జోగి రమేష్ కు త్వరలో కేబినెట్ బెర్త్! తిట్లే ఆయనకు పాజిటివ్?
posted on May 23, 2021 @ 5:05PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మే23తో రెండేళ్లు అవుతోంది. 2019 మే 23న జరిగిన ఎన్నికల కౌంటింగులో వైసీపీ 151 అసెంబ్లీ సీట్లు సాధించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్... కేబినెట్ కూర్పుపై కీలక ప్రకటన చేశారు. రెండేళ్ల తర్వాత మెజార్టీ మంత్రులను మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తామని ప్రకటించారు. జగన్ చెప్పిన సమయం పూర్తి కావడంతో... జగన్ కేబినెట్ విస్తరణపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు.. మంత్రి వర్గ విస్తరణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ త్వరలో మంత్రి కాబోతున్నారని చెప్పారు విష్ణుకుమార్ రాజు. వైసీపీలో బాగా తిట్టగలిగిన వాళ్లకే పదవులు వస్తాయని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో టీడీపీ, బీజేపీపై జోగి రమేష్ తిట్లతో విరుచుకుపడుతున్నారని.. సో ఆయనకు కేబినెట్ లో బెర్తు ఖాయమంటూ విష్ణుకుమార్ రాజు సెటైర్లు వేశారు. ఈ నెల 20న జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసనసభ్యుడు జోగి రమేశ్.. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామపై నిప్పులు చెరిగారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఎంపీ రఘురామ రాజును తిట్టిన ఎమ్మెల్యే జోగు రమేష్ ను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఘటనను ఉదహరిస్తూ.. ఈసారి జరిగే ఏపీ క్యాబినెట్ విస్తరణలో జోగి రమేశ్ కు పదవి ఖాయమన్నారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు.
తెలుగు దేశం పార్టీతో పాటు చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేసే వారికి వైసీపీలో ప్రాధాన్యత ఉంటుందనే ప్రచారం మొదటి నుంచి ఉంది. సీఎం జగన్ కూడా అలాంటి వారిని ఎంకరేజ్ చేస్తారని చెబుతారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు స్వగ్రామంలో హల్చల్ చేసిన వైసీపీ శ్రీకాకుళం లోక్ సభ ఇంచార్జ్ దువ్వాడ శ్రీనివాస్ కు .. కొన్ని రోజులకే పదవి వరించింది. దువ్వాడను ఎమ్మెల్సీగా పంపించారు సీఎం జగన్. అచ్చెన్నను టార్గెట్ చేయడం వల్లే దువ్వాడకు వెంటనే ఎమ్మెల్సీ పదవి వచ్చిందని వైసీపీ నేతల్లోనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవాళ్లు కూడా.. తమ పదవిని కాపాడుకునేందుకే టీడీపీని తిట్టడంలో పోటీ పడుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా తమకు కొరకరాని కొయ్యగా మారిన ఎంపీ రఘురామ రాజును తిట్టిన జోగి రమేష్ ను సీఎం జగన్ కేబినెట్ లోకి తీసుకోవడం ఖాయమనే చర్చ జరుగుతోంది. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చెప్పారు.
చంద్రబాబును తిట్టిన వారితో పాటు కస్టడీలో ఎంపీ రఘురామ రాజును కొట్టినవారికి కూడా పదోన్నతులు లభిస్తాయని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఒకవేళ రఘురామ జైలుకు వెళ్లుంటే మాత్రం అనుమానాస్పద స్థితిలో మరణించేవారని భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు. జగన్ అంటే తనకు గౌరవం అని, లేదంటే తనను కూడా లోపలేస్తారని చమత్కరించారు. రఘురామ ఉదంతంలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై సీబీఐ విచారణ జరిపించాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.