రేవంత్‌రెడ్డికి ట్విస్ట్.. తెరపైకి కర్ణాటక ఫార్ములా.. పీసీసీ పీఠం ఇంకెంత దూరం?
posted on Jun 6, 2021 @ 9:08PM
రేపేమాపో టీపీసీసీ అధ్యక్షుని నియామకం. వారం రోజులుగా ఇదే బ్రేకింగ్ న్యూస్. అంతఈజీగా మేటర్ సెటిల్ అయితే అది కాంగ్రెస్ ఎందుకు అవుతుంది? రేసులో ఉన్నవారంతా గాంధీభవన్ వేదికగా రచ్చ చేస్తున్నారు. హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రేవంత్‌రెడ్డి నుంచి వీహెచ్ వరకూ.. పదుల సంఖ్యలో ఆశావహులు ఉన్నారు. ఒకరికొకరు చెక్ పెట్టుకుంటూ.. 10 జన్‌పథ్‌కు లేఖలు రాస్తూ.. రాజకీయాన్ని రంజుగా మార్చుతున్నారు. టీపీసీసీ ఎంపిక తలనొప్పిని భరించలేక అధిష్టానం అనూహ్యంగా ఓ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.
కర్నాటక ఫార్ములా. అవును, కర్ణాటక పీసీసీ అధ్యక్షుని ఎంపికలో సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసిన ఆ వ్యూహాన్ని ఇప్పుడు తెలంగాణలోనూ అనుసరించాలని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయించారట. గతంలో కర్ణాటక పీసీసీ చీఫ్ పదవి కోసం హేమాహేమీలాంటి నేతలు పోటీ పడ్డారు. సిద్దరామయ్య, పరమేశ్వర్ , మల్లిఖార్జున ఖర్గే , వీరప్పమొయిలీ, బీవీ పాటిల్, డీకే శివకుమార్, జైరామ్ రమేష్.. ఇలా అంతా సీనియర్లే. అందరూ సమర్థులే. ఎవరిని సెలెక్ట్ చేయాలో.. ఎవరిని ఎంపిక చేస్తే.. ఇంకెవరు అలక వహిస్తారో అనే కన్ఫ్యూజన్ ఉండేది. సీనియర్లు అంతా మూకుమ్మడిగా డీకే శివకుమార్ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. అయితే, కిందిస్థాయి కేడర్‌తో పాటు మెజారిటీ డీసీసీలు.. డీకే శివకుమార్‌కు మద్దతుగా నిలిచాయి. అధిష్టానం అభిప్రాయ సేకరణ కోసం ఓ సీనియర్ నేతను కర్ణాటక పంపించింది. ఆయన క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలు సేకరించి హైకమాండ్‌కు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత.. డీకే శివకుమార్‌ను పీసీసీ అధ్యక్షునిగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇదీ కర్ణాటక ఫార్ములా. దీన్ని.. యధాతదంగా తెలంగాణలోనూ అమలు చేసి టీపీసీసీ చీఫ్‌ను ఎంపిక చేయాలని సోనియాగాంధీ ఆదేశించినట్టు సమాచారం.
తెలంగాణలోనూ ప్రస్తుతం కర్ణాటక తరహా పరిస్థితే ఉంది. డీకే శివకుమార్‌తో.. రేవంత్‌రెడ్డిని పోల్చుతున్నారు. సీనియర్లు అంతా రేవంత్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. మిగతా పార్టీ కేడర్ అంతా రేవంత్‌రెడ్డే కావాలంటోంది. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కాకుండా.. సీనియర్లు ఎవరి స్థాయిలో వాళ్లు అడ్డుపుల్లలు వేస్తున్నారు. దీంతో.. క్షేత్ర స్థాయి అభిప్రాయ సేకరణకు పార్టీ పరిశీలకుడిగా సీనియర్ నేత కమల్‌నాథన్‌ను నియమించినట్టు తెలుస్తోంది. ఆయన తెలంగాణలో పర్యటించి.. రెండుమూడు రోజుల్లో అధిష్టానానికి నివేదిక అందజేయనున్నారు. కర్ణాటక ఫార్ములా ప్రకారం హైకమాండ్ పరిశీలకుడు నివేదిక ఇస్తే.. అందులో మెజార్టీ మద్దతు రేవంత్‌రెడ్డికే ఉంటుందని తెలుస్తుంది.
డీసీసీ అధ్యక్షులు అధిక మంది రేవంత్‌రెడ్డికే జై కొడుతున్నారు. కేడర్ సైతం రేవంతన్నే కావాలంటున్నారు. ఆ లెక్కన.. కర్ణాటక ఫార్ములా అమలు చేస్తే.. కాబోయే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డే అంటున్నారు. అదే జరిగితే.. సీనియర్ల సహకారం ఏ మేరకు ఉంటుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్ చేస్తే.. ఇక చిచ్చరపిడుగు రేవంత్.. కేసీఆర్‌పై మరింత రెచ్చిపోవడం ఖాయం అంటున్నారు. అప్పుడు ఉంటుంది తెలంగాణలో అసలైన రాజకీయం.