ఇంకెన్నాళ్లు దొరా మూతకండ్ల పరిపాలన? కేసీఆర్ సారూ.. మీకు చేతకాకనా?
posted on Jun 6, 2021 @ 3:22PM
మామూలుగా లేవుగా విమర్శలు. అచ్చ తెలంగాణ భాషలో, యాసలో కేసీఆర్‌ను కుమ్మేస్తున్నారు. ఇంకా పార్టీనైనా ప్రారంభించలేదు.. అప్పుడే గులాబీ బాస్‌తో చెడుగుడు ఆడుకుంటున్నారు. ప్రజాసమస్యలపై సూదుల్లాంటి కామెంట్లతో సర్కారును కుళ్లబొడుస్తున్నారు వైఎస్ షర్మిల. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకై దీక్ష చేసి.. నిరుద్యోగులకు మద్దతుగా నిలిచి.. ఉద్యమ కార్యచరణతో తెలంగాణ ప్రజల ముందుకొచ్చారు షర్మిల. అయితే, అంతలోనే కరోనా విజృంభించడం.. లాక్‌డౌన్ తదితర కారణాలతో లోటస్ పాండ్‌కే పరిమితమయ్యారు ఈ తెలంగాణ కోడలు.
ఇంటికే పరిమితమైనా.. ప్రజాసమస్యలను ప్రస్తావించడంలో ఏమాత్రం కాంప్రమైజ్‌కావడం లేదు. ట్విట్టర్ వేదికగా.. ట్వీట్లతో సీఎం కేసీఆర్‌ను కడిగిపారేస్తున్నారు. తాజాగా, తెలంగాణలో ప్రహసనంగా మారిన వ్యాక్సినేషన్ ప్రక్రియపై గట్టిగా ప్రశ్నించారు. తెలంగాణ నాటు పదాలతో, ఘాటైన సామెతలతో.. వ్యాక్సిన్లపై సర్కారు ఉదాసీన వైఖరిని నిలదీశారు.
ప్రైవేట్ ఆసుపత్రుల టీకా దందా పేరిట ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఆమె పోస్ట్ చేశారు. ఒక్కో డోసుకు రూ.1,250 నుంచి రూ.1,600 తీసుకుంటున్నారని, ఐదు రోజుల్లో రూ.21 కోట్ల బిజినెస్ చేశారనేది ఆ స్టోరీ సారాంశం. ప్రైవేట్ వ్యాక్సిన్ బిజినెస్‌కు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆ కథనంలో ఉంది. ఇదే విషయంపై షర్మిల ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు.
'ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి కేసీఆర్ సారూ. మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూతకండ్ల పరిపాలన..?' అంటూ మండిపడ్డారు షర్మిల.
'తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడనే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెలరోజులైంది. ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్నయ్. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించండి' అని షర్మిల డిమాండ్ చేశారు.
సామెతలు, సెటైర్లతో కేసీఆర్‌పై షర్మిల చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఆమె చేసిన ట్వీట్స్ ఆలోచింప చేసేవిగా ఉన్నాయని అంటున్నారు.