ఆనందయ్య మందుపై మరో ట్విస్ట్! సోమిరెడ్డిపై చీటింగ్ కేసు..
posted on Jun 6, 2021 @ 4:40PM
కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సోమవారం నుంచి మందును అందిస్తారని ప్రకటించగా.. అక్కడి పరిస్థితులను చూస్తే మాత్రం అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ప్రభుత్వ సహకారం లేనిదే మందు పంపిణి కష్టమని ఆనందయ్య అనుచరులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కృష్ణపట్నం సమీప గ్రామాల నుంచే ఆదివారం జనాలు భారీగా వచ్చారు. మందు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆనందయ్య సోదరుడు కొందరికి మందు పంపిణి చేశారు. ఆ విషయం తెలిసిన పోలీసులు... అక్కడికి చేరుకుని మందు పంపిణిని నిలిపివేశారు.
ఆనందయ్య మందుపై నెలకొన్న రాజకీయ వివాదం మరో మలుపు తిరిగింది.మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదయ్యింది. తమ అనుమతి లేకుండా డేటా చోరీ చేశారని, మోసపూరిత కుట్ర చేస్తున్నారని శ్రేశిత టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు 468, 379, 506 సెక్షన్లు కింద సోమిరెడ్డిపై కేసు నమోదు చేశారు. పూర్తిగా డెవలప్ చేయని తమ సైట్‌ని సోమిరెడ్డి రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని శ్రేశిత టెక్నాలజీస్ ఎండీ నర్మద్ రెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణలు వల్ల తమ కంపెనీకి చెడ్డపేరు వచ్చిందని.. దీనిపై సోమిరెడ్డి పట్ల చర్యలు తీసుకోవాలని నర్మదా రెడ్డి డిమాండ్ చేశారు
Childeal.com వెబ్‌సైట్‌కు సంబంధించి టీడీపీ నేత సోమిరెడ్డి శనివారం సంచలన ఆరోపణలు చేశారు. ఆనందయ్య మందుతో వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న మందును రూ.167కు అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కోటి మందికి మందు అమ్ముకుని 167 కోట్లు కొట్టేయాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. శ్రేషిత టెక్నాలజీ ద్వారా వెబ్‌సైట్‌ను రూపొందించారని.. ఈ కంపెనీలో వైసీపీ నేతలే డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు. వెబ్‌సైట్‌లో మందు వివరాలు, ధరను పేర్కొన్నారని.. కానీ మళ్లీ డిలీట్ చేశారని ఆరోపించారు. ఆనందయ్య మందు పేరిట ఫేక్ వెబ్‌సైట్ సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి డిమాండ్ చేశారు.