ముంబైలో రూపాయికే లీటర్ పెట్రోల్.. బారులు తీరిన వాహనాలు..
posted on Jun 14, 2021 9:23AM
దేశంలో ప్రస్తుతం పెట్రోల్ రేట్లు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ రేట్ సెంచరీ దాటేసింది. లీటర్ డీజిల్ ధర కూడా వందకు దగ్గరలోనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ లీటర్ పెట్రోల్ రేట్ హండ్రెడ్ మార్క్ దాటేసింది. రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ రేట్లతో వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. పెట్రోల్ కే తమ సంపాదన పోతుందనే ఆగ్రహం వాహనదారుల్లో వ్యక్తమవుతోంది. అయితే వంద రూపాయలు దాటిన లీటర్ పెట్రోల్.. కేవలం ఒక్క రూపాయికే వస్తే.. అది సంచనమే కదా.. ముంబైలోని ఓ ప్రాంతంలో అదే జరుగుతోంది. దీంతో వాహనదారులంతా అక్కడికి క్యూ కట్టారు. వాహనార రద్దీతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
మహారాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే పుట్టిన రోజును పురస్కరించుకుని శివసేన మద్దతుదారులు డోంబివిలిలో రూపాయికే లీటరు పెట్రోలును పంపిణీ చేశారు. డోంబివిలి ఎంఐడీసీ ప్రాంతంలోని ఉస్మా పెట్రోలు పంపు వద్ద డోంబివిలి యువసేన నేత యోగేశ్ మహాత్రే వాహనదారులకు రూపాయికే పెట్రోలు అందించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రెండు గంటలపాటు ఈ కార్యక్రమం జరిగింది. పెట్రోలు పోయించుకునేందుకు జనం రోడ్డుపై క్యూకట్టారు. అంబర్‌నాథ్‌లో శివసేన నేత అరవింద్ వాలేకర్ కూడా 50 రూపాయలకే పెట్రోలును పంపిణీ చేశారు. విమ్కో నాకా పెట్రోలు పంపులో పెట్రోలు పంపిణీ చేయడంతో.. అక్కడ కూడా వాహనాలు కిక్కిరిసిపోయాయి.