రావల్ కోల్ లో ముదిరాజ్ భూమి కబ్జా! మరో వివాదంలో ఈటల ఫ్యామిలీ
posted on May 23, 2021 @ 1:43PM
అప్పుడు ఈటల రాజేందర్... ఇప్పుడు ఈటల నితిన్ రెడ్డి... అప్పుడు మెదక్ జిల్లా అచ్చంపేట.. ఇప్పుడు మెదక్ జిల్లా రావల్ కోల్. అప్పుడు.. ఇప్పుడు భూకబ్జా ఆరోపణలే. ఆసైన్డ్ ల్యాండ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మెడకు మరో వివాదం చుట్టుకోంది. ఈటల రాజేందర్ తనయుడు నితిన్ రెడ్డిపై ఓ రైతు భూ కబ్జా ఆరోపణలు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేశాడు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుమారుడు నితిన్ రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు మేడ్చల్ లోని రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేశ్ ముదిరాజ్ లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో మహేష్ పలు అంశాలను పేర్కొన్నాడు.బాధితుడు మహేష్ ఫిర్యాదుపై స్పందించిన సీఎం కేసీఆర్.. తక్షణమే దార్యాప్తు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను ఆదేశించారు. ఏసీబీ, రెవిన్యూ శాఖలు సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తన భుమిని ఇనాం భూమిగా చూపుతూ కొనుగోలు చేసి ఇప్పుడు తమను ఆ భూమిలోకి రాకుండా బెదిరిస్తున్నారని మహేష్ బుధవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్, కీసర ఆర్డీఓ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈటల రాజేందర్ మెదక్ జిల్లా అచ్చంపేట, హకీంపేటలో భూకబ్జాకు పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఈటల రాజేందర్‌పై పలువురు రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి ఖచ్చితంగా రాజీనామా చేస్తానని.. ఈటల రాజేందర్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. కరోనా ముగిసిన తర్వాతే ఆ నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. ఈటల రాజీనామా చేస్తే... అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించాలనే ప్రణాళికలు రచిస్తోంది టీఆర్‌ఎస్. స్థానిక టీఆర్‌ఎస్ నేతలు ఎవరూ ఈటలకు మద్దతుగా నిలవకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ బాధ్యతలను టీఆర్‌ఎస్ అధిష్టానం పలువురు పార్టీ ముఖ్య నేతలకు అప్పగించినట్టుగా ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఈటల కుమారుడు కూడా భూ కబ్జాకు పాల్పడ్డాడని ఫిర్యాదు రావడం సంచలనంగా మారింది. ఈటల రాజేందర్ కొడుకుపై భూ కబ్జా ఫిర్యాదు రావడం.. సీఎం విచారణకు ఆదేశించడం చకాచకా జరిగిపోయాయి. ముదిరాజు బిడ్డనైన తనను సీఎం కేసీఆర్ కావాలనే టార్గెట్ చేశారని పదే పదే ఆరోపిస్తున్నారు రాజేందర్. తనది ఆత్మగౌరవ పోరాటమని చెబుతున్నారు. తాజాగా ఈటల తనయుడిపై భూకబ్జా ఆరోపణలు చేసింది ముదిరాజ్ యువకుడే కావడం ఆసక్తిగా మారింది. ముదిరాజునని గొప్పగా చెప్పుకునే రాజేందర్... ముదిరాజ్ వ్యక్తి భూములను కబ్జా చేసినట్లు ఆరోపణలు రావడంపై రాజకీయ వర్గాల్లోనూ చర్చగా మారింది. పిట్ల మహేశ్ ముదిరాజ్ అంశం.. ఈటలకు కొంతగా ఇబ్బందిగా మారవచ్చని భావిస్తున్నారు.