కొవాగ్జిన్ వ్యాక్సిన్ పరిజ్ఞానం బదిలీ చేయం.. సొంతంగా తయారు చేశామన్న భారత్ బయోటెక్
posted on May 23, 2021 @ 10:45AM
దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. యుద్ద ప్రాతిపదికన టీకాలు వేయాలని ప్రభుత్వాలు చూస్తున్నా... వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. డిమాండ్ కు సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో చాలా రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ను ఆపేశాయి. దేశంలో వ్యాక్సినేషన్ మొదలై.. నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకు 20 కోట్ల డోసులు కూడా ఇవ్వలేకపోయారు. ఏప్రిల్ తో పోల్చితే మేలో మరింత స్లోగా సాగుతోంది. శనివారం దేశ వ్యాప్తంగా కేవలం 16 లక్షల కొవిడ్ డోసులు మాత్రమే ఇచ్చారనే కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కలే చెబుతున్నాయి. వ్యాక్సిన్ కొరత తీరాలంటే దేశంలో ప్రస్తుతం తయారవుతున్న టీకా పరిజ్ఞానం ఇతర ఫార్మా సంస్థలకు బదిలీ చేయాలనే డిమాండ్ వస్తేంది. ముఖ్యంగా పూర్తిగా దేశీయంగా తయారైన భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలని కొందరు సీఎంలు కేంద్రాన్నికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) నుంచి పరిజ్ఞానాన్ని తీసుకున్నందు వల్ల..కొవాగ్జిన్ వ్యాక్సిన్ పరిజ్ఞానాన్నిఇతర సంస్థలకు బదిలీ చేసి టీకాలను పెద్ద ఎత్తున తయారు చేయాలని కోరారు.
వ్యాక్సిన్ పరిజ్ఞానం బదిలీ చేయాలన్న వార్తలపై భారత్ బయోటెక్ స్పందించింది. వాగ్జిన్ అభివృద్ధి చేయడానికి వాడిన వ్యాక్సిన్ పరిజ్ఞానం మొత్తం భారత్ బయోటెక్‌దేనని ఆ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ) సుచిత్ర ఎల్లా చెప్పారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి తాము భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) నుంచి పరిజ్ఞానాన్ని ఏమీ తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆ రెండు సంస్థల సహకారంతోనే భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిందని, ఆ పరిజ్ఞానాన్ని మరిన్ని ఔషధ కంపెనీలకూ బదిలీ చేయాలని ఇటీవల కొందరు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు. ఇతర ఫార్మా సంస్థలకు కొవాగ్జిన్ పేటెంట్లతో పాటు తయారీ పరిజ్ఞానాన్ని బదిలీ చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ ప్రక్రియ చాలా క్లిష్టతరమైన ప్రక్రియ అని చెప్పారు సుచిత్ర ఎల్లా.
కరోనా స్ట్రెయిన్‌ను సేకరించి వ్యాక్సిన్ తయారీ సంస్థలకు అందించడం, అలాగే కోతులు, ఎలుకలపై ప్రయోగ పరీక్షల్లో మాత్రమే ఐసీఎంఆర్, ఎన్‌ఐవీ సహకరిస్తాయని సుచిత్ర ఎల్లా చెప్పారు. పెద్ద జంతువులపై నేరుగా ప్రయోగ పరీక్షలు జరిపేందుకు ప్రైవేటు ఔషధ సంస్థలకు అనుమతులు లేనందు వల్లే కేవలం ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్, ఎన్‌ఐవీ సహకారాన్ని తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆ రెండు సంస్థల నుంచి కరోనా స్ట్రెయిన్ అందిన అనంతరం వ్యాక్సిన్ తయారీలో మొత్తం పనిని తామే చేశామని స్పష్టం చేశారు. ఇందుకోసం పూర్తిస్థాయిలో తమ సంస్థ నిధులనే వాడామని తెలిపారు. సొంత ల్యాబ్‌లలో స్ట్రెయిన్‌ను పరీక్షించామని, అలాగే, వ్యాక్సిన్‌ను మనుషులపై పరీక్షించే వరకు తమ సంస్థే సొంతంగా పనులు చేసుకుందని చెప్పారు. చిన్నారులపై కొవాగ్జిన్ ప్రయోగ పరీక్షలు వచ్చేనెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సుచిత్ర ఎల్లా తెలిపారు.