ఉక్కుశిబిరానికి నిప్పు.. మంటల వెనుక కుట్రకోణం?
posted on May 23, 2021 @ 2:00PM
విశాఖ ఉక్కు కోసం ఉక్కు సంకల్పంతో పోరాడుతున్నారు. ఒకటి, రెండు రోజులుగా కాదు.. ఏకంగా 100 రోజుల నుంచి అలుపెరగని ఉద్యమం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. కార్మికులు, నిర్వాసితులు మొక్కవోని దీక్షతో ఉద్యమిస్తున్నారు. జీవీఎంసీ కార్యాలయం ఎదుట.. గాంధీ విగ్రహం దగ్గర.. దీక్షా శిబిరం ఏర్పాటు చేసి.. అక్కడే తిష్టవేసి.. సర్కారు దిగొచ్చేదాకా.. తగ్గేదే లే అంటూ పోరాడుతున్నారు. నిత్యం ఆ దీక్షాశిబిరం కార్మికుల నినాదాలతో మారుమోగుతోంది. అలాంటి.. దీక్షాశిబిరం ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా అగ్నికి ఆహుతి అవడం కలకలం రేపింది.
ఉన్నట్టుండి మంటలు. చూస్తుండగానే శిబిరం అంతా వ్యాపించాయి. పెద్ద ఎత్తున అగ్రికీలలు చెలరేగాయి. తెల్లవారుజాము కావడంతో ఆ సమయంలో కార్మికులెవరూ దీక్షాశిబిరంలో లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. లేదంటే.. వారి ప్రాణాలు అగ్నికి ఆహుతి అయ్యే అవకాశం ఉండేది. క్షణాల్లోనే మంటలు ఎగిసి.. శిబిరం అంతా కాలి బూడిదైంది. ఆ వైపు నుంచి వెళ్తున్న వాకర్స్ మంటలను గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలు అదుపు చేశారు.
అగ్నిప్రమాదంపై ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. శిబిరం దగ్గర షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశమే లేదని, ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసి ఉంటారని ఆరోపించారు. ఎండల తీవ్రతలకు అగ్ని రాజుకుందేమో అనటానికి లేదు. ఎందుకంటే ప్రమాదం జరిగింది తెల్లవారుజామున కాబట్టి. ఆ సమయంలో వాతావరణం చల్లగా ఉంది. సో, ఎండ తీవ్రతకు నిప్పు రాజుకునే ఛాన్సే లేదు. షార్ట్ సర్క్యూట్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే.. అక్కడ పెద్దగా విద్యుత్ పరికరాలు ఏమీ లేవు కాబట్టి. శిబిరంలో ఆ సమయంలో మనుషులెవరూ లేనందునా.. ఏ బీడీ తాగితేనో... అగ్గిపెట్టె అంటిస్తుండగానో.. స్టౌవ్ వెలిగిస్తుండగానో.. అంటూ ప్రమాదాన్ని పక్కదారి పట్టించే అవకాశం అసలే మాత్రం లేదు లేదంటున్నారు కార్మికులు. ఇదెవరో కావాలనే చేసిన కుట్ర అని సూటిగా ఆరోపిస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేయడం ఇష్టం లేని వాళ్లెవరో.. కావాలనే శిబిరానికి నిప్పు పెట్టుంటారని ఆరోపిస్తున్నారు. కార్మికుల దీక్షకు ప్రజాసంఘాలు, కమ్యూనిస్టులు, టీడీపీ పూర్తి స్థాయిలో మద్దతు నిస్తున్నాయి. మరి, దీక్ష చేయడం ఇష్టం లేని వాళ్లు ఇంకెవరు ఉంటారు? ఈ అగ్నిప్రమాదానికి కారణం ఎవరై ఉంటారు? అనే అనుమానం స్థానికుల నుంచి వ్యక్తం అవుతోంది. ఆ విషయం పోలీసులే తేల్చాలి?