కరోనా లెక్కల్లో ప్రభుత్వాల అబద్ధాలు
posted on Jun 12, 2021 @ 7:24PM
హమ్మయ్యా..ఎట్టకేలకు కరోనా లెక్కల వాస్తవాలు, అవాస్తవాలపై ఇప్పటికైనా చర్చ జరుగుతోంది. కరోనా కేసులు రోజువారీగా బులెటిన్లు విడుదల చేసే ప్రభుత్వాలు (ఇది కూడా కోర్టులు మొట్టికాయలు వేశాక మొదలెట్టారు).. వాటిల్లో వాస్తవాలు చెప్పటం లేదనే ఆరోపణలు మొదటి నుంచీ వస్తున్నాయి. లేటెస్టుగా మధ్యప్రదేశ్ లో లక్షా 70 వేల మరణాలు దాచి పెట్టారనే విషయం బయటకు రావడంతో... దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అయితే జనం మాత్రం ఎప్పడూ దానిపై మాట్లాడుకుంటూనే ఉన్నారు. కరోనా పాండమిక్ డిసీజ్ కావడంతో.. దీనిపై పానిక్ అయ్యేలా వార్తలిస్తే.. అదో కేసు మళ్లీ. అందుకే మీడియా కూడా వాస్తవాలు తెలిసినా.. బుద్ధిగా ప్రభుత్వాలు చెప్పిన ఫిగర్లనే వేస్తూ వచ్చారు. మన దేశంలో ఈ విషయంలో జాతీయ మీడియా చాలా బెటర్. నేరుగా ఫీల్డ్ కు వెళ్లి.. మరణాలు ఎక్కువున్నాయని శ్మశానాలు చూపించారు లైవ్ లో. గంగానది ఒడ్డుకు శవాలు కొట్టుకు రావడంతో.. ఈ విషయంపై సీరియస్ నెస్ మరింత పెరిగిందనే చెప్పాలి.
అటు ఏపీ, తెలంగాణ రెండు చోట్లా కరోనా లెక్కల్లో నిజాయితీ లేదనే ఆరోపణలు ఉన్నాయి. గాంధీ ఆస్పత్రిలో మరణాలపైన ప్రశ్నిస్తేనే.. అవి గుండెపోటుతో చనిపోయినవని..సర్టిఫికెట్ లో అవే ఉన్నాయని.. కరోనా వచ్చినా.. చివరకు వారు చనిపోయింది మాత్రం గుండెపోటుతోనే అని ఆస్పత్రి సూపరిండెంట్ అధికారికంగా చెప్పారు. ఇంకేమనగలం చెప్పండి.
ఆంధ్రప్రదేశ్ లో చాలామంది ఎవరికివారు.. తమ బంధువులు, స్నేహితులు, తెలిసినవారు చనిపోతుంటే భయంతో వణికిపోయారు. ఎవరికివారు లెక్కలేసుంటే వారి వారి సర్కిల్స్ లోనే 10 నుంచి 50 మందిదాకా తేలేవారు. కాని ప్రభుత్వం మాత్రం రోజువారీ కరోనా మరణాలు 50 నుంచి 100 వరకు మాత్రమే చూపించింది. ఒక్క ఉదాహరణ చాలు..అవి ఎంత ఖచ్చితమైన లెక్కలు అర్ధం చేసుకోవాలంటే. ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రిలో ఒక రోజు 33 మంది చనిపోయారు. కాని ఆ రోజు బులెటిన్ లో ప్రకాశం జిల్లా మొత్తం ముగ్గురే చనిపోయినట్లు రిపోర్టు ఇచ్చారు. ఇదొక్కటి చాలు మనకి..
మరణాలు అధికంగా అవుతున్నాయని .. జనాన్ని భయాందోళనకు గురిచేసి.. పానిక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాని వాస్తవాలు దాచి పెట్టి.. తద్వారా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తే అది క్షమించరాని నేరం అవుతుంది. మీడియాకు తెలుస్తుంది... ఎక్కడికక్కడ జనానికి తెలుస్తుంది..కాని కళ్లు మూసుకుని తాగే పిల్లి లాగా.. లెక్కలు తగ్గించి చెప్పుకుంటే ఎవరికి ఉపయోగం?
ఏపీలో 20 వేలు కేసులు చూపించినప్పుడు.. దాదాపు 60 వేల పైనే ఉన్నాయని.. 10 వేలకు తగ్గించాక.. అవి 30, 40 వేలు ఉన్నాయని..ఇప్పుడు 6, 7 వేలు చూపిస్తున్నారని..వాస్తవంలో ఇప్పుడు 20 వేలు ఉంటాయని..కొందరు ఆరోపిస్తున్నారు. ఒక్క ఆస్పత్రికి వెళ్లినా యావరేజ్ మిగతాచోట్ల పరిస్ధితి ఏంటో తెలిసిపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు వాస్తవాలనే బులెటిన్లలో ఇస్తే.. ప్రజలంతా ఒక అంచనాకు రాగలుగుతారు. పై నుంచి చెప్పే హెచ్చరికలకు, డాక్టర్లు చెప్పే జాగ్రత్తలకు, ప్రభుత్వాలు ఇచ్చే లెక్కలకు పొంతన లేకపోతే.. ప్రజల్లో సరైన అవేర్ నెస్ ఎలా ఆశించగలం మనం?