కరోనా నుంచి కోలుకున్నారా? అయితే .. ఇవి మార్చండి..
posted on May 23, 2021 @ 6:32PM
ఒక్కొక్కప్పుడు చిన్న తప్పిదమే, పెద్ద ముప్పును తెచ్చి పెడుతుంది. కరోనా ఫస్ట్ ఫేజ్ వెళ్ళిపోయిందని.. ఇక రాదన్న భరోసాతో మనం అందరం, మాస్క తీసేశాం, మూడడుగుల దూరం మరిచి పోయాం. చేతులు శుభ్రం చేసుకోవడం మానేశాం. మన కంటే ఘనులు మన నాయకులు ఏకంగా వేల మందితో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. పెళ్ళిళ్ళు, పేరంటాలు, కుంభ మేళాలు,ఒకటనేమిటి చేయకూడని పనులన్నీ చేసి ఇప్పుడు చింతిస్తున్నాం. కన్నీళ్ళు పెట్టుకుని కుములి పోతున్నాం. చేతులు కాలిన తర్వాత ఆకులూ పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది? కన్నీళ్లు వృధా కావడం మినహా...
ఇపుడు కరోనా వచ్చి తగ్గిన వారికి , కరోనా మరోమారు రాదన్న భరోసా లేదని.. అలాంటి భరోసా అసలు వద్దని నిపుణులు అంటున్నారు. అంతే కాదు కరోనా వచ్చి తగ్గిన తర్వాత చేసే చిన్న తప్పులే పెద్ద చిక్కులు తెచ్చి పెడతాయని హెచ్చరిస్తున్నారు. అందులో ముఖ్యంగా కరోనా నుంచి బయట పడిన బాధితులు, ముందుగా చేయవలసింది ... అంతవరకు వాడిన టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ ... తక్షణమే మార్చేయడం. అదే బ్రష్ అదే టంగ్ క్లీనర్ వాడడం కామన్’గా అందరూ చేస్తున్న తప్పు. కరోనా పేషెంట్ కోలుకున్నవెంటనే టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ మార్చుకోవడం మరిచి పోరాదని వైద్యులు చెపుతున్నారు. చూడడానికి చాలా చిన్న తప్పుగా కనిపిస్తుంది కానీ, ఈ చిన్న తప్పే, ఒక్కోసారి ఇంటిల్లిపాదినీ, కరోనా పాలిట పడేలా చేసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రవేత్తలు వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారం, కరోనా సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల వల్ల ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇది ఏదైనా వస్తువుపై చేరినా లేక గాలిలో అయినా కొంత కాలం పాటు మరణించకుండా ఉంటోంది. దీని వల్ల చాలా మందికి కరోనా సోకుతోంది. ఈ క్రమంలోనే కరోనా పేషెంట్లు కోలుకోగానే టూత్‌బ్రష్, టంగ్ క్లీనర్ మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారు మరోసారి కరోనా బారిన పడకుండా ఉండటంతోపాటుగా.. ఒకే వాష్‌రూమ్ ఉపయోగించే కుటుంబ సభ్యులను కూడా కాపాడిన వారవుతారని చెప్తున్నారు.
ముఖ్యంగా కరోనా సోకిన సమయంలో ఉపయోగించే టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ మీద వైరస్ చేరుతుంది, అదే బ్రష్. టంగ్ క్లీనర్ వాడితే, వాటి మీద ఉన్న వైరస్ ఎగువ శ్వాసనాళలో చేరుతుంది. సమస్యలకు దారితీస్తుంది. అందుకే కొత్త బ్రష్, టంగ్ క్లీనర్ వాడాలని, దాంతోపాటు మౌత్‌వాష్ వాడడం కూడా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, కరోనా సోకితగ్గిన వారు ఉపయోగించిన టవల్స్, ఇతర వస్తువలను కూడా ఇతరులు వాడకపోవడం పోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా వైద్యుల సలహాను పాటించడమే మంచిదని చెప్తోంది. ఇవ్వన్నీ చినంగా కనిపించే పెద్ద ప్రమాదాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.