నీలం సాహ్ని అవుటేనా? జగన్ ఖాతాలో మరో వికెటా?
posted on May 23, 2021 @ 10:45AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఖాతాలో మరో వికెట్ పడనుందా? రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గండంలో ఉన్నారా? జగన్ కోసం అత్యుత్సాహంగా వ్యవరించినందుకు పదవి కోల్పోబోతున్నారా? అంటే ఏపీ రాజకీయ వర్గాలు, రాజ్యాంగ నిపుణుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఏపీలో గత ఏప్రిల్ లో జరిగిన పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇవ్వడం, ఎస్ఈసీ నుంచి ఉద్దేశించి ధర్మాసనం చేసిన ఘాటు వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఏపీ ఎస్ఈసీ నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో ఎస్ఈసీకి పదవి గండం ఉందనే చర్చ జరుగుతోంది.
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వర్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు.దీనిపై విచారణ జరిపిన కోర్టు...ప్రతివాదులు ఏపీ గవర్నర్ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్ 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషనర్ పదవి చేపట్టేందుకు.. పదవీ విరమణ చేసిన తరువాత కనీసం మూడేళ్ల గడువు ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం జరిగిందని పిటిషనర్ తెలిపారు.
నీలం సాహ్ని గత ఏడాది డిసెంబరు 31న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసింది. అయితే ఆమె పదవి విరమణ చేయకముందే ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తరువాత కొంతకాలానికే 2021 మార్చి 28న నిమ్మగడ్డ స్థానంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ పంచాయతీరాజ్ శాఖ జీవో జారీచేసింది. ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని, అధికరణ 243(కె) మేరకు నీలం సాహ్ని నియామకం రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని పిటిషనర్ చెబుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషనర్ కోరారు. వ్యాజ్యం పరిష్కారమయ్యేంతవరకు ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్నీ విధులు నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవాలని తన పిటిషన్ లో పేర్కోన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంలో సుప్రీంకోర్టు సూచనలను అనుసరించాలి.. వాటి గురించి సుప్రీంకోర్టు మార్చి 12న మరోసారి స్పష్టం కూడా చేసింది.. కానీ ఏపీ ఎస్ఈసీ నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని పిటిషనర్ రేగు మహేశ్వర్ రావు చెబుతున్నారు. నిబంధనలను ఏవిధంగా పాటించలేదో కోర్టుముందుంచామని తెలిపారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ తీర్పు సమయంలో ఎస్ఈసీ నీలం సాహ్నిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అర్థం చేసుకోవడంలో కూడా విఫలమయ్యారని విమర్శించింది. ఎస్ఈసీగా ఆమె అర్హతను కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించింది. ఎస్ఈసీగా ఆమె పదవీ బాధ్యతలను చేపట్టిన వారం రోజుల వ్యవధిలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం పది రోజుల వ్యవధిలోనే పోలింగ్ జరిగింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నోటిఫికేషన్ కు, పోలింగ్ కు మధ్య నాలుగు వారాల వ్యవధి ఉండాలని, సుప్రీం ఆదేశాలను తుంగలో తొక్కారంటూ ఎస్ఈసీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలను రద్దు చేసింది.తాజాగా ఆమె నియామకం చెల్లదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నీలం సాహ్నీకి గండం ఉందనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. సీఎం జగన్ మెప్పు కోసం ఆమె తొందర పడి నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు. అదే ఇప్పుడు ఇబ్బందిగా మారిందని, పదవి కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.