ఒకసారి కరోనా వస్తే.. 10 నెలలు సేఫ్!
posted on Jun 6, 2021 @ 2:05PM
దేశంలో కొవిడ్ మహమ్మారి తీవ్రత కొంత తగ్గింది. గత నెలలో రోజుకు 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం లక్షకు పైగా వస్తున్నాయి. మరణాలు మాత్రం ఇంకా ప్రమాదకరంగానే ఉన్నాయి. కొవిడ్ కట్టడికి వ్యాక్సినేషనే ప్రధానమన్న వైద్యు నిపుణుల నివేదికలతో... దేశంలో టీకాల పంపిణి ముమ్మరంగా సాగుతోంది. అందుబాటులో ఉన్న టీకాలను యుద్ధ ప్రాతిపదికన జనాలను అందిస్తున్నారు. అయితే కొవిడ్ సోకిన వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చా.. ఎప్పుడు తీసుకోవాలి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొవిడ్ విజేతలకు యాంటీ బాడీలు ఎప్పుడు వస్తాయి.. ఎప్పటివరకు ఉంటాయన్నదానిపైనా భిన్న వాదనలు ఉన్నాయి.
తాజాగా ఒకసారి కొవిడ్ వస్తే.. మళ్లీ ఎంతకాలం పాటు వచ్చే అవకాశం ఎంత ఉంది? ఎప్పుడు ఉంది? అన్న సందేహాలకు సమాధానాల్ని తాజాగా బ్రిటన్ లో చేసిన పరిశోధన చెబుతోంది. కొవిడ్ ఒకసారి వస్తే.. వారికి రోగ నిరోధక శక్తి దాదాపు పది నెలల వరకు ఉంటుందని.. ఈ సమయంలో కొవిడ్ ఇన్ ఫెక్షన్ నుంచి ప్రమాదం లేదని తాజా పరిశోధన స్పష్టం చేస్తోంది. యూనివర్సిటీ కాలేజ్ లండన్ సైంటిస్టులు చేపట్టిన పరిశోధనను లాన్సెట్ లో ప్రచురించారు.ఇందులో భాగంగా వైద్య సిబ్బందితో కలిసి మొత్తం 2111 మందికి గత అక్టోబరులో పరిశోధన చేసినట్లు వెల్లడించారు.
గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పలు ధఫాల్లో పరిశోధనల నిమిత్తం వారికి కొవిడ్ యాంటీబాడీ రక్త పరీక్షల్ని నిర్వహిస్తారు. వీరిలో682 మంది సామాన్యులైతే.. 1429 మంది సిబ్బంది పాల్గొన్నారు. వీరిలో 634 మంది గతంలోనే కొవిడ్ బారిన పడిన వారే.అధ్యయనం సమయంలో 93 మంది సామాన్యులకు.. 111 మంది సిబ్బందికి తొలిసారి ఇన్ ఫెక్షన్ బారిన పడ్డారు. మిగిలిన వారితో పోలిస్తే.. ఒకసారి కొవిడ్ వచ్చి ఇంట్లో ఉంటున్న వారికి.. రీ ఇన్ ఫెక్షన్ ముప్పు 85 శాతం.. వైద్య సిబ్బందికి 60 శాతం తక్కువగా ఉంటుందని తేల్చారు.
కొవిడ్ టీకా వేయించుకున్న వారికి పది నెలల పాటు మహమ్మారి నుంచి రక్షణ లభిస్తుందన్న మాట. తాజా అధ్యయనం మరోసారి వ్యాక్సిన్ అవసరాన్ని స్పష్టం చేసిందని చెప్పాలి. అయితే కొవిడ్ విజేతలు, వ్యాక్సిన్ వేసుకున్న వారు తప్పనిసరిగా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని పరిశోధన తేల్చి చెప్పింది.