ఎట్టా ఉంటాదో చెప్పడానికి నిదర్శనం ఈ ఇద్దరు.
ఆసుపత్రిలో సమస్యలు ఎత్తిచూపిన పాపానికి.. డాక్టర్ సుధాకర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసి.. పిచ్చివాడిగా ముద్ర వేసి.. మెంటల్ హాస్పిటల్‌కు పంపించి.. శారీరకంగా, మానసికంగా వేధించి.. చుక్కలు చూపించింది జగన్‌రెడ్డి సర్కారు. ఏడాదికి పైగా అనుభవిస్తున్న మనోవేధనతోనే డాక్టర్ సుధాకర్ గుండె ఆగి చనిపోయాడని అంటున్నారు. రఘురామను సైతం అదే విధంగా చేయాలనుకున్నారేమో! రాజద్రోహానికి పాల్పడుతున్నాడంటూ నాన్‌బెయిలబుల్ కేసు పెట్టి.. గుంటూరు జైలులో కుక్కారు. జైల్లోనే రఘురామను హత్య చేసేందుకు కుట్ర చేశారంటూ స్వయంగా రఘురామ సతీమణి రమాదేవి ఆరోపించడం కలకలం రేపింది. కానీ, డాక్టర్ సుధాకర్‌లా.. ఎంపీ రఘురామ అమాయకుడు కాదు. బలమైన నాయకుడు. రాజ్యంతో తుదకంటూ పోరాడగల సత్తా ఆయన సొంతం. అందుకే, సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ.. బెయిల్ తెచ్చుకున్నారు. జగన్‌రెడ్డి కబంధ హస్తాల నుంచి బయటపడ్డారని చెబుతున్నారు.
డాక్టర్ సుధాకర్ మృతి చెందడం.. రఘురామకు బెయిల్ రావడం.. ఈ రెండూ ఒకేరోజు జరగడం కాకతాళీయమే. సందర్భం కుదిరింది కాబట్టే ఇప్పుడంతా సుధాకర్, రఘురామ గురించి చర్చించుకుంటున్నారు. గతేడాది కరోనా రోగులకు సేవలు అందించిన డాక్టర్ సుధాకర్ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, ప్రభుత్వాధికారులు ఎవరూ తమకు సహకరించడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ప్రభుత్వం సుధాకర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై డాక్టర్ సుధాకర్ తీవ్ర మనస్తాపం చెందారు. వైద్యులకు వసతులు లేవని చెప్పడంతో తనపై కక్షగట్టి సస్పెండ్ చేశారని ఆరోపించారు.
గత ఏడాది మే నెలలో విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం వద్ద జాతీయ రహదారిపై గలాటా సృష్టిస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్‌ను నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను ఆ సమయంలో కొట్టడం, చేతులు విరిచికట్టడంపై.. తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.డాక్దర్ సుధాకర్ కు మతిస్థిమితం లేదంటూ పోలీసులు ఆయనను మానసిక వైద్యశాలకు తరలించారు. దీనిపై దళిత నాయకులు కోర్టును ఆశ్రయించడంతో సీబీఐతో విచారణ చేయించారు. కోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించడం అప్పట్లో సంచలనమైంది. త్వరలోనే ఈ కేసులో తీర్పు రావాల్సి ఉండగా అంతలోనే ఆయన మరణించారు. కాగా సుధాకర్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
డాక్టర్ సుధాకర్‌ను ప్రభుత్వం టార్చర్ చేసిన తీరును.. ఎంపీ రఘురామను సర్కారు కేసులతో వేధిస్తున్న వైనాన్ని.. పోల్చి చూస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు వారిద్దరికి ఎదురైన చేదు అనుభవాలను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న విమర్శనే భరించలేక.. సుధాకర్‌ను టార్చర్ చేయడంతో.. ఆయన గుండెపోటుతో మరణించే వరకూ వచ్చింది. గుండె ఆపరేషన్ అయిన రఘురామను అరెస్ట్ చేయడం.. ఆయన ఆరోపిస్తున్నట్టు కస్టడీలో తీవ్రంగా కొట్టడం.. జైల్లో మూసేయాలని చూసిన ప్రభుత్వ బరితెగింపు విధానాలను తీవ్రంగా తప్పుబడుతున్నారు ప్రజాస్వామ్యవాదులు.
సీబీఐ కేసు ఇంకా కొనసాగుతుండగానే డాక్టర్ సుధాకర్ మృతి చెందారు. రఘురామను కస్టడీలో కొట్టడంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఆయన కుమారుడు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. మరోవైపు, జగన్‌కు బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై వేగంగా విచారణ జరుగుతోంది. ఇలా డాక్టర్ సుధాకర్, ఎంపీ రఘురామల ఉదంతాలకు కారణం జగన్‌రెడ్డి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కోర్టులు, తీర్పులు ఎలా ఉన్నా.. ఈ రెండు కేసులూ సర్కారు చేసిన కుట్ర, కుతంత్రాల ఫలితమేననేది ప్రజల అభిప్రాయం. అందుకే, ప్రజాకోర్టులో దోషిగా నిలబడుతోంది జగన్‌రెడ్డి సర్కారు.