సర్వేపల్లి, చంద్రగిరికే మందు! ఆనందయ్య కొందరివాడేనా..
posted on Jun 7, 2021 @ 11:15AM
కృష్ణపట్నం ఆనందయ్య మందు అందరిది.. ఇది నిన్నటి మాట. ఆనందయ్య మందు కొందరిదే... కాదు కాదు రెండు నియోజకవర్గాల జనాలదే.. ఇది ఇప్పటి మాట. ఎన్నో వివాదాలు.. అనుమానాలు మధ్య ఆనందయ్య మందు పంపిణికి ముందడుగు పడింది. సోమవారం నుంచి మంది పంపిణీకి ఏర్పాటు జరిగాయి. మందు తయారీ కూడా జరిగింది. ఆనందయ్య మందు కోసం లక్షలాది మంది ఎదురు చూస్తుండగా.. వాళ్లందరికి షాకింగ్ న్యూస్ చెప్పారు ఆనందయ్య. మొదటగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకే మందు ఇస్తానని చెప్పారు. అంతేకాదు కాదు ముందు చెప్పినట్టు కాకుండా తొలి రోజు కేవలం 2 వేల మందికే మందు పంపిణీ చేసేందుకు ఆనందయ్య సిద్ధమయ్యారు.
కనీసం 5 వేల మందికి పంపిణీ చేస్తారని ప్రచారం జరిగినా.. ఆ సంఖ్యను మరింత కుదించారు. తొలి రోజు కేవలం 2 వేల మందికి మాత్రమే మందు పంపిణీ చేయనున్నారు. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నవారికి మొదట మందు వేయాలని ఆనందయ్య కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఇతర ప్రాంతాల వారు ఎవరినీ రానీయడం లేదు. ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఆధార్ కార్డు పరిశీలించి తరువాత గ్రామంలోకి అనుమతిస్తున్నారు పోలీసులు. వాలంటీర్ల ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ.. మెడిసిన్ డోర్ డెలివరీ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అటు తిరుపతిలో కూడా ఆనందయ్య పంపిణీకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మందు తయారీ ప్రక్రియ ప్రారంభమయింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని నారాయణ గార్డెన్స్‌లో కరోనా ఆయుర్వేద మందును తయారు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మందును పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు. ఆనందయ్య కుమారుడు శ్రీధర్ మందు తయారీని పర్యవేక్షిస్తున్నారు. సోమవారం సాయంత్రానికల్లా మందు తయారీ పూర్తవుతుందని చెబుతున్నారు. వనమూలికలు సేకరించేందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి తీవ్రంగా శ్రమించినట్టు తెలిపారు.మందు పంపిణి కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేక ప్యాకింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న బాక్సులను తయారు చేయించారు.
కృష్ణపట్నం…టు…సర్వేపల్లి…వయా చంద్రగిరి. ఇది ఆనందయ్య మందు తయారు చేసే రూటుగా మారింది. కృష్ణపట్నంలో ఆనందయ్య తమ్ముడు నాగరాజు మందు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. సర్వేపల్లిలో స్వయంగా ఆనందయ్య…చంద్రగిరిలో కొడుకు శ్రీధర్ మందు తయారు చేసి పంపిణీకి సిద్ధమయ్యారు. ఆనందయ్యకు…ఆయన అనుచరులకు మధ్య విభేదాలు వచ్చినట్లు కనిపిస్తోంది. మందు పంపిణీకి బ్రేక్ పడిందని…ఎవ్వరూ కృష్ణపట్నం, సర్వేపల్లి రావొద్దని ఆయన అనుచరుడు సంపత్ ఖరాఖండిగా చెప్పేశారు. ప్రభుత్వ సహకారం లేనిదే మందు పంపిణీ చేయలేమంటున్నారు. మందు పంపిణీకి బ్రేక్ పడలేదని.. సోమవారం నుంచి పంపిణీ జరుగుతుందని ఆనందయ్య చెప్పారు. ముందుగా సర్వేపల్లిలో మందు పంపిణీ జరుగుతుందన్నారు. ఇతర జిల్లాల వారు కృష్ణపట్నం రావొద్దని సూచించారు. త్వరలో ఇతర జిల్లాలకు పంపిణీ చేస్తామని తెలిపారు.
మొత్తంగా ఆనందయ్య మందును సర్వేపల్లి నియోజకవర్గంలోనే పంపిణి చేస్తుండటం.. అటు చంద్రగిరి కోసం తిరుపతిలో తయారు చేస్తుండటం వివాదంగా మారుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఆనందయ్యను బెదిరించి.. తాము చెప్పినట్లుగా చేసేలా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కేవలం తమ తమ నియోజకవర్గ ప్రజల కోసమే మందును తయారు చేయిస్తుండడంపైనా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. మందుకోసం ఎదురుచూస్తున్న మిగతా వారంతా ఏమైపోవాలని జనం ప్రశ్నిస్తున్నారు. సర్వేపల్లి, చంద్రగిరి ఎమ్మెల్యేల తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. చంద్రగిరిలో మందు పంపిణి కోసం సీఎం జగన్ ఫోటోలతో ప్యాకింగ్ ఏర్పాట్లు చేయడంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఆనందయ్య మందును వైసీపీ తన ఖాతాలో వేసుకోవాలని చూడటం దారుణమంటున్నారు.