ఈటలకు ఐదేళ్ల గండం.. ఈసారీ రాజకీయ సుడిగుండం?
posted on Jun 12, 2021 @ 9:26PM
కొందరిది అదో రకమైన జాతకం. వారి జీవితమంతా అదోరకంగా సాగిపోతుంటుంది. అనేక ప్రత్యేకతలు, అంతకుమించి సంచలనాలతో ముందుకు పోతుంటారు. ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. అంతే అధఃపాతాళాన్నీ చూస్తారు. అలాంటి ప్రత్యేక కోవలోకి ఈటల రాజేందర్ కూడా చేరుతారు. వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ఏనాడు ఓటమి ఎరుగరు. ప్రజాక్షేత్రంలో తిరుగులేని నేతగా నిలిచారు. రెండు పర్యాయాలు మంత్రిగా చేశారు. కానీ, ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈటల ఏనాడూ పూర్తిగా ఐదేళ్ల పాటు ఎమ్మెల్యే పదవిని అనుభవించకపోవడం విచిత్రం.
కమలాపూర్ నుంచి వరుసగా రెండుసార్లు.. హుజురాబాద్ నుంచి వరుసగా నాలుగు మార్లు.. మొత్తంగా వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు ఈటల రాజేందర్. అయితే, ఆయన ఏనాడు పూర్తిగా ఐదేళ్ల పాటు పదవిలో లేని ఎమ్మెల్యేగానూ రికార్డు నెలకొల్పారు ఆయన.
2004లో మొదటిసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా కమలాపూర్‌లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు రాజేందర్. అయితే, ఐదేళ్లు నిండకుండానే.. నాలుగేళ్లు గడిచే సరికి.. కేసీఆర్ ఆదేశాల మేరకు 2009లో రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. గెలిచారు.
ఆ తర్వాత 2009లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరిగి కమలాపూర్ నియోజకవర్గం రద్దయింది. హుజూరాబాద్ కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పడింది. 2009లో హుజురాబాద్ నుంచి బరిలో దిగిన ఈటల మరోసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే, ఏడాది గడిచే సరికి మళ్లీ రాజీనామా చేయాల్సి వచ్చింది. 2010లో ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయడం.. ఉప ఎన్నికలో గెలవడంతో ఈసారి నాలుగేళ్లు పదవిలో కొనసాగారు.
2014లో ప్రత్యేక తెలంగాణలో మరోసారి హుజురాబాద్ నుంచే పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా చేపట్టారు. అయితే.. అప్పుడు కూడా ఐదేళ్లు ఎమ్మెల్యే పదవిలో లేరు ఈటల. సీఎం కేసీఆర్ ఆరు నెలలు ముందుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడంతో.. నాలుగున్నరేళ్లు మాత్రమే పదవిలో ఉన్నారు రాజేందర్.
2018 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో మళ్లీ హుజురాబాద్ నుంచి విజయం సాధించి.. ఆరోసారి ఎమ్మెల్యే అయి.. మరోసారి మంత్రి అయ్యారు. అయితే, అనూహ్యంగా కేసీఆర్ కేబినెట్ నుంచి బర్తరఫ్ అవడం.. పార్టీని వీడి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో ఈసారి రెండున్నర ఏళ్లకే పదవి వదులుకోవాల్సి వచ్చింది. ఇలా.. ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఏనాడూ ఐదేళ్లు పదవిలో ఉండకపోవడం కాకతాళీయమే అయినా.. ఆసక్తికరం.
హుజురాబాద్‌కు త్వరలో జరగబోవు ఉప ఎన్నికలో ఈటల గెలిచినా, ఓడినా సంచలనమే. ఓడితే, తొలిసారి ఓటమి చవిచూసిన వాడిగా నిలిచిపోతారు. గెలిస్తే మరో రెండున్నరేళ్లు మాత్రమే అధికారంలో ఉంటారు. ఈసారి కూడా రాజేందర్ ఐదేళ్లు పదవిని అనుభవించలేరు. ఆయన రాజకీయ జాతకం అలాంటిది మరి అంటున్నారు.