తుపాను గుప్పిట్లో తూర్పు తీరం.. ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు గండం
posted on May 22, 2021 @ 9:27PM
దేశంలో మరో గండం ముంచుకొస్తోంది. పశ్చిమ తీరంలో తౌక్తే తుపాను సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోకముందే మరో తుపాను ముప్పు దూసుకువస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పక్కనే ఉన్న ఉత్తర అండమాన్ సముద్రానికి ఆనుకుని శనివారం అల్పపీడనం ప్రాంతం ఏర్పడింది. తుపాను ఏర్పడడానికి అల్పపీడన ప్రాంతం తొలి దశ. అయితే, అల్పపీడనాలన్నీ తుపాన్లగా మారే అవకాశం లేదు. కాని తాజాగా ఏర్పడిన అల్పపీడనం మార్చి 23 ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆ తర్వాత అది ఉత్తర-వాయవ్య దశలో కదులుతూ 24 నాటికి తుపానుగా మారుతుందని, ఆ తర్వాత 24 గంటల్లో అది అతి తీవ్ర తుపానుగా మారుతుందని హెచ్చరించింది. రాబోయే తుపానుకు ‘యాస్’ పేరు నామకరణం చేశారు.
యాస్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య ఈ నెల 26న దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత అది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ మరింత తీవ్రమై పశ్చిమ బెంగాల్ సమీపంలోని ఉత్తర బంగాళాఖాతానికి, దాని పక్కనే ఉన్న ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాలకు 26న ఉదయం చేరుకుంటుందని వివరించింది. అదే రోజు సాయంత్రం పశ్చిమ బెంగాల్ దాని పక్కనే ఉన్న ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
యాస్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గఢ్ పై ఉండనుంది. బెంగాల్- ఒడిషా మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో ఆ రెండు రాష్ట్రాలకు గండం పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్ లోను భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. బంగ్లాదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లోనూ యాస్ తుపాను బీభత్సం స్పష్టించనుంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకాయి. ఈనెల 30న కేరళను తాకనున్నాయని ఐఎండీ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లోకి గతంలో కంటే ముందే నైరుతి రుతుపవనాలు ఎంటర్ కానున్నాయి. ఈసారి దేశమంతా సాధారణ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.