10 వేలు దాటిన కరోనా మరణాలు.. బ్లాక్ ఫంగస్ కేసుల్లోనూ ఏపీ టాప్
posted on May 22, 2021 @ 8:01PM
కరోనా మహమ్మారితో అల్లాడుతున్న దేశాన్ని బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారికి సోకుతూ వారి ప్రాణాలకు ముప్పు తీసుకొస్తోంది. కేంద్ర గణాంకాల ప్రకారం శుక్రవారం (మే 21) నాటికి దేశవ్యాప్తంగా 8848 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. వాటిల్లో 58.66 శాతం మూడు రాష్ట్రాల్లోనే నమోదు కావడం భయాందోళనలకు కారణమవుతోంది. కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు ఏపీలో భారీగా నమోదవుతున్నాయి.
ఇప్పటివరకు గుజరాత్‌లో అత్యధికంగా 2281 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 2000 మందికి వచ్చింది. 910 మంది బ్లాక్ ఫంగస్ కేసులతో ఆంధ్రప్రదేశ్‌లో మూడో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (720), రాజస్థాన్ (700), కర్ణాటక (500) ఉన్నాయి. కరోనా చికిత్సలో భాగంగా అధిక మోతాదులో స్టెరాయిడ్స్ తీసుకున్న వారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. ఈ వ్యాధి సోకిన వారికి `అంపోటెరిసిన్-బి` ఔషధాన్ని వాడుతున్నారు.
ఏపీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది.గత 24 గంటల్లో వందకు పైగా మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 10 వేలు దాటింది. తాజా మరణాలతో కలిపి 10,022గా నమోదైంది. శుక్రవారం ఒక్కరోజులో 118 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మంది, చిత్తూరు జిల్లాలో 14 మంది మరణించారు. రోజువారీ కేసుల విషయానికొస్తే... 90,609 కరోనా పరీక్షలు నిర్వహించగా 19,981 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి 3 వేలకు పైన కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో తాజాగా 18,336 మంది కోలుకున్నారు. ఇంకా 2,10,683 మందికి చికిత్స కొనసాగుతోంది. ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,62,060కి చేరింది.