బికినీపై కర్నాటక జెండా.. అమెజాన్‌పై గుస్సా..
posted on Jun 6, 2021 @ 6:17PM
భారతీయులన్నా.. మన భాషా, మన సంస్కృతి, మన సంప్రదాయాలన్నా.. పాశ్చాత్యులకు ఎప్పుడూ చిన్నచూపే. ఇటీవల కన్నడను వికారమైన భాషగా పేర్కొని.. ఆ తర్వత క్షమాపణలు చెప్పింది గూగుల్. ఆ వ్యవహారం మరవకముందే.. తాజాగా అమెజాన్ సంస్థ కర్నాటకను కించ పరిచే విధంగా ఉన్న వస్తువులను అమ్మకానికి పెట్టడం వివాదాస్పదమైంది. అది కన్నడిగుల ఆగ్రహానికి కారణమైంది.
కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేకమైన చిహ్నం, జెండా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా, కర్నాటక స్టేట్ గుర్తు, జెండా రంగులతో కూడిన టూ పీస్ బికినీని అమెజాన్‌లో అమ్మకానికి పెట్టారు. అమెజాన్‌కు చెందిన కెనడా వెబ్‌సైట్‌లో ఈ తరహా బికినీలు వెలుగుచూడడం వివాదానికి కారణం.
బికినీ వ్యవహారంపై కర్ణాటక మంత్రి అరవింద్ లింబావాలీ తీవ్రంగా స్పందించారు. కర్ణాటక ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ విషయంలో అమెజాన్ కెనడా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా మల్టీ నేషనల్ కంపెనీలు చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సైతం అమెజాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. కన్నడిగుల ఆత్మాభిమానం దెబ్బతీసేలా ఉన్న అమెజాన్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.
విమర్శలు వెల్లువెత్తడంతో.. వివాదంపై అమెజాన్ స్పందించకపోయినా.. కర్ణాటక రాష్ట్ర జెండా రంగులు, చిహ్నంతో కూడిన బికినీ అమ్మకాలను త సైట్ నుంచి తొలగించింది.