ఎన్టీఆర్ జెండా.. రాజకీయ అజెండా...
posted on Jun 6, 2021 @ 6:42PM
రాను రాను అంటున్నా కూడా అభిమానులు రారమ్మని పిలుస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కోసం.. చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం ప్రజలే గట్టిగా పట్టుబడుతుండటం ఆసక్తికరం. గతంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా.. జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కుప్పం అభిమానులు. చంద్రబాబుపైనా ఒత్తిడి చేశారు. ఆ సమయానికి చంద్రబాబు సర్ది చెప్పారు. కొన్నాళ్లు మౌనంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు.. మళ్లీ జూనియర్ నినాదాన్ని ఎత్తుకున్నారు. తాజాగా, అదే కుప్పం ఫ్యాన్స్ మరోసారి జూనియర్ పొలిటిక్ ఎంట్రీపై వినూత్నంగా డిమాండ్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ ఓ జెండా తయారు చేసి ఆవిష్కరించారు. కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెల్లటి జెండాపై.. మీసం మెలేస్తున్న ఎన్టీఆర్ ఫోటో చిత్రీకరించి.. నుదుట ఎర్రటి తిలకం దిద్ది.. జెండాగా ఎగరేశారు అభిమానులు. ఇప్పటికే ఆలస్యం అయిందని.. జూనియర్ ఎన్టీఆర్ త్వరగా రాజకీయాల్లోకి రావాలంటూ.. ఇలా జెండా ఆవిష్కరణతో డిమాండ్ చేశారు కుప్పంలోని జూనియర్ అభిమానులు. ఈ ఘటన టీడీపీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
జూనియర్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు ఎన్టీఆర్. తాతలా ఖాకీ డ్రెస్ వేసుకొని.. చైతన్యరథంపై పర్యటిస్తూ.. అద్భుతమైన వాగ్దాటితో ప్రసంగిస్తూ.. తెలుగు తమ్ముళ్లను ఉత్తేజ పరిచారు. అయితే.. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడంతో అప్పటి నుంచి మళ్లీ రాజకీయాల జోలికి రాలేదు జూనియర్. పార్టీతో ఆయనకు దూరం బాగా పెరిగింది.
జగన్ సీఎం అయ్యాక.. టీడీపీ ప్రభ తగ్గాక.. మళ్లీ ఎన్టీఆర్ పేరు అభిమానుల నోటి నుంచి వినిపిస్తోంది. అయితే, ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌లో అభిమానులు.. జూనియర్‌ను ఉద్దేశించి సీఎం సీఎం అని నినదించడంతో.. ఆగండి బ్రదర్.. అంటూ ఫ్యాన్స్‌ను కాస్త గట్టిగానే మందలించారు ఎన్టీఆర్. మరో ఈవెంట్‌లోనూ.. ఇది సమయం, సందర్భం కాదంటూ విషయాన్ని దాట వేశారు. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న తనకు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదన్నట్టే ఉంది జూనియర్ వ్యవహార శైలి. అయితే, ఫ్యాన్స్ వింటేగా. రావాలి ఎన్టీఆర్.. కావాలి ఎన్టీఆర్ అంటూ కుప్పం అభిమానులు ఒకటే గోల గోల చేస్తున్నారు. తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ జెండాతో మరోసారి టీడీపీలో అలజడి తీసుకొచ్చారు.