చంద్రబాబుతో పని చేస్తానన్న సోనూసూద్.. ఏపీకి ఇక వరమే?
posted on Jun 13, 2021 @ 9:49AM
కరోనా కల్లోలంలో ప్రజలకు నేనున్నాంటూ ఆదుకుంటున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. కష్టాల్లో ఉన్నామని చెబితే నిమిషాల్లో వారికి సాయం చేస్తూ రియల్ హీరోగా నిలిచారు. దేశ ప్రజలకు ఆపన్న హస్తం అందిస్తున్న సోనూసూద్ .. త్వరలోనే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు. చంద్రబాబు విజన్ బాగుందని.. తనకు ఎప్పటి నుంచో చంద్రబాబు గురించి తెలుసునని.. ఆయనతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమని సోనూ చెప్పడం రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఆసక్తిగా మారింది. పొలిటికల్ హీరో, రియల్ హీరో కలిస్తే అద్బుతాలు జరగతాయని కొందరు ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు వరమేనని మరికొందరు చెబుతున్నారు.
దేశానికి కరోనా విసురుతున్న సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు అన్న అంశంపై.. వివిధ రంగాల నిపుణులు, ప్రముఖులతో తాజాగా చంద్రబాబు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సమావేశంలో నటుడు సోనూసూద్తో పాటు వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు. కొవిడ్ సమయంలో తనకు తోచిన సాయం అందిస్తున్నట్లు ఈ సందర్భంగా సోనూసూద్ తెలిపారు.విపత్కర పరిస్థితుల్లో సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ మహమ్మారి చాలా మందిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోందని సోనూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సేవకు ఐక్య కార్యాచరణ రూపొందిద్దామని సోనూసూద్‌కు చంద్రబాబు సూచన చేశారు. త్వరలోనే ఐక్య కార్యాచరణ రూపొందిద్దామని కోరిన నేపథ్యంలో చంద్రబాబు సూచనను సోనుసూద్ అంగీకరించారు. కలిసి పనిచేసేందుకు కూడా ఆయన ముందుకు వస్తున్నట్టు తెలిపారు.ఆనాడు హైదరాబాద్ నగరంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు జంటనగరాలను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదేనని కితాబిచ్చారు. కరోనాపై పోరాటంలో తమ ఇద్దరి ఆలోచనలు కలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఈ రియల్ హీరో అన్నారు.
ఆంధ్రా, తెలంగాణ.. తనకు రెండో ఇల్లు వంటివని సోనూ తెలిపారు. తన భార్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కావడం ఆనందకరమని అన్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలోనూ సాయం కోసం ఫోన్ కాల్స్ వచ్చేవని తెలిపిన సోనూసూద్ .. సమయంతో సంబంధం లేకుండా సేవ చేయడమే విధిగా భావించినట్లు స్పష్టం చేశారు. ఎవరికివారు తమ సాయాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దని.. సాయం కోరిన వారి పట్ల సేవ చేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోండని ప్రజలకు, అభిమానులకు సోనూ సూద్ సూచించారు. కుల, మత ప్రాంతాలతో పని లేదన్న ఆయన.. తెలుగు రాష్ట్రాల్లో 18 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తొలిదశలో కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్‌తో పాటు 4 చోట్ల ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
భారత దేశ రాజకీయ చరిత్రలో చంద్రబాబునాయుడు తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. సుస్పష్టమైన ప్రణాళిక,దార్శనికత, ముందుచూపు కలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు. విజన్ 2020 పేరుతో ఏపీ అభివృద్ధికి బీజాలు వేసిన రాజకీయ దార్శనీకుడు చంద్రబాబు. తెలుగునాట ఐటీ అంటే తెలియని రోజుల్లోనే హైదారాబాద్ లో ఐటీ రంగాన్ని అభివృద్ది చెయ్యడం చంద్రబాబుకే సాధ్యమైంది. హైటెక్ సిటీ. భారీ వేతనాల తో కూడిన లక్షలాది ఉద్యోగృగాలు,ఏటా వేల కోట్ల రూపాయల ఐటి ఎగుమతులు ఇప్పుడు వస్తున్నాయంటే అందుకు అప్పటి చంద్రబాబు కృషే కారణం. బెంగుళూరు, ఈ విషయాన్ని ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశం మొత్తం అంగీకరిస్తుంది. అటువంటి విజనరీ హీరో చంద్రబాబుపై రియల్ హీరో సోనూ సూద్ తాజాగా ప్రశంసల జల్లు కురిపించడం, ఇద్దరం కలిసి పనిచేద్దామని సూచించడం సంచలనంగా మారింది. ఏపీ ప్రజలు ఈ పరిణామాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.