థర్డ్ వేవ్ తో పిల్లలకు ప్రమాదమా! వైద్య నిపుణులు ఏమంటున్నారు..
posted on Jun 6, 2021 @ 9:19PM
దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపింది. ఫస్ట్ వేవ్ తో పోల్చితే అత్యంత వేగంగా వైరస్ విస్తరించింది. వైరస్ ప్రభావం కూడా తీవ్రంగానే ఉంది. మొదటి వేవ్ తో పోల్చితే.. చాలా రెట్లు ఎక్కువ మంది హాస్పిటల్ పాలయ్యారు. ఫస్ట్ వేవ్ లో వృద్ధులు ఎక్కువగా ఎఫెక్ట్ కాగా.. సెకండ్ వేవ్ లో యువతపై ఎక్కువప్రభావం చూపింది మహమ్మారి. దేశంలో ప్రస్తుతం సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. జూన్ చివరికి కట్టడిలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. అయితే మరో రెండు నెలల్లోనే థర్డ్ వేవ్ మొదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. వైద్య నిపుణులు కూడా అదే చెబుతున్నారు.
కొవిడ్ థర్డ్ వేవ్ లో వైరస్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని కొందరు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు భయాందోళన కల్గిస్తోంది. థర్డ్ వేవ్ పై వస్తున్న వార్తలతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉంటుందనడానికి ఆధారాలు లేవంటున్నారు కొందరు వైద్యులు. పిల్లలపై కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం లేదంటున్నారు. ఇందుకు కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు పిల్లల డాక్టర్లు.
వివిధ దేశాలలో, వివిధ రాష్ట్రాలలో ఇప్పటి వరకు వచ్చిన వేవ్స్ ని పరిశీలిస్తే పిల్లల పై కోవిడ్ ప్రభావం స్వల్పంగా మాత్రమే ఉందని తెలుస్తుంది. దీనికి శాస్త్రీయ మరియు epidemilogical సాక్షాలు చాలా ఉన్నాయి. భారతదేశ జనాభాలో 18 సంవత్సరాల లోపు వయసు వారి జనాభా శాతం 40%. మొదటి రెండు వేవ్స్ లో ఈ వయసు వారు ఆసుపత్రిలో చికిత్సపొందిన వారి శాతం కేవలం 5%. అంటే, వీరి పై వైరస్ ప్రభావం ఎంత స్వల్పంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో కరోనా ప్రభావము 20 రెట్లు తక్కువ.
రానున్న వేవ్స్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అనేందుకు ఎటువంటి సాక్షాలు లేవు. వైరస్ లో మ్యుటేషన్ వచ్చినా ప్రత్యేకంగా పిల్లలను టార్గెట్ చేసే అవకాశం లేదు. ప్రముఖ శాస్త్రవేత్తలు, చిన్నపిల్లల వైద్యనిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. రెండవ వేవ్ లో పిల్లల పై కోవిడ్ ప్రభావం పెరిగిందని, రాబోయే వేవ్ లో ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కొందరు వాదిస్తున్నారు. కానీ, మొదటి వేవ్ తో పోలిస్తే రెండవ వేవ్ లో సాధారణ కేసుల సంఖ్య 4 రెట్లు పెరిగింది. అదే నిష్పత్తిలో పిల్లలలో కేసుల సంఖ్య పెరిగింది తప్పించి అదనంగా పెరగలేదు.
మొదటి వేవ్ లో కోవిడ్ బారిన పడ్డ వారు 18 సంవత్సరాల లోపు వారు 11.4%, రెండవ వేవ్ లో 11.8%. పెద్ద వ్యత్యాసం లేదు అని స్పష్టంగా తెలుస్తుంది.... దేశ జనాభాలో 40% ఉన్న పిల్లలలో 12% కేసులు నమోదయితే, మిగిలిన 60% జనాభా (పెద్దలు) లో 88% కేసులు నమోదయ్యాయి. అంటే వైరస్ ప్రభావం ఎవరిపై ఎక్కువుందో తెలుస్తుంది కదా.
ఒక వేళ పిల్లలకు వైరస్ సోకినా వారిలో ACE 2 RECEPTORS లేకపోవడం, CYTOKINE STORM అవకాశాలు తక్కువ ఉండటం, T CELL DIFFERENTIATION ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఇతర వ్యాధులు ఉన్న పిల్లలలో మాత్రమే కోవిడ్ ప్రభావం ఎక్కువ, అందరు పిల్లలలో కాదు. అదే విధంగా ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న MIS-C కూడా కొత్త జబ్బేమి కాదు, కోవిడ్ సోకిన పిల్లలందరికీ వచ్చేదీ కాదు. కేవలం కొందరిలో అరుదుగా వస్తుంది, చికిత్సలు అందుబాటులో ఉన్నవి. అందువల్ల ఆందోళన వద్దు, అవగాహన మాత్రం అవసరం.
పిల్లల కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు..
1. పిల్లలకు కొవిడ్ లక్షణాలు, నివారణ పై అవగాహన కల్పించండి
2. పోషకాహారం అందించండి
3. ఉదయం, సాయంత్రం ఎండలో ఆడించండి(కోవిడ్ ప్రొటోకాల్ తో)
4. బడులు తెరిచినపుడు, బడులకు పంపండి
5. తల్లితండ్రులు జాగ్రత్తగా ఉంటే పిల్లలు అవే పాటిస్తారు