ఆనందయ్య మందుకు టీటీడీ సపోర్ట్! స్టెరాయిడ్స్ వల్లే కోటయ్యకు సీరియస్?
posted on May 23, 2021 @ 4:05PM
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన కొవిడ్ ఆయుర్వేద మందుకు మద్దతు పెరుగుతోంది. ఆనందయ్య మందులో హానికారక పదార్థాలు లేవని ఆయుష్ శాఖ శనివారం క్లారిటీ ఇచ్చింది. తాజాగా తిరుపతి ఆయుర్వేద వైద్య కళశాల కూడా ఆనందయ్య మద్దతుకు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసింది. కృష్ణపట్నం వెళ్లిన తిరుపతి ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ల బృందం.. ఆనందయ్య కోవిడ్ మందు తయారీలో ఉపయోగించే మూలికలు, తయారీ విధానాన్ని స్వయంగా పరిశీలించింది. ఈ సందర్భంగా అనందయ్య రూపొందించిన కరోనా మందుతో ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేసింది. కృష్ణపట్నం మందుకు పరిశోధక బృందాల నుంచి అనుమతులు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా ఎస్వీ ఆయుర్వేదిక్ ఫార్మసీ నిపుణులు చర్చించారు.
ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్, ఐసీఎంఆర్ అధ్యయనం సంస్థల నివేదికల కోసం చూస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. ఆనందయ్య మందుపై సానుకూల నివేదికలు వస్తే, ఆ మందును ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో తయారుచేస్తామని తెలిపారు. ఆ మేరకు ఆయుర్వేద ఫార్మసీ ప్రణాళికలు రూపొందించిందని వివరించారు. శేషాచలం అడవుల్లో ఔషధం తయారీకి అవసరమైన వనమూలికలు విరివిగా లభ్యమవుతాయని ఎమ్మెల్యే చెవిరెడ్డి వెల్లడించారు. ఆనందయ్య మందును ఆయుష్, ఐసీఎంఆర్ పరిశోధకులు కరోనా మందు కాదని తేల్చినా, దాన్ని వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేసే మందుగా పరిశీలిస్తామని తెలిపారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో పర్యటించారు. ఆనందయ్య మందు పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీసిన నారాయణ మీడియాతో మాట్లాడుతూ, ఆనందయ్య కరోనా మందు తీసుకున్నవారిలో ఎలాంటి దుష్ఫలితాలు కనిపించలేదని అభిప్రాయపడ్డారు.ఆనందయ్య మందుపై కార్పొరేట్ ఆసుపత్రుల గోల ఎక్కువైందని అన్నారు. ఇలాంటి మందులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. కోటయ్య స్టెరాయిడ్స్ వాడడం వల్లే అస్వస్థతకు గురయ్యాడని పేర్కొన్నారు. ఆనందయ్య మందులో ఎలాంటి హానికర పదార్ధాలు లేవని తెలిసిందని అన్నారు.
మరోవైపు కరోనాకు విరుగుడుగా తాను అందిస్తున్న మందుపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని ఆనందయ్య అన్నారు. ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తానన్నారు. తన మందు ఆయుర్వేదమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రజలకు మేలు చేసేందుకే మందు తయారుచేశానని, వేల మందికి మందు తయారు చేయాలంటే సమయం పడుతుందన్నారు. కోటయ్యకు మందు వేసి నాలుగు రోజులైందని, తన మందు వల్లే కోటయ్య ఇబ్బందిపడ్డారని చెప్పలేమన్నారు. తన మందును కొందరు అమ్మే ప్రయత్నం చేస్తున్నానని, అమ్మేవారిని కట్టడి చేయాలని పోలీసులను ఆనందయ్య కోరారు.