రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్.. ఇక కుస్తీ ఫసక్?
posted on May 23, 2021 @ 11:54AM
స్టార్ ఆటగాడు. ఒలంపిక్ మెడల్ సాధించిన మొనగాడు. అయితేనేం.. విచక్షణ కోల్పోయాడు. క్షణికావేశంలో ఉన్మాదిగా మారాడు. బలం చూపించాల్సింది బరిలో మాత్రమేనని మరిచాడు. బరి బయట బలుపు ప్రదర్శించాడు. స్నేహితులతో కలిసి.. మరో రెజ్లర్‌పై దాడి చేశాడు. దెబ్బలు తాళలేక ఆ రెజ్లర్ చనిపోయాడు. కుస్తీ యోధుడు సుశీల్ కుమార్‌పై మర్డర్ కేసు నమోదైంది. రెండు వారాలుగా అతను పరారీలో ఉన్నాడు. తాజాగా.. పోలీసులు సుశీల్‌ను అరెస్ట్ చేశారు.
మర్డర్ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, డబుల్ ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. పంజాబ్‌లోని జలంధర్‌లో సుశీల్‌తోపాటు అతడి ప్రధాన అనుచరుడు అజయ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసుల బృందం అదుపులోకి తీసుకొంది. 15 రోజులుగా పరారీలో ఉన్న అతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఛత్రసాల్ స్టేడియంలో 23 ఏళ్ల యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో 37 ఏళ్ల సుశీల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తప్పించుకొని తిరుగుతున్న అతడిపై లుక్ అవుట్ నోటీసు కూడా జారీ చేశారు. సీనియర్ రెజ్లర్ ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష, అతడి అనుచరుడు అజయ్ కుమార్ సమాచారం చెబితే రూ. 50 వేలను బహుమతిగా ఇస్తామని పోలీసులు ఇదివరకే ప్రకటించారు. కాగా, ముందస్తు బెయిల్ కోసం సుశీల్ చేసుకొన్న దరఖాస్తును కూడా కోర్టు తిరస్కరించింది. తాజాగా, రెజ్లర్ సుశీల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన రెజ్లింగ్ కెరియర్ ప్రశ్నార్థకంగా మారింది. హత్య కేసులో శిక్ష పడితే.. ఇక కుస్తీకి స్వస్తి పలకాల్సిందే. క్షణికావేశంలో దాడి చేసి ఓ నిండు ప్రాణం తీసినందుకు ఫలితం అనుభవించాల్సిందే. జీవితాంతం జైల్లో మగ్గాల్సిందే. అందుకే అంటారు.. తన కోపమే తన శత్రువు.