సోనూసూద్ ఆంధ్రా అల్లుడే.. ఆయన విజయాల వెనక ఆమె..
posted on Jun 12, 2021 @ 10:00PM
సోనూ సూద్.. నిజంగానే సోనా కంటే గొప్పవాడు. లాక్ డౌన్ వేళలో ఎంతోమందిని ఆదుకున్నాడు. పేదలు గొంతెత్తి పిలిస్తే చాలు ప్రత్యక్షమైపోతున్నాడు. వంద రూపాయలిచ్చినా.. వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి వీడియోను వైరల్ చేసుకునే సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. కాని కోట్లు ఖర్చు పెట్టినా.. తీసుకున్నవాడు చెప్పేవరకు తెలియకపోవడమే సోనూసూద్ స్పెషాలిటీ. సింపుల్ గా ఉంటూ.. ఇంత సాయం.. భారతదేశంలో ఈ మధ్య కాలంలో ఎవరూ చేయలేదు. సాయం చేయడానికి, వచ్చిన రిక్వెస్టులను వెరిఫై చేయడానికి ఓ యంత్రాంగం.. దాని ద్వారా ఎవరికైనా గంటల్లో సాయం అందించడం చేస్తూ సోనూ సూద్ అందరి హృదయాల్లో ముఖ్యంగా తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయాడు.
అయితే ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే.. సోనూసూద్ మన తెలుగింటి అల్లుడంట. ఇప్పటివరకు సోనూసూద్ పర్సనల్ విషయాలు ఎక్కడా బయటకు రాకపోవడంతో.. చాలా మందికి ఇది తెలియదు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అమ్మాయినే సోనూ పెళ్లి చేసుకున్నాడు. అది కూడా లవ్ మ్యారేజ్. ఆ అమ్మాయి పేరు సోనాలి. సోనూ సోనాలి దిల్ గెలుచుకుంది నాగపూర్ లో. అవును సోనూసూద్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు.. అదే యూనివర్శిటీలో సోనాలి ఎంబీఏ చదువుకుంది. మనోడు హ్యాండ్సమ్..మేడమ్ బ్యూటీ..మొత్తానికి ఎక్కడో చూపులు కలిశాయి..ఆ తర్వాత మాటలు కలిశాయి.. కొన్ని రోజులకు మనసులు కలిశాయి. ఇంకేముంది ప్యార్, ఇష్క్, మొహబ్బత్ అన్నీ ఒకేసారి వచ్చేశాయి. ఇద్దరూ ప్రేమించుకున్నారు. 1996లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు, ఇప్పుడు లైఫ్ హ్యాపీ.
ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎవరికైనా పెళ్లయిందంటే వాడి కెరీర్ ఖతమే. ఇక వాడు సంపాదన అనే రేసులో పరిగెత్తాలి..బ్యాంకు బాలెన్స్ పెంచాలి అంతే.. ఇంకే పిచ్చి పిచ్చివేషాలు వేయకూడదు. కాని సోనూసూద్ లైఫ్ టర్నింగ్ అయిందే పెళ్లయిన తర్వాత. 23ఏళ్ల వయసులోనే సోనూసూద్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సినిమాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొదట్లో కాస్త సందేహించినా..సోనూసూద్ ఆకాంక్షలను గౌరవించి సోనాలి ప్రోత్సహించింది. సోనూసూద్ అంటే ఎంత ప్రేమంటే.. అతడు, మరో నలుగురు స్నేహితులతో కలిసి ఉండే సింగిల్ బెడ్ రూమ్ లోనే ఉండటానికి సిద్ధపడిందట.. ఈ విషయం సోనూసూద్ చాలా గర్వంగా చెప్పుకున్నాడు.
ఇంకో విషయం ఏంటంటే.. ఎవరైనా మంచి హైప్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటారు.. ఫ్లాప్ లు వచ్చాయంటే డైవర్స్ ఇచ్చి వెళ్లిపోయిన కేసులు కూడా ఉన్నాయి. ఇక్కడ అంతా స్పెషల్... తనకసలు కెమెరా కూడా చూడని టైములో పెళ్లి చేసుకుంది. అతడు స్టార్ అవడానికి తానే అండగా నిలిచింది. ఇప్పుడు తను కూడా సెలెబ్రిటీ అయింది. కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది.
మామూలుగా ఒక్క రూపాయి బయట ఎవరికైనా ఇవ్వాలంటే.. భార్యకు తెలియకుండా అన్నాఇవ్వాలి.. భార్యను ఒప్పించి అయినా ఇవ్వాలి.. తెలిశాక దబిడిదిబిడే. అలాంటిది సోనూసూద్ తన ఆస్తులను పణంగా పెట్టి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటుంటే..పక్కన నిలబడి ప్రోత్సహించిందంటే.. వారిద్దరూ ఒకరి మనసును మరొకరు ఎంతగా అర్ధం చేసుకుంటే..ఇలాంటి మిరకిల్స్ సాధ్యమవుతాయి కదా. సోనూసూద్ లాంటి వాడు దేశానికి గర్వకారణం అయితే.. అలాంటి వాడిని ఇంత ఎత్తుకు ఎదిగేలాచేసిన మన తెలుగింటి అమ్మాయి సోనాలి మనకు గర్వకారణం. హేట్సాఫ్ టు మిస్టర్ అండ్ మిసెస్ సోనూ సూద్.