బోర్డర్‌లో బాధలు.. మళ్లీ అదే తీరు? తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా?
posted on May 23, 2021 @ 1:20PM
తెలంగాణ పోలీసుల తీరుతో సరిహద్దులు దాటే ఏపీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉన్నట్టుండి.. సడెన్‌గా బోర్డర్ మూసేసి.. తెలంగాణలోకి ఏపీ వాహనాలను అనుమతించడం లేదు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. పర్మిషన్ లేదంటూ వాహనాదరులకు పరేషాన్ చేస్తున్నారు ఖాకీలు. అంబులెన్సులు, ఎమర్జెన్సీ వాహనాలను మాత్రం వదిలేస్తున్నారు. సరుకు రవాణా వెహికిల్స్‌ను కూడా తెలంగాణలోకి రానీయడం లేదు పోలీసులు. దీంతో.. ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
కర్నూలు నగర శివారులోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద వాహనాలను తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. ఈ పాస్ ఉంటేనే పోలీసులు తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. బైక్‌లు, ఆటోలను కూడా నిలిపివేస్తున్నారు. పోలీసులు వాహనాలను నిలిపివేస్తుండటంతో హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
తెలంగాణలో పోలీస్ అధికారులు కర్ఫ్యూ నిబంధనలు కఠినం చేశారు. ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. అయితే అంబులెన్స్‌లకు మినహాయింపు ఇచ్చారు. కర్ఫ్యూ సడలింపు సమయంలోను పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణీకులకు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే ఆన్‌లైన్లో అప్లై చేసుకున్న లక్షలాది మందికి ఈ-పాస్‌లు మంజూరు చేశామని పోలీస్ అధికారులు తెలిపారు. అత్యవసరం ఉన్నవారికి మాత్రమే ఈ-పాస్‌లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఈ-పాస్ చూపిస్తేనే తెలంగాణలోకి అనుమతిస్తామంటూ.. మిగతా వాహనాలకు ఆపేస్తున్నారు. దీంతో ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ప్రయాణికుల వాహనాలు భారీగా నిలచిపోయాయి.
తెలంగాణా సరిహద్దులో ప్రతిసారీ పంచాయితీలేమిటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పొందుగుల సరిహద్దు దగ్గర వాహనదారులపై పోలీసులు మళ్లీ లాఠిచార్జి చేస్తున్నారని, ముఖ్యమంత్రికి ప్రజల బాగోగులు పట్టవా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రజల ఆవేదన చెవిటివాని ముందు శంఖలా మారిందన్నారు.
తెలంగాణా భారతదేశంలో అంతర్భాగం కాదా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అక్కడ ప్రత్యేక చట్టాలేమైనా అమలవుతున్నాయా? అని అన్నారు. ప్రజల ప్రాణాలతో ఇరురాష్ట్రాల సీఎంలు చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కనీసం మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. మంత్రినో, ఎమ్మెల్యేనో ఆపితే చూస్తూ ఊరుకుంటారా? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో, లేదో అర్థం కావడం లేదన్నారు. సమన్వయానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలన్నారు. సమస్య ఇలాగే పునరావృతమవుతుంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు అచ్చెన్నాయుడు.